అందాల కోవెల.. ఏడుపాయల
ఓ వైపు పరీక్షలు.. మరోవైపు రాష్ట్రంలో జాతర సందడి. వనదేవతలు సమ్మక్క, సారక్క జాతరకు జనం తండోపతండాలుగా వెళ్తున్నారు. పని ఒత్తిడి, సెలవులు లేకపోవడం.. ఇలా ఏదో కారణం వల్ల ఆ జాతరకు వెళ్లలేని వారు ఫీల్ అవ్వక్కర్లేదు. ఒకటీ రెండ్రోజులు కాదు... ఏకంగా 365 రోజులూ జాతర వాతావరణముండే ఏడుపాయల సిటీకి దగ్గర్లోనే ఉంది. మరి ఆలస్యమెందుకు ఈ వీకెండ్ అక్కడికి ప్యాకప్ అయిపోండి. - ఓ మధు
స్థలపురాణం ఇదీ..
ఏడు పాయలుగా చీలి ప్రవహించే మంజీర, వనదుర్గమాత మందిరం, వనభోజనాలకు విశేషంగా వచ్చే జనంతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది మెదక్ జిల్లాలోని ఏడుపాయల క్షేత్రం. వనదుర్గ ఆలయం చుట్టూ నీరు ఉంటుంది. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం గురించి ఆనేక పురాణగాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. నాగజాతిని తుదముట్టించేందుకు జనమేజయుడు నిర్వహించిన సర్పయాగం జరిగింది ఇక్కడేనని అని స్థలపురాణం. సర్పయాగం అనంతరం యాగస్థలిని పుణీతం చేయడానికి గరుడ్మంతుడు.. భోగావతి నదిని తీసుకొచ్చాడని, అందుకే ఈ ప్రవాహాన్ని గరుడగంగ అని అంటారని ప్రతీతి. ఏడుగురు రుషుల యాగకుండాలను తాకేందుకు గరుడగంగ ఏడుపాయలుగా చీలిందని చెప్తారు. అత్రి, జమదగ్ని, కశ్యప, విశ్వామిత్ర, వశిష్ట, భరద్వాజ, గౌతమ సప్తరుషులు ఈ ఏడుపాయలను స్వాగతించినందున వీటిని ఆ పేర్లతోనే పిలుస్తుంటారు. అలా ఇది ఏడుపాయలుగా ప్రసిద్ధి చెందింది.
ఆలయాల నిలయం..
స్వయంభూ దుర్గాభవానీ ఆలయం ఇక్కడి మరో ప్రత్యేకత. సొరంగంలో దుర్గామాత దర్శనమిస్తుంది. ఏకోత్తర శతకుండలం, పాపాలమడుగు, ముని పుట్ట, తపోభూమి ఆలయ పరిసరాల్లో ఉంటాయి. పాపాలమడుగులో స్నానం చేస్తే పాపాలు తొలిగిపోతాయనేది ప్రజల నమ్మకం. దీనికి సమీపంలోనే శివాలయం, ముత్యాలమ్మ గుడి, ఎల్లమ్మ ఆలయాలున్నాయి. శివరాత్రి సమయంలో మూడు రోజుల పాటు వైభవంగా జాతర నిర్వహిస్తారు. జాతరకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ఈ జాతరకు ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నక్సాలిపల్లిలో ఉందీ ఏడుపాయల. సిటీ నుంచి 110 కి.మీ, మెదక్‌కు 20 కి.మీ దూరంలో ఉంటుంది. ఏడుపాయలకు హైదరాబాద్ నుంచి బస్ సౌకర్యం ఉంది. పండుగ సమయాల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు.