మర్పల్లి: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బిల్‌కల్ గ్రామంలోని ఓ ఫాంహౌస్‌లో షెడ్డు నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలోకి మొసలి వచ్చింది. సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. బిల్‌కల్‌లో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి ఫాంహౌస్ ఉంది. అందులో షెడ్డు నిర్మాణం కోసం కూలీలు పిల్లర్ గుంతలు తీస్తున్నారు. ఈ క్రమంలో సుమారు 200 కిలోల బరువున్న మొసలి ఉదయం ఓ పిల్లర్ గుంతలో కనిపించడంతో కూలీలు భయాందోళనకు గురయ్యారు. సర్పంచ్ శ్రీనివాస్ ఫారెస్టు అధికారులకు దీనిపై సమాచారం ఇచ్చారు.
అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పిల్లర్ గుంతలో ఉన్న మొసలిని పైకి తీసి తాళ్లతో బంధించారు. బంట్వారం ఫారెస్టు సెక్షన్ అధికారి ఫరీద్ ఆధ్వర్యంలో మొసలిని సంగారెడ్డి జిల్లాలోని మంజీరా ప్రాజెక్టుకు తరలించి అందులో వదిలేశారు. బిల్‌కల్ గ్రామ సమీపంలోని మిలిగిరిపేట్ చెరువులోంచి మొసళ్లు వస్తున్నాయని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే మూడుసార్లు ఫారెస్టు అధికారులు మొసళ్లను బంధించి ప్రాజెక్టులో వదిలేశారని పేర్కొన్నారు. మొసళ్లు గ్రామాల్లోకి రాకుండా మిలిగిరిపేట్ చెరువు చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
చదవండి: ఆ పక్షులు మంటలో దూకి ప్రాణాలు విడుస్తాయి
Comments
Please login to add a commentAdd a comment