Mumbai terror attacks
-
‘ముంబై’ దాడులపై నాడు స్పందనే లేదు!
ముంబై: 2008లో ముంబైలో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించి నాటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంపై విదేశాంగ మంత్రి జై శంకర్ పరోక్ష విమర్శలు చేశారు. ఆ దాడికి భారత్ వైపు నుంచి స్పందనే లేకపోయిందంటూ ఆక్షేపించారు. ముంబైలో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘ముంబై దాడి జరిగినప్పుడు భారత్ నుంచి దానిపై స్పందనే లేదు. ఆ సమయంలో ఐరాస భద్రతా మండలిలో భారత్ సభ్య దేశం. ఉగ్రవాద వ్యతిరేక కమిటీ అధ్యక్ష స్థానంలో ఉంది. ఆ కమిటీ బేటీ కూడా ఉగ్ర దాడికి లక్ష్యంగా మారిన ముంబై తాజ్ హోటల్లోనే జరిగింది’’ అని గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు పరిస్థితి మారింది. నేడున్నది నాటి భారత్ కాదు. ఉగ్ర ఘటనలపై గట్టిగా స్పందిస్తున్నాం. దుస్సాహసం చేస్తే మన సమాధానమే వేరుగా ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. మనతో పగలు వ్యాపారం చేస్తాం, రాత్రిళ్లు మనపైనే ఉగ్ర దాడులు చేస్తామంటే కుదరదన్నారు. తూర్పు లద్దాఖ్‌లో 2020 నాటి పరిస్థితి నెలకొనాలంటే చైనా సేనలను పూర్తిగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని జైశంకర్ అన్నారు. -
ముంబై దాడులను ఎన్నటికీ మర్చిపోలేం : మన్ కీ బాత్‌లో ప్రధాని
న్యూఢిల్లీ: ముంబైలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడులను ఎప్పటికీ మర్చిపోలేమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అది ఒక దారుణమైన ఉగ్ర దాడి అని అభివర్ణించారు. ఆదివారం తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధాని ముంబై టెర్రర్ దాడులను ప్రస్తావించారు. ‘ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడులను ఎప్పటికీ మర్చిపోలేం.ఆ రోజున ఉగ్రవాదులు ముంబైతో పాటు మొత్తం దేశాన్నే వణికించారు. ఆ దాడుల నుంచి మనం ధైర్యంతో కోలుకుని ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నాం’ అని ప్రధాని తెలిపారు. మరోపక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్లో 26/11 దాడుల్లో మరణించిన అమరవీరులకు నివాళులర్పించారు.వారి కుటుంబాలకు దేశం ఎప్పటికీ అండగా నిలుస్తుందన్నారు. దాడుల్లో మరణించిన పోలీసుల ధైర్య సాహసాలు ఉగ్రవాదంపై పోరులో దేశ పౌరులకు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. గుజరాత్‌లోని అరేబియా సముద్ర తీరం ద్వారా దేశంలోకి ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదులు 2008, నవంబర్ 26న ముంబైలోని తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ రైల్వేస్టేషన్‌తో పాటు పలు ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పలు జరపడంతో పాటు గ్రెనేడ్లు విసిరారు. ఈ ఉగ్ర దాడుల్లో 18 మంది భద్రతా సిబ్బందితో పాటు మొత్తం 166 మంది చనిపోయారు.10 మంది ఉగ్రవాదుల్లో తొమ్మిది మందిని భద్రతా బలగాలు అప్పటికప్పుడే మట్టుబెట్టాయి. ప్రాణాలతో పట్టుబడ్డ అజ్మల్ కసబ్ అనే ఉగ్రవాదికి మరణశిక్ష పడింది. ఇదీచవండి..సుప్రీం కోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి -
Constitution Day: ప్రాథమిక విధులే ప్రాథమ్యం
న్యూఢిల్లీ: ప్రాథమిక విధుల నిర్వహణే పౌరుల ప్రథమ ప్రాథమ్యంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అప్పుడే దేశం ఉన్నత శిఖరాలకు చేరుతుందన్నారు. వాటిని పూర్తి అంకితభావంతో, చిత్తశుద్ధితో పాటించాలని పిలుపునిచ్చారు. నాడు గాంధీ మహాత్ముడు కూడా ఈ మేరకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం సుప్రీంకోర్టులో జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ వృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్న భారత్‌వైపే ప్రపంచమంతా చూస్తోందన్నారు. వచ్చే ఏడాది జీ 20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనుండటాన్ని ప్రపంచ శ్రేయస్సులో మన పాత్రను అందరి ముందుంచేందుకు అతి గొప్ప అవకాశంగా అభివర్ణించారు. ‘‘ప్రపంచం దృష్టిలో దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు మనమంతా కలసికట్టుగా కృషి చేయాలి. ఇది మనందరి బాధ్యత. కేంద్రం అనుసరిస్తున్న ప్రజానుకూల విధానాలు పేదలను, మహిళలను సాధికారత దిశగా నడుపుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రాచీనకాలం నుంచి వస్తున్న విలువలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యానికి మాతృకగా భారత్ అలరారుతోంది. ఈ గుర్తింపును మరింత బలోపేతం చేయాలి’’ అని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రానంతరపు కాలంలో జాతి సాంస్కృతిక, నైతిక భావోద్వేగాలన్నింటినీ మన రాజ్యాంగం అద్భుతంగా అందిపుచ్చుకుందని కొనియాడారు. స్వతంత్ర దేశంగా భారత్ ఎలా మనుగడ సాగిస్తుందోనన్న తొలినాటి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ భిన్నత్వమే అతి గొప్ప సంపదగా అద్భుత ప్రగతి సాధిస్తూ సాగుతోందన్నారు. ‘‘వందేళ్ల స్వతంత్ర ప్రస్థానం దిశగా భారత్ వడివడిగా సాగుతోంది. ఇప్పటిదాకా నడిచింది అమృత కాలమైతే రాబోయే పాతికేళ్లను కర్తవ్య కాలంగా నిర్దేశించుకుందాం. ప్రాథమిక విధులను పరిపూర్ణంగా పాటిద్దాం. రాజ్యాంగంతో పాటు అన్ని వ్యవస్థల భవిష్యత్తూ దేశ యువతపైనే ఆధారపడి ఉంది. రాజ్యాంగంపై వారిలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరముంది. అప్పుడే సమానత్వం, సాధికారత వంటి ఉన్నత లక్ష్యాలను వారు మరింతగా అర్థం చేసుకుని ఆచరిస్తారు’’ అని చెప్పారు. రాజ్యాంగ పరిషత్తులో మహిళా సభ్యుల పాత్రకు తగిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘అందులో 15 మంది మహిళలుండేవారు. వారిలో ఒకరైన దాక్షాయణీ వేలాయుధన్ అణగారిన వర్గాల నుంచి వచ్చిన మహిళామణి’’ అని గుర్తు చేశారు. దళితులు, కార్మికులకు సంబంధించి పలు ముఖ్యమైన అంశాలు రాజ్యాంగంలో చోటుచేసుకునేలా ఆమె కృషి చేశారన్నారు. 26/11 మృతులకు నివాళి 2008 నవంబర్ 26న ముంబైపై ఉగ్ర దాడికి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వాటిలో అసువులు బాసిన వారిని మోదీ గుర్తు చేసుకున్నారు. వారికి ఘనంగా నివాళులర్పించారు. ఇ–కోర్టు ప్రాజెక్టులో భాగంగా తీసుకొచ్చిన వర్చువల్ జస్టిస్ క్లాక్, జస్ట్‌ఈజ్ మొబైల్ యాప్ 2.0, డిజిటల్ కోర్ట్, ఎస్3వాస్ వంటి సైట్లు తదితరాలను ప్రారంభించారు. వీటిద్వారా కక్షిదారులు, లాయర్లు, న్యాయవ్యవస్థతో సంబంధమున్న వారికి టెక్నాలజీ ఆధారిత సేవలందించేందుకు వీలు కలగనుంది. వేడుకల్లో కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ముంబై ఉగ్రదాడులకు 14 ఏళ్లు.. ట్వీట్‌తో జైశంకర్ నివాళులు
సాక్షి, న్యూఢిల్లీ: 26/11 ముుంబై ఉగ్రదాడులు జరిగి ఈరోజుతో 14 ఏళ్లు అవుతోంది. భారత దేశ చరిత్రలోనే చీకటి రోజుగా చెప్పే ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది, పౌరులకు నివాళులు అర్పించారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. Terrorism threatens humanity. Today, on 26/11, the world joins India in remembering its victims. Those who planned and oversaw this attack must be brought to justice. We owe this to every victim of terrorism around the world. pic.twitter.com/eAQsVQOWFe — Dr. S. Jaishankar (@DrSJaishankar) November 26, 2022 ఉగ్రవాదం మానవాళికి ముప్పు. నేడు 26/11 ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని భారత్‌తో పాటు యావత్ ప్రపంచం స్మరించుకుంటోంది. ఈ ఘటనకు బాధ్యులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడుల్లో ప్రాణాలు కల్పోయిన వారికి భారత్ సంఘీభావం తెలుపుతోంది. అని జైశంకర్ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ముంబై ఉగ్రదాడుల్లో మరణించిన వారికి సంతాపం తెలిపారు. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బందికి దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. On the anniversary of 26/11 Mumbai terror attacks, the nation remembers with gratitude all those we lost. We share the enduring pain of their loved ones and families. Nation pays homage to the security personnel who fought valiantly and made supreme sacrifice in the line of duty. — President of India (@rashtrapatibhvn) November 26, 2022 14 ఏళ్ల క్రితం 2008లో ఇదే రోజున లష్కరే తోయిబాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి సముద్రమార్గం ద్వారా ముంబై వచ్చి ప్రముఖ హోటల్లో చొరబడ్డారు. కన్పించిన వారిపై కాల్పులకు తెగబడి మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో18 మంది భద్రతా సిబ్బంది సహా మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: మహిళలపై రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు.. -
'విచారకరం.. నా ఇన్నింగ్స్ వారికే అంకితం'
ముంబై మారణహోమం(26/11) తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తాను ఆడిన 103 పరుగుల ఇన్నింగ్స్ కెరీర్లో ఎంతో ప్రత్యేకమైనదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎన్నోసార్లు చెప్పపుకొచ్చాడు. ఆ ఇన్నింగ్స్‌ను ముంబై మారణహోమ బాధితులకు అంకితం చేసినట్లు మ్యాచ్ అనంతరం ప్రకటించడం అప్పటి క్రికెట్ అభిమానుల్లో ఎంతో సంతోషం నింపింది. ఆరోజు సచిన్ చేసిన వ్యాఖ్యలను భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాయి. సచిన్ వ్యాఖ్యలకు నేటితో(డిసెంబర్ 15) సరిగ్గా 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మరోసారి ఆ వ్యాఖ్యలను గుర్తు చేసుకుందాం. (చదవండి : దుమ్మురేపిన కోహ్లి.. జడేజా) ఇంగ్లండ్‌పై విజయం అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బరువెక్కిన హృదయంతో మాట్లాడాడు. 'ముంబై మారణహోమం (26/11 దాడులు) నన్ను చాలా కలచివేసింది.. ఆ దృశ్యం తలచుకుంటేనే నా హృదయం కన్నీళ్లతో బరువెక్కుతుంది.. ఎంతో మంది అమాయకప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులను చూస్తే నా రక్తం మరిగిపోయేది. వారిని అంతమొందించిన ఎన్ఎస్జీ కమాండోలకు నా శతకోటి వందనాలు.. ఈరోజు ఇంగ్లండ్‌పై చేసిన సెంచరీని ఆ మారణహోమంలో అమరులైన వారికి అంకితం చేస్తున్నా... అసలు ఆరోజు ముంబైలో ఏం జరుగుతుందో నాకు మొదట అర్థం కాలేదు. అర్థమయ్యే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే ఈరోజు ఇంగ్లండ్‌పై చేసిన 100 పరుగులు.. ఆ మారణహోమం నుంచి అభిమానులు బయటపడేందుకు సహాయపడుతుందనే అనుకుంటున్నా.మారణహోమం తర్వాత ఉగ్రవాదులతో పోరాడిన కమాండోలకు, అక్కడి ప్రజలకు, పోలీసులకు సెల్యూట్ తప్ప ఇంకేం చేయలేను. ఆ దహనకాండ తర్వాత దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ సెంచరీ చేయడం.. అమరులకు అంకింతం చేయడం జీవితంలో మరిచిపోలేనిదంటూ' ఉద్వేగంతో పేర్కొన్నాడు. కాగా ముంబై మారణహోమానికి ముందే ఇంగ్లండ్ జట్టు భారత్‌లో 5 వన్డేలు, రెండు టెస్టులు ఆడడానికి వచ్చింది. మూడో వన్డే సమయంలోనే 26/11 దాడులు జరగడంతో తదుపరి రెండు వన్డేలను రద్దు చేశారు. అనంతరం అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్‌ను నిర్వహించారు. సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన మొదటి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆండ్రూ స్ట్రాస్ సెంచరీతో 316 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్‌కు 75 పరుగుల ఆధిక్యం వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో స్ట్రాస్ మరోసారి సెంచరీతో మెరవడంతో భారత్‌కు 387 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది. సచిన్ 103 పరుగుల వీరోచిత సెంచరీతో భారత్ 6వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. (చదవండి : ఆసీస్‌కు మరో దెబ్బ.. స్మిత్ అనుమానమే!) -
ముంబై దాడుల దోషి రానా మళ్లీ అరెస్ట్
వాషింగ్టన్: భారత్‌లో 2008నాటి ముంబై ఉగ్రదాడుల ఘటనలో దోషి అయిన పాకిస్తాన్ సంతతి కెనడా వ్యాపారి తహవుర్ రానాను అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. ఉగ్రదాడుల కేసు నిమిత్తం తమకు అప్పగించాలన్న భారత్ అభ్యర్థన మేరకు రానాను ఈనెల 10న అరెస్ట్‌చేశారు. 59 ఏళ్ళ రానాకు కరోనా సోకిన కారణంగా ఇటీవలే అమెరికా జైలు నుంచి విడుదలచేశారు. రానాను తమకు అప్పగించాల్సిందిగా భారత్ తాజాగా కోరినట్టు అమెరికా అటార్నీ జాన్ లులేజియన్ కోర్టుకి వెల్లడించారు. 2006 నవంబర్ నుంచి 2008 నవంబర్ మధ్యకాలంలో రానా పాకిస్తాన్‌లోని తన చిన్ననాటి స్నేహితుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ(దావూద్ గిలానీ), మరికొందరితో కలిసి లష్కరే తోయిబా, హరాకత్ ఉల్–జిహాదీ–ఇ ఇస్లామీ ఉగ్ర సంస్థలకు ముంబై దాడుల్లో సహకరించారని అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ వెల్లడించారు. -
'ఆ ఘటన మరిచిపోలేనిది, క్షమించరానిది'
ముంబై : ముంబైలో 11 ఏళ్ల క్రితం నవంబర్ 26న జరిగిన 26/11 దాడులను అంత తేలికగా మరిచిపోలేమని, ఎన్నటికి క్షమించరానిదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గుర్తుచేసుకుంటూ దాడులు జరిగిన తాజ్‌మహల్ ప్యాలెస్‌ను ప్రతీకగా పెట్టి అమరవీరులకు కొవ్వొత్తితో నివాళి ప్రకటించిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. ఫోటోలో 'ఈ ఘటన మరిచిపోలేనిదని, ఎప్పటికి క్షమించరానిదని' అనే క్యాప్షన్ పెట్టారు. స్మృతి పెట్టిన పోస్టుకు నెటిజన్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. 'అవును మేం ఆ ఘటనను అంత తేలికగా మరిచిపోలేము. మమ్మల్ని కాపాడడానికి వారి ప్రాణాలను అర్పించిన అమరవీరులకు మా జోహార్లు. మీరు దేశం కోసం చేసిన ప్రాణత్యాగాలను ఎప్పటికి గుర్తుపెట్టుకుంటామని' ఒక నెటిజన్ అభిప్రాయపడ్డారు. అప్పుడు జరిగిన దాడులు భారతదేశంలో భయానక వాతావరణాన్ని సృస్టించాయని, దాడిలో మరణించిన అమరవీరులకు మా ప్రగాడ సంతాపం ప్రకటిస్తున్నట్లు పలువురు కామెంట్లు పెట్టారు. 2008 నవంబర్ 26 ముంబైలో జరిగిన 26/11 దాడిలో 166 మంది చనిపోగా, 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 10 మంది ఉగ్రవాదులు సముద్రమార్గం ద్వారా దేశంలోకి చొరబడి నాలుగు రోజులపాటు ముంబయిలోని చత్రపతి శివాజి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఒబెరాయి, తాజ్ ప్యాలెస్, నారిమన్ పాయింట్ వద్ద మారణహోమం సృష్టించారు. కాగా, కమాండోలు దాడులు జరిగిన ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకొని 9 మంది ఉగ్రవాదులు హతమార్చారు. ఈ క్రమంలో ప్రాణాలతో పట్టుకున్న కసబ్‌ను 2012 నవంబర్‌లో ఉరి తీశారు. 26/11 #MumbaiTerrorAttack - Not Forgotten, Never to be Forgiven 🙏 pic.twitter.com/mggKIhq22H — Smriti Z Irani (@smritiirani) November 26, 2019 -
నా శాపంతోనే కర్కరే బలి
భోపాల్/న్యూఢిల్లీ: మాలేగావ్ పేలుడు కేసులో నిందితురాలు, బీజేపీ భోపాల్ లోక్‌సభ స్థానం అభ్యర్థిని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్(48) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను శపించినందునే ఐపీఎస్ అధికారి, ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) మాజీ చీఫ్ హేమంత్ కర్కరే ఉగ్రకాల్పుల్లో హతమయ్యారని చెప్పారు. భోపాల్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రజ్ఞాసింగ్ మాట్లాడుతూ..‘మాలేగావ్ పేలుడు కేసులో ముంబై జైలులో ఉన్న నన్ను విచారించడానికి హేమంత్ కర్కరే వచ్చారు. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం దొరక్కుంటే దానిని సృష్టించేందుకు ఎందాకైనా వెళ్తానన్నాడు. అప్పటిదాకా జైలు నుంచి బయటకు వదిలేది లేదన్నాడు. దుర్భాషలాడుతూ తీవ్రంగా హింసించాడు. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా నాకేమీ తెలియదు, అంతా ఆ దేవుడికే తెలుసని బదులిచ్చా. తెల్సుకునేందుకు దేవుడి దగ్గరకు వెళ్లాలా? అని ప్రశ్నించాడు. కావాలనుకుంటే వెళ్లాలన్నాను. నువ్వు నాశనమైపోతావని శపించా. ఆ తర్వాత నెల రోజుల్లోనే ఆయన్ను ఉగ్రవాదులు చంపేశారు’ అని అన్నారు. మోసకారి, దేశద్రోహి, మత వ్యతిరేకి అంటూ కర్కరేను ఆమె దూషించారు. ప్రజ్ఞాసింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారికి ఫిర్యాదు అందిందని, విచారణ చేయిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని క్షమాపణలు చెప్పాలి: కాంగ్రెస్ తను శపించడంతోనే కర్కరే చనిపోయారన్న ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కర్కరేను ద్రోహిగా చిత్రీకరించడం ద్వారా బీజేపీ నేతలు నేరానికి పాల్పడ్డారని పేర్కొంది. ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై భోపాల్ లోక్‌సభ స్థానంలో ఆమె ప్రత్యర్థి, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ స్పందించారు. ‘దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఆయన్ను చూసి మనమంతా గర్వపడాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు’ అని అన్నారు. ఐపీఎస్ అధికారుల సంఘం ప్రజ్ఞా వ్యాఖ్యలను ఖండించింది. ‘అశోక్ చక్ర అవార్డు గ్రహీత కర్కరే త్యాగాన్ని అందరూ గౌరవించాలి. ఆయనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించాలి’ అని ట్విట్టర్లో పేర్కొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలను అందరూ తీవ్రంగా ఖండించాలి. బీజేపీ తన నిజ స్వరూపం బయటపెట్టుకుంది’అని పేర్కొన్నారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘ఆమె వంటి వ్యక్తులతో జరిగిన పోరాటంలోనే కర్కరే చనిపోయారు. ఆయన మృతికి ఉగ్రదాడి కేసు నిందితురాలు శాపం కారణం కాదు. ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు మనకున్న హక్కులను కాపాడే క్రమంలోనే ఆయన పోరాడుతూ చనిపోయారు. వీర జవాన్లను ఇలా అవమానించడానికి బీజేపీకి ఎంతధైర్యం?’ అంటూ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం: బీజేపీ తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో ప్రజ్ఞాసింగ్ వెనక్కి తగ్గారు. ‘నేను వ్యక్తిగతంగా అనుభవించిన బాధతో ఆ వ్యాఖ్యలు చేశా. నా మాటలను దేశ వ్యతిరేకులు అనుకూలంగా మార్చుకున్నారు. ఆ వ్యాఖ్యలతో బాధ కలిగితే క్షమించాలని కోరుతున్నా’ అని తెలిపారని ఆమె సహాయకుడు తెలిపారు. ఈ వివాదం నుంచి దూరంగా ఉండేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. జైలులో ఉండగా శారీరకంగా, మానసికంగా అనుభవించిన వేదనతో ప్రజ్ఞా సింగ్ చేసిన ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమని బీజేపీ తెలిపింది. ‘ఉగ్రవాదులను సాహసంతో ఎదుర్కొని పోరాడుతూ కర్కరే ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ ఆయన్ను వీర జవానుగానే భావిస్తుంది’ అని పేర్కొంది. -
‘26/11’ సమాచారమిస్తే రూ.35 కోట్ల రివార్డు
వాషింగ్టన్: పదేళ్ల క్రితం ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడికి పాల్పడిన, కుట్ర పన్నిన వారి వివరాలు అందించిన వారికి రూ. 35.39 కోట్ల (50 లక్షల డాలర్లు) ఇస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. కుట్రకు పాల్పడిన, వారికి తోడ్పడిన లేదా వారిని ప్రేరేపించిన వారి వివరాలతోపాటు ఘటనకు సంబంధించిన ఎలాంటి సమాచారానైనా నిర్భయంగా వెల్లడించవచ్చని పాకిస్తాన్ సహా ప్రపంచ దేశాలను కోరింది. రివార్డ్స్ ఫర్ జస్టిస్ (ఆర్‌ఎఫ్‌జే) కార్యక్రమం కింద ఈ మొత్తం అందిస్తామని ప్రకటించింది. అలాగే కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌ను కోరింది. ముంబైలో ఉగ్రదాడికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియొ సోమవారం ప్రకటన విడుదల చేశారు. 2008లో జరిగిన ఈ ఘటన అత్యంత క్రూరమైనదిగా అభివర్ణించారు. దాడి జరిగి పదేళ్లు అయినా సూత్రదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అని అన్నారు. దాడికి సంబంధించిన వివరాలను తెలిపేందుకు ఆర్‌ఎఫ్‌జే ఆఫీసర్‌ను సంప్రదించవచ్చని అమెరికా సూచించింది. లేదా సమీపంలోని యూఎస్ రాయబార కార్యాలయం వద్ద కానీ, యూఎస్ కాన్సులేట్ వద్ద కానీ సమాచారాన్ని అందించవచ్చని పేర్కొంది. సా...గుతున్న ‘ముంబై’ విచారణ లాహోర్: 26/11 దాడులు జరిగి పదేళ్లు పూర్తయినా పాకిస్తాన్లో ఈ దాడుల సూత్రధారులకెవ్వరికీ శిక్ష పడలేదు. 2009 నుంచి పాక్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఈ కేసును విచారిస్తోంది. విచారణను రెండు నెలల్లో ముగించాలని 2015లోనే ఇస్లామాబాద్ హైకోర్టు కూడా ఆదేశించింది. అయినా ఇప్పటికీ కేసు విచారణలో పురోగతి లేదు. పైగా తరచుగా న్యాయమూర్తులను మార్చడం, ఓ దర్యాప్తు అధికారి హత్య తదితరాల కారణంగా ఈ కేసు విచారణ పలు మలుపులు తిరుగుతూ తొమ్మిదేళ్లుగా సాగుతోంది. -
‘కసబ్‌కీ బేటీ’ అన్నారు!
దశాబ్దం క్రితం జరిగిన 26/11 ముంబై దాడులకు ప్రత్యక్ష సాక్షి ఆరేళ్ల దేవిక. ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్(సీఎస్టీ)లో అమాయకులను పొట్టనబెట్టుకున్న లష్కరే ఉగ్రవాది కసబ్‌ను పోలీసులు పట్టుకున్నాక అతడిని పోలీసు పరేడ్‌లో గుర్తుపట్టిన అత్యంత చిన్న వయసు ప్రత్యక్ష సాక్షి ఈమె. ఉగ్రవాదిని గుర్తించడంలో సాయంచేసినందుకు ఆ కుటుంబం ఎదుర్కొన్న చేదు అనుభవం ఒకటైతే, ఆ చిన్ని మనసును నొప్పించిన ఘటనలెన్నో. 2008 నవంబర్ 26న ఉగ్రబుల్లెట్ల నుంచి దేవిక త్రుటిలో తప్పించుకుంది. కసబ్‌ని గుర్తుపట్టి, అతడికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చేందుకు నాడు కోర్టు మెట్లెక్కినపుడు దేవిక వయసు తొమ్మిదేళ్లు. ఘటన జరిగినపుడు ఆమె వయసు కేవలం ఆరేళ్లు. ‘నా కుడి కాలుని షూట్ చేశారు’ అంటూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది దేవిక. ప్రస్తుతం దేవిక ఇంటర్మీడియెట్ చదువుతోంది. దాడి జరిగిన రోజు పుణెలోని తన చిన్న అన్నయ్యను కలవడానికి తండ్రి నట్వర్లాల్, పెద్ద అన్నయ్యలతో కలిసి రైలెక్కడానికి ముంబై సీఎస్టీకి వచ్చింది. అదే సమయంలో రైల్వేస్టేషన్లో కసబ్ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ దేవిక కుడి కాలును చీల్చుకుంటూ దూసుకెళ్లింది. రక్తసిక్తమైన దేవిక రెండు నెలల పాటు ఆసుపత్రిపాలైంది. కోలుకుని కోర్టుకెళ్లిన దేవికను ‘నిన్నెవరు కాల్చారు?’ అని ప్రశ్నించినపుడు సూటిగా కసబ్ వైపు చూపించింది. దీంతో అప్పట్లో దేవిక పేరు మార్మోగింది. దేశం యావత్తు ఆ చిన్నారి తెగువను ప్రశంసించింది. అయితే, దేవికను కష్టాలు మరోరూపంలో మొదలయ్యాయి. బడిలో తోటి విద్యార్థినులు ‘కసబ్‌కీ బేటీ’ అని పిలిచేవారు. స్నేహితులు దగ్గరికి రావడానికి భయపడ్డారు. సూటిపోటి మాటలతో వేధించారు. దీంతో దేవిక మరో పాఠశాలలో చేరాల్సి వచ్చింది. అక్కడా పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. దీనికితోడు దేవిక కుటుంబానికి ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అయినా దేవిక, ఆమె కుటుంబం వెనక్కి తగ్గలేదు. దేవిక తండ్రి రోజుకూలీ. ఇంత పేదరికంలోనూ తను లక్ష్యంగా పెట్టుకున్న ఐపీఎస్ ఆశయాన్ని సాధించేందుకు దేదిక కష్టపడి చదువుతోంది. 26/11 మృతులకు సోమవారం జమ్మూలో నివాళులర్పిస్తున్న పాఠశాల విద్యార్థులు -
‘సర్జికల్’పై సాక్ష్యాలు కావాలట!
భిల్వారా: ముంబైలో 2008, నవంబర్ 26న లష్కరే తోయిబా ఉగ్రవాదుల మారణహోమం సమయంలో దేశభక్తి గురించి మాట్లాడిన కాంగ్రెస్ నేతలు, రెండేళ్ల క్రితం భారత ఆర్మీ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌పై మాత్రం వీడియో సాక్ష్యాలు అడిగారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఈ దారుణానికి పాల్పడినవారిని ఎన్నటికీ విడిచిపెట్టబోమనీ, సరైన సమ యం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ముంబైపై పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడిచేసి 166 మందిని బలికొన్న ఘటనకు సోమవారంతో పదేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌లోని భిల్వారాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. ఉగ్రవాదం, మావోయిజంపై కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. రిమోట్ కంట్రోల్ పాలన నడిచేది.. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీఏ చైర్పర్సన్, అప్పటి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ లక్ష్యంగా మోదీ విరుచుకుపడ్డారు. ‘‘నవంబర్ 26... పదేళ్ల క్రితం ఇదే రోజున ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని ఓ మేడమ్(సోనియా) రిమోట్ కంట్రోల్‌తో పాలించేవారు. ముంబైపై ఉగ్రవాదులు దాడికి తెగబడి మన ప్రజలు, భద్రతా బలగాలను హత్య చేసినప్పుడు కేంద్రంతో పాటు మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. నాకు బాగా గుర్తుంది. దాడి జరిగిన సమయంలో రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఉగ్రదాడులను ఖండించిన వివక్ష నేతలపై అప్పట్లో అధికార కాంగ్రెస్ నేతలు అంతెత్తున ఎగిరిపడ్డారు. ‘ఇది యుద్ధం. పాకిస్తాన్ భారత్ పై దాడిచేసింది. కానీ ప్రతిపక్షాలన్నీ దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో అన్ని పార్టీలు కేంద్రానికి అండగా నిలవాలి. ఉగ్రదాడులపై రాజకీయాలు చేయడం సరికాదు’ అంటూ నీతులు చెప్పారు. కానీ రాజస్తాన్ ఎన్నికల్లో గెలిచేందుకు ఈ ఉగ్ర ఘటనను ఓ అస్త్రంగా కాంగ్రెస్ నేతలు వాడుకున్నారు’’ అని మోదీ దుయ్యబట్టారు. ‘ముంబై’ దోషులను విడిచిపెట్టబోం.. ‘2016 సర్జికల్ దాడులతో భారత సైన్యం ఉడీ ఉగ్రదాడి ఘటనపై ప్రతీకారం తీర్చుకుంది. శత్రువులను వారి ఇంట్లో దూరి చావుదెబ్బ కొట్టింది. ఇలాంటి గొప్ప సమయంలో కాంగ్రెస్ నేతలు ఏమడిగారో తెలుసా? సర్జికల్ దాడులు నిజంగానే జరిగాయనటానికి వీడియో సాక్ష్యాలను చూపాలన్నారు. ఆపరేషన్ల సమయంలో సైనికులు చేతిలో కెమెరాలు తీసుకుని వెళతారా? వాళ్లు తమ ప్రాణాలకు తెగించి దేశం కోసం పోరాడేందుకు వెళ్లారు. ఈ సమయంలో మాత్రం కాంగ్రెస్ నేతలకు పదేళ్ల క్రితం వల్లించిన దేశభక్తి ప్రవచనాలు గుర్తుకురాలేదు’ అని ప్రధాని మండిపడ్డారు. నా కులంపైనే కాంగ్రెస్‌కు మక్కువ.. ‘ఉగ్రవాదులు, నక్సల్స్, మావోయిస్టులు.. చిన్నారుల చేతికి తుపాకులు ఇచ్చి అమయాకులను చంపుతున్నారు. ఓవైపు ఇలాంటి ఉగ్రమూకలకు అర్థమయ్యే భాషలో కేంద్రం జవాబిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన అనుచరగణం నక్సలైట్లను విప్లవకారులుగా కీర్తిస్తూ సర్టిఫికెట్లు అందజేస్తోంది. ఎన్నికలు సమీపించేకొద్దీ కాంగ్రెస్ నేతలు నా కులం గురించి, నా తండ్రి పేరు గురించి బాగా అడుగుతున్నారు. కానీ ఓ భారత ప్రధానిగా నేను అమెరికాకు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడితో భేటీ అయితే అభివృద్ధి, సంక్షేమం గురించి మాత్రమే ఆయన మాట్లాడతారు. నా కులం గురించి అడగరు. దేశంలోని 125 కోట్ల మంది ప్రజల కులాలకు ప్రధానిగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా’ అని ప్రధాని మోదీ చెప్పారు. -
26/11 దాడులు: అమెరికా భారీ రివార్డు
వాషింగ్టన్: ముంబైలో 26/11 మరణహోమం జరిగి పదేళ్లు గడిచిన సందర్భంగా అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడుల వెనుక ఉన్న వారి గురించి సమాచారం ఇచ్చిన వారికి భారీ నజరానా అందజేయనున్నట్టు ప్రకటించింది. 166 మందిని పొట్టనబెట్టుకున్న ఈ ఉగ్రదాడి సూత్రధారుల గురించి కానీ, దాడులకు ప్రేరేపించిన వారి గురించి కానీ సమాచారం తెలియజేస్తే వారికి 5 మిలియన్ డాలర్లు(దాదాపు 35 కోట్ల రూపాయలు) రివార్డు అందజేస్తామని యూఎస్ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పొంపియో తెలిపారు. ఈ ఉగ్రచర్య జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అమెరికా ప్రభుత్వం తరఫున, అమెరికా ప్రజల పక్షాన భారత ప్రజలకు, ముంబై వాసులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ అనాగరిక చర్య ప్రపంచం మొత్తాన్ని షాక్‌కు గురిచేసిందని పొంపియో అన్నారు. ఈ దాడిలో కుటుంబసభ్యులను కోల్పోయినవారికి, గాయపడ్డవారికి తాము అండగా ఉంటామని ప్రకటించారు. ఈ దాడిలో ఆరుగురు అమెరికా పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంతటి క్రూరమైన చర్య జరిగి పదేళ్లు గడిచినప్పటికీ.. ఈ దాడికి సూత్రధారులను పట్టుకుని శిక్షించకపోవడం బాధితుల కుటుంబాలను అగౌరవపరచడమేనని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు భాద్యులైన లష్కరే తోయిబాతో సహా దాని అనుబంధ సంస్థలపై అంక్షలు అమలు చేయాలని ఐకరాజ్యసమితి భద్రత మండలి తరఫున ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా పాకిస్తాన్ ఈ దుర్మార్గపు చర్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ముంబై దాడుల కారకులను న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి అమెరికా కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. కాగా, అమెరికా ఇలాంటి రివార్డు ప్రకటించడం ఇది మూడోసారి. 2008 నవంబర్ 26న భారత ఆర్థిక రాజధానిపై ఆధునిక ఆయుధాలతో విరుచుకుపడిన పాక్ ఉగ్రమూకల బారిన పడి 166మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఉగ్రమూకలను మట్టుపెట్టే క్రమంలో పలువురు పోలీసులు వీర మరణం పొందారు. ఈ దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల్లో ఒకడైన కసబ్‌ను భద్రత బలగాలు సజీవంగా పట్టుకున్నాయి. కసబ్‌కు న్యాయస్థానం మరణశిక్ష విధించడంతో.. 2012లో అతడిని ఉరితీశారు. ఈ దాడికి కారకులను శిక్షించడంలో భారత్‌కు సహకరిస్తామని చెప్పిన దాయాది దేశం.. కుట్రదారులు వారి దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్న పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. సంబంధిత కథనాలు: మరో దాడి జరిగితే యుద్ధమే..! 26/11 పదేళ్ల ఉగ్ర జ్ఞాపకం -
మరో దాడి జరిగితే యుద్ధమే..!
ముంబై పీడకలకు పదేళ్లు. దేశ ఆర్థిక రాజధానిని తూటాల వర్షంతో చిన్నాభిన్నం చేసిన ఉగ్ర విధ్వంసం జరిగి దశాబ్దం గడిచింది. దేశ భద్రతకు సవాలుగా నిలిచిన పాకిస్తాన్ ఉగ్ర కుట్ర జరిగి పదేళ్లయింది. నేటికి సరిగ్గా పదేళ్ల కిత్రం ముంబైపై ఆధునిక ఆయుధాలతో విరుచుకుపడిన 12 మంది లష్కరే రాక్షసుల బారిన పడి 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్లో ఐఎస్ఐ ఆధ్వర్యంలో ఆధునిక శిక్షణ పొందిన ఆ ఉగ్రవాదులను మట్టుపెట్టే క్రమంలో సందీప్ ఉన్నికృష్ణన్, హేమంత్ కర్కరే, విజయ్ సలాస్కర్, అశోక్ కామ్టే తదితర సాహస అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటనకు పదేళ్లయిన సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు.. ముంబై/వాషింగ్టన్: 26/11 అంతటి తీవ్ర దాడులు భారత్‌పై మరోసారి జరిగితే భారత్, పాక్‌ల మధ్య ప్రాంతీయ యుద్ధం సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. 2008 నవంబర్ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించి 166 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. ఈ దాడికి సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడనీ, దాడికి కారకులను శిక్షిస్తామని ఇచ్చిన మాటను పాక్ నిలబెట్టుకోలేదని వారు పేర్కొన్నారు. అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) మాజీ అధికారి బ్రూస్ రీడెల్ మాట్లాడుతూ ‘26/11 దాడి సూత్రధారులకు శిక్ష పడటాన్ని బాధిత కుటుంబాలు ఇంకా చూడాల్సి ఉంది. అయితే పాకిస్తాన్ వైఖరి చూస్తుంటే ఇది దాదాపుగా అసాధ్యమనిపిస్తోంది. ఇంతటి తీవ్రమైన దాడి మరోసారి జరిగితే ఇక యుద్ధం అనివార్యం కావొచ్చు’ అని అభిప్రాయ పడ్డారు. దాడుల సమయంలో అమెరికాలో పాక్ రాయబారిగా పనిచేసిన హుస్సేన్ హక్కానీ మాట్లాడుతూ ‘ఇంకో దాడి జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. అయితే 26/11 దాడుల సూత్రధారులను శిక్షిస్తామన్న తమ హామీని పాక్ నిలబెట్టుకోవాలి. కానీ వారందరినీ పాక్ వదిలేసింది. అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అంటే భారత్‌పై ఉగ్రదాడికి పాల్పడిన వారిని తాము ఉపేక్షిస్తామని పాక్ పరోక్షంగా చెబుతోంది’ అని అన్నారు. దాడుల సమయంలో అమెరికా జాతీయ భద్రతా మండలి దక్షిణాసియా విభాగ డైరెక్టర్‌గా ఉన్న అనీశ్ గోయెల్ మాట్లాడుతూ ‘భారత్–పాక్‌ల యుద్ధాన్ని నివారించడమే నాడు మా ప్రధాన లక్ష్యం. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్, నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఫోన్ చేసి సంయమనం పాటించాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఓ దశలో పాక్‌పై భారత్ యుద్ధానికి దిగుతుందని కూడా నాడు అనిపించింది’ అని చెప్పారు. పోలీసులు ఉగ్రవాదుల్ని పారిపోనిచ్చారు ఫొటో జర్నలిస్ట్ సెబాస్టియన్ ముంబై మారణహోమం సందర్భంగా ఉగ్రవాదులను నిలువరించే అవకాశమున్నప్పటికీ భయపడ్డ మహారాష్ట్ర పోలీసులు వారిని పారిపోనిచ్చారని కసబ్ ఫొటోను షూట్చేసిన జర్నలిస్ట్ సెబాస్టియన్ డిసౌజా అలియాస్ సబీ(67) తెలిపారు. ముంబై దాడులకు నేటితో పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘2008, నవంబర్ 26న నేను ఆఫీసులో పనిచేసుకుంటుండగా పక్కనే ఉన్న సీఎస్టీలో కాల్పుల శబ్దం వినిపించింది. వెంటనే నా కెమెరా, లెన్సులు తీసుకుని కిందకు పరిగెత్తాను. రైల్వేస్టేషన్‌లోకి దూరి ఓ బోగీలో దాక్కున్నా. కానీ అక్కడి నుంచి ఫొటో తీయడానికి యత్నించగా కుదరలేదు. దీంతో మరో బోగీలోకి వెళ్లి ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఉగ్రవాదుల ఫొటోలు తీశాను’ అని చెప్పారు. క్రూరంగా నవ్వుతూ కాల్పులు సీఎస్టీ అనౌన్సర్ విష్ణు ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్టీ) రైల్వేస్టేషన్ లో క్రూరంగా నవ్వుతూ అమాయకులపై గుళ్ల వర్షం కురిపించిన ఉగ్రవాది కసబ్ ముఖం తనకు ఇంకా గుర్తుందని ఆరోజు అనౌన్సర్‌గా విధులు నిర్వర్తిస్తున్న విష్ణు జెందె(47) గుర్తుచేసుకున్నారు. ‘నవంబర్ 26న రాత్రి 9.15 గంటల సమయంలో రైల్వేస్టేషన్లో పెద్ద శబ్దం వినిపించగానే ఏదో పేలుడు జరిగిందనుకున్నా. కానీ ఇద్దరు వ్యక్తులు తుపాకులు పట్టుకుని వస్తుండటాన్ని చూడగానే ఇది ఉగ్రదాడి అని అర్థమైపోయింది. ప్రయాణికులందరూ రైల్వేస్టేషన్ నుంచి వెళ్లిపోవాలనీ, ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారని ప్రజల్ని అప్రమత్తం చేశా. ఉగ్రవాదులకు దూరంగా ఉన్న ప్లాట్‌ఫామ్ 1 దగ్గరి నుంచి బయటకు వెళ్లిపోవాలని చెప్పా. ఘటనాస్థలికి చేరుకోవాల్సిందిగా రైల్వే పోలీసులను కోరాను. మరోవైపు సహచరుడితో కలిసి ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్న కసబ్ క్రూరంగా నవ్వుతూ, దూషిస్తూ ప్రయాణికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు’ అంటూ నాటి అనుభవాలను విష్ణు గుర్తుచేసుకున్నారు. రెండుసార్లు ఫెయిల్ ముంబైలో ఉగ్రదాడికి పాల్పడ్డ పాక్ పౌరుడు కసబ్‌కు లష్కరే తోయిబా కరాచీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తాజాగా వెల్లడైంది. ప్రము ఖ చరిత్రకారుడు సరోజ్ కుమార్ రత్ కసబ్ విచారణాధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ రాసిన ‘ఫ్రజైల్ ఫ్రంటియర్స్: ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ముంబై టెర్రర్ అటాక్స్’ పుస్తకంలో ఈ అంశాలను ప్రస్తావించారు. ‘కసబ్‌కు తొలుత నావికుడిగా, చేపలుపట్టేలా ఐఎస్ఐ అధికారులు, లష్కరే తోయిబా కమాండర్లు రెండేళ్లు శిక్షణ ఇచ్చారు. అయితే ఉగ్రదాడి కోసమే ఈ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పలేదు. ఇది ఎవరికైనా తెలిస్తే భారత్‌పై దాడిచేసే మార్గాలు మూసుకుపోతాయన్న భయంతో టాప్ కమాండర్లు హఫీజ్ సయీద్, జకీవుర్ రెమ్మాన్ లఖ్వీ గోప్యత పాటించారు. ముంబైపై 2008, నవంబర్ 26న దాడికి ముందు లష్కరే చేసిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2008, సెప్టెంబర్‌లో ఉగ్రవాదులను తీసుకెళుతున్న బోటు సముద్రంలో ఓ రాయిని ఢీకొని మునిగిపోయింది. దీంతో లష్కరే వర్గాలు కొనప్రాణాలతో ఉన్న తమ ఉగ్రవాదుల్ని కాపాడాయి. ఇక రెండోసారి నవంబర్ 7న ఉగ్రవాదుల బృందం మరోసారి భారత్‌కు బయలుదేరింది. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన ఓ బోటు కెప్టెన్‌ను లొంగిపోవాల్సిందిగా ఉగ్రవాదులు కోరగా, అతను నిరాకరించి పడవను వేగంగా తీసుకెళ్లిపోయాడు. ‘ఆపరేషన్ కసబ్’ ఇలా.. ప్రాణాలతో చిక్కిన ఉగ్రవాది కసబ్‌ను ఉరితీసేందుకు ఏర్పాట్లు చాలా రహస్యంగా సాగాయని ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘కసబ్‌ను ఉరితీయడం కోసం ఆర్థర్రోడ్ జైలులోని అండా సెల్ నుంచి పుణెలోని ఎర్రవాడ కేంద్ర కారాగారానికి తరలించడానికి నవంబర్ 20న రాత్రి ఏర్పాట్లు పూర్తిచేశాం. రాత్రిపూట కసబ్‌ను పోలీస్ వ్యానులో ఎక్కించాం. మహారాష్ట్ర పోలీసులకు చెందిన ఫోర్స్ వన్ కమాండో బృందం ఈ వాహనానికి రక్షణగా బయలుదేరింది. ఎక్కువ కార్లు ఒకేసారి వెళితే అనుమానం రావొచ్చన్న ఆలోచనతో రాష్ట్ర రిజర్వు పోలీస్ బలగాలు కొంతదూరం నుంచి ఈ వాహనాలను వెంబడించాయి. ఈ ఆపరేషన్ ముగిసేవరకూ ఇందులో పాల్గొన్న అధికారుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. అర్ధరాత్రి కసబ్‌ను ఎర్రవాడ జైలు అధికారులకు అప్పగించగానే..‘పార్సిల్ రీచ్డ్ ఫాక్స్’ అంటూ పోలీస్ ఉన్నతాధికారి సంకేత భాషలో మిగతావారికి సమాచారం చేరవేశారు. ఉరితీత నోటీసులను వారంరోజుల కసబ్‌కు అందజేశాం. చివరికి నవంబర్ 21న తెల్లవారుజామున 3 గంటలకు కసబ్‌ను ఉరితీశారు. ఆ తర్వాత కసబ్ ఉరి వార్త ప్రపంచమంతా తెలిసిపోయింది’ అని అప్పటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు. -
సయీద్‌పై అమెరికా కన్నెర్ర
వాషింగ్టన్: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, ఉగ్రసంస్థ జమాతుద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసిన పాక్ ప్రధాని వ్యాఖ్యలపై అమెరికా మండిపడింది. సయీద్ ఉగ్రవాదేనని స్పష్టం చేసిన అమెరికా.. చట్టప్రకారం అతనిపై అభియోగాలు మోపి పూర్తిస్థాయి విచారణ జరపాల్సిందేనంది. ‘ భద్రతామండలి ఉగ్రవాదుల జాబితాలో సయీద్ పేరుంది. 2008 ముంబై దాడుల్లో సయీద్ పాత్ర కీలకమని మేం విశ్వసిస్తున్నాం. జమాతుద్ దవా (జేయూడీ) లష్కరే సంస్థలో భాగమే. గృహనిర్బంధం నుంచి సయీద్‌ను విడుదల చేయటంపై పాక్ ప్రభుత్వానికి నిరసనను స్పష్టంగా తెలియజేశాం’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హీతర్ నార్ట్ చెప్పారు. గురువారం ప్రముఖ పాకిస్తాన్ చానెల్ జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్రధాని అబ్బాసీ.. సయీద్‌ను ‘సాబ్, సర్’ అని సంబోధించారు. ‘పాక్‌లో సయీద్ సర్‌పై కేసుల్లేవు’ అని అన్నారు. సయీద్‌పై చర్యలు తీసుకోవటంలో పాకిస్తాన్ చిత్తశుద్ధిని చాటుకోవాలని భారత్ సూచించింది. పసలేని కారణాలు చూపుతూ తప్పించుకునే ప్రయత్నాలను మానుకోవాలని పేర్కొంది. సయీద్‌పై అభియోగాలు మోపాలంటూ అమెరికా వ్యాఖ్యానించిన నేపథ్యంలో భారత్ ఈ విధంగా స్పందించింది. -
అమ్మానాన్నను కోల్పోయిన చోటుకి 9 ఏళ్ల తర్వాత..
సాక్షి, ముంబై: బేబీ మోషే గుర్తున్నాడు.. 2008 నవంబర్ 26న పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబైలో జరిపిన మారణహోమంలో మోషే తన తల్లిదండ్రులను కోల్పోయాడు. ఇప్పుడు తొమిదేళ్ల తర్వాత మోషే హోల్ట్జ్‌బర్గ్ మళ్లీ ముంబై గడ్డపై అడుగుపెట్టాడు. రెండేళ్ల కిందట తాను 13వ ఏట అడుగుపెట్టినప్పుడే మోషే ముంబై రావాలనుకున్నాడు. కానీ అప్పుడు కుదరలేదు. గత ఏడాది ప్రధాని నరేంద్రమోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించినప్పుడు మోషేను ముంబై రావాల్సిందిగా ఆహ్వానించారు. సంరక్షకురాలు సాండ్రా శామ్యూల్‌తో కలిసి మంగళవారం ఉదయం మోషే ముంబై చేరుకున్నాడు. అతను మరికాసేపట్లో నారీమన్ హౌజ్‌ను సందర్శించబోతున్నాడు. ముంబై దాడుల్లో భాగంగా ఉగ్ర ముష్కరులు ఇక్కడ నరమేథం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక్కడే చాబాద్ హౌజ్‌లో ఉన్న మోషే ఇంటిపై కూడా ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రమూక దాడి బారిన పడకుండా ఆ సమయంలో సాండ్రా చిన్నారి మోషేను కాపాడింది. ఉగ్రవాదుల కాల్పుల నుంచి తప్పించుకుంటూ మోషేను ఎత్తుకొని బయటకు పరిగెత్తింది. అయితే, ఈ దాడిలో మోషే తల్లిదండ్రులు హతమయ్యారు. దీంతో రెండేళ్ల వయస్సులో ఉన్న మోషేను రక్షణార్థం అతని నానమ్మ-తాతయ్య ఇజ్రాయెల్‌లోని అఫుల నగరానికి తీసుకెళ్లారు. ఉగ్రవాదుల కిరాతక హింసకు బాధితులైన అమాయకులకు ప్రతీకగా మోషే అప్పట్లో నిలిచాడు. ఇది ఒకప్పటి ముంబై కాదు..! మోషే ముంబైకి రావడం ఎంతో భావోద్వేగ సందర్భమని, ఎంతో సున్నితమైన అంశమని యూదుల కేంద్రం చాబాద్ హౌజ్‌ను నడిపించే రబ్బి ఇజ్రాయెల్ కోజ్లోవ్స్కీ అన్నారు. మోషేను కలిసేందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నామని, అతను ఇప్పటికీ తమ హృదయాల్లో చిన్నారి బాలుడేనని తెలిపారు. ఇది ఒకప్పటి ముంబై కాదని, ఇప్పుడు ఎంతో సురక్షితంగా, భద్రంగా ఈ నగరం ఉందని, మోషేని కలువబోతుండటం ఎంతో ఆనందంగా ఉందని అతని తాత రబ్బి హోల్ట్జ్‌బర్గ్ నాష్మన్ అన్నారు. -
వారి త్యాగాలకు సలాం
న్యూఢిల్లీ: 2008 ముంబై ఉగ్ర దాడుల్లో అమరులైన వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరిచిపోదని, వారికి దేశం సలాం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచానికి ఉగ్రవాదం ముప్పుగా పరిణమించిన తరుణంలో దానిపై సంఘటితంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం మాసాంతపు రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో ఆయన ప్రసంగిస్తూ.. పౌరులు, పాలనా యంత్రాంగం రాజ్యాంగాన్ని అనుసరించి నడచుకోవాలని కోరారు. పద్మావతి చిత్రం విడుదలను వ్యతిరేకిస్తూ కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉగ్ర ముప్పు గురించి కొన్నేళ్ల క్రితం భారత్ మాట్లాడినప్పుడు.. ప్రపంచంలో చాలా దేశాలు అంతగా పట్టించుకోలేదని మోదీ గుర్తుచేసుకున్నారు. ‘ప్రస్తుతం ఉగ్రవాదం వారి తలుపులు తడుతున్న సమయంలో.. ప్రపంచంలో మానవత్వం, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకమున్న ప్రభుత్వాలు ఈ సమస్యను అతిపెద్ద సవాలుగా చూస్తున్నాయి. ఉగ్రవాదం తన వికృత రూపంతో ప్రతి రోజు ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తోంది. అందుకే భారతదేశమే కాకుండా.. ప్రపంచంలోని మానవతా శక్తులన్నీ ఉగ్రభూతాన్ని ఓడించేందుకు కలిసికట్టుగా పోరాటం చేయాలి. నవంబర్ 26న మనం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజు ముంబైలో జరిగిన ఉగ్రదాడిని దేశం మరచిపోదు. ఆ దాడిలో మరణించిన సాహస పౌరులు, పోలీసులు, భద్రతా సిబ్బంది, ఇతరుల త్యాగాలను ఈ దేశం గుర్తుంచుకుంటుంది. వారికి సలాం చేస్తోంది’ అని పేర్కొన్నారు. 1 నుంచి సైనిక దళాలపై అవగాహన డిసెంబర్ 4న నేవీ దినోత్సవం నేపథ్యంలో యుద్ధం,ఇతర సమయాల్లో భారత నౌకాదళం పోషించిన పాత్రను ప్రధాని గుర్తు చేశారు. ‘కేవలం యుద్ధ సమయాల్లో మాత్రమే గాక.. సరిహద్దు దేశాల్లో మానవతా సాయం అందించడంలో భారత నేవీ కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోని చాలా నౌకా దళాల్లో ఎప్పటికోగానీ మహిళల్ని యుద్ధ నౌకల్లో చేర్చుకోలేదు. అయితే 800, 900 సంవత్సరాల క్రితమే భారత్‌లో చోళ రాజ్య సైన్యంలో మహిళలు కీలక పాత్ర పోషించారు. సైనిక దళాల పతాక దినోత్సవమైన డిసెంబర్ 7 గర్వించదగ్గ రోజు. డిసెంబర్ 1 నుంచి 7 వరకూ సైనిక బలగాల ప్రాధాన్యతను వివరిస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ వారమంతా సైనిక బలగాల శౌర్య పరాక్రమాలకు గుర్తుగా ప్రతి ఒక్కరూ జెండా ధరించాలి. ఆ ఫొటోల్ని # armedforcesflagday ట్వీటర్ ఖాతాకు పోస్టు చేయవచ్చు’ అని మోదీ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగానికి కట్టుబడటం బాధ్యత పౌరులు, పాలనా యంత్రాంగం...ఇరు వర్గాలూ రాజ్యాంగాన్ని అనుసరించి నడచుకోవాలని మోదీ కోరారు. ‘రాజ్యాంగానికి కట్టుబడి ఉండటం మనందరి బాధ్యత. రాజ్యాంగం ప్రకారమే ప్రజలు, పాలకులు నడచుకోవాలి. ఏ ఒక్కరికీ హాని జరగకూడదన్న సందేశాన్ని మన రాజ్యాంగం ఇస్తోంది. సమానత్వం, సున్నితత్వం అనేవి రాజ్యాంగంలోని అద్వితీయ భావనలు. వాటి వల్లే ప్రతి ఒక్క పౌరుడికీ ప్రాథమిక హక్కులున్నాయి. ఆ హక్కులను రాజ్యాంగమే కాపాడి, ప్రజల ప్రయోజనాలకు రక్షణగా ఉంటుంది’ అని ప్రధాని వెల్లడించారు. 2022 నాటికి యూరియా వాడకాన్ని తగ్గించాలి డిసెంబర్ 5న ప్రపంచ మట్టి దినోత్సవాన్ని గుర్తు చేస్తూ.. ప్రపంచంలో సారవంతమైన భూమే లేకపోతే ఏం జరుగుతుందో? అని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రపంచంలో మట్టి లేకపోతే మొక్కలు, చెట్లు పెరగవు.. ఎక్కువ యూరియా వాడడంతో భూమికి తీవ్ర నష్టం జరుగుతోంది. 2022 నాటికి ప్రస్తుత యూరియా వాడకాన్ని సగానికి తగ్గించేలా మన రైతులు తీర్మానం చేయాలి’ అని కోరారు. దివ్యాంగులు అన్ని రంగాల్లోను అద్భుత ప్రతిభ చూపుతున్నారని మోదీ కొనియాడారు. ‘రియో ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణ పతకాలు సాధించడంతో పాటు , అంధుల క్రికెట్లో టీ20 విజేతగా నిలిచారు. అనేక సామాజిక కార్యక్రమాల్లో దివ్యాంగులు విశేష కృషి చేస్తూ పోటీ పడుతున్నారు’ అని ప్రధాని అన్నారు. తన గ్రామాన్ని బహిర్భూమి రహితంగా మార్చేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన 8 ఏళ్ల బాలుడు తుషార్ తీసుకున్న నిర్ణయాన్ని మోదీ ప్రశంసించారు. -
భారత సాక్షుల్ని రప్పించండి
లాహోర్: 2008 ముంబై ఉగ్రదాడులకు సంబంధించి 24 మంది భారతీయ సాక్షుల వాంగ్మూలాలను స్వీకరించేందుకు పాక్‌కు తీసుకురావాలని ఇక్కడి ఉగ్రవాద నిరోధక కోర్టు పాక్ ఫెడరల్ దర్యాప్తు సంస్థ (ఎఫ్ఐఏ)ను ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రతినిధిని నియమించాలని ఎఫ్ఐఏ డైరెక్టర్ జనరల్(డీజీ)కు సూచించింది. విచారణను ముగించడానికి భారత సాక్షుల వాంగ్మూలం అవసరమని ప్రాసిక్యూషన్ వాదించడంతో ఉగ్రవాద నిరోధక కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై కోర్టుకు చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ఒకవేళ భారత సాక్షులు కోర్టుకు రాకుంటే వారి వాంగ్మూలం లేకుండానే తీర్పు ఇవ్వాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరుతుంది’ అని తెలిపారు. -
లష్కరే ముష్కరుల కుట్రే
నేను రెక్కీ నిర్వహించి సమాచారం ఇచ్చా ముంబై మారణహోమంపై వీడియో కాన్ఫరెన్సలో హెడ్లీ వాంగ్మూలం ముంబై: ముంబై మహానగరంలో మారణహోమం సృష్టించిన ఉగ్రదాడికి కుట్ర పన్నిందీ, అమలు చేసిందీ.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థేనని.. ఆ కుట్రలో పాలుపంచుకున్న లష్కరే ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ వెల్లడించాడు. ఇందులో పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అధికారుల సాయం ఉందని పేర్లతో సహా వివరించాడు. తనకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి శిక్షణ ఇచ్చారు.. తాను పేరు మార్చుకుని అమెరికా నుంచి ఇండియాలోకి ఎలా ప్రవేశించాడు.. ముంబైలో ఎలా రెక్కీ నిర్వహించాడు.. 26/11 ఉగ్రదాడికి ఎలా సాయం చేశాడు అనే విషయాలను.. సోమవారం ముంబై విచారణ కోర్టుకు వీడియో వాంగ్మూలం ద్వారా పూసగుచ్చినట్టు వివరించాడు. లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, ఆ సంస్థ కమాండర్ జకీఉర్ రెహ్మాన్ లఖ్వీల మార్గదర్శకత్వంలో తనకు పాక్ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో, పాక్ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలోని అబోటాబాద్లోనూ ఆ ఉగ్రవాద సంస్థ ఇచ్చిన శిక్షణ గురించి చెప్పాడు. సయీద్, లఖ్వీల ఫొటోలను అతడు కోర్టులో గుర్తించి చూపాడు. పాక్ ఐఎస్ఐకి చెందిన ముగ్గురు అధికారులు మేజర్ అలీ, మేజర్ ఇక్బాల్, మేజర్ అబ్దుల్ రెహ్మాన్ పాషాలతో తనకు ఎలా సంబంధం ఏర్పడిందీ తెలిపాడు. పాకిస్తానీ-అమెరికన్ అయిన డేవిడ్ కోల్మాన్ హెడ్లీ.. ముంబై దాడుల కేసులోనే అమెరికా కోర్టులో దోషిగా నిర్ధారితుడై 35 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ముంబై దాడుల కేసును విచారిస్తున్న ముంబై కోర్టులో సైతం.. తనకు క్షమాభిక్ష పెట్టేట్లయితే అప్రూవర్‌గా మారి వాంగ్మూలం ఇవ్వడానికి హెడ్లీ సమ్మతించాడు. కోర్టు ఆదేశం మేరకు సోమవారం అమెరికా జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాంగ్మూలం ఇచ్చాడు. ముంబై నగరంలో 166 మంది మరణానికి, 309 మంది క్షతగాత్రులవటానికి కారణమైన 2008 నవంబర్ 26 నాటి ఉగ్రదాడులకు ముందు జరిగిన పరిణామాలన్నిటి గురించీ ప్రత్యేక న్యాయమూర్తి జి.ఎ.సనాప్ ఎదుట వివరించాడు. విదేశీ గడ్డ నుంచి భారతదేశంలోని కోర్టుకు వీడియో వాంగ్మూలం ఇవ్వటం ఇదే తొలిసారి. ఉదయం 7 గంటలకు మొదలైన వాంగ్మూలం ప్రక్రియ ఐదున్నర గంటల పాటు కొనసాగింది. హెడ్లీవాంగ్మూలం, విచారణ ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగనుంది. పాక్ పాత్రపై అస్పష్టత తొలగుతుంది: రిజిజు న్యూఢిల్లీ: పాకిస్తానీ - అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ ఇచ్చిన వాంగ్మూలంతో.. ముంబై ఉగ్రవాద దాడిలో పాక్‌కు చెందిన ప్రభుత్వ, ప్రభుత్వేతర శక్తుల పాత్రపై అస్పష్టత తొలగిపోతుందని.. కేసును తార్కిక ముగింపునకు తీసుకెళుతుందని భారత ప్రభుత్వం వ్యాఖ్యానించింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముంబై ఉగ్రవాద దాడుల కుట్రలో ఎవరి పాత్ర ఉందనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎవరెవరు ఉన్నారో తెలుసు. హెడ్లీ వాంగ్మూలం ఒక తార్కిక ముగింపునకు దారితీస్తుంది. అది మనకు సాయపడుతుంది’’ అని పేర్కొన్నారు. వాంగ్మూలం అతని మాటల్లోనే... సయీద్ ప్రేరేపణతో లష్కరేలో చేరా... ‘‘నా అసలు పేరు దావూద్ జిలానీ. పాకిస్తాన్‌లోని హసన్ అబ్దల్ కాడెట్ కాలేజ్‌లో చదివాను. పదిహేడేళ్ల వయసులో అమెరికాకు వలస వెళ్లాను. హఫీజ్ సయీద్ ప్రసంగాలతో ప్రేరేపితమై లష్కరే ఉగ్రవాద సంస్థలో చేరాను. ఇండియాను నా శత్రువుగా పరిగణించేవాడిని. నేను లష్కరేకు నిజమైన కార్యకర్తను. కశ్మీర్ వెళ్లి భారత బలగాలతో యుద్ధం చేయాలనుకున్నాను. కానీ.. అందుకు నా వయసు ఎక్కువైపోయిందని లఖ్వీ తదితరులు చెప్పారు. నన్ను మరొక అవసరానికి వాడుకుంటామని, అది కశ్మీర్ కన్నా చాలా సాహసోపేతమైన పని అని లఖ్వీ నాకు చెప్పాడు. ఇండియా లో దాడుల కోసం రెక్కీ నిర్వహించటానికి నా పేరు మార్చుకోవాలని లఖ్వీ, ఐఎస్ఐ కమాండర్లు సూచించారు.’’ రెండేళ్ల పాటు లష్కరే శిక్షణ పొందా... ‘‘నేను తొలిసారి 2002లో ముజఫరాబాద్‌లో లష్కరే శిక్షణ పొందాను. సయీద్, లఖ్వీలు నడిపిన ‘నాయకత్వ శిక్షణ’కు కూడా హాజరయ్యాను. లష్కరే శిబిరాల్లో దాదాపు రెండేళ్ల పాటు ఐదు, ఆరు శిక్షణ కోర్సులకు హాజరయ్యాను. దౌరా-ఎ-సూఫా అనేది ఒక అధ్యయన కోర్సు. లాహోర్‌లోని మురిడ్కేలో ఈ శిక్షణ ఇస్తారు. దౌరా-ఎ-ఆమ్ అనేది ప్రాథమిక సైనిక శిక్షణ. ‘ఆజాద్ కశ్మీర్’(పీఓకే)లోని ముజఫరాబాద్‌లో ఈ శిక్షణ ఇస్తారు. దౌరా-ఎ-ఖాస్ అనేది మరింత తీవ్రమైన శిక్షణ. అందులో నాకు ఆయుధాలు, తుపాకులు, పేలుడు పదార్థాలు, మందుగుండును ఎలా వినియోగించాలో నేర్పించారు. దౌరా-ఎ-రిబాత్ అనే శిక్షణ కూడా నాకు ఇచ్చారు. ఇది నిఘా కోర్సు. సురక్షిత స్థావరాలను నెలకొల్పటం, రహస్యంగా సమాచారం సేకరించటం తదితరాలు నేర్పారు. ఈ శిక్షణా కేంద్రం పాక్‌లోని అబోటాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో గల మన్సేరాలో ఉంది.’’ అమెరికాలో పేరు మార్చుకుని ఇండియా వీసా తీసుకున్నా... ‘‘ఇండియాలోకి ప్రవేశించటానికి.. అమెరికా గుర్తింపుతో ఇండియాలో వ్యాపారం స్థాపించే మిషతో వచ్చాను. అందుకోసం.. నా పేరును డేవిడ్ హెడ్లీగా మార్చుకుంటూ 2006 ఫిబ్రవరి 5న ఫిలడెల్ఫియాలో దరఖాస్తు చేశాను. ఆ పేరుతో కొత్త పాస్‌పోర్ట్ సంపాదించాను. ఆ విషయాన్ని లష్కరేలోని నా సహచరులకు చెప్పాను. వారిలో సాజిద్ మిర్.. నాతో సంప్రదింపులు జరుపుతుండేవాడు. ఇండియాలో ఒక ఆఫీసు లేదా వ్యాపారం నెలకొల్పటం ద్వారా నేను అక్కడ ఒక ముసుగులో నివసించాలనేది ఉద్దేశం. భారత రాయబార కార్యాలయంలో వాణిజ్య వీసా కోసం దరఖాస్తు చేశాను. భారత వీసా కోసం దరఖాస్తు చేసేటపుడు నేను ఒక ఇమిగ్రేషన్ కన్సల్టెంట్‌నని తప్పుడు కథ అల్లి చెప్పాను. ప్రతిసారీ భారత వీసా కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా.. పలుమార్లు వచ్చి వెళ్లేందుకు వీలైన వీసా తీసుకున్నాను. ఒక డానిష్ వార్తా పత్రికపై దాడికి కుట్ర పన్నటంలో లష్కరే సంస్థకు మద్దతిచ్చిన కేసులో దోషిగా నిర్ధారితుడైన పాక్ మాజీ సైనిక వైద్యుడు తాహావ్వుర్ హుస్సేన్ రాణా.. నేను ఇండియా ప్రయాణానికి ఐదేళ్ల వీసా సంపాదించటంలో సాయపడ్డాడు. 26/11 దాడుల గురించి రాణాకూ తెలుసు. ఐఎస్ఐ మేజర్లు మాకు సహకరించారు... ‘‘ఐఎస్ఐకి చెందిన మేజర్ ఇక్బాల్ నాకు తెలుసు. ఐఎస్ఐకే చెందిన మేజర్ అలీ అతడిని నాకు పరిచయం చేశాడు. ఆ తర్వాత ఒకసారి లాహోర్‌లో మేజర్ ఇక్బాల్‌ను నేను కలిశాను. పాక్‌లోని ఫెడరల్లీ అడ్మినిస్ట్రేటెడ్ ట్రైబల్ ఏరియాలో నేను ఒకసారి అరెస్టయ్యాను. ఆ సమయంలో ఐఎస్ఐకి చెందిన మేజర్ అబ్దుల్ రెహ్మాన్ పాషా కూడా నాతోనే ఉన్నాడు. నన్ను ప్రశ్నించేందుకు మేజర్ అలీ వచ్చాడు. నేను విదేశీయుడిలా కనిపించటం వల్ల, నా వద్ద ఇండియా మీద గల పుస్తకాలు దొరకటం వల్ల నన్ను అరెస్ట్ చేశారు. అయితే నాకు గల పాకిస్తానీ గుర్తింపు కార్డును చూపటంతో నాపై కేసు నమోదు చేయలేదు. ’’ రెండు సార్లు విఫలమయ్యారు... ‘‘ముంబైలో 2008 నవంబర్ 26వ తేదీన మారణహోమం సృష్టించిన పది మంది ఉగ్రవాదులు.. అంతకుముందు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే దాడులు చేయటానికి రెండు సార్లు కుట్ర పన్నారు. కానీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయని సాజిద్‌మిర్ నాకు చెప్పాడు. సెప్టెంబర్‌లో తొలి ప్రయత్నం చేశారు. కరాచీ వెలుపలి నుంచి సముద్రంలో ప్రయాణమైన ఉగ్రవాదుల బోటు.. కొంత దూరం వెళ్లాక రాళ్లను ఢీకొట్టి ముక్కలైంది. బోటులోని ఆయుధాలు, పేలుడు పదార్థాలన్నీ సముద్రంలో పడిపోయాయి. అందులో ఉన్నవారికి లైఫ్ జాకెట్లు ఉండటంతో వారు వెనుదిరిగి పాక్ తీరానికి చేరుకున్నారు. అక్టోబర్‌లో రెండోసారి ప్రయత్నం చేశారు. అదీ విఫలమైంది. అదే 10 మంది ఉగ్రవాదులు ముంబైపై దాడి చేయటంలో మూడోసారి సఫలమయ్యారు.’’ దాడులకు ముందు ఏడుసార్లు ముంబై వచ్చాను.. ‘‘నా వీసా ప్రణాళికనంతటినీ నేను సాజిద్మిర్తోను, ఐఎస్ఐకి చెందిన మేజర్ ఇక్బాల్లతోను చర్చించాను. ముంబై చేరుకుని.. నా వాస్తవ గుర్తింపు తెలియకుండా ఉండటం కోసం ఒక ఆఫీసు స్థాపించాను. నేను తొలిసారి ఇండియాకు రావటానికి ముందు.. ముంబై నగరాన్ని వీడియో తీసి తీసుకురావాలని లష్కరే ప్రతినిధి సాజిద్‌మిర్ (ఈ కేసులో మరో నిందితుడు) నాకు చెప్పాడు. 2008 ఉగ్రవాద దాడులకు ముందు నేను ఏడుసార్లు ముంబై వెళ్లాను. ఆ దాడి తర్వాత 2009 మార్చిలో ఒకసారి ఢిల్లీ వెళ్లాను. (ముంబైలో హెడ్లీ చేసిన పని.. నగరానికి సంబంధించి మ్యాపులు తయారు చేసి, వీడియో తీయటం, తాజ్, ఒబెరాయ్ హోటళ్లు, నారీమన్ హౌస్‌ల వద్ద రెక్కీ నిర్వహింభఃచటం. ముంబైపై 10 మంది ఉగ్రవాదుల దాడులకు హెడ్లీ అందించిన రెక్కీ సమాచారమే కీలకమైంది.) సంచలన విషయాలు వెల్లడించాడు: నికమ్ హెడ్లీ తన వాంగ్మూలంలో వెల్లడించిన విషయాలతో తాను పూర్తిగా సంతృప్తి చెందినట్లు ప్రత్యేక ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ పేర్కొన్నారు. ‘‘హెడ్లీ సంచలన విషయాలు వెల్లడించాడు. తాను హఫీజ్ సయీద్‌ను కలిసినట్లు చెప్పాడు. అతడి ఫొటోను గుర్తించాడు. ఐఎస్ఐలో ఉన్న మేజర్ ఇక్బాల్, మేజర్ అలీల గురించి చాలా విషయాలు వెల్లడించాడు. అతడికి శిక్షణ ఇచ్చింది మేజర్ ఇక్బాల్. పలువురు లష్కరే శిక్షకుల పేర్లను కోర్టు ఎదుట వెల్లడించాడు. హఫీజ్ సయీద్ వల్ల ప్రేరేపితుడనై లష్కరే తోయిబాలో చేరినట్లు హెడ్లీ ఒప్పుకున్నాడని అతడి తరఫు న్యాయవాది మహేశ్జెఠ్మలాని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. 26/11 దాడుల మరో కుట్రదారు సయ్యద్ జబీయుద్దీన్ అన్సారీ అలియాస్ అబుజుందాల్‌ను కూడా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరిచారు. తన న్యాయవాదిని ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపిన జుందాల్.. కొత్త న్యాయవాదిని నియమించుకునేందుకు 15 రోజుల గడువు కోరాడు. అలాగే తన పేరు సయ్యద్ జబీయుద్దీన్ అన్సారీ అని.. అబుజుందాల్ కాదంటూ అలియాస్ పేరును కోర్టు రికార్డుల నుంచి తొలగించాలని కోరాడు. -
‘ముంబై’ ఘాతుకానికి ఆరేళ్లు
అమరవీరులకు ప్రధాని నివాళి ముంబైలో 26/11 సంస్మరణ కార్యక్రమాలు ముంబై/న్యూఢిల్లీ: ముంబైపై ఉగ్రవాదుల ఘాతుకానికి ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దాడుల్లో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ‘ముంబై దాడుల ఘటన ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆ బాధను భారతీయులు అనుభవిస్తూనే ఉన్నారు. ఆ రోజు ప్రజల ప్రాణాల రక్షణ కోసం తమ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు దేశం సాల్యూట్ చేస్తోంది. వారే నిజమైన హీరోలు’ అని ఒక ప్రకటనలో నివాళులర్పించారు. ముంబై దాడులను గుర్తు చేస్తూ.. ఉగ్రవాద భూతాన్ని తుదముట్టించేం దుకు కలసికట్టుగా పోరాడాలని, అందుకు అంతా మరోసారి కంకణబద్ధులు కావాల్సిన సమయమిదని కఠ్మాండులో సార్క్ దేశాధినేతలకు భారత ప్రధాని పిలుపునిచ్చారు. కాగా, పాకిస్తాన్లో జరుగుతున్న 26/11 దాడుల విచారణ మందగతిన కొనసాగుతుండటంపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. విచారణను వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా దోషులను శిక్షించాలని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ డిమాండ్ చేశారు. ఉగ్రవాదులతో పోరులో వీర మరణం పొందిన వారికి ముంబైలో పలువురు పుష్పాంజలి ఘటించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఈ కార్యక్రమాలకు హాజరు కాలేదు. కానీ, ముంబై దాడుల అమర వీరులకు నివాళులర్పిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్ర భద్రత, రాష్ట్ర ప్రజల రక్షణ కోసం మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. అలాగే, ఉగ్ర దాడులు జరిగిన తాజ్ హోటల్ తదితర ప్రాంతాల్లో సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించారు. ముంబై దాడుల మృతులకు బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, మాధుర్ భండార్కర్, ఫర్హాన్ అఖ్తర్, అర్జున్ కపూర్, నటి దియామీర్జా తదితరులు ట్వీటర్లో నివాళులర్పించారు. ముంబై దాడుల సంస్మరణ సందర్భంగా, మరోసారి ఇలాంటి దాడులు జరిగితే ఎదుర్కొనే సంసిద్ధతపై భద్రతాబలగాలు సమీక్ష జరిపాయి. తీర గస్తీదళాన్ని బలోపేతం చేయాలని, 2020 నాటికి 150 నౌకలను, 100 విమానాలను సమకూర్చుకోవాలని నిర్ణయిం చాయి. ఆరేళ్ల క్రితం సముద్ర మార్గంలో ముం బైలో ప్రవేశించిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలోని పలు చోట్ల మారణాయుధాలతో విరుచుకుపడిన ఘటనలో విదేశీయులు, భద్రత సిబ్బంది సహా 166 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఏటీఎస్ అధినేత హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబై అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ ఖామ్తె, సీనియర్ పోలీస్ అధికారి విజయ్ సలాస్కర్ తదితరులు ఉగ్రవాదులతో పోరులో ప్రాణాలర్పించారు. భద్రతాబలగాల ప్రతిదాడుల్లో ఉగ్రవాదుల్లో 9 మంది చనిపోగా, అజ్మల్ కసబ్‌ను ప్రాణాలతో పట్టుకుని 2012లో ఉరితీశారు.