రాష్ట్ర అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు పంపిణీ
ప్రతి బ్రూవరీలో నిత్యం లక్ష కార్టన్లకు తగ్గకుండా నిల్వలు
ఎండలు మండుతున్నందున ఉత్పత్తి పెంచాలని ఆదేశం
మంజీరా నుంచి బ్రూవరీలకు పెరిగిన నీటి సరఫరా
సాక్షి, హైదరాబాద్: మంటెక్కిస్తున్న ఎండలతో తాగునీటికే కాదు, బీర్లకు కూడా కొరత వచ్చేసింది. దాంతో మద్యం ప్రియులకు అవసరమైనంత బీరును ఇక్కడే ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న బీర్లను ఇక్కడి అవసరాలు తీరాకే వేరే రాష్ట్రాలకు పంపిణీ చేయాలని ఆదేశించింది. అవసరమైతే పని గంటలు పెంచుకునైనా రాష్ట్ర అవసరాలకు సరిపడా బీరును ఉత్పత్తి చేయాలని బ్రూవరీలను ఆదేశించింది.
ప్రజల తాగునీటికి కోత పెట్టి మరీ బీర్ల ఉత్పత్తికి కోట్లాది లీటర్ల నీటిని సరఫరా చేస్తున్న దృష్ట్యా వేసవిలో ఎక్కడా బీర్ల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత బ్రూవరీ కంపెనీలదేనంటూ అధికారులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన జిల్లాలకు సరఫరా చేసేందుకు ప్రతి బ్రూవరీలో కనీసంగా లక్ష కార్టన్ల (12 బీరు సీసాలతో కూడిన పెట్టె) బీర్లు ఎప్పుడూ సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశాలందాయి. బీర్ల ఉత్పత్తి, సరఫరా తీరుపై ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్ శనివారం అదనపు కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లతో సమావేశమై సమీక్షించారు.
రోజుకు 20 వేల నుంచి 75 వేల పెట్టెల బీర్లు
రాష్ట్రంలో ఏడాదికి 50 కోట్ల లీటర్ల బీర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఐదు బ్రూవరీ కంపెనీలు పనిచేస్తున్నాయి. బీర్ల తయారీ కోసం వీటికి నెలకు సుమారు 8 కోట్ల నుంచి 10 కోట్ల లీటర్ల నీటి ని హైదరాబాద్ వాటర్‌బోర్డు సరఫరా చేస్తుంది. రోజూ ఒక్కో కంపెనీ 2.4 లక్షల నుంచి 7 లక్షల దాకా బీరు సీసాలను (20 వేల నుంచి 75 వేల కార్టన్లు) ఉత్పత్తి చేస్తున్నాయి. అయినా డి మాండ్‌కు సరిపడా సరఫరా ఉండటం లేదంటూ పలు జిల్లాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి ఏప్రిల్‌లోనే ఎన్నడూ లేనంతటి ఎండలు మాడు పగలగొడుతుండటంతో చల్లని బీర్లకు డిమాండ్ మరింత పెరిగింది.
దాంతో సరఫరా కష్టమవుతోంది. వచ్చే నెల రోజుల్లో ఎండలు మరింత పెరిగేలా ఉండటంతో సర్కారు అప్రమత్తమైంది. అందుకే ఇక్కడ ఉత్పత్తయ్యే బీర్లను ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. బడ్వైజర్, కాల్స్‌బర్గ్, హైవర్డ్స్ 5000, నాకౌట్ తదితర బ్రాండ్ బీర్లకు ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా 40 నుంచి 60 శాతం ఎగుమతవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవసరాలు తీరాకే ఎగుమతి చేసేలా బీర్ల కంపెనీలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
బీర్ల కంపెనీలకు పెరిగిన నీటి కోటా
బీర్ల తయారీకి అవసరమైన నీటిని సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టు జనవరి నాటికే ఎండిపోవడంతో నీటి సరఫరాను అప్పట్లో వాటర్‌బోర్డు ఆపేసింది. బీర్ల కంపెనీల ఒత్తిళ్లు, ఖజానాకు సమకూరే ఆదాయం దృష్ట్యా మంజీరా నుంచి ఐదు బ్రూవరీలకు ప్రత్యేకంగా నీటిని సరఫరా చేస్తున్నారు. వాటికి నెలకు ఏకంగా 6 నుంచి 8 కోట్ల లీటర్లు సమకూరుస్తున్నారు.
రాష్ట్రంలోని బ్రూవరీల ఉత్పాదన సామర్థ్యం, నీటి సరఫరా వివరాలు
బీర్ల కంపెనీ వార్షిక ఉత్పాదన సామర్థ్యం నెలకు నీటి సరఫరా (లీటర్లలో)
సౌత్ ఏషియా బ్రూవరీస్ 15,00,00,000 2,30,00,000
క్రౌన్ బీర్స్ ఇండియా లి. 5,00,00,000 2,02,61,000
యు.బి. నిజాం బ్రూవరీస్ 5,00,00,000 1,11,60,000
యు.బి. లిమిటెడ్ 20,00,00,000 2,79,00,000
కార్ల్స్‌బెర్గ్ ఇండియా ప్రై.లి. 6,00,00,000 2,00,000