వాషింగ్టన్: పదేళ్ల క్రితం ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడికి పాల్పడిన, కుట్ర పన్నిన వారి వివరాలు అందించిన వారికి రూ. 35.39 కోట్ల (50 లక్షల డాలర్లు) ఇస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. కుట్రకు పాల్పడిన, వారికి తోడ్పడిన లేదా వారిని ప్రేరేపించిన వారి వివరాలతోపాటు ఘటనకు సంబంధించిన ఎలాంటి సమాచారానైనా నిర్భయంగా వెల్లడించవచ్చని పాకిస్తాన్ సహా ప్రపంచ దేశాలను కోరింది. రివార్డ్స్ ఫర్ జస్టిస్ (ఆర్‌ఎఫ్‌జే) కార్యక్రమం కింద ఈ మొత్తం అందిస్తామని ప్రకటించింది.
అలాగే కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌ను కోరింది. ముంబైలో ఉగ్రదాడికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియొ సోమవారం ప్రకటన విడుదల చేశారు. 2008లో జరిగిన ఈ ఘటన అత్యంత క్రూరమైనదిగా అభివర్ణించారు. దాడి జరిగి పదేళ్లు అయినా సూత్రదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అని అన్నారు. దాడికి సంబంధించిన వివరాలను తెలిపేందుకు ఆర్‌ఎఫ్‌జే ఆఫీసర్‌ను సంప్రదించవచ్చని అమెరికా సూచించింది. లేదా సమీపంలోని యూఎస్ రాయబార కార్యాలయం వద్ద కానీ, యూఎస్ కాన్సులేట్ వద్ద కానీ సమాచారాన్ని అందించవచ్చని పేర్కొంది.
సా...గుతున్న ‘ముంబై’ విచారణ
లాహోర్: 26/11 దాడులు జరిగి పదేళ్లు పూర్తయినా పాకిస్తాన్‌లో ఈ దాడుల సూత్రధారులకెవ్వరికీ శిక్ష పడలేదు. 2009 నుంచి పాక్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఈ కేసును విచారిస్తోంది. విచారణను రెండు నెలల్లో ముగించాలని 2015లోనే ఇస్లామాబాద్ హైకోర్టు కూడా ఆదేశించింది. అయినా ఇప్పటికీ కేసు విచారణలో పురోగతి లేదు. పైగా తరచుగా న్యాయమూర్తులను మార్చడం, ఓ దర్యాప్తు అధికారి హత్య తదితరాల కారణంగా ఈ కేసు విచారణ పలు మలుపులు తిరుగుతూ తొమ్మిదేళ్లుగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment