కాళేశ్వరంపై చర్చకు రా! కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌ | CM Revanth Reddy challenge to KCR On Kaleshwaram | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంపై చర్చకు రా! కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌

Published Thu, Apr 25 2024 3:22 PM | Last Updated on Thu, Apr 25 2024 3:26 PM

CM Revanth Reddy challenge to KCR On Kaleshwaram - Sakshi

మడికొండ జనజాతర సభలో కావ్యను గెలిపించాలని కోరుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

మేడిగడ్డ వద్దే మేధావులతో చర్చిద్దాం: కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌ 

నీ మేధస్సు కరిగించి కడితే.. మేడిగడ్డ మేడిపండు ఎందుకైందో తేలుద్దాం 

ప్రతిపక్ష నేతగా దీనిపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేదేం? 

మెదడు రంగరించింది కాళేశ్వరం కోసం కాదు.. దోపిడీ కోసం.. 

భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తా.. 

హరీశ్‌.. రాజీనామా జేబులో పెట్టుకో.. ఆ రోజే మాట్లాడుదాం.. 

మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ తోడుదొంగలు.. 

దేవుడు, మతం పేరిట విద్వేషాలు... ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు 

లోక్‌సభ ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పాలని పిలుపు 

వరంగల్‌ జనజాతర సభ,సికింద్రాబాద్‌ కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడిన రేవంత్‌ 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/ రాంగోపాల్‌పేట్‌: మాజీ సీఎం కేసీఆర్‌కు దమ్మూ, ధైర్యముంటే కాళేశ్వరంపై బహిరంగ చర్చకు రావాలని టీపీసీసీ చీఫ్, సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి సవాల్‌ చేశారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాని కేసీఆర్‌.. గంటల కొద్దీ టీవీ స్టూడియోలో కూర్చుని కాళేశ్వరంపై మాట్లాడారని విమర్శించారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఓట్ల రాజకీయాలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. కేసీఆర్, మోదీ తోడు దొంగలని.. వారికి లోక్‌సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. చచ్చిన పాములా మారిన బీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం హనుమకొండ జిల్లా మడికొండలో నిర్వహించిన కాంగ్రెస్‌ జన జాతర బహిరంగ సభలో, అంతకుముందు సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో రేవంత్‌ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 
 
‘‘కేసీఆర్‌ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాలేదు. అడిగేటోళ్లు, చూపించేటోళ్లు నీవోళ్లే.. గంటల కొద్దీ టీవీ స్టుడియోలో కూర్చుని మాట్లాడావ్‌. మేధస్సు కరిగించి కాళేశ్వరం కట్టినమంటున్నవ్‌ కదా.. మరి మేడిగడ్డ మేడిపండు ఎందుకైంది. సూటిగా సవాల్‌ విసురుతున్నా.. మేడిగడ్డ వద్దే మేధావులతో చర్చిద్దాం.. కేసీఆర్‌.. దమ్ముంటే చర్చకు రావాలి. గత పదేళ్లలో దోపిడీ కోసం మెదడు రంగరించారు కనుకనే కాళేశ్వరం కూలిపోయింది. లక్ష కోట్లు ఖర్చుపెట్టిన ప్రాజెక్టు ఏడాదన్నా లేకపాయే.. ఇంకా ఏం మాట్లాడుతున్నారు. ఇంతకంటే దివాళాకోరు తీరు ఎక్కడా ఉండదు. కాంగ్రెస్‌ హయాంలో దశాబ్దాల కింద కట్టిన నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ, దేవాదుల, శ్రీశైలం, భీమా, నెట్టెంపాడు.. ఇలా ఎన్నో ప్రాజెక్టులు చెక్కు చెదరకుండా ఉన్నాయి. 

ఆ ఇద్దరూ తోడు దొంగలు 
ప్రధాని మోదీ, కేసీఆర్‌ తోడు దొంగలు. ఒక నాణేనికి బొమ్మ బొరుసులాంటి వాళ్లు. వారి చీకటి ఒప్పందాలు, ముసుగు రాజకీయాలతో దేశాన్ని మోదీ, రాష్ట్రాన్ని కేసీఆర్‌ భ్రష్టు పట్టించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు బుద్ధి చెప్పిన ప్రజలు.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి, మోదీకి గుణపాఠం చెప్పాలి. వారి కుట్రలను భగ్నం చేయాలి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ.. పదేళ్లలో ఇచ్చింది 7 లక్షల ఉద్యోగాలు. ఏమైనా పొంతన ఉందా? మోదీ ప్రజల సంక్షేమాన్ని విస్మరించి అదానీ, అంబానీలకు దోచిపెట్టారు. బీజేపీ నల్ల చట్టాలతో అంబానీ, అదానీలకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టే కుట్ర చేసింది. ఢిల్లీ సరిహద్దుల్లో హరియాణా, పంజాబ్‌ రైతులు చేసిన ఉద్యమంతో ప్రధాని మోదీ దిగివచ్చి క్షమాణలు చెప్పిన విషయాన్ని మర్చిపోగలమా? బీజేపీ ప్రజా సంక్షేమాన్ని వదిలేసి మత రాజకీయాలకు పాల్పడుతోంది. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెలో ఉండాలి. అంతే తప్ప రాజకీయం చేయొద్దు. 

ఓరుగల్లులో విజయం ప్రజాపాలనకు నాంది 
అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేను చేపట్టిన పాదయాత్ర సందర్భంగా.. తెలంగాణను పట్టిపీడిస్తున్న కేసీఆర్‌ పాలన నుంచి విముక్తి కోరాను. ఆ పిలుపు మేరకు ఇక్కడి 12 అసెంబ్లీ స్థానాల్లో 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఓరుగల్లు ప్రజలు ప్రజాపాలనకు పునాదులు వేశారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు వంటి చీడపురుగును ఓడించిన యశస్విని, ఝాన్సీరెడ్డి ప్రజల మదిలో నిలిచారు. ఓరుగల్లు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు... ఐటీ విస్తరణతోపాటు హైదరాబాద్‌– వరంగల్‌– రామగుండం ఇండ్రస్టియల్‌ కారిడార్‌తో యువతకు ఉపాధి కల్పిస్తాం.

వానాకాలం వస్తే నీళ్ల నిలిచిపోయి, మురికి కంపు కొట్టే గోసను రూపుమాపుతాం. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మిస్తాం. హైదరాబాద్‌ మాదిరి ఔటర్‌ రింగురోడ్డు నిర్మించి.. విమానాలు సరాసరిగా దించగలిగేలా మహర్ధçశ కల్పిస్తాం’’ అని సీఎం రేవంత్‌ చెప్పారు. వరంగల్‌ సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రోహిత్‌ చౌదరి, మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్‌ నాగరాజు, మామిడాల యశస్వినిరెడ్డి, వరంగల్‌ అభ్యర్థి కడియం కావ్య తదితరులు పాల్గొన్నారు. 
 
హరీశ్‌.. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో.. 
‘‘బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఒక మాట అన్నడు.. రైతు రుణమాఫీ చేసి చూపిస్తే రాజీనామా చేస్తానని అన్నడు. నేను ఈ వేదిక మీది నుంచి మాట ఇస్తున్నా.. రామప్ప శివుని సాక్షిగా, సమ్మక్క–సారలమ్మ సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా చెప్తున్నా.. సూర్యుడు పడమరన ఉదయించినా, భూమి ఆకాశం తిరగబడ్డా, తుపాను వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా సరే.. పంద్రాగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతా.. హరీశ్‌రావు.. సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నావుకదా.. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో.. పంద్రాగస్టు నాడు నీతో మాట్లాడుతా.. మాటమీద ఉండాలె.. మీ మామలా దళితుడిని సీఎం చేస్తా, లేకుంటే తలకాయ నరుక్కుంటానని తలకాయ లేని మాటలు మాట్లాడుదామని అనుకుంటున్నవేమో! ఆనాడు వంద రూపాయల పెట్రోల్‌ తెచ్చుకున్నవ్‌.. పది పైసల అగ్గిపెట్టె దొరకలే.. ఇప్పుడట్లనే అనుకుంటున్నవేమో.. రుణమాఫీ చేసి పంద్రాగస్టు నాడు నీ ఆఖరి శాసనసభ సభ్యత్వం సంగతి తేలుస్తా..’’ 

కాంగ్రెస్‌ హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి 
‘‘గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే హైదరాబాద్‌ నగరం అభివృద్ధి జరిగింది. 2004, 2009లో వైఎస్సార్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే కృష్ణా, గోదావరి జలాలతో హైదరాబాద్‌ దాహార్తిని తీర్చింది. ఔటర్‌ రింగ్‌రోడ్డు, ఎయిర్‌పోర్టు, మెట్రో రైలు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలను తీసుకువచ్చింది. సికింద్రాబాద్‌లో దానం నాగేందర్‌ను ఎంపీ గెలిపిస్తే కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. ఓటేసే బాధ్యత మీదైతే కీలక స్థానం కల్పించే బాధ్యత నాది. హైదరాబాద్‌లో మత సామరస్యాన్ని కాపాడింది కాంగ్రెస్‌ పార్టీయే. కానీ మోదీ దేవుళ్ల పేరు చెప్తూ, దేవుళ్లను రోడ్డు మీదకు తెస్తూ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు.

సికింద్రాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన దత్తాత్రేయ, కిషన్‌రెడ్డిలు కేంద్ర మంత్రులుగా ఉన్నా.. ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు. 2021లో నగరాన్ని వరదలు ముంచెత్తితే.. కిషన్‌రెడ్డి హోం శాఖ సహాయ మంత్రిగా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ తన పరిధిలో ఉన్నా ఒక్క రూపాయి కూడా తీసుకుని రాలేకపోయారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చే పెట్టుబడులను గుజరాత్‌కు తరలించుకుపోతుంటే కూడా కిషన్‌రెడ్డి ఏమి చేయలేకపోయారు...’’ అని రేవంత్‌ విమర్శించారు. సికింద్రాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యరి్థగా పోటీచేస్తున్న పద్మారావుగౌడ్‌ మంచోడేనని.. కానీ వాళ్ల గురువు కేసీఆర్‌ను నమ్ముకుంటే మాత్రం మునిగినట్లేనని వ్యాఖ్యానించారు. 
 
మహంకాళి ఆలయంలో పూజలు.. భారీ ర్యాలీ 
బుధవారం ఉదయం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వద్ద నుంచి ప్యాట్నీ సెంటర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించిన అనంతరం సీఎం రేవంత్‌ మరో కార్యక్రమానికి వెళ్లిపోగా.. దానం నాగేందర్‌ ఇతర నేతలతో కలసి నామినేషన్‌ వేసేందుకు జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వెళ్లారు. సీఎం పర్యటన, ర్యాలీ, కార్నర్‌ మీటింగ్‌ సందర్భంగా సుమారు 3 గంటల పాటు సికింద్రాబాద్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ నిలిచిపోయి.. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement