ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికళ వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లాపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం బదిలీ వేటు వేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఈసీ తమ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రతిపక్షాల విషయంలో డీజీపీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది.
రష్మీ శుక్లా స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారికి డీజీపీగా బాధ్యతలు అప్పగించాలని ఎన్నికల సంఘం మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. డీజీపీగా నియామకం కోసం మంగళవారం మధ్యాహ్నంలోగా ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన ప్యానెల్‌ను పంపాలని తెలిపింది. దీంతో రష్మీ శుక్లా స్థానంలో అత్యంత సీనియర్ అధికారిగా ఉన్న వివేక్ ఫన్సాల్కర్‌కు తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ముంబై సీపీగా పనిచేస్తున్నారు.
కా గాగత నెలలో రాష్ట్ర డీజీపీని తొలగించాలని అభ్యర్థిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే లేఖ రాశారు. కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ(శరద్‌చంద్ర) సహా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలపై డీజేపీ శుక్లా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆయన లేఖలో ఆరోపించారు.
చదవండి: దేశంలో పలు స్థానాల్లో ఉప ఎన్నిక తేదీ మార్పు
గత ప్రభుత్వ హయాంలో నేతల ఫోన్లను ట్యాప్ చేశారని.. నేతలు ఏం చేయబోతున్నారనేది తెలుసుకొని ఆ సమాచారాన్ని ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు చేరవేశారంటూ శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్రతిపక్షాలపై రాజకీయ హింస పెరిగిందని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించాయి. ఆమెను తొలగించాలని లేఖలో కోరాయి.
దీనిపై ఈసీ స్పందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా, న్యాయంగా వ్యవహరించాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ సూచించారు. తమ విధులను నిర్వహించడంలో పార్టీలకతీతంగా భావించేలా చూడాలన్నారు. ఇక 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో నవంబరు 20న ఓటింగ్ జరగనుంది. 23న ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment