Details of the case
-
‘26/11’ సమాచారమిస్తే రూ.35 కోట్ల రివార్డు
వాషింగ్టన్: పదేళ్ల క్రితం ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడికి పాల్పడిన, కుట్ర పన్నిన వారి వివరాలు అందించిన వారికి రూ. 35.39 కోట్ల (50 లక్షల డాలర్లు) ఇస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. కుట్రకు పాల్పడిన, వారికి తోడ్పడిన లేదా వారిని ప్రేరేపించిన వారి వివరాలతోపాటు ఘటనకు సంబంధించిన ఎలాంటి సమాచారానైనా నిర్భయంగా వెల్లడించవచ్చని పాకిస్తాన్ సహా ప్రపంచ దేశాలను కోరింది. రివార్డ్స్ ఫర్ జస్టిస్ (ఆర్‌ఎఫ్‌జే) కార్యక్రమం కింద ఈ మొత్తం అందిస్తామని ప్రకటించింది. అలాగే కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌ను కోరింది. ముంబైలో ఉగ్రదాడికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియొ సోమవారం ప్రకటన విడుదల చేశారు. 2008లో జరిగిన ఈ ఘటన అత్యంత క్రూరమైనదిగా అభివర్ణించారు. దాడి జరిగి పదేళ్లు అయినా సూత్రదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అని అన్నారు. దాడికి సంబంధించిన వివరాలను తెలిపేందుకు ఆర్‌ఎఫ్‌జే ఆఫీసర్‌ను సంప్రదించవచ్చని అమెరికా సూచించింది. లేదా సమీపంలోని యూఎస్ రాయబార కార్యాలయం వద్ద కానీ, యూఎస్ కాన్సులేట్ వద్ద కానీ సమాచారాన్ని అందించవచ్చని పేర్కొంది. సా...గుతున్న ‘ముంబై’ విచారణ లాహోర్: 26/11 దాడులు జరిగి పదేళ్లు పూర్తయినా పాకిస్తాన్లో ఈ దాడుల సూత్రధారులకెవ్వరికీ శిక్ష పడలేదు. 2009 నుంచి పాక్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఈ కేసును విచారిస్తోంది. విచారణను రెండు నెలల్లో ముగించాలని 2015లోనే ఇస్లామాబాద్ హైకోర్టు కూడా ఆదేశించింది. అయినా ఇప్పటికీ కేసు విచారణలో పురోగతి లేదు. పైగా తరచుగా న్యాయమూర్తులను మార్చడం, ఓ దర్యాప్తు అధికారి హత్య తదితరాల కారణంగా ఈ కేసు విచారణ పలు మలుపులు తిరుగుతూ తొమ్మిదేళ్లుగా సాగుతోంది. -
నాపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వడం లేదు
సాక్షి, హైదరాబాద్: తనపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలు అందచేసేలా డీజీపీని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని కోరినా డీజీపీ ఇవ్వడం లేదని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకు నాపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నాపై నమోదైన పలు కేసుల్లో నాకు పోలీసుల నుంచి ఎటువంటి నోటీసులు రాలేదు. అందువల్ల ఈ కేసుల వివరాలు తెలిసే అవకాశం నాకు లేదు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేటప్పుడు నిబంధనల ప్రకారం అందులో అభ్యర్థిపై ఉన్న కేసుల వివరాలన్నింటినీ ప్రస్తావించాలి. నాకు తెలియకుండానే నాపై అనేక కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఆ కేసుల వివరాలు ఇవ్వాలని ఈ ఏడాది మార్చి 14న సమాచార హక్కు చట్టం కింద డీజీపీని కోరాను. అయితే ఇప్పటి వరకు నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇదే అంశంపై డీజీపీకి గత నెల 12న వినతిపత్రం ఇచ్చాను. అయినా డీజీపీ ఇప్పటి వరకు ఎటువంటి వివరాలు ఇవ్వలేదు. నేను కోరిన వివరాలు ఇవ్వని పక్షంలో నాకు తీరని ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల మరో ప్రత్యామ్నాయం లేక హైకోర్టును ఆశ్రయించా. నాపై వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను అందచేసేలా డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆదేశించండి’ అని రేవంత్‌రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. -
ఎస్ఎంఎస్ చేస్తే కేసు వివరాలు
దేశంలోనే తొలిసారిగా సైబరాబాద్ పోలీసుల ప్రయోగం ఠాణాల చుట్టూ చక్కర్లు లేకుండానే ఫిర్యాదుదారులకు సమాచారం కమిషనర్ వైబ్‌సైట్‌కు వెళ్లి ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు ఎప్పటికప్పుడూ కేసు పురోగతి వివరాలు చేరవేత సిటీబ్యూరో: మీరు ఎవరిపైనైనా ఫిర్యాదు చేశారా...? కేసు స్థితిగతుల గురించి తెలుసుకునేందుకు ఠాణాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారా..? కేసు వివరాలు చెప్పేందుకు పోలీసులు తిప్పించుకుంటున్నారా...? ఇక నుంచి ఫిర్యాదుదారులకు ఇలాంటి తిప్పలు లేకుండా సైబరాబాద్ పోలీసులు సరికొత్త పంథాను ఎంచుకున్నారు. ఫిర్యాదుదారుడు తన సెల్‌ఫోన్ నంబర్ నుంచి CYBPOL <space> CS <space> Police Station/Crime No/Yearఅని టైప్ చేసి 9731979899 నంబర్‌కు సందేశం పంపిస్తే కేసు పురోగతి గురించి సమాచారం వెంటనే వచ్చేస్తుంది. సైబరాబాద్ పోలీసులు ఇటీవల ప్రారంభించిన ఎస్ఎంఎస్ గేట్ వే ఫర్ సిటిజన్స్‌కు మంచి స్పందన వస్తోంది. వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నా ఎస్ఎంఎస్లు ‘ఎస్ఎంఎస్ ద్వారా కేసు వివరాలను తెలుసుకునేందుకు తొలుత సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ వెబ్‌సైట్‌కి వెళ్లి నో యువర్ కేస్ స్టేటస్‌కి వెళ్లాలి. కేసు స్టేటస్ త్రూ ఎస్ఎంఎస్ని క్లిక్ చేయాలి. ఫిర్యాదుచేసిన పోలీసు స్టేషన్ పేరు, క్రైం నంబర్, పేరు, మొబైల్ నంబర్లను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఫోన్‌కు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఎస్ఎంఎస్ వస్తుంది. రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే కేసు స్థితిగతుల వివరాలు మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంటాయి. కేసుకు సంబంధించి ఎప్పుడూ పురోగతి లభించినా వెంటనే సదరు సమాచారం ఫిర్యాదుదారుడి సెల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ‘సైబరాబాద్ పోలీసులు తీసుకొచ్చిన ఈ ఎస్ఎంఎస్ విధానం ద్వారా ఠాణాలు చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి తప్పింది. దీనివల్ల సమయం ఆదా అవడంతో పాటు వ్యక్తిగత పనులకు ఎటువంటి అంతరాయం కలగడం లేదు. ఫోన్ పట్టుకొని నంబర్ ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేసు పురోగతి వివరాలు వచ్చేస్తున్నాయ’ని గచ్చిబౌలికి చెందిన అరుణ్ తెలిపాడు. క్రైమ్ నంబర్, ఎఫ్ఐఆర్ నమోదు తేదీ, పేరుతో పాటు కేసు విచారణ దశలో ఉందా, ఉంటే అందుకు కారణాలు ఏంటనే వివరాలు వచ్చేస్తున్నాయని తెలిపాడు. కాగా, ఈ ఎస్ఎంఎస్ గేట్ వే ఫర్ సిటిజన్స్ పద్ధతి వల్ల తమకు కూడా చాలా పనిభారం తప్పినట్టైందని, ఎప్పటికప్పుడు కేసు పురోగతి వివరాలను ఫిర్యాదుదారుడికి ఎస్ఎంఎస్ రూపంలో చెరవేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఠాణాకు ప్రతిసారి కేసు వివరాలు తెలుసుకునేందుకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని, దీంతో వాళ్లకు సర్దిచెప్పడం లాంటి సంఘటనలు కూడా తగ్గాయని అంటున్నారు. అలాగే కమిషనర్ వెబ్సైట్లోకి లాగిన్ అయి వివరాలు నమోదుచేసినా కేసు స్థితిగతులను తెలుసుకోవచ్చు.