వాషింగ్టన్ : 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ హెడ్లీ (58) ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంటూ వచ్చిన వార్తలను అతడి లాయర్ జాన్ థెయిస్ ఖండించారు. ఈ వార్తలన్నీ అవాస్తవాలని.. డేవిడ్ హెడ్లీ షికాగో జైలులో గానీ, ఆస్పత్రిలో గానీ లేడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెడ్లీతో కాంటాక్ట్‌లోనే ఉన్నానన్న జాన్.. హెడ్లీ ఎక్కడున్నాడో మాత్రం చెప్పలేనన్నారు. పీటీఐతో మాట్లాడుతూ.. తోటి ఖైదీల చేతిలో గాయపడిన హెడ్లీ పరిస్థితి విషమంగా ఉందంటూ భారత మీడియాలో వచ్చిన కథనాలు నిరాధారమైనవని, వాటిలో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ విషయం గురించి స్పందించేందుకు కెన్నెత్ జస్టర్(భారత్‌లో అమెరికా రాయబారి) నిరాకరించారు.
ముంబై ఘటన సూత్రధారి
పాకిస్తాన్ ఏజెంట్‌గా పనిచేసిన హెడ్లీకి ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అక్కడే ఉగ్రవాద శిక్షణ పొందిన హెడ్లీ.. ముంబై దాడి రహస్య ఏజెంటుగా పనిచేసి 168 మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. అంతేకాకుండా మహ్మద్ ప్రవక్తపై కార్టూన్ వేసిన ఓ డానిష్ దినపత్రికపై దాడి చేసింది కూడా హెడ్లీయేనని వెల్లడైంది. ఈ నేపథ్యంలో 2009 అక్టోబర్‌లో షికాగోలోని ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పాకిస్తాన్‌కు బయల్దేరుతుండగా హెడ్లీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో 2013లో అమెరికా కోర్టు ముంబై దాడుల కేసులో హెడ్లీకి 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాగా షికాగో జైలులో హెడ్లీపై తోటి ఖైదీలు దాడికి పాల్పడిన ఘటనలో అతడు తీవ్రంగా గాయపడినట్లు మంగళవారం మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment