
దూప తీరదు.. దగా ఆగదు
♦ జిల్లా కేంద్రంలో నీటి కష్టాలు
♦ ఎండిపోయిన మంజీర
♦ అవసరాలు తీర్చని ప్రత్యామ్నాయ చర్యలు
♦ అడ్డగోలుగా నీటిదందా
♦ దోపిడీ చేస్తున్న వ్యాపారులు
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణ ప్రజలు నీటికోసం నిత్యం అవస్థలు పడుతున్నారు. ప్రధాన నీటి వనరైన మంజీరలో నీరు లేకపోవడంతో పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. వేసవిని దృష్టిలో పెట్టుకొని మూడు నెలల క్రితం 72 బోర్లు వేసినా ఫలితం లేకపోయింది. మోటార్లు బిగించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీరు ఏ మాత్రం సరిపోక జనం సతమతమవుతున్నారు. నీటి కొరత దృష్ట్యా కొందరు అక్రమ వ్యాపారానికి తెరలేపారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అడ్డగోలుగా డబ్బులు గుంజుతున్నారు.
సంగారెడ్డి మున్సిపాలిటీ: పట్టణానికి ప్రధాన ఆధారమైన మంజీర ఎండిపోవడంతో నీటి సమస్య తీవ్రమైంది.గత రెండు నెలలుగా మంజీర నుంచి వస్తున్న మూడు ఎంఎల్‌డీల నీటిని కేవలం 10 వార్డులకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఇలా మూడు రోజులకోసారి ఒక్కో వైపు అందిస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో నీటి సరఫరా లేకపోవడంతో జనం ప్రైవేటు బోర్లను ఆశ్రయిస్తున్నారు. వాటర్ క్యాన్‌లను కొనుగోలు చేస్తున్నారు. మూడు ట్యాంకర్లను అద్దెకు తీసుకొని నీటి సరఫరా చేస్తున్నా ఏ మూలకూ సరిపోవడం లేదు.
ట్యాంకర్ల కోసం ప్రజల కంటే కౌన్సిలర్లే పోటీపడి తమ వార్డులకు తీసుకెళ్తున్నారు. నీటి సమస్య తీవ్రం కావడంతో గత సెప్టెంబర్‌లో కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ తీర్మానం మేరకు 75 బోర్లను తవ్వినా ఇంతవరకు మోటార్లు బిగించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. కొందరు వ్యక్తులు నీటి దందాను సాగిస్తున్నారు. అడ్డగోలుగా వసూలు చేస్తూ జనాన్ని దోపిడీ చేస్తున్నారు.
సింగూరు నుంచి తెస్తాం...
పట్టణ అవసరాలకు గాను సింగూర్ నుంచి 80 ఎంఎల్‌డీల వరకు నీటిని మంజీరలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇందుకోసం సింగూర్ ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజీలో ఉన్నా ఎగువన ఉన్న నీటిని మంజీరకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. నూతన పద్ధతుల్లో పైప్‌ల ద్వారా నీటిని కిందికి తోడి తీసుకొస్తాం. ఆ నీరు మరో రెండు రోజుల్లో మంజీరకు చేరుతుంది. పట్టణానికి రెండు నెలల వరకు ప్రస్తుతమున్న నీటిని సరఫరా చేస్తాం. నీటి కొరతను దృష్టిలో పెట్టుకొని పొదుపుగా వాడుకోవాలి.
- విజయలక్ష్మి, మున్సిపల్ చైర్‌పర్సన్, సంగారెడ్డి
చర్యలు తీసుకుంటాం..
మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. కౌన్సిల్ ఆమోదం మేరకు వేసిన బోర్లలో 40 మోటార్లను బిగించేందుకు గాను ఆన్‌లైన్ ద్వారా టెండర్లు పిలిచాం. వర్క్ ఆర్డర్లు ఇచ్చాం. మరో రెండుమూడు రోజుల్లో 70 శాతం వరకు నీటి సమస్యను పరిష్కరిస్తాం. - వెంకటేశ్వర్, ఏజేసీ, ఇన్‌చార్జి కమిషనర్
అధికారుల నిర్లక్ష్యం..
పట్టణంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 14వ వార్డులో నీటి సమస్య తీవ్రంగా ఉంది. గత మూడు నెలల క్రితం బోరు వేశారు. మోటారు బిగించకపోవడంతో నిరుపయోగంగా ఉంది. మంచినీటి సరఫరా కాకపోవడంతో ఈ ప్రాంతానికి చెందిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. - అజీజ్ అహ్మద్, 14వ వార్డు
నీళ్లు కొంటున్నాం...
తాగేందుకు నీళ్లు దొరక్క కొంటున్నాం. మా కాలనీకి మంజీర నీరు రావడం లేదు. కనీసం బోరు నీరు కూడా పూర్తి స్థాయిలో సరఫరా కావడం లేదు. నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నాం. సమస్యను అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.
- స్వర్ణలత, కిందిబజార్
ట్యాంకర్ల నీళ్లూ వస్తలె...
కనీసం అద్దె ట్యాంకర్ల ద్వారా అయినా జలాల్ భాగ్ కాలనీకి మంచినీటిని సరఫరా చేయాలి. ఈ కాలనీకి మంజీర నీటితో పాటు బోరు నీటి సరఫరా సైతం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారానైనా నీటి సరఫరా చేసి ఆదుకోవాలి.
- బీపాషా, 18వ వార్డు కౌన్సిలర్
బోరు వేసినా ప్రయోజనం లేదు...
నీటి సమస్య పరిష్కారం కోసం బోర్లు వేశారు. మోటార్లు బిగించకపోవడంతో అది నిరుపయోగంగా ఉంది. ఫలితంగా మేం అద్దె ట్యాంకర్ల ద్వారా నీటిని కొంటున్నాం. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు వ్యాపారులు అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అధికారులు నీటిసమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. - పద్మ కల్వకుంట్ల