లష్కరే ముష్కరుల కుట్రే | David Headley Says Two Earlier 26/11-Type Attempts Failed | Sakshi
Sakshi News home page

లష్కరే ముష్కరుల కుట్రే

Published Tue, Feb 9 2016 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

లష్కరే ముష్కరుల కుట్రే

లష్కరే ముష్కరుల కుట్రే

నేను రెక్కీ నిర్వహించి సమాచారం ఇచ్చా
ముంబై మారణహోమంపై వీడియో కాన్ఫరెన్‌‌సలో హెడ్లీ వాంగ్మూలం

ముంబై: ముంబై మహానగరంలో మారణహోమం సృష్టించిన ఉగ్రదాడికి కుట్ర పన్నిందీ, అమలు చేసిందీ.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థేనని.. ఆ కుట్రలో పాలుపంచుకున్న లష్కరే ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ వెల్లడించాడు. ఇందులో పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ అధికారుల సాయం ఉందని పేర్లతో సహా వివరించాడు. తనకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి శిక్షణ ఇచ్చారు..

తాను పేరు మార్చుకుని అమెరికా నుంచి ఇండియాలోకి ఎలా ప్రవేశించాడు.. ముంబైలో ఎలా రెక్కీ నిర్వహించాడు.. 26/11 ఉగ్రదాడికి ఎలా సాయం చేశాడు అనే విషయాలను.. సోమవారం ముంబై విచారణ కోర్టుకు వీడియో వాంగ్మూలం ద్వారా పూసగుచ్చినట్టు వివరించాడు. లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, ఆ సంస్థ కమాండర్ జకీఉర్ రెహ్మాన్ లఖ్వీల మార్గదర్శకత్వంలో తనకు పాక్‌ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో, పాక్ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలోని అబోటాబాద్‌లోనూ ఆ ఉగ్రవాద సంస్థ ఇచ్చిన శిక్షణ గురించి చెప్పాడు.

సయీద్, లఖ్వీల ఫొటోలను అతడు కోర్టులో గుర్తించి చూపాడు. పాక్ ఐఎస్‌ఐకి చెందిన ముగ్గురు అధికారులు మేజర్ అలీ, మేజర్ ఇక్బాల్, మేజర్ అబ్దుల్ రెహ్మాన్ పాషాలతో తనకు ఎలా సంబంధం ఏర్పడిందీ తెలిపాడు. పాకిస్తానీ-అమెరికన్ అయిన డేవిడ్ కోల్‌మాన్ హెడ్లీ.. ముంబై దాడుల కేసులోనే అమెరికా కోర్టులో దోషిగా నిర్ధారితుడై 35 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ముంబై దాడుల కేసును విచారిస్తున్న ముంబై కోర్టులో సైతం.. తనకు క్షమాభిక్ష పెట్టేట్లయితే అప్రూవర్‌గా మారి వాంగ్మూలం ఇవ్వడానికి హెడ్లీ సమ్మతించాడు.

కోర్టు ఆదేశం మేరకు సోమవారం అమెరికా జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాంగ్మూలం ఇచ్చాడు. ముంబై నగరంలో 166 మంది మరణానికి, 309 మంది క్షతగాత్రులవటానికి కారణమైన 2008 నవంబర్ 26 నాటి ఉగ్రదాడులకు ముందు జరిగిన పరిణామాలన్నిటి గురించీ ప్రత్యేక న్యాయమూర్తి జి.ఎ.సనాప్ ఎదుట వివరించాడు. విదేశీ గడ్డ నుంచి భారతదేశంలోని కోర్టుకు వీడియో వాంగ్మూలం ఇవ్వటం ఇదే తొలిసారి. ఉదయం 7 గంటలకు మొదలైన వాంగ్మూలం ప్రక్రియ ఐదున్నర గంటల పాటు కొనసాగింది. హెడ్లీవాంగ్మూలం, విచారణ ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగనుంది.
 
పాక్ పాత్రపై అస్పష్టత తొలగుతుంది: రిజిజు
న్యూఢిల్లీ: పాకిస్తానీ - అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ ఇచ్చిన వాంగ్మూలంతో.. ముంబై ఉగ్రవాద దాడిలో పాక్‌కు చెందిన ప్రభుత్వ, ప్రభుత్వేతర శక్తుల పాత్రపై అస్పష్టత తొలగిపోతుందని.. కేసును తార్కిక ముగింపునకు తీసుకెళుతుందని భారత ప్రభుత్వం వ్యాఖ్యానించింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముంబై ఉగ్రవాద దాడుల కుట్రలో ఎవరి పాత్ర ఉందనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎవరెవరు ఉన్నారో తెలుసు. హెడ్లీ వాంగ్మూలం ఒక తార్కిక ముగింపునకు దారితీస్తుంది. అది మనకు సాయపడుతుంది’’ అని పేర్కొన్నారు.
 
వాంగ్మూలం అతని మాటల్లోనే...
సయీద్ ప్రేరేపణతో లష్కరేలో చేరా...

‘‘నా అసలు పేరు దావూద్ జిలానీ. పాకిస్తాన్‌లోని హసన్ అబ్దల్ కాడెట్ కాలేజ్‌లో చదివాను. పదిహేడేళ్ల వయసులో అమెరికాకు వలస వెళ్లాను. హఫీజ్ సయీద్ ప్రసంగాలతో ప్రేరేపితమై లష్కరే ఉగ్రవాద సంస్థలో చేరాను. ఇండియాను నా శత్రువుగా పరిగణించేవాడిని. నేను లష్కరేకు నిజమైన కార్యకర్తను.

కశ్మీర్ వెళ్లి భారత బలగాలతో యుద్ధం చేయాలనుకున్నాను. కానీ.. అందుకు నా వయసు ఎక్కువైపోయిందని లఖ్వీ తదితరులు చెప్పారు. నన్ను మరొక అవసరానికి వాడుకుంటామని, అది కశ్మీర్ కన్నా చాలా సాహసోపేతమైన పని అని లఖ్వీ నాకు చెప్పాడు. ఇండియా లో దాడుల కోసం రెక్కీ నిర్వహించటానికి నా పేరు మార్చుకోవాలని లఖ్వీ, ఐఎస్‌ఐ కమాండర్లు సూచించారు.’’
 
రెండేళ్ల పాటు లష్కరే శిక్షణ పొందా...

‘‘నేను తొలిసారి 2002లో ముజఫరాబాద్‌లో లష్కరే శిక్షణ పొందాను. సయీద్, లఖ్వీలు నడిపిన ‘నాయకత్వ శిక్షణ’కు కూడా హాజరయ్యాను. లష్కరే శిబిరాల్లో దాదాపు రెండేళ్ల పాటు ఐదు, ఆరు శిక్షణ కోర్సులకు హాజరయ్యాను.
 దౌరా-ఎ-సూఫా అనేది ఒక అధ్యయన కోర్సు. లాహోర్‌లోని మురిడ్కేలో ఈ శిక్షణ ఇస్తారు. దౌరా-ఎ-ఆమ్ అనేది ప్రాథమిక సైనిక శిక్షణ. ‘ఆజాద్ కశ్మీర్’(పీఓకే)లోని ముజఫరాబాద్‌లో ఈ శిక్షణ ఇస్తారు.

దౌరా-ఎ-ఖాస్ అనేది మరింత తీవ్రమైన శిక్షణ. అందులో నాకు ఆయుధాలు, తుపాకులు, పేలుడు పదార్థాలు, మందుగుండును ఎలా వినియోగించాలో నేర్పించారు. దౌరా-ఎ-రిబాత్ అనే శిక్షణ కూడా నాకు ఇచ్చారు. ఇది నిఘా కోర్సు. సురక్షిత స్థావరాలను నెలకొల్పటం, రహస్యంగా సమాచారం సేకరించటం తదితరాలు నేర్పారు. ఈ శిక్షణా కేంద్రం పాక్‌లోని అబోటాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో గల మన్సేరాలో ఉంది.’’
 
అమెరికాలో పేరు మార్చుకుని
ఇండియా వీసా తీసుకున్నా...

‘‘ఇండియాలోకి ప్రవేశించటానికి.. అమెరికా గుర్తింపుతో ఇండియాలో వ్యాపారం స్థాపించే మిషతో వచ్చాను. అందుకోసం.. నా పేరును డేవిడ్ హెడ్లీగా మార్చుకుంటూ 2006 ఫిబ్రవరి 5న ఫిలడెల్ఫియాలో దరఖాస్తు చేశాను. ఆ పేరుతో కొత్త పాస్‌పోర్ట్  సంపాదించాను. ఆ విషయాన్ని లష్కరేలోని నా సహచరులకు చెప్పాను. వారిలో సాజిద్ మిర్.. నాతో సంప్రదింపులు జరుపుతుండేవాడు.

ఇండియాలో ఒక ఆఫీసు లేదా వ్యాపారం నెలకొల్పటం ద్వారా నేను అక్కడ ఒక ముసుగులో నివసించాలనేది ఉద్దేశం. భారత రాయబార కార్యాలయంలో వాణిజ్య వీసా కోసం దరఖాస్తు చేశాను. భారత వీసా కోసం దరఖాస్తు చేసేటపుడు నేను ఒక ఇమిగ్రేషన్ కన్సల్టెంట్‌నని తప్పుడు కథ అల్లి చెప్పాను. ప్రతిసారీ భారత వీసా కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా.. పలుమార్లు వచ్చి వెళ్లేందుకు వీలైన వీసా తీసుకున్నాను.

ఒక డానిష్ వార్తా పత్రికపై దాడికి కుట్ర పన్నటంలో లష్కరే సంస్థకు మద్దతిచ్చిన కేసులో దోషిగా నిర్ధారితుడైన పాక్ మాజీ సైనిక వైద్యుడు తాహావ్వుర్ హుస్సేన్ రాణా.. నేను ఇండియా ప్రయాణానికి ఐదేళ్ల వీసా సంపాదించటంలో సాయపడ్డాడు. 26/11 దాడుల గురించి రాణాకూ తెలుసు.

ఐఎస్‌ఐ మేజర్లు మాకు సహకరించారు...
‘‘ఐఎస్‌ఐకి చెందిన మేజర్ ఇక్బాల్ నాకు తెలుసు. ఐఎస్‌ఐకే చెందిన మేజర్ అలీ అతడిని నాకు పరిచయం చేశాడు. ఆ తర్వాత ఒకసారి లాహోర్‌లో మేజర్ ఇక్బాల్‌ను నేను కలిశాను. పాక్‌లోని ఫెడరల్లీ అడ్మినిస్ట్రేటెడ్ ట్రైబల్ ఏరియాలో నేను ఒకసారి అరెస్టయ్యాను. ఆ సమయంలో ఐఎస్‌ఐకి చెందిన మేజర్ అబ్దుల్ రెహ్మాన్ పాషా కూడా నాతోనే ఉన్నాడు.

నన్ను ప్రశ్నించేందుకు మేజర్ అలీ వచ్చాడు. నేను విదేశీయుడిలా కనిపించటం వల్ల, నా వద్ద ఇండియా మీద గల పుస్తకాలు దొరకటం వల్ల నన్ను అరెస్ట్ చేశారు. అయితే నాకు గల పాకిస్తానీ గుర్తింపు కార్డును చూపటంతో నాపై కేసు నమోదు చేయలేదు. ’’
 
రెండు సార్లు విఫలమయ్యారు...
‘‘ముంబైలో 2008 నవంబర్ 26వ తేదీన మారణహోమం సృష్టించిన పది మంది ఉగ్రవాదులు.. అంతకుముందు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే దాడులు చేయటానికి రెండు సార్లు కుట్ర పన్నారు. కానీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయని సాజిద్‌మిర్ నాకు చెప్పాడు. సెప్టెంబర్‌లో తొలి ప్రయత్నం చేశారు. కరాచీ వెలుపలి నుంచి సముద్రంలో ప్రయాణమైన ఉగ్రవాదుల బోటు.. కొంత దూరం వెళ్లాక రాళ్లను ఢీకొట్టి ముక్కలైంది.

బోటులోని ఆయుధాలు, పేలుడు పదార్థాలన్నీ సముద్రంలో పడిపోయాయి. అందులో ఉన్నవారికి లైఫ్ జాకెట్లు ఉండటంతో వారు వెనుదిరిగి పాక్ తీరానికి చేరుకున్నారు. అక్టోబర్‌లో రెండోసారి ప్రయత్నం చేశారు. అదీ విఫలమైంది. అదే 10 మంది ఉగ్రవాదులు ముంబైపై దాడి చేయటంలో మూడోసారి సఫలమయ్యారు.’’
 
దాడులకు ముందు ఏడుసార్లు ముంబై వచ్చాను..
‘‘నా వీసా ప్రణాళికనంతటినీ నేను సాజిద్‌మిర్‌తోను, ఐఎస్‌ఐకి చెందిన మేజర్ ఇక్బాల్‌లతోను చర్చించాను. ముంబై చేరుకుని.. నా వాస్తవ గుర్తింపు తెలియకుండా ఉండటం కోసం ఒక ఆఫీసు స్థాపించాను. నేను తొలిసారి ఇండియాకు రావటానికి ముందు.. ముంబై నగరాన్ని వీడియో తీసి తీసుకురావాలని లష్కరే ప్రతినిధి సాజిద్‌మిర్ (ఈ కేసులో మరో నిందితుడు) నాకు చెప్పాడు.

2008 ఉగ్రవాద దాడులకు ముందు నేను ఏడుసార్లు ముంబై వెళ్లాను. ఆ దాడి తర్వాత 2009 మార్చిలో ఒకసారి ఢిల్లీ వెళ్లాను. (ముంబైలో హెడ్లీ చేసిన పని.. నగరానికి సంబంధించి మ్యాపులు తయారు చేసి, వీడియో తీయటం, తాజ్, ఒబెరాయ్ హోటళ్లు, నారీమన్ హౌస్‌ల వద్ద రెక్కీ నిర్వహింభఃచటం. ముంబైపై 10 మంది ఉగ్రవాదుల దాడులకు హెడ్లీ అందించిన రెక్కీ సమాచారమే కీలకమైంది.)
 
సంచలన విషయాలు వెల్లడించాడు: నికమ్
హెడ్లీ తన వాంగ్మూలంలో వెల్లడించిన విషయాలతో తాను పూర్తిగా సంతృప్తి చెందినట్లు ప్రత్యేక ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ పేర్కొన్నారు. ‘‘హెడ్లీ సంచలన విషయాలు వెల్లడించాడు. తాను హఫీజ్ సయీద్‌ను కలిసినట్లు చెప్పాడు. అతడి ఫొటోను గుర్తించాడు. ఐఎస్‌ఐలో ఉన్న మేజర్ ఇక్బాల్, మేజర్ అలీల గురించి చాలా విషయాలు వెల్లడించాడు. అతడికి శిక్షణ ఇచ్చింది మేజర్ ఇక్బాల్. పలువురు లష్కరే శిక్షకుల పేర్లను  కోర్టు ఎదుట వెల్లడించాడు.

హఫీజ్ సయీద్ వల్ల ప్రేరేపితుడనై లష్కరే తోయిబాలో చేరినట్లు హెడ్లీ ఒప్పుకున్నాడని అతడి తరఫు న్యాయవాది మహేశ్‌జెఠ్మలాని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. 26/11 దాడుల మరో కుట్రదారు సయ్యద్ జబీయుద్దీన్ అన్సారీ అలియాస్ అబుజుందాల్‌ను కూడా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరిచారు. తన న్యాయవాదిని ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపిన జుందాల్.. కొత్త న్యాయవాదిని నియమించుకునేందుకు 15 రోజుల గడువు కోరాడు. అలాగే తన పేరు సయ్యద్ జబీయుద్దీన్ అన్సారీ అని.. అబుజుందాల్ కాదంటూ అలియాస్ పేరును కోర్టు రికార్డుల నుంచి తొలగించాలని కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement