సాక్షి, రంగారెడ్డి: చేవెళ్ల మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సహాయక చర్యలు కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు. తాజాగా ఘటనాస్థలికి వెళ్లిన ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తలిగింది. రోడ్డు విస్తరణ ఎందుకు చేపట్టలేకపోయారు? అంటూ స్థానికులు ఆయన్ని నిలదీశారు.
చేవెళ్ల ఘటనా స్థలంలో సోమవారం ఉదయం స్థానికులు ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారిపై ఇప్పటిదాకా రోడ్డు విస్తరణ చేపట్టకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కాలె యాదయ్యను నిలదీశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ యాదయ్యపై దాడికి యత్నించబోయారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని శాంతింపజేశారు. దీంతో ఎమ్మెల్యే యాదయ్య వచ్చిన కారులో అలాగే వెళ్లిపోయారు.
తాండూరుకు చెందిన ఆర్టీసీ బస్సు ఈ ఉదయం 4.45గం. బస్టాండ్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరింది. అయితే అక్కడ 30 మంది ఎక్కారు. ఫస్ట్ ట్రిప్ కావడం.. ఎక్స్‌ప్రెస్ బస్సే అయినప్పటికీ పల్లె వెలుగు పేరిట నడపం, ప్రతీ స్టాపులో ఆపుతూ రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో ఎక్కారు. కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ మీర్జాగూడ టర్నింగ్ పాయింట్‌లో స్పీడ్‌ను కంట్రోల్ చేయలేకపోవడంతో అదుపుతప్పింది. బస్సును ఢీ కొట్టి ఆపై.. గుంత కారణంగా అదుపు తప్పి అలాగే బస్సు మీద ఒరిగిపోయింది.
టిప్పర్ లారీ అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు నిర్థారించగా.. బస్సు మీదకు ఒరిగిపోవడం, ఈ క్రమంలో కంకర మొత్తం బస్సులో పడిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెబుతున్నారు. బస్సుకు కుడి వైపు కూర్చున్న 21 మంది స్పాట్‌లోనే మరణించినట్లు చెబుతున్నారు. ఘటనలో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ దస్తగిరి స్పాట్‌లోనే చనిపోగా.. కండక్టర్ రాధ ప్రాణాలతో బయటపడింది. మృతులంతా తాండూరు, చేవెళ్ల వాసులుగా తెలుస్తోంది. స్థానికులు, పోలీసులు కంకర నుంచి ప్రయాణికులను బయటకు తీసి రక్షించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. యుద్ధప్రతిపాదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలించే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.


