David Headley
-
‘నీ కోసం భారత్‌లో ఉరి శిక్ష ఎదురుచూస్తోంది’
వాషింగ్టన్: 2008 ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడు, పాక్ సంతతి కెనడా వ్యాపారవేత్త తహవుర్ రానాకు.. బెయిల్ ఇచ్చేందుకు అమెరికా కోర్టు నిరాకరించింది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా రానా 1.5 మిలియన్ డాలర్ల బెయిల్ అప్లికేషన్ పెట్టుకున్నాడు. 2008 ముంబై కేసులో అతని కోసం భారత్ ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలో అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన అమెరికా కోర్టు.. రానాను ఫ్లయిట్ రిస్క్‌గా భావించింది. డేవిడ్ కోల్మన్ హెడ్లీ చిన్ననాటి స్నేహితుడైన రానాను జూన్ 10న లాస్ ఏంజిల్స్‌లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 2008 ముంబై ఉగ్రవాద దాడిలో రానాకు ప్రమేయం ఉన్నందున అతడికి అప్పగించాలంటూ భారతదేశం కోరింది. 2008నాటి ఘటనలో ఆరుగురు అమెరికన్లతో సహా 166 మంది మరణించారు. (ముంబై దాడుల దోషి రానా మళ్లీ అరెస్ట్) లాస్ ఏంజిల్స్ జిల్లా కోర్టు జడ్జి జాక్వెలిన్ చూల్జియన్.. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 21న 24 పేజీల తీర్పునిచ్చారు. పారిపోయే అవకాశం ఉన్నందున రానాకు బెయిల్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఒకవేళ అతన్ని కెనడా వెళ్లేందుకు అనుమతిస్తే.. అప్పుడు రానా భారత్‌లో శిక్షను తప్పించుకుంటాడని కోర్టు అభిప్రాయపడింది. భారీ మొత్తంపై బెయిల్ ఇచ్చినా.. కోర్టుకు తీసుకువచ్చే గ్యారెంటీ ఉండదని కోర్టు తెలిపింది. అతడి కోసం భారతదేశంలో ఉరి శిక్ష ఎదురు చూస్తుందని.. ఇప్పుడు రానాకు బెయిల్ మంజూరు చేస్తే.. అతడు పారిపోయే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాక రానాకు బెయిల్ మంజూరు చేయడం వల్ల అమెరికా-భారత్ సంబంధాలు దెబ్బతింటాయని అసిస్టెంట్ యుఎస్ అటార్నీ జాన్ జె లులేజియన్ కోర్టుకు తెలిపారు. అయితే రానా వల్ల ఎటువంటి రిస్క్ లేదని, ఆయనపై 1.5 మిలియన్ల డాలర్ల పూచీకత్తు పెడుతున్నామని కోర్టులో అతని తరఫున న్యాయవాది వాదించారు. ('ఆ ఘటన మరిచిపోలేనిది, క్షమించరానిది') రానాపై భారత్‌లో హత్య అభియోగం కింద కేసులు ఉన్నాయి. లష్కరే తోయిబాకు ఆర్థిక సహాకారం అందిస్తున్న కేసులో.. 2011లో షికాగో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. వాస్తవానికి అమెరికాలో రానాకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పుడు అతన్ని భారత్‌కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డేవిడ్ కోల్మన్ హెడ్లీ సహకారంతో రానా అమెరికాలో ఉగ్రవాదులకు సాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ముంబై పేలుళ్ల కేసులో హెడ్లీ కూడా దోషిగా ఉన్నాడు. -
అటల్ జీ అంత్యక్రియలకు టెర్రరిస్టు సోదరుడు!!
సాక్షి, న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికి కడసారి నివాళులు అర్పించేందుకు భారత్‌కు వచ్చిన పాక్ ప్రముఖుల్లో ఉగ్రవాది సోదరుడు కూడా ఉండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటువంటి వ్యక్తులను అటల్ జీ అంత్యక్రియలకు ఎలా అనుమతిస్తారంటూ విదేశాంగ శాఖ అధికారులపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే... స్మృతి స్థల్లో శుక్రవారం జరిగిన వాజ్‌పేయి అంత్యక్రియలకు పాకిస్తాన్‌కు చెందిన ఐదుగురు ప్రతినిధుల బృందం ఢిల్లీకి వచ్చింది. వీరిలో పాకిస్తాన్ న్యాయ, సమాచార శాఖ మాజీ మంత్రి సయ్యద్ అలీ జాఫర్‌తో పాటుగా, ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న దన్యాల్ గిలాని కూడా ఉన్నారు. కాగా గిలానికి... 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ హెడ్లీ సవతి సోదరుడు కావడంతో, ఆయనపై రాకపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన భారత విదేశాంగ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ....విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యేందుకు గిలాని భారత్‌కు వచ్చారు. ఆ సమయంలో ఆమె వాజ్‌పేయి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దాంతో గిలాని కూడా అక్కడకు వచ్చారు. ప్రభుత్వాధికారిగా ఉన్న ఆయనను అనుమతించకుండా ఉండేందుకు ఎటువంటి కారణాలు కన్పించలేదు. ఆయన బ్లాక్‌లిస్టులో కూడా లేరు. అందుకే నిబంధనల ప్రకారమే గిలానికి వీసా జారీ చేశామని’ వివరణ ఇచ్చారు. నేను నా దేశం కోసం పనిచేస్తున్నా.. తన గురించి వస్తున్న విమర్శలకు స్పందించిన గిలాని.. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘ఓ ప్రభుత్వాధికారిగా దేశానికి (పాకిస్తాన్) సేవ చేయడం నా బాధ్యత. డేవిడ్ హెడ్లీ కుటుంబంతో నాకు ఎటువంటి సంబంధాలు లేవు. అయినా ఎవరైనా ఒక వ్యక్తితో బంధుత్వం ఉండటం పాపమేమీ కాదు కదా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పాకిస్తాన్ సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు చైర్మన్‌గా, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పత్రికా కార్యదర్శిగా.. ఇలా వివిధ హోదాల్లో గిలాని తన సేవలందించారు. -
‘26/11’దాడి : హెడ్లీ అసలు షికాగోలోనే లేడు!
వాషింగ్టన్ : 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ హెడ్లీ (58) ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంటూ వచ్చిన వార్తలను అతడి లాయర్ జాన్ థెయిస్ ఖండించారు. ఈ వార్తలన్నీ అవాస్తవాలని.. డేవిడ్ హెడ్లీ షికాగో జైలులో గానీ, ఆస్పత్రిలో గానీ లేడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెడ్లీతో కాంటాక్ట్‌లోనే ఉన్నానన్న జాన్.. హెడ్లీ ఎక్కడున్నాడో మాత్రం చెప్పలేనన్నారు. పీటీఐతో మాట్లాడుతూ.. తోటి ఖైదీల చేతిలో గాయపడిన హెడ్లీ పరిస్థితి విషమంగా ఉందంటూ భారత మీడియాలో వచ్చిన కథనాలు నిరాధారమైనవని, వాటిలో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ విషయం గురించి స్పందించేందుకు కెన్నెత్ జస్టర్(భారత్‌లో అమెరికా రాయబారి) నిరాకరించారు. ముంబై ఘటన సూత్రధారి పాకిస్తాన్ ఏజెంట్‌గా పనిచేసిన హెడ్లీకి ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అక్కడే ఉగ్రవాద శిక్షణ పొందిన హెడ్లీ.. ముంబై దాడి రహస్య ఏజెంటుగా పనిచేసి 168 మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. అంతేకాకుండా మహ్మద్ ప్రవక్తపై కార్టూన్ వేసిన ఓ డానిష్ దినపత్రికపై దాడి చేసింది కూడా హెడ్లీయేనని వెల్లడైంది. ఈ నేపథ్యంలో 2009 అక్టోబర్‌లో షికాగోలోని ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పాకిస్తాన్‌కు బయల్దేరుతుండగా హెడ్లీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో 2013లో అమెరికా కోర్టు ముంబై దాడుల కేసులో హెడ్లీకి 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాగా షికాగో జైలులో హెడ్లీపై తోటి ఖైదీలు దాడికి పాల్పడిన ఘటనలో అతడు తీవ్రంగా గాయపడినట్లు మంగళవారం మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. -
‘26/11’ సూత్రధారి హెడ్లీపై జైల్లో దాడి
వాషింగ్టన్ : 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ హెడ్లీ (58) ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అమెరికాలోని షికాగోలో మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్ (జైలు)లో శిక్షను అనుభవిస్తున్న హెడ్లీపై ఇద్దరు తోటి ఖైదీలు దాడికి దిగారు. దీంతో తీవ్రంగా గాయపడిన హెడ్లీని అధికారులు ఆస్పత్రికి తరలించారు. జూలై 8న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ)లో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి.. ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పాకిస్తాన్ ఏజెంట్‌గా, ఉగ్రవాదిగా పనిచేసిన హెడ్లీపై జైల్లో దాడి చేసిన వారు పోలీసులను కొట్టిన కేసులో జైల్లో శిక్షననుభవిస్తున్నారు. 26/11 కేసులో అప్రూవర్‌గా మారిన హెడ్లీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబైలోని ప్రత్యేక కోర్టు విచారణలకు హాజరయ్యాడు. లష్కరే ఆధ్వర్యంలో ఉగ్రశిక్షణ అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అధికారిగా తరచూ పాకిస్తాన్ సందర్శించిన సమయంలో హెడ్లీకి లష్కరే తోయిబాతో పరిచయం ఏర్పడింది. అనంతరం లష్కరే వద్దే ఉగ్రవాద శిక్షణ పొందిన హెడ్లీ.. ముంబైలో దాడి చేసేందుకు రహస్య ఏజెంటుగా పనిచేశాడు. రెక్కీలు నిర్వహించడంలోనూ సాయం చేశాడు. 168 మంది ప్రాణాలు బలిగొన్న ముంబై ఘటనకు సూత్రధారిగా నిలిచాడు. కోపెన్‌హాగన్‌లో మహ్మద్ ప్రవక్తపై కార్టూన్ వేసిన ఓ డానిష్ దినపత్రికపై దాడి కూడా హెడ్లీయే చేసినట్లు వెల్లడైంది. 2009 అక్టోబర్‌లో షికాగోలోని ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పాకిస్తాన్‌కు బయలుదేరుతుండగా హెడ్లీని పోలీసులు అరెస్టు చేశారు. 2013లో అమెరికా కోర్టు ముంబై దాడుల కేసులోనే ఈయనకు 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అప్పటినుంచి ఈ జైల్లో శిక్షననుభవిస్తున్నాడు. -
బాల్‌థాక్రే హత్యకు కుట్ర
వీడియోలింకు వాంగ్మూలంలో హెడ్లీ వెల్లడి తన భార్యకు ముంబై దాడి విషయం తెలియదని వ్యాఖ్య ముంబై: శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాక్రే హత్యకు లష్కరే తోయిబా కుట్రపన్నిందని.. 26/11 ఘటనలో అప్రూవర్‌గా మారిన పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ చెప్పాడు. ఎప్పుడు వీలు చిక్కినా థాక్రేను మట్టుబెట్టాలనే లక్ష్యంతో లష్కరే ఒకరిని ప్రత్యేకంగా నియమించిందని.. అయితే, అతన్ని పోలీసులు పట్టుకోవటంతో ప్రయత్నం విఫలమైందని హెడ్లీ తెలిపాడు. అబు జుందాల్ తరపు న్యాయవాది అబ్దుల్ వాహబ్ ఖాన్.. క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నపుడు హెడ్లీ ఈ వివరాలు వెల్లడించాడు. శివసేన కార్యాలయం ‘సేన భవన్’ను తను కూడా రెండుసార్లు సందర్శించినట్లు తెలిపాడు. ఈ ప్రయత్నం కచ్చితంగా ఎప్పుడు జరిగిందీ.. గుర్తురావటం లేదని కానీ.. పోలీసుల కస్టడీనుంచి ఆ లష్కరే ఉగ్రవాది తర్వాత తప్పించుకున్నాడని వెల్లడించాడు. 2009లో మరోసారి భారత్‌లో దాడులకు (అల్‌కాయిదా తరపున) వచ్చినపుడు ఖర్చుల కోసం అల్‌కాయిదా నాయకుడు ఇలియాస్ కశ్మీరీ రూ. లక్ష పాకిస్తానీ కరెన్సీ ఇచ్చినట్లు హెడ్లీ తెలిపాడు. ముంబై దాడులకు కారకులైన 10 మంది ఉగ్రవాదులను తనెప్పుడూ కలవలేదనీ.. కానీ, కసబ్ ఫొటోను మాత్రం ఇంట ర్నెట్లో చూశానన్నాడు. ‘ముంబై ఘటనతో మీరు సంతోషంగా ఉన్నారా?’ అన్న వాహబ్ ఖాన్ ప్రశ్నకు.. హెడ్లీ స్పందిస్తూ ‘అవునని చెప్పినా తప్పుడు సమాధానమే.. కాదని చెప్పినా తప్పుడు సమాధానమే అవుతుంది’ అని అన్నాడు. తన భార్య షాజియాకు ఈ గొడవతో ఎలాంటి సంబంధం లేదని హెడ్లీ పునరుద్ఘాటించాడు. షాజియా గురించి ప్రశ్నించటంతో హెడ్లీ-ఖాన్ మధ్య వాగ్వాదం జరిగిం ది. ‘మీరు అనవసరమైన, పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. నోటికేదొస్తే దాన్ని అడగడం సరైంది కాదు’ అని అన్నాడు. కాగా, బాల్‌థాక్రేపై హిట్‌లిస్టులో ఉన్నారనే విషయం గర్వకారణమని శివసేన తెలిపింది. అయితే హెడ్లీ చెప్పేంతవరకు.. బాల్‌థాక్రేపై దాడికి యత్నించిన వ్యక్తిని పట్టుకోవడం.. అతడు తప్పించుకున్న విషయా న్ని ప్రభుత్వం ఎందుకు చెప్పలేదని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ప్రశ్నించారు. -
కసబ్ మంచివాడో కాదో తెలియదు కానీ..
ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడు... ఇటీవల అప్రూవర్‌గా మారిన పాక్ ఆమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ విచారణ రెండోరోజూ కొనసాగింది. శివసేన అధినేత బాలఠాక్రే హత్యకు ప్లాన్ చేశామని ప్రకటించి సంచలనం సృష్టించిన హెడ్లీ మరిన్ని వివరాలు వెల్లడించాడు. కసబ్ మంచివాడో కాదో తెలియదు గానీ.. అతను చేసిన పని ఎంతమాత్రం మంచిది కాదని వీడియో కాన్ఫరెన్స్ విచారణలో పేర్కొన్నాడు. 26 నవంబర్ దాడి ఘటనపై తాను ఇప్పటికే పశ్చాత్తాపం ప్రకటించానన్నాడు. ఆ పేలుళ్లలో భాగస్వామిగా నేరం చేశానని చెప్పాడు. కరాచీలోని లష్కరే తాయిబా కార్యాలయాన్ని తన జీవితంలో ఎప్పుడూ సందర్శించలేదని తెలిపాడు. 26/11 దాడుల తర్వాత కూడా భారత్‌పై దాడిచేసేందుకు తాను ప్రయత్నించానన్నాడు. కానీ ఈసారి అల్-కాయిదా సూచనలతో దాడి చేసేందుకు ప్రణాళిక రచించినా అది అమలుకాలేదని క్రాస్ ఎగ్జామినేషన్‌లో తెలిపాడు. మరోవైపు పాక్ ఐఎస్ఐ ముంబై దాడుల కోసం భారీగా నిధులు సమకూర్చినట్లు డేవిడ్ హెడ్లీ విచారణలో అంగీకరించాడని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ వెల్లడించారు. -
హెడ్లీ వివరాలు చెప్పిన మాజీ భార్య
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడితోపాటు పలు ఉగ్రవాద సంస్థలతో డేవిడ్ హెడ్లీకి ఉన్న సంబంధాలను అతడి మాజీ భార్య ఫైజా ఔటాల్హా ఎన్ఐఏకు వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మొరాకో దేశంలో ఉన్న ఆమెకు.. లెటర్ ఆఫ్ రొగేటరీ ద్వారా ప్రశ్నలను పంపించి వివరాలు రాబట్టింది. ఆ వివరాలను ఎన్ఐఏ బహిరంగపర్చలేదు. ఫైజా 2007లో హెడ్లీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాది కాలానికే వారు విడాకులు తీసుకున్నారు. అయితే ఆ ఏడాది కాలంలోనే హెడ్లీతో కలసి ఫైజా రెండు సార్లు భారత్‌కు వచ్చారు. ముంబైతో పాటు కశ్మీర్లో తిరిగారు. పాక్‌లో సయీద్ సహా పలువురు ఉగ్రవాదులను కలిశారు. కొంతకాలానికి హెడ్లీ విపరీత ప్రవర్తన, ఉగ్రవాదులతో సంబంధాలతో విసిగిపోయిన ఫైజా.. అతడిపై లాహోర్‌లోని పోలీస్‌స్టేషన్‌లో, అమెరికన్ ఎంబసీలో ఫిర్యాదు చేశారు. ఉగ్రవాదులు తహవూర్ రాణా, సయీద్, లఖ్వీలతో సంబంధాలు, ముంబై కుట్ర అంశాల వివరాలను వెల్లడించినట్లు సమాచారం. అమెరికాలో నివసించే హెడ్లీ సోదరుడి నుంచీ ఎన్ఐఏ వివరాలు రాబట్టింది. 1997లో న్యూయార్క్‌లో వీడియో పార్లర్ పెట్టిన హెడ్లీ... కొంతకాలానికి పూర్తిగా ముస్లిం మతవాదిగా మారిపోయాడని, ఆ తర్వాత వీడియో పార్లర్‌కు వచ్చేవాడు కాదని అతడి సోదరుడు వెల్లడించినట్లు సమాచారం. -
'ముంబై ఎయిర్ పోర్టులోనూ రెక్కీ'
ముంబై: 26/11 మారణహోమంలో ముంబై ఎయిర్ పోర్టుపై దాడి చేయనందుకు లష్కరే తొయిబా అసంతృప్తికి గురైందని అప్రూవర్‌గా మారిన పాకిస్తానీ అమెరికన్, లష్కరే ఉగ్రవాది డేవిడ్ కోలెమన్ హెడ్లీ వెల్లడించాడు. ముంబై ఎయిర్ పోర్టులో రెక్కీ నిర్వహించానని, ఈ విషయం తెలిసి ఐఎస్ఐ అధికారి మేజర్ ఇక్బాల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఎయిర్ పోర్టును టార్గెట్ చేయడం మంచి ఆలోచన కాదని ఇక్బాల్ అభిప్రాయపడినట్టు తెలిపాడు. యూదులు, ఇజ్రాయెల్ దేశస్తులు ఎక్కువగా ఉండే బచబాద్ హౌస్ ను లష్కరే తొయిబా టార్గెట్ గా ఎంపిక చేసిందన్నాడు. పాకిస్థాన్ పై గతంలో భారత్ జరిపిన బాంబు దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలంటే 26/11 దాడులను పక్కాగా అమలు చేయాలని లష్కరే కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ తమకు నూరిపోశాడని చెప్పాడు. ఉగ్రవాదులు ఎక్కడ దిగాలో ఇక్బాల్, సాజిద్ మిర్ తనకు వీడియోలో చూపించారని చెప్పాడు. దాడికి పాల్పడిన 10 మంది ఉగ్రవాదులు హిందువులుగా నమ్మించేందుకు సిద్ధివినాయక ఆలయంలో ఎరుపు, పసుపు రంగు తాళ్లు కొన్నారని తెలిపాడు. ఐఎస్ఐ తరపున పనిచేందుకు భవిష్యత్ లో బాటా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) నుంచి కొంతమందిని నియమించుకోవాలనుకుంటున్నట్టు మేజన్ ఇక్బాల్ తనతో చెప్పాడని వెల్లడించాడు. తాను బార్క్ ను సందర్శించి తీసిన వీడియోను ఇక్బాల్, సాజిద్ మిర్ ఇచ్చినట్టు హెడ్లీ తెలిపాడు. -
ఇష్రత్ జహాన్ లష్కరే ఉగ్రవాది
వీడియో కాన్ఫరెన్స్ వాంగ్మూలంలో హెడ్లీ వెల్లడి * ఈ విషయాన్ని లఖ్వీయే చెప్పాడన్న డేవిడ్ * ‘బాబ్రీ’కి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలోనే ఎన్కౌంటర్ ముంబై: 2008 ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన పాకిస్తానీ అమెరికన్, లష్కరే ఉగ్రవాది డేవిడ్ కోలెమన్ హెడ్లీని విచారిస్తున్న కొద్దీ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2004లో గుజరాత్లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మృతిచెందిన 19 ఏళ్ల ఇష్రత్ జహాన్.. లష్కరే తోయిబా ఉగ్రవాదని గురువారం జరిగిన వీడియో లింక్ వాంగ్మూలంలో హెడ్లీ వెల్లడించాడు. ‘భారత్‌లో పోలీసులపై కాల్పులు జరిపే వ్యూహంతో.. లష్కరే ఉగ్రవాది ముజమ్మిల్ భట్ ప్రయత్నాలు చేస్తుండగానే ఓ మహిళా ఉగ్రవాది ఎన్కౌంటర్ అయిందని లష్కరే కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ చెప్పారు’ అని హెడ్లీ పేర్కొన్నారు. ఆమె భారతీయురాలే అయినా.. లష్కరేలో క్రియాశీలకంగా పనిచేసినట్లు లఖ్వీ మాటలతో తెలిసిందన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా అక్షర్ధామ్ మందిరంపై దాడికి లష్కరే ఉగ్రవాది అబూ కఫా ప్రయత్నించాడన్నారు. భారత్‌లో దాడులకు లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఆర్థికంగా ఏవిధంగా తోడ్పడ్డాయనే విషయాన్ని హెడ్లీ కోర్టుకు వెల్లడించారు. కోర్టు బయట ఉజ్వల్ నికమ్ మీడియాతో మాట్లాడుతూ.. లష్కరేతోయిబాలో.. మిలటరీ, నేవీ, మహిళ, ఆర్థిక విభాగాలున్నాయని పేర్కొన్నారు. 2004లో ఏం జరిగింది? గుజరాత్‌లోని అహ్మదాబాద్ శివార్లలో 2004 జూన్ 15న ఇష్రత్ జహాన్‌తోపాటు నలుగురిని గుజరాత్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ కేసును విచారించిన సీబీఐ.. బూటకపు ఎన్కౌంటర్ అని, క్రైమ్ బ్రాంచ్, ఎస్ఐబీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయని 2013లో విడుదల చేసిన చార్జిషీటులో పేర్కొంది. అప్పటి గుజరాత్ అదనపు డీజీపీ, డీఐజీ డీజీ వంజారాతో పాటు ఏడుగురు గుజరాత్ పోలీసు అధికారుల పేర్లను చార్జిషీటులో చేర్చింది. ఐబీ స్పెషల్ డెరైక్టర్ రాజిందర్ కుమార్‌తోపాటు మరో ముగ్గురు ఐబీ అధికారులను విచారించింది. అయితే ఈ కేసులో తనను ఇరికించాలని చూశారని.. అయినా వారి రాజకీయానికి పావుగా మారలేదని రాజిందర్ కుమార్ గురువారం తెలిపారు. ఎన్కౌంటర్లన్నీ రాజకీయ జోక్యం కారణంగానే బూటకంగా మారిపోతాయని డీజీ వంజారా అన్నారు. ఇది సాక్ష్యం కాదు: ఇష్రత్ లాయర్ అయితే.. హెడ్లీ వెల్లడించిన అంశాలను సాక్ష్యాలుగా పరిగణించలేమని ఇష్రత్ కుటుంబం తరపు న్యాయవాది వృందా గ్రోవర్ అన్నారు. నలుగురు పేర్లు చెబితే.. అందులోనుంచి ఒకరి పేరును హెడ్లీ వెల్లడించటం సాక్ష్యం కాదన్నారు. ఇష్రత్ కుటుంబ సభ్యులు కూడా హెడ్లీ ఆరోపణలను ఖండించారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన ప్రణేశ్ కుమార్ అలియాస్ జావెద్ షేక్ తండ్రి పిళ్లై కూడా.. హెడ్లీ వ్యాఖ్యలపై అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ముంబై దాడుల కేసులో ముగ్గురు కీలక సాక్షులు కోర్టుకు హాజరు కాకపోవటంతో.. తదుపరి విచారణను పాక్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది. సోనియా క్షమాపణలు చెప్పాలి: బీజేపీ ప్రధాన మంత్రి మోదీపై కోపంతో.. ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్‌ను బూటకంగా చూపించేందుకు కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నించిందని.. తాజాగా హెడ్లీ వాంగ్మూలంతో.. సోనియా, రాహుల్ వ్యాఖ్యలు తప్పని తేలిందని బీజేపీ విమర్శించింది. మోదీపై తప్పుడు ప్రచారం చేసినందుకు సోనియా, రాహుల్ గాంధీ జాతికి క్షమాపణలు చెప్పాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ డిమాండ్ చేశారు. హెడ్లీ వ్యాఖ్యలు నమ్మలేం: కాంగ్రెస్ ఇష్రత్ ఎన్‌కౌంటర్‌పై హెడ్లీ వాంగ్మూలంతో.. సోనియా, రాహుల్ క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ డిమాండ్‌ను కాంగ్రెస్ ఖండించింది. హెడ్లీ సాక్షం ఆధారంగా ఇది బూటకపు ఎన్కౌంటర్ కాదని నిర్ధారించలేమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ తెలిపారు. -
'ఇప్పుడేమంటారు.. సోనియా క్షమాపణ చెప్పి తీరాలి'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికైనా తమకు క్షమాపణ చెప్పితీరాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇష్ర్రాత్ జహాన్ కూడా ఓ ఉగ్రవాదేనని లష్కరే ఈ తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ చెప్పిన నేపథ్యంలో గతంలో తమపై అనవసరంగా ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాల్సిందనన్నారు. 'ఉగ్రవాది ఇష్రాత్ జహాన్‌ను హతమార్చిన నాటి పోలీసు హీరోలకు, దేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి' అని బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ అన్నారు. 2014లో జూన్ 15న గుజరాత్ లోని అహ్మదాబాద్ శివారుల్లో పోలీసులకు కొందరు అనుమానితులపై జరిపిన కాల్పుల్లో ఇష్రత్ జహాన్ ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఓ ఉగ్రవాదిని మట్టుపెట్టిన ఇలాంటి సంఘటనపట్ల హర్షం వ్యక్తం చేయకుండా నాటి పోలీసులను అభినందించకుడా అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పలు ప్రశ్నలు లేవనెత్తిందని, కొందరిని జైలులో పెట్టిందని శ్రీకాంత్ శర్మ మండిపడ్డారు. -
'2006లో ముంబైలో ఆఫీసు పెట్టా'
ముంబై: 26/11 ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ(55) సంచలన విషయాలు వెల్లడిస్తున్నాడు. నాలుగో రోజు గురువారం ముంబై ప్రత్యేక కోర్టు జడ్జికి వీడియో లింక్ ద్వారా హెడ్లీ వాంగ్మూలం ఇచ్చాడు. ముంబైపై ముష్కరుల దాడికి అండదండలు అందించింది పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐనేనని ఇప్పటికే వెల్లడించిన హెడ్లీ మరిన్ని విషయాలు బయటపెట్టాడు. ఐఎస్ఐ అధికారి మేజర్ ఇక్బాల్, సామిర్ అలీ, డాక్టర్ తవ్వూర్ రానా, అబ్దుర్ రెహ్మాన్ పాషా నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నానని వెల్లడించాడు. ముంబైలోని నారీమన్ ప్రాంతంలో ఉన్న ఇండస్ ఇండ్ బ్యాంకు ద్వారా ఈ మొత్తం అందుకున్నానని తెలిపాడు. 2006, సెప్టెంబర్ 14న టార్డియో ఏసీ మార్కెట్ ప్రాంతంలో కార్యాలయం ప్రారంభించానని చెప్పాడు. 26/11 దాడుల తర్వాత దీన్ని మూసివేయాలని భావించినట్టు పేర్కొన్నాడు. భారత్ లో తాను రెండుమూడు ఫోన్ నంబర్లు వినియోగించినట్టు తెలిపాడు. ఇక్బాల్, సామిర్ అలీ, రానాలతో ఇ-మెయిల్స్ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్టు పంపినట్టు తెలిపాడు. 2004లో గుజరాత్ ఎన్ కౌంటర్ లో హతమైన ఇష్రత్ జహాన్ తీవ్రవాద సంస్థ లష్కర్ తోయిబా సభ్యుడని వెల్లడించాడు. లష్కర్ తోయిబాలో మహిళా విభాగం కూడా ఉందని చెప్పాడు. -
వాళ్లను ఉరి తీయాల్సిందే: దేవిక
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 26/11 మారణోమానికి కారకులైన కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలని బాధితుల్లో ఒకరైన దేవిక రొతవాన్ విజ్ఞప్తి చేశారు. చేశారు. దాడులకు కుట్రపన్నిన రాక్షసులను ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. మరణశిక్ష అమలు చేయాలని స్పష్టం చేసింది. 26/11 దాడి నుంచి దేవిక ప్రాణాలతో బయటపడింది. ముష్కరులు పేల్చిన తుపాకీ తూటా తగలడంతో ఆమె గాయపడింది. తర్వాత కోలుకుంది. ముంబై ఉగ్రదాడుల కేసులో అప్రూవర్‌గా మారి ముంబై కోర్టుకు వాంగ్మూలం ఇస్తున్న డేవిడ్ హెడ్లీని కూడా ఉరితీయాల్సిందేనని దేవిక డిమాండ్ చేసింది. ఐపీఎస్ ఉద్యోగంలో చేరాలన్నదే తన లక్ష్యమని వెల్లడించింది. -
రక్షణ శాస్త్రవేత్తలపై దాడికి ప్లాన్!
భారతదేశంలో.. అందునా ముంబై నగరంలో ఉగ్రదాడులు చేయాలని లష్కరే తాయిబా 2007 సంవత్సరంలోనే లష్కరే తాయిబా నిర్ణయించిందని 26/11 దాడుల సూత్రధారి, ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ చెప్పాడు. ముంబై ఉగ్రదాడుల కేసులో అప్రూవర్‌గా మారిన హెడ్లీ.. వీడియోలింకు ద్వారా గుర్తుతెలియని ప్రదేశం నుంచి ముంబై ప్రత్యేక కోర్టు విచారణలో పాల్గొన్నాడు. అల్ కాయిదా గురించి తనకు తెలుసని, అది ఒక ఉగ్రవాద సంస్థ అని హెడ్లీ అంగీకరించాడు. అలాగే, లష్కరే తాయిబాకు జకీవుర్ రెహ్మాన్ ఆపరేషనల్ కమాండర్ అని కూడా అంగీకరించాడు. లష్కరే తాయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ అన్నీ యునైటెడ్ జీహాద్ కౌన్సిల్ కింద పనిచేస్తున్నాయని, ఇవన్నీ భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలేనని హెడ్లీ అంగీకరించాడు. 2007 నవంబర్ - డిసెంబర్ నెలల్లో పాకిస్థాన్‌లోని ముజఫరాబాద్‌లో ఓ సమావేశం జరిగిందని, దానికి సాజిద్ మీర్, అబు ఖఫా, తాను హాజరయ్యామని హెడ్లీ చెప్పాడు. ఆ సమావేశంలోనే ముంబైలోని తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్ వద్ద రెక్కీ చేయాల్సిందిగా తనకు బాధ్యతలు అప్పగించారన్నాడు. తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్లో కొంతమంది రక్షణ శాస్త్రవేత్తలు సమావేశం అవుతున్నారన్న సమాచారం అప్పటికే లష్కర్ వద్ద ఉందని, సరిగ్గా ఆ సమావేశం జరిగే సమయానికి దాడి చేయాలని వాళ్లు అనుకున్నారని హెడ్లీ చెప్పాడు. తాను తొలిసారి జకీవుర్ రెమ్మాన్ లఖ్వీని 2003లో ముజఫరాబాద్‌లో లష్కర్ ప్రధాన కార్యాలయంలో కలిశానని హెడ్లీ తెలిపాడు. కాగా, అదే సమయంలో లఖ్వీ ఫొటో చూపించగా.. అతడేనని గుర్తుపట్టాడు. -
లష్కరే ముష్కరుల కుట్రే
నేను రెక్కీ నిర్వహించి సమాచారం ఇచ్చా ముంబై మారణహోమంపై వీడియో కాన్ఫరెన్సలో హెడ్లీ వాంగ్మూలం ముంబై: ముంబై మహానగరంలో మారణహోమం సృష్టించిన ఉగ్రదాడికి కుట్ర పన్నిందీ, అమలు చేసిందీ.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థేనని.. ఆ కుట్రలో పాలుపంచుకున్న లష్కరే ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ వెల్లడించాడు. ఇందులో పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అధికారుల సాయం ఉందని పేర్లతో సహా వివరించాడు. తనకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి శిక్షణ ఇచ్చారు.. తాను పేరు మార్చుకుని అమెరికా నుంచి ఇండియాలోకి ఎలా ప్రవేశించాడు.. ముంబైలో ఎలా రెక్కీ నిర్వహించాడు.. 26/11 ఉగ్రదాడికి ఎలా సాయం చేశాడు అనే విషయాలను.. సోమవారం ముంబై విచారణ కోర్టుకు వీడియో వాంగ్మూలం ద్వారా పూసగుచ్చినట్టు వివరించాడు. లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, ఆ సంస్థ కమాండర్ జకీఉర్ రెహ్మాన్ లఖ్వీల మార్గదర్శకత్వంలో తనకు పాక్ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో, పాక్ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలోని అబోటాబాద్లోనూ ఆ ఉగ్రవాద సంస్థ ఇచ్చిన శిక్షణ గురించి చెప్పాడు. సయీద్, లఖ్వీల ఫొటోలను అతడు కోర్టులో గుర్తించి చూపాడు. పాక్ ఐఎస్ఐకి చెందిన ముగ్గురు అధికారులు మేజర్ అలీ, మేజర్ ఇక్బాల్, మేజర్ అబ్దుల్ రెహ్మాన్ పాషాలతో తనకు ఎలా సంబంధం ఏర్పడిందీ తెలిపాడు. పాకిస్తానీ-అమెరికన్ అయిన డేవిడ్ కోల్మాన్ హెడ్లీ.. ముంబై దాడుల కేసులోనే అమెరికా కోర్టులో దోషిగా నిర్ధారితుడై 35 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ముంబై దాడుల కేసును విచారిస్తున్న ముంబై కోర్టులో సైతం.. తనకు క్షమాభిక్ష పెట్టేట్లయితే అప్రూవర్‌గా మారి వాంగ్మూలం ఇవ్వడానికి హెడ్లీ సమ్మతించాడు. కోర్టు ఆదేశం మేరకు సోమవారం అమెరికా జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాంగ్మూలం ఇచ్చాడు. ముంబై నగరంలో 166 మంది మరణానికి, 309 మంది క్షతగాత్రులవటానికి కారణమైన 2008 నవంబర్ 26 నాటి ఉగ్రదాడులకు ముందు జరిగిన పరిణామాలన్నిటి గురించీ ప్రత్యేక న్యాయమూర్తి జి.ఎ.సనాప్ ఎదుట వివరించాడు. విదేశీ గడ్డ నుంచి భారతదేశంలోని కోర్టుకు వీడియో వాంగ్మూలం ఇవ్వటం ఇదే తొలిసారి. ఉదయం 7 గంటలకు మొదలైన వాంగ్మూలం ప్రక్రియ ఐదున్నర గంటల పాటు కొనసాగింది. హెడ్లీవాంగ్మూలం, విచారణ ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగనుంది. పాక్ పాత్రపై అస్పష్టత తొలగుతుంది: రిజిజు న్యూఢిల్లీ: పాకిస్తానీ - అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ ఇచ్చిన వాంగ్మూలంతో.. ముంబై ఉగ్రవాద దాడిలో పాక్‌కు చెందిన ప్రభుత్వ, ప్రభుత్వేతర శక్తుల పాత్రపై అస్పష్టత తొలగిపోతుందని.. కేసును తార్కిక ముగింపునకు తీసుకెళుతుందని భారత ప్రభుత్వం వ్యాఖ్యానించింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముంబై ఉగ్రవాద దాడుల కుట్రలో ఎవరి పాత్ర ఉందనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎవరెవరు ఉన్నారో తెలుసు. హెడ్లీ వాంగ్మూలం ఒక తార్కిక ముగింపునకు దారితీస్తుంది. అది మనకు సాయపడుతుంది’’ అని పేర్కొన్నారు. వాంగ్మూలం అతని మాటల్లోనే... సయీద్ ప్రేరేపణతో లష్కరేలో చేరా... ‘‘నా అసలు పేరు దావూద్ జిలానీ. పాకిస్తాన్‌లోని హసన్ అబ్దల్ కాడెట్ కాలేజ్‌లో చదివాను. పదిహేడేళ్ల వయసులో అమెరికాకు వలస వెళ్లాను. హఫీజ్ సయీద్ ప్రసంగాలతో ప్రేరేపితమై లష్కరే ఉగ్రవాద సంస్థలో చేరాను. ఇండియాను నా శత్రువుగా పరిగణించేవాడిని. నేను లష్కరేకు నిజమైన కార్యకర్తను. కశ్మీర్ వెళ్లి భారత బలగాలతో యుద్ధం చేయాలనుకున్నాను. కానీ.. అందుకు నా వయసు ఎక్కువైపోయిందని లఖ్వీ తదితరులు చెప్పారు. నన్ను మరొక అవసరానికి వాడుకుంటామని, అది కశ్మీర్ కన్నా చాలా సాహసోపేతమైన పని అని లఖ్వీ నాకు చెప్పాడు. ఇండియా లో దాడుల కోసం రెక్కీ నిర్వహించటానికి నా పేరు మార్చుకోవాలని లఖ్వీ, ఐఎస్ఐ కమాండర్లు సూచించారు.’’ రెండేళ్ల పాటు లష్కరే శిక్షణ పొందా... ‘‘నేను తొలిసారి 2002లో ముజఫరాబాద్‌లో లష్కరే శిక్షణ పొందాను. సయీద్, లఖ్వీలు నడిపిన ‘నాయకత్వ శిక్షణ’కు కూడా హాజరయ్యాను. లష్కరే శిబిరాల్లో దాదాపు రెండేళ్ల పాటు ఐదు, ఆరు శిక్షణ కోర్సులకు హాజరయ్యాను. దౌరా-ఎ-సూఫా అనేది ఒక అధ్యయన కోర్సు. లాహోర్‌లోని మురిడ్కేలో ఈ శిక్షణ ఇస్తారు. దౌరా-ఎ-ఆమ్ అనేది ప్రాథమిక సైనిక శిక్షణ. ‘ఆజాద్ కశ్మీర్’(పీఓకే)లోని ముజఫరాబాద్‌లో ఈ శిక్షణ ఇస్తారు. దౌరా-ఎ-ఖాస్ అనేది మరింత తీవ్రమైన శిక్షణ. అందులో నాకు ఆయుధాలు, తుపాకులు, పేలుడు పదార్థాలు, మందుగుండును ఎలా వినియోగించాలో నేర్పించారు. దౌరా-ఎ-రిబాత్ అనే శిక్షణ కూడా నాకు ఇచ్చారు. ఇది నిఘా కోర్సు. సురక్షిత స్థావరాలను నెలకొల్పటం, రహస్యంగా సమాచారం సేకరించటం తదితరాలు నేర్పారు. ఈ శిక్షణా కేంద్రం పాక్‌లోని అబోటాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో గల మన్సేరాలో ఉంది.’’ అమెరికాలో పేరు మార్చుకుని ఇండియా వీసా తీసుకున్నా... ‘‘ఇండియాలోకి ప్రవేశించటానికి.. అమెరికా గుర్తింపుతో ఇండియాలో వ్యాపారం స్థాపించే మిషతో వచ్చాను. అందుకోసం.. నా పేరును డేవిడ్ హెడ్లీగా మార్చుకుంటూ 2006 ఫిబ్రవరి 5న ఫిలడెల్ఫియాలో దరఖాస్తు చేశాను. ఆ పేరుతో కొత్త పాస్‌పోర్ట్ సంపాదించాను. ఆ విషయాన్ని లష్కరేలోని నా సహచరులకు చెప్పాను. వారిలో సాజిద్ మిర్.. నాతో సంప్రదింపులు జరుపుతుండేవాడు. ఇండియాలో ఒక ఆఫీసు లేదా వ్యాపారం నెలకొల్పటం ద్వారా నేను అక్కడ ఒక ముసుగులో నివసించాలనేది ఉద్దేశం. భారత రాయబార కార్యాలయంలో వాణిజ్య వీసా కోసం దరఖాస్తు చేశాను. భారత వీసా కోసం దరఖాస్తు చేసేటపుడు నేను ఒక ఇమిగ్రేషన్ కన్సల్టెంట్‌నని తప్పుడు కథ అల్లి చెప్పాను. ప్రతిసారీ భారత వీసా కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా.. పలుమార్లు వచ్చి వెళ్లేందుకు వీలైన వీసా తీసుకున్నాను. ఒక డానిష్ వార్తా పత్రికపై దాడికి కుట్ర పన్నటంలో లష్కరే సంస్థకు మద్దతిచ్చిన కేసులో దోషిగా నిర్ధారితుడైన పాక్ మాజీ సైనిక వైద్యుడు తాహావ్వుర్ హుస్సేన్ రాణా.. నేను ఇండియా ప్రయాణానికి ఐదేళ్ల వీసా సంపాదించటంలో సాయపడ్డాడు. 26/11 దాడుల గురించి రాణాకూ తెలుసు. ఐఎస్ఐ మేజర్లు మాకు సహకరించారు... ‘‘ఐఎస్ఐకి చెందిన మేజర్ ఇక్బాల్ నాకు తెలుసు. ఐఎస్ఐకే చెందిన మేజర్ అలీ అతడిని నాకు పరిచయం చేశాడు. ఆ తర్వాత ఒకసారి లాహోర్‌లో మేజర్ ఇక్బాల్‌ను నేను కలిశాను. పాక్‌లోని ఫెడరల్లీ అడ్మినిస్ట్రేటెడ్ ట్రైబల్ ఏరియాలో నేను ఒకసారి అరెస్టయ్యాను. ఆ సమయంలో ఐఎస్ఐకి చెందిన మేజర్ అబ్దుల్ రెహ్మాన్ పాషా కూడా నాతోనే ఉన్నాడు. నన్ను ప్రశ్నించేందుకు మేజర్ అలీ వచ్చాడు. నేను విదేశీయుడిలా కనిపించటం వల్ల, నా వద్ద ఇండియా మీద గల పుస్తకాలు దొరకటం వల్ల నన్ను అరెస్ట్ చేశారు. అయితే నాకు గల పాకిస్తానీ గుర్తింపు కార్డును చూపటంతో నాపై కేసు నమోదు చేయలేదు. ’’ రెండు సార్లు విఫలమయ్యారు... ‘‘ముంబైలో 2008 నవంబర్ 26వ తేదీన మారణహోమం సృష్టించిన పది మంది ఉగ్రవాదులు.. అంతకుముందు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే దాడులు చేయటానికి రెండు సార్లు కుట్ర పన్నారు. కానీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయని సాజిద్‌మిర్ నాకు చెప్పాడు. సెప్టెంబర్‌లో తొలి ప్రయత్నం చేశారు. కరాచీ వెలుపలి నుంచి సముద్రంలో ప్రయాణమైన ఉగ్రవాదుల బోటు.. కొంత దూరం వెళ్లాక రాళ్లను ఢీకొట్టి ముక్కలైంది. బోటులోని ఆయుధాలు, పేలుడు పదార్థాలన్నీ సముద్రంలో పడిపోయాయి. అందులో ఉన్నవారికి లైఫ్ జాకెట్లు ఉండటంతో వారు వెనుదిరిగి పాక్ తీరానికి చేరుకున్నారు. అక్టోబర్‌లో రెండోసారి ప్రయత్నం చేశారు. అదీ విఫలమైంది. అదే 10 మంది ఉగ్రవాదులు ముంబైపై దాడి చేయటంలో మూడోసారి సఫలమయ్యారు.’’ దాడులకు ముందు ఏడుసార్లు ముంబై వచ్చాను.. ‘‘నా వీసా ప్రణాళికనంతటినీ నేను సాజిద్మిర్తోను, ఐఎస్ఐకి చెందిన మేజర్ ఇక్బాల్లతోను చర్చించాను. ముంబై చేరుకుని.. నా వాస్తవ గుర్తింపు తెలియకుండా ఉండటం కోసం ఒక ఆఫీసు స్థాపించాను. నేను తొలిసారి ఇండియాకు రావటానికి ముందు.. ముంబై నగరాన్ని వీడియో తీసి తీసుకురావాలని లష్కరే ప్రతినిధి సాజిద్‌మిర్ (ఈ కేసులో మరో నిందితుడు) నాకు చెప్పాడు. 2008 ఉగ్రవాద దాడులకు ముందు నేను ఏడుసార్లు ముంబై వెళ్లాను. ఆ దాడి తర్వాత 2009 మార్చిలో ఒకసారి ఢిల్లీ వెళ్లాను. (ముంబైలో హెడ్లీ చేసిన పని.. నగరానికి సంబంధించి మ్యాపులు తయారు చేసి, వీడియో తీయటం, తాజ్, ఒబెరాయ్ హోటళ్లు, నారీమన్ హౌస్‌ల వద్ద రెక్కీ నిర్వహింభఃచటం. ముంబైపై 10 మంది ఉగ్రవాదుల దాడులకు హెడ్లీ అందించిన రెక్కీ సమాచారమే కీలకమైంది.) సంచలన విషయాలు వెల్లడించాడు: నికమ్ హెడ్లీ తన వాంగ్మూలంలో వెల్లడించిన విషయాలతో తాను పూర్తిగా సంతృప్తి చెందినట్లు ప్రత్యేక ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ పేర్కొన్నారు. ‘‘హెడ్లీ సంచలన విషయాలు వెల్లడించాడు. తాను హఫీజ్ సయీద్‌ను కలిసినట్లు చెప్పాడు. అతడి ఫొటోను గుర్తించాడు. ఐఎస్ఐలో ఉన్న మేజర్ ఇక్బాల్, మేజర్ అలీల గురించి చాలా విషయాలు వెల్లడించాడు. అతడికి శిక్షణ ఇచ్చింది మేజర్ ఇక్బాల్. పలువురు లష్కరే శిక్షకుల పేర్లను కోర్టు ఎదుట వెల్లడించాడు. హఫీజ్ సయీద్ వల్ల ప్రేరేపితుడనై లష్కరే తోయిబాలో చేరినట్లు హెడ్లీ ఒప్పుకున్నాడని అతడి తరఫు న్యాయవాది మహేశ్జెఠ్మలాని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. 26/11 దాడుల మరో కుట్రదారు సయ్యద్ జబీయుద్దీన్ అన్సారీ అలియాస్ అబుజుందాల్‌ను కూడా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరిచారు. తన న్యాయవాదిని ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపిన జుందాల్.. కొత్త న్యాయవాదిని నియమించుకునేందుకు 15 రోజుల గడువు కోరాడు. అలాగే తన పేరు సయ్యద్ జబీయుద్దీన్ అన్సారీ అని.. అబుజుందాల్ కాదంటూ అలియాస్ పేరును కోర్టు రికార్డుల నుంచి తొలగించాలని కోరాడు. -
క్షమిస్తే సాక్ష్యం చెబుతా: హెడ్లీ
-
క్షమిస్తే సాక్ష్యం చెబుతా: హెడ్లీ
ముంబై: 26/11 దాడి కేసులో పాకిస్థాన్ సంతతికి చెందిన అమెరికా తీవ్రవాది డేవిడ్ హెడ్లీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబై ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. అమెరికా జైలులో ఉన్న అతడిని గురువారం సాయంత్రం 6.35 గంటలకు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. తనపై మోపిన 11 అభియోగాలను అతడు అంగీకరించాడు. 26/11 దాడిలో తన పాత్ర ఉందని ఒప్పుకున్నాడు. తనకు క్షమాభిక్ష ప్రసాదిస్తే సాక్ష్యం చెబుతానని కోర్టుకు తెలిపాడు. 'నేను కోర్టు ముందు హాజరయ్యాను. ముంబై కోర్టు నాకు క్షమాభిక్ష పెడితే 26/11 దాడి కేసుకు సంబంధించి అడిగే ఏ ప్రశ్నలకైనా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను' అని హెడ్లీ పేర్కొన్నాడు. ముంబై కోర్టు ఆదేశాల మేరకు అతడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. -
డేవిడ్ హాడ్లీకిముంబై కోర్టు సమన్లు
-
డేవిడ్ హాడ్లీకిముంబై కోర్టు సమన్లు
ముంబై: 26/11 దాడి కేసులో పాకిస్థాన్-అమెరికన్ లష్కరే తోయిబా తీవ్రవాది డేవిడ్ హాడ్లీను నిందితుడిగా చేర్చేందుకు ప్రత్యేక టాడా కోర్టు అంగీకరించింది. అతడికి సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 10న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించేందుకు పోలీసులకు అనుమతినిచ్చింది. ప్రస్తుతం అతడు అమెరికా జైలులో ఉన్నాడు. ఈ కేసులో హాడ్లీ నిందితుడిగా చేర్చాలని ముంబై పోలీసులు అక్టోబర్ 8న పిటిషన్ దాఖలు చేశారు. అమెరికా జైలులో ఉన్నప్పటికీ హాడ్లీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేందుకు ఎటువంటి అడ్డంకులు ఎదురుకాబోవని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఉజ్వల్ నికమ్ తెలిపారు. అతడికి అమెరికా కోర్టు 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది.