భారీ వ‌ర్షాల‌తో ఢిల్లీ ఆగ‌మాగం.. ఆరుగురి మృతి | Delhi rain: 6 dead power cuts water supply disruption add to chaos | Sakshi
Sakshi News home page

భారీ వ‌ర్షాల‌తో ఢిల్లీ ఆగ‌మాగం.. ఆరుగురి మృతి

Published Sat, Jun 29 2024 11:40 AM | Last Updated on Sat, Jun 29 2024 11:59 AM

Delhi rain: 6 dead power cuts water supply disruption add to chaos

న్యూఢిల్లీ: భారీ వ‌ర్షాల‌తో దేశ రాజ‌ధాని ఢిల్లీ అత‌లాకుత‌లం అవుతోంది. మొన్న‌టి వ‌ర‌కు ఎండ‌ల‌తో అల్లాడిన హ‌స్తీనా వాసుల‌కు చ‌ల్ల‌గాలులు, వ‌ర్షంతో ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ప్ప‌టికీ.. ఊహించ‌ని స్థాయిలో ప‌డిన కుండ‌పోత వ‌ర్షాలు తీవ్ర ఇబ్బందుల‌ను క‌లిగించింది. దేశ రాజధానిలో శుక్ర‌వారం ఒక్క రోజే 228.1 మిల్లీమీటర్ల వర్షం ప‌డింది. ఢిల్లీలో ఒక్క‌రోజులో ఈ స్థాయిలో వర్షం కుర‌వ‌డం 88 ఏళ్లలో ఇదే తొలిసారి కావ‌డం విశేషం.

అయితే మ‌రో రెండు రోజులు(జూన్ 1) భారీ వ‌ర్షాలు, అయిదు రోజులు తేలిక‌పాటి వాన‌లు ప‌డ‌నున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. భారీ వ‌ర్షంతో విద్యుత్తు సరఫరాకు, మంచి నీటి స‌రాఫరాకు అంతరాయం ఏర్ప‌డింది. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. వ‌ర్షం, వ‌ర‌దలు కార‌ణ‌గా దేశ రాజ‌ధానిలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుగురు మృత్యువాత ప‌డ్డారు.

వీరిలో 8, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో వర్షపు నీరు నిండిన కాలువలో ప‌డి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా వ‌సంత్ విహార్‌లో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ముగ్గురు కూలీలు మరణించారు. వీరి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది శనివారం బయటకు తీశారు. షాలిమార్‌బాగ్‌ ప్రాంతంలోని అండర్‌పాస్‌లో ఓ వ్యక్తి మునిగిపోయాడు.

 ఢిల్లీ విమానాశ్రయంలో నిన్న పైకప్పు కూలిన టెర్మినల్-1ను నేడు కూడా మూసివేశారు. శుక్ర‌వారం పైక‌ప్పు కూలి ఓ వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెల‌సిందే. మ‌రో న‌లుగురురికి గాయాల‌య్యాయి. ప్రాంతాల్లో చెట్లు కూలాయి. ఓ అండర్‌పాస్‌లో వరద నీటిలో బస్సు చిక్కుకుపోయింది.

గత మూడు నెలలుగా ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన దేశరాజధాని ఢిల్లీ నగరం.. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి చిగురుటాకులా వణికిపోయింది. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు మొదలైన వాన ఏకధాటిగా మూడు గంటలకు పైగా కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాలు నీట మునిగాయి. అనేక ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. ఈ వర్షంతో రాజధాని మొత్తం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది

ఇక నేడు (శనివారం)  ద్వారకా, పాలం, వసంత్ విహార్, వసంత్ కుంజ్, గుర్గావ్, ఫరీదాబాద్, మనేసర్‌తో సహా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వ‌ర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ‌ అంచనా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement