
న్యూఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రదాడుల కుట్రదారుడు తహవూర్ రాణా(Tahawwur Rana) భారత్‌కు వస్తున్న వేళ.. హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడుల్లో రాణా పాత్ర నిమిత్త మాత్రమేనన్న ఆయన.. అసలు కుట్రదారుడ్ని అప్పగించకుండా అమెరికా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
తహవూర్ రాణా ఓ పిల్లకాకి. 26/11దాడుల్లో అతని జోక్యం చాలా తక్కువే. అసలు కుట్రదారు డేవిడ్ కోల్మన్ హెడ్లీ(David Coleman Headley). అతను భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని అమెరికాకూ తెలుసు. అయినా అతని తరలింపును ఆపేసి దుర్మార్గంగా వ్యవహరించింది అని జీకే పిళ్లై(GK Pillai) అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఐఎస్ఐకి డబుల్ ఏజెంట్‌గా వ్యవహరించిన హెడ్లీ.. 26/11 సంఘటన తర్వాత కూడా దాడుల కోసం భారత్‌పై నిఘా కొనసాగించాడు. 2009 అక్టోబర్‌లో చికాగో ఎయిర్‌పోర్టులో అతన్ని అరెస్ట్ చేశారు. ఆపై ఉగ్ర దాడుల అభియోగాలు రుజువు కావడంతో అతనికి 35 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే.. దర్యాప్తునకు సహకరించి లష్కరే తాయిబా గురించి కీలక సమాచారం అందించేందుకు అతను అంగీకరించాడు. ఈ ఒప్పందం కారణంగా.. అతనితో బేరసారాలు కుదుర్చుకున్న అమెరికా భారత్‌కు అప్పగించకుండా ఉండిపోయింది.
దావూద్ సయ్యద్ గిలానీ(డేవిడ్ కోల్మన్ హెడ్లీ) 1960లో వాషింగ్టన్‌లో జన్మించాడు. అతని తండ్రి సయ్యద్ సలీం గిలానీ పాక్ దౌత్య వేత్త. తల్లి అలైస్ సెర్రిల్ హెడ్లీ వాషింగ్టన్‌లోని పాక్ రాయబార కార్యాలయంలో అమెరికా కార్యదర్శిగా పని చేశారు. పాక్‌లో ఎక్కువ రోజులు గడిపిన హెడ్లీ.. క్రమంగా లష్కరే తాయిబాకు దగ్గరై ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. పాకిస్థాన్ సంతతికి చెందిన 64 ఏళ్ల కెనెడియన్ అయిన రాణా ఇప్పటివరకు లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నాడు.

2008 నవంబర్ 26న ముంబయిలో ఉగ్రమూకలు జరిపిన భీకర దాడిలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తొలుత రైల్వే స్టేషన్‌లో బీభత్సం సృష్టించిన ముష్కరులు ఆ తర్వాత రెండు లగ్జరీ హోటళ్లపై దాడి చేశారు. ప్రాణాలతో దొరికిన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌ను నవంబర్ 2012లో పూణెలోని యరవాడ జైలులో ఉరి తీశారు. ఈ దాడులకు మాస్టర్‌మైండ్ డేవిడ్ హెడ్లీనే అని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) భావిస్తోంది. అయితే ఇదే కేసులో కీలక నిందితుడిగా లష్కర్ ఉగ్రవాది తహవూర్ రాణా ఉన్నాడు.
హెడ్లీకి అత్యంత సన్నిహితుడైన రాణా.. దాడులకు ముందు ఎనిమిదిసార్లు భారత్‌కు వచ్చాడు. రెక్కీ నిర్వహించాక ఏకంగా 231 సార్లు ఫోన్‌లో మాట్లాడాడు. ముంబై ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్ తయారీ చేసింది కూడా రాణానే. ప్రస్తుతం అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన వెంటనే రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యక్షంగా విచారించే అవకాశం ఉంది. తద్వారా హెడ్లీ మీద దృష్టిసారించే అవకాశం లేకపోలేదు.