సాక్షి, హైదరాబాద్: తనపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలు అందచేసేలా డీజీపీని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని కోరినా డీజీపీ ఇవ్వడం లేదని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకు నాపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. నాపై నమోదైన పలు కేసుల్లో నాకు పోలీసుల నుంచి ఎటువంటి నోటీసులు రాలేదు. అందువల్ల ఈ కేసుల వివరాలు తెలిసే అవకాశం నాకు లేదు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేటప్పుడు నిబంధనల ప్రకారం అందులో అభ్యర్థిపై ఉన్న కేసుల వివరాలన్నింటినీ ప్రస్తావించాలి.
నాకు తెలియకుండానే నాపై అనేక కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఆ కేసుల వివరాలు ఇవ్వాలని ఈ ఏడాది మార్చి 14న సమాచార హక్కు చట్టం కింద డీజీపీని కోరాను. అయితే ఇప్పటి వరకు నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇదే అంశంపై డీజీపీకి గత నెల 12న వినతిపత్రం ఇచ్చాను. అయినా డీజీపీ ఇప్పటి వరకు ఎటువంటి వివరాలు ఇవ్వలేదు. నేను కోరిన వివరాలు ఇవ్వని పక్షంలో నాకు తీరని ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల మరో ప్రత్యామ్నాయం లేక హైకోర్టును ఆశ్రయించా. నాపై వివిధ పోలీస్‌స్టేషన్‌లలో నమోదైన కేసుల వివరాలను అందచేసేలా డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆదేశించండి’ అని రేవంత్‌రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment