petition filed
-
పారదర్శక విచారణ జరగాలి
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో 2017లో దళితులపై దాడి జరిగిన ఘటనపై విచారణ పారదర్శకంగా సాగాలని బాధితుల్లో ఒకరైన కోలా హరీశ్ పేర్కొన్నారు. ఈ మేరకు హైకోర్టులో విచారణ సాగుతున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో తనను ఇంప్లీడ్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నాటి కేసులో వాస్తవాలు తెలియాలంటే తన వాదనలు కూడా వినాలని కోరారు. అలాగే, న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. సిరిసిల్ల జిల్లా చీర్లవంచ, కొదురుపాక ప్రాంతాల నుంచి వందలాది ఇసుక లారీలు టిప్పర్లు నడిచేవి. ఈ క్రమంలోనే 2017, జూలై 2న నేరెళ్లకు చెందిన ఎరుకల భూమయ్యను ఇసుక లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు ఐదు ఇసుక లారీలను తగలబెట్టారు. దీంతో పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ జరగ్గా.. 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల తర్వాత రాత్రి 11:30 గంటలకు నేరెళ్లకు చెందిన పెంట బానయ్య, కోలా హరీశ్, చెప్పాల బాలరాజు, పసుల ఈశ్వర్ కుమార్, గంధం గోపాల్, రామచంద్రాపూర్‌కు చెందిన భక్తుల మహేశ్, జిల్లెలకు చెందిన కోరుకొండ గణేశ్, చీకోటి శ్రీనివాస్‌లను పోలీసులు అనుమానితులుగా అదుపులోకి తీసుకొని, జూలై 7న అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. ఎస్ఐ తప్పు లేదని విచారణలో తేలింది ఈ ఘటనలో బాధితులను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని, బాధ్యులైన ఎస్పీ విశ్వనాథ్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవీందర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉప్పల్‌కు చెందిన గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన పిల్‌తో పాటు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ రాసిన లేఖతో మరో పిల్ దాఖలైంది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రాధారాణి ధర్మాసనం బుధవారం వి చారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది డి.సురేశ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ మంగళవారం అందిందన్నారు. దీనిపై వివరాలు తెలుసుకుని, బదులివ్వడానికి 15 రోజుల సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 27కు వాయిదా వేసింది. అయితే, సదరు ఎస్ఐ ఎలాంటి తప్పు చేయలేదని విచారణాధికారి నివేదిక ఇచ్చారని, దీంతో సస్పెన్షన్‌ను ఉపసంహరించుకున్నామని అఫిడవిట్లో ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. -
పారని బాబు, నారాయణ పాచిక
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణంలో భాగమైన అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంపై సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితులైన మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఆయనకు అత్యంత ఆప్తుడు, మాజీ మంత్రి నారాయణ ఏదో జరిగిపోతోందంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వారి వినతి మేరకు హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత వారి పిటిషన్లపై విచారణ సాగకుండా వారే శక్తియుక్తులన్నీ ప్రయోగిస్తూ వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు. స్టే పొడిగింపు ఉత్తర్వులూ పొందుతున్నారు. హైకోర్టులో ఇదో పెద్ద ప్రహసనంగా మారింది. తాజాగా గురువారం ఇదే రీతిలో విచారణను సుదీర్ఘ కాలానికి వాయిదా వేయించేందుకు వారి న్యాయవాదులు ప్రయత్నించి విఫలమయ్యారు. కోర్టులో వారి ఎత్తులను రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో అడ్డుకున్నారు. న్యాయస్థానానికి సైతం వారి ఎత్తుగడలు అర్థమయ్యాయి. దీంతో వచ్చే గురువారానికి మాత్రమే విచారణను వాయిదా వేయించుకోగలిగారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. స్టే పొంది వాయిదాల మీద వాయిదాలు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ 2021లో ఈ కేసు నమోదు చేసింది. ఈ కేసు కొట్టేయాలంటూ బాబు, నారాయణ అదే ఏడాది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. ఈ కేసులో దర్యాప్తుతో సహా తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ 2021 మార్చి 19న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి విచారణ వాయిదా పడుతోంది. ఆ తరువాత ఈ వ్యాజ్యాలు ఓ న్యాయమూర్తి వద్ద విచారణకు రాగా, తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు స్టే కొనసాగుతుందంటూ ఉత్తర్వులు పొందారు. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి. చంద్రబాబు, నారాయణ తరఫు సీనియర్ న్యాయవాదుల అభ్యర్థన మేరకు విచారణ గురువారానికి వాయిదా పడింది. గురువారం మరోసారి సుదీర్ఘ వాయిదాకు వారి వ్యూహాన్ని అమల్లో పెట్టారు. బాబు తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే, ఈ కేసులో ఫిర్యాదుదారు, ప్రతివాది ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టు నోటీసు అందలేదని, అందువల్ల విచారణ జరపడం సరికాదని అన్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రికార్డులను పరిశీలించిన కోర్టు అధికారి.. నోటీసు ఇచ్చినట్లు ఎలాంటి డాక్యుమెంట్ లేదన్నారు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకొని మరోసారి రికార్డులు చూడాలని కోరారు. మరోసారి రికార్డులను పరిశీలించగా, రామకృష్ణారెడ్డికి 2021లోనే నోటీసులు పంపినట్లు ఉన్న ఉత్తర్వుల కాపీ దొరికింది. దీంతో ఖంగుతిన్న చంద్రబాబు, నారాయణ న్యాయవాదులు విచారణ వాయిదా వేయాలని కోరారు. దీనికి సుధాకర్‌రెడ్డి అడ్డుతగిలారు. నోటీసులు అందలేదన్న సాకుతో వాయిదా వేయించాలని చూశారన్నారు. వాదనలు వినిపించేందుకు సిద్ధమని చెప్పిన దమ్మాలపాటి శ్రీనివాస్ ఎందుకు వాయిదా కోరుతున్నారని, ఇది టూ మచ్ అంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు. ఇప్పటికే విచారణను ఎన్నోసార్లు వాయిదా వేయించారని చెప్పారు. వాళ్లే చాలాసార్లు వాయిదా తీసుకున్నారని దమ్మాలపాటి అనగా, ఎవరు ఎన్నిసార్లు వాయిదాలు తీసుకున్నారో తేల్చేందుకు తాను ఇక్కడ లేనని న్యాయమూర్తి కరాఖండిగా చెప్పారు. సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. బుధవారం మరో కేసు ఉన్నందున విచారణను గురువారానికి కోరతామని దమ్మాలపాటి చెప్పడంతో తాను అంగీకరించినట్లు తెలిపారు. గురువారం కూడా వాయిదా కోరడంలో అర్థం లేదన్నారు. తమ ఎత్తుగడ ఫలించదని బాబు, నారాయణ న్యాయవాదులకు అర్థమవడంతో తాము సుదీర్ఘ వాయిదా కోరడం లేదని దమ్మాలపాటి చెప్పారు. వచ్చే గురువారానికి వాయిదా వేయాలని కోరారు. న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ బుధవారానికి మొగ్గు చూపగా, దమ్మాలపాటి పదే పదే అభ్యర్థించడంతో విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
ఎన్సీఎల్ఏటీకి గో ఫస్ట్ లీజుదార్లు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ గో ఫస్ట్ స్వచ్ఛంద దివాలా ప్రక్రియను వ్యతిరేకిస్తూ విమానాల లీజుదార్లు ఒక్కొక్కరుగా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంలో ఎన్సీఎల్టీ ఆదేశాలను సవాలు చేస్తూ జీవై ఏవియేషన్, ఎస్‌ఎఫ్‌వీ ఎయిర్‌క్రాఫ్ట్ హోల్డింగ్ సంస్థలు.. నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో పిటీషన్ దాఖలు చేశాయి. ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్ ఇప్పటికే పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్‌కు చెందిన జీవై ఏవియేషన్.. గో ఫస్ట్‌కు 9 విమానాలు, ఎస్‌ఎఫ్‌వీ ఎయిర్‌క్రాఫ్ట్ హోల్డింగ్స్ ఒకటి, ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్ 5 విమానాలను లీజుకిచ్చాయి. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న గో ఫస్ట్ దాఖలు చేసిన స్వచ్ఛంద దివాలా పిటీషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ టీ) విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. -
మే 7న జరగాల్సిన WFI ఎన్నికలు వాయిదా
-
గత ప్రభుత్వం పేదలను గాలికొదిలేసింది
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలోని మొత్తం విస్తీర్ణంలో ఐదు శాతం భూమిని పేదల నివాసాల నిమిత్తం కేటాయించాలని సీఆర్డీఏ చట్టం స్పష్టంగా చెబుతోందని, అయితే గత ప్రభుత్వం మాత్రం పేదలను గాలికొదిలేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. పేదల కోసం రాజధాని ప్రాంతంలో సెంటు భూమి కూడా కేటాయించలేదని, ఆ తప్పును తాము ఇప్పుడు సరిచేసి, చట్టానికి అనుగుణంగా 5 శాతం భూమిని పేదల నివాసకల్పన కోసం కేటాయించామని చెప్పారు. చట్ట ప్రకారం వ్యవహరించడం కూడా తప్పు అంటూ పిటిషన్ దాఖలు చేశారని ఆయన వివరించారు. పేదలులేని ప్రపంచస్థాయి రాజదాని కావాలని రాజధాని రైతులు కోరుకుంటున్నారని, తాము మాత్రం పేదలు సైతం రాజధానిలో ఇళ్లు కట్టుకుని ఉండాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే పేదల కోసం ఆర్ 5 జోన్‌ను ఏర్పాటుచేసి, వందల ఎకరాల భూమిని కేటాయించామన్నారు. రాజధాని రైతుల వాదనను పరిగణనలోకి తీసుకోవద్దని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అంటరానితనం ఆలోచనలు ఉండటం దురదృష్టకరమని సుధాకర్‌రెడ్డి తెలిపారు. సీఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్–57 ప్రకారం పూలింగ్ ద్వారా సమీకరించిన భూమిపై సర్వహక్కులు సీఆర్డీఏకే ఉంటాయన్నారు. ఆ భూమి సీఆర్డీఏ ఆస్తి అవుతుందే తప్ప, రైతులది కాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఇప్పటికే ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పడంతో ఈ వ్యాజ్యాన్ని సైతం త్రిసభ్య ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వుల నిమిత్తం ఈ వ్యాజ్యాన్ని ఆయన ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇళ్లు కావాలని ఎవరూ అడగలేదు.. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ఆర్ 5 జోన్‌ను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా, కృష్ణాయపాళెం గ్రామానికి చెందిన రైతు అవల నందకిషోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ వాదనలు వినిపిస్తూ, రాజధాని ప్రాంతంలో తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజలెవ్వరూ కోరలేదన్నారు. గ్రామసభల్లో రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పేదల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకారం చేయాల్సిన పనిని గత ప్రభుత్వం విస్మరించిందని, ఆ తప్పును సరిదిద్ది మాస్టర్ ప్లాన్‌కు ఓ విలువను తీసుకొచ్చామని, దాన్ని కూడా పిటిషనర్ తప్పుపడుతున్నారని తెలిపారు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో 900 ఎకరాలను పేదల కోసం కేటాయించామని చెప్పారు. ప్రజలు తమకు ఫలానాది కావాలని అడిగేంత వరకు ప్రభుత్వాలు ఎదురుచూడవని.. వారి అవసరాలను గుర్తించడమే ప్రభుత్వ విధి అన్నారు. ఇదే అంశంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది.. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని, తరువాత పూర్తిస్తాయిలో విచారణ జరుపుతామన్నారు. ఈ సమయంలో ఇంద్రనీల్.. ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. తమకు ఏ ధర్మాసనమైనా ఒక్కటేనని, తాము చట్ట ప్రకారమే ఆర్ 5 జోన్‌ను ఏర్పాటుచేశామని సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని త్రిసభ్య ధర్మాసనానికి నివేదించారు. దీనిపై తగిన ఉత్తర్వులు జారీచేసేందుకు ఈ వ్యాజ్యాన్ని సీజే ముందుంచాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. -
నీట్ కనీస వయో పరిమితిపై జోక్యం చేసుకోలేం
సాక్షి, అమరావతి : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు హాజరయ్యేందుకు కనీస వయో పరిమితి 17 సంవత్సరాలుగా నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమంది. కనీస వయస్సును 17 సంత్సరాలుగా నిర్ణయించడం సమానత్వపు హక్కును హరించినట్లు కాదని స్పష్టంచేసింది. ఇదే అంశంపై జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ ఉమ్మడి హైకోర్టు గతంలోనే తీర్పునిచ్చిందని, ఓసారి తేలిన అంశంలో మరోసారి జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది.నీట్‌కు కనీస వయోపరిమితి నిబంధనను కొట్టేయాలంటూ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఓ మైనర్ విద్యార్థిని తండ్రి నాగ మునుస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అనూప్ కౌషిక్ వాదనలు వినిపిస్తూ, ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వ, వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందని అన్నారు. పిటిషనర్ కుమార్తెకు నీట్ అర్హత వయస్సుకు నాలుగు రోజులు తక్కువ ఉందన్నారు. పరీక్షకు అనుమతించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్, జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తరపున న్యాయవాది ఎస్.వివేక్ చంద్రశేఖర్‌లు వాదనలు వినిపిస్తూ.. ఇదే అంశంపై గతంలో దాఖలైన వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు కొట్టేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వీరి వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం ఇదే అంశంపై తీర్పునిచ్చినప్పుడు దానికి విరుద్ధంగా స్పందించలేమంది. పరీక్ష రాసేందుకు నాలుగు రోజులు తక్కువైనా, ఒక్క రోజు తగ్గినా కూడా తాము ఏమీ చేయలేమని స్పష్టం చేసింది. -
‘లిక్కర్’ కేసులో తీవ్ర చర్యలొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో తనపై తీవ్ర చర్యలు తీసుకోవద్దని ఈడీని ఆదేశించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ విచారణ పారదర్శకతపై అనుమానాలు వస్తున్నాయని.. నిందితులు/సాక్షులపై థర్డ్ డిగ్రీ చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. అధికారులు చట్ట విరుద్ధంగా తన ఫోన్‌ను సీజ్ చేశారని కోర్టుకు తెలిపారు. కేంద్రంలోని అధికార పార్టీ కుట్రతో కావాలనే ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. అందువల్ల ఈ నెల 11 నాటి విచారణకు సంబంధించిన తదుపరి చర్యలపై, 16న జరగాల్సిన విచారణపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది వందన సెహగల్ బుధవారం కవిత తరఫున అభ్యర్థనలను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనానికి విన్నవించారు. ఈ తరహా కేసుల్లో గతంలో కోర్టులు ఇచ్చి న తీర్పులను పిటిషన్లో ప్రస్తావించారు. కవిత పిటిషన్‌లోని అంశాలివీ.. ‘‘పిటిషనర్ తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు కుమార్తె, ఉన్నత విద్యావంతురాలు, మహిళా ఎమ్మెల్సీ. గతంలో లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నప్పుడు పార్లమెంటులో పలు కమిటీల్లో పనిచేశారు. ఎన్నో సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ ఈడీ ఉద్దేశ పూర్వకంగా ఇండోస్పిరిట్స్ తదితరుల కేసులో ఆమెను విచారిస్తోంది. 2022 ఆగస్టు 17న సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పిటిషనర్ పేరు లేదు. కొందరు వ్యక్తుల నిర్దిష్ట వాంగ్మూలం ఆధారంగా మాత్రమే ఈ కేసులో ఇంప్లీడ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో పిటిషనర్ పేరును కావాలనే ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు ఈడీ దాఖలు చేసిన రిమాండ్ అప్లికేషన్లో పిటిషనర్ వ్యక్తిగత వివరాలు పొందుపరిచింది. అలా చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పిటిషనర్‌పై కేంద్రంలోని అధికారపార్టీ కుట్రలో భాగంగా ఈడీ పనిచేస్తోంది. న్యాయస్థానం జోక్యంతోనే పిటిషనర్‌పై రాజకీయ కుట్ర ఆగుతుంది. విచారణకు సహకరించినా కూడా.. సీబీఐ 2022 డిసెంబర్ 2న పిటిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. అదే నెల 11న పిటిషనర్ నివాసంలో సుమారు ఏడు గంటలపాటు విచారించింది. అయితే ఈ ఏడాది మార్చి 10న జంతర్‌మంతర్ వద్ద నిరసన దీక్ష చేస్తామని పిటిషనర్ మార్చి 2న ప్రకటించారు. కానీ దీక్షకు ఒకరోజు ముందు (9న) విచారణకు హాజరుకావాలంటూ 7న ఈడీ నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ విజ్ఞప్తి చేయడంతో 11న విచారణ చేపట్టి.. మళ్లీ 16న హాజరుకావాలని నోటీసులు ఇచ్చి ంది. ఇంటి వద్ద విచారించాలని కోరినా అనుమతించలేదు. చట్ట విరుద్ధంగా ఫోన్ సీజ్.. ఈ నెల 7న ఈడీ మనీలాండరింగ్ చట్టం సెక్షన్ 50(2), 50(3) ప్రకారం సమన్లు ఇచ్చింది. అంటే వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలి. కానీ ఫోన్ ఇవ్వాలని అందులో పేర్కొనలేదు. విచారణకు హాజరయ్యాక ఫోన్ ఇవ్వాలని అధికారులు కోరగా.. పిటిషనర్ ఫోన్ తెప్పించి అందజేశారు. కానీ ఈడీ అధికారులు చట్టవిరుద్ధంగా ఫోన్‌ను సీజ్ చేశారు. ఎందుకు అలా చేస్తున్నారని అడిగినా వివరణ ఇవ్వలేదు. పైగా ఫోన్‌ను పిటిషనరే స్వయంగా అందజేశారని ఈడీ పేర్కొంది. ఇక పిటిషనర్‌ను నివాసంలో విచారించాలని కోరినా ఈడీ తిరస్కరించిన నేపథ్యంలో అరెస్టు చేస్తారన్న భావన వ్యక్తమైంది. అలా జరగలేదు. కానీ రాత్రి సుమారు 8.30 గంటలకు వరకూ విచారణ కొనసాగింది. ఆ స్టేట్మెంట్లలో విశ్వసనీయత కనిపించట్లేదు పిటిషనర్‌పై ఎలాంటి కేసు లేదు. కొందరు ఇచ్చి న స్టేట్మెంట్ల ఆధారంగా ఈడీ విచారిస్తోంది. కానీ తన స్టేట్మెంట్ను ఉపసంహరించుకుంటున్నానని అరుణ్ పిళ్లై కోర్టులో పిటిషన్ వేయడాన్ని చూస్తే.. ఆ స్టేట్మెంట్లు బలవంతంగా సేకరించినట్లు స్పష్టమవుతోంది. ఈడీ చెప్తున్న స్టేట్మెంట్లపై విశ్వసనీయత కనిపించడం లేదు. ఈడీ ఆఫీసులో విచారణ పిటిషనర్‌కు హానికరం! ఈడీ విచారణలో భాగంగా థర్డ్ డిగ్రీ వంటి తీవ్ర చర్యలకు పాల్పడుతోందని శరత్‌చంద్రారెడ్డి విచారణ సమయంలో గాయపడిన చందన్‌రెడ్డిని చూస్తే అర్థమవుతుంది. పిటిషనర్, ఇతర నిందితులకు ఎదురైన పరిణామాలు చూస్తుంటే శారీరకంగా, మానసికంగా ఈడీ బాధించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఈడీ కార్యాలయంలో విచారించడం పిటిషనర్‌కు హానికరమే. పిటిషనర్ తన నివాసంలో విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. పూర్తి పారదర్శకత కోసం పిటిషనర్‌ను న్యాయవాది సమక్షంలో విచారించాలి’’అని పిటిషన్లో పేర్కొన్నారు. అత్యవసర విచారణకు నో.. ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని కవిత తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు బుధవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కానీ అత్యవసర విచారణకు నిరాకరించిన సీజేఐ.. ఈ నెల 24న జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు. -
1,730 కోట్లు చెల్లించేలా ఆదేశించండి
సాక్షి, హైదరాబాద్: రూ.1,730 కోట్ల విద్యుత్ బకాయిలకు సంబంధించి టీఎస్ ట్రాన్స్‌కో వేసిన కేసులో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, ఏపీ ప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఉద్యోగుల పీఎఫ్, గ్రాట్యుటీ.. తదితరాలపై ఏపీ సర్కార్ తమకు రూ..1,730 కోట్లు బకాయి ఉందని, వాటిని చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ టీఎస్ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ సి. శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగుల ట్రస్టు(పీఅండ్‌జీ, పీఎఫ్, ఈఎల్, గ్రాట్యుటీ) పెట్టుబడులకు సంబంధించి అసలు రూ.674 కోట్లు, వడ్డీ రూ.38 కోట్లు.. ట్రాన్స్మిషన్ అండ్ ఎస్ఎల్డీసీ చార్జీలకు సంబంధించి అసలు రూ.105 కోట్లు, వడ్డీ రూ.85 కోట్లు.. టీఎస్ డిస్కం బాండ్స్‌కు సంబంధించి అసలు రూ.359 కోట్లు, వడ్డీ రూ.253 కోట్లు.. ఐసీడీస్, డెబిట్ సర్వీసింగ్ తదితరాలకు సంబంధించి.. అసలు రూ.128 కోట్లు, వడ్డీ రూ.87 కోట్లు.. మొత్తంగా అసలు రూ.1,267 కోట్టు, వడ్డీ రూ.463 కోట్లు కలిపి రూ.1,730 కోట్లు ఏపీ బాకీ ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. తొలుత టీఎస్ ట్రాన్స్‌కో అడ్వొకేట్ వై.రామారావు వాదిస్తూ, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం విద్యుత్ ఉద్యోగుల బకాయిలు ఏపీ ట్రాన్స్‌కో చెల్లించాలే ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. షీలా బిండే కమిటీ గైడ్‌లైన్స్ ప్రకారం ఆస్తులు, అప్పుల పంపిణీ జరగాలన్న రూల్స్ అమలు కాలేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు ప్రతివాదులకు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. గతంలో వేసిన ఇదే తరహా పిటిషన్‌తో పాటు దీన్ని కలిపి విచారణ చేస్తామని వెల్లడించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది. -
నవజ్యోత్ సింగ్ సిద్ధూ కు జైలు శిక్ష
-
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన చిన బావమరిది, అల్లుడు కూడా అయిన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిలతోపాటు మరో ముగ్గురిని నిందితులుగా పేర్కొంటూ వారిని విచారించాలని న్యాయస్థానంలో పిటీషన్ దాఖలైంది. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్‌రెడ్డి, బీటెక్ రవిలతోపాటు వివేకానందరెడ్డితో ఆర్థిక, రాజకీయ విభేదాలు ఉన్న కొమ్మా పరమేశ్వరరెడ్డి, వైజీ రాజేశ్వరరెడ్డి, నీరుగట్టు ప్రసాద్‌లను నిందితులుగా చేర్చి దర్యాప్తు చేయాలని ఆ పిటీషన్లో కోరారు. ఈ కేసులో అరెస్టైన దేవిరెడ్డి శివ శంకర్‌రెడ్డి భార్య తులసమ్మ ఈమేరకు వైఎస్సార్ జిల్లా పులివెందుల న్యాయస్థానంలో ఈ నెల 21న పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్ కాపీని దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి కుమారుడు యశ్వంత్ రెడ్డి గురువారం మీడియాకు విడుదల చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలు, ఆస్తుల పంపకం వ్యవహారాలతోపాటు ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఈ హత్యకు కారకులని ఆమె పేర్కొన్నారు. సీబీఐ ఉద్దేశ్యపూర్వకంగానే ఆ విషయాలను పట్టించుకోకుండా కేసును తప్పుదారి పట్టించేలా ఏకపక్షంగా దర్యాప్తు చేస్తోందని కూడా తులసమ్మ తన పిటీషన్లో ఆరోపించారు. తన వాదనను బలపరుచుకుంటూ ఆమె న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చిన పలు కీలక అంశాలు ఇలా ఉన్నాయి... వివేకా రెండో వివాహంతో కుటుంబంలో తీవ్ర విభేదాలు - వైఎస్ వివేకానందరెడ్డికి ఆయన కుటుంబ సభ్యులకు మధ్య కొన్నేళ్లుగా తీవ్ర విభేదాలు ఉన్నాయి. షేక్ షమీమ్ అనే మహిళను ఆయన 2010లో రెండో పెళ్లి చేసుకున్నారు. వారికి 2015లో ఓ కుమారుడు కూడా జన్మించారు. దాంతో వివేకానందరెడ్డి వైవాహిక జీవితంలోనూ కుటుంబంలోనూ విభేదాలు తలెత్తాయి. కొన్నేళ్లుగా ఆయన భార్య సౌభాగ్యమ్మ హైదరాబాద్‌లో తన కుమార్తె సునీత నివాసంలో ఉంటున్నారు. వివేకానందరెడ్డి ఒక్కరే పులివెందులలో నివసించేవారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన అన్నయ్య శివ ప్రకాశ్ రెడ్డి చాలాసార్లు షేక్ షమీమ్‌ను తీవ్రంగా బెదిరించారు. ఇక వివేకానందరెడ్డి తన రెండో భార్య షమీమ్, ఆమె కుమారుడినిక కొంత ఆస్తి రాసివ్వాలని భావించడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. బెంగళూరులో భూ సెటిల్మెంట్ ద్వారా వచ్చే రూ.2 కోట్లను తన రెండో భార్యకు ఇవ్వాలని ఆయన ప్రకటించడంతో కుంటుంబంలో విభేదాలు మరింతగా తీవ్రమయ్యాయి. అంతేకాదు షమీమ్ కుమారుడిని తన వారసుడిగా కూడా ప్రకటిస్తానని ఆయన చెప్పడం కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ప్రధానంగా వివేకానందరెడ్డికి రాజకీయ వారసులు కావాలని ఆశిస్తున్న నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్‌రెడ్డి ఆయనపై కక్ష పెంచుకున్నారు. వివేకా హత్య అనంతరం అనుమాస్పందంగా కుటుంబ సభ్యుల ప్రవర్తన - ఇక వివేకానందరెడ్డి హత్యకు గురైన తరువాత ఆయన కుటుంబ సభ్యుల ప్రవర్తన సందేహాస్పదంగా ఉంది. వివేకానందరెడ్డి చనిపోయిన విషయాన్ని ఆయన పీఏ కృష్ణారెడ్డి మొదట ఆయన కుటుంబ సభ్యులకే తెలిపారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన మృతదేహం, ఆ ప్రదేశాన్ని వివేకానందరెడ్డి అనుచరుడు ఇనయతుల్లా తన సెల్‌ఫోన్ ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డికి ఉదయం 6.27గంటలకు వాట్సాప్ చేశారు. ఆ ఫొటోలు, వీడియోలు చూసిన తరువాత కూడా నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డి ఉదయం 8గంటలకు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డికి ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. అదే విషయాన్ని ఆది నారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు కూడా. ఆ ఫొటోలు చూస్తే ఆయన హత్యకు గురైనట్టు ఎవరికైనా తెలుస్తుంది. కానీ గుండెపోటుతో చనిపోయినట్టు శివ ప్రకాశ్ రెడ్డి ఎందుకు చెప్పారు. ఇక వివేకానందరెడ్డి మృతదేహం వద్ద ఆయన రాసినట్టు చెబుతున్న లేఖ, ఆయన సెల్ఫోన్లను కృష్ణారెడ్డి స్వాధీనం చేసుకున్నారు. ఆ విషయాన్ని వైఎస్ వివేకా కుమార్తె, అల్లుడు సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి వెంటనే తెలిపారు. కానీ తాము వచ్చేవరకూ ఆ లేఖ, సెల్‌ఫోన్ పోలీసులకు అప్పగించవద్దని రాజశేఖరరెడ్డి ఆయనతో చెప్పారు. దాంతో పోలీసులకు ఆయన వాటిని ఇవ్వలేదు. హత్య జరిగిన రోజు మధ్యాహ్నం 1గంటకు వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులు పులివెందులకు చేరుకున్న తరువాత వాటిని రాజశేఖర రెడ్డికి అప్పగించారు. ఆ సెల్ఫోన్లో ఉన్న మెసేజులు, ఇతర వివరాలను డిలీట్ చేసిన తరువాతే సాయంత్రం ఆ సెల్‌ఫోన్, లేఖలను పోలీసులకు అప్పగించారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇక వివేకానంద రెడ్డి హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి ఆ గదిని తుడిచివేసి, మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి గదిలోకి తీసుకురావాలని ఎర్ర గంగిరెడ్డికి నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డే చెప్పారు. ఆ విషయన్ని ఎర్రగంగిరెడ్డి ఒప్పుకున్నారు కూడా. కాబట్టి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్ రెడ్డిలే కుట్ర పన్ని వైఎస్‌వివేకానందరెడ్డిని హత్య చేయించారు.ఈ కేసును సిట్ బృందాలు సమగ్రంగా దర్యాప్తు చేస్తుండగా వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ అడ్డుకున్నారు. కాల్ డేటాలు, సీసీ టీవీ ఫుటేజీలు, ఇతర శాస్త్రీయ ఆధారాలను సిట్ బృందాలు సేకరించి కేసును ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యాయి. కానీ అదే సందర్భంలో సిట్ దర్యాప్తును అడ్డుకుంటూ సౌభాగ్యమ్మ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె పిటీషన్ వేశారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? వివేకాతో పరమేశ్వరరెడ్డికి ఆర్థిక విభేదాలు - ఇక వివేకానందరెడ్డికి ఆయన అనుచరుడిగా ఉన్న కొమ్మా పరమేశ్వరరెడ్డికి మధ్య ఆర్థికపరమైన కారణాలతో విభేదాలు తలెత్తాయి. బెంగళూరులోని ఓ భూమి సెటిల్మెంట్ వ్యవహారంలో తనకు దక్కాల్సిన వాటాను ఇవ్వలేదని పరమేశ్వరరెడ్డి కక్ష పెంచుకున్నారు. దాంతో కొంతకాలంగా అతను వివేకానందరెడ్డితో తీవ్రంగా విభేదిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యకు ముందు ఎలిబీ సృష్టించుకునేందుకే పరమేశ్వరరెడ్డి 2019, మార్చి 13న అనారోగ్యం నెపంతో పులివెందులలోని నాయక్ ఆసుపత్రిలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ అతన్ని చేర్చుకునేందుకు అక్కడి వైద్యులు సమ్మతించ లేదు. దాంతో అతను పులివెందులలోని డా.గంగిరెడ్డి ఆసుపత్రిలో చేరేందుకు విఫలయత్నం చేశారు. దాంతో పరమేశ్వరరెడ్డి కడప వెళ్లి అక్కడ సన్‌రైజ్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 2019, మార్చి 13న చేరారు. కానీ పరమేశ్వరరెడ్డి వైద్యులు, ఇతర సిబ్బందికి తెలియకుండా 2019, మార్చి 14 సాయంత్రం ఆసుపత్రి నుంచి బయటకువచ్చి హరిత హోటల్లో సాయంత్రం 6.30గంటలకు ఓసారి 7.05గంటలకు మరోసారి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో బేటీ అయ్యారు. శ్రీనివాసరెడ్డి అనే అతను కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఆ తరువాత కొద్ది రోజులకే శ్రీనివాసరెడ్డి అనుమానస్పదంగా మృతిచెందడం గమనార్హం. బీటెక్ రవి రాజకీయ ఆధిపత్యానికి వివేకానే అడ్డు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి వివేకానందరెడ్డితో రాజకీయంగా విభేదాలు ఉన్నాయి. వివేకానందరెడ్డి ఉన్నంతకాలం తాను పులివెందుల నియోజకవర్గం, కడప జిల్లాలో రాజకీయంగా ఆధిపత్యం సాధించలేమని ఆయనకు తెలుసు. అందుకే వివేకానందరెడ్డిని అడ్డుతొలగించుకునేందుకు ఆయన హత్యకు సహకరించారు. తన ప్రత్యర్థిని వివేకా ప్రోత్సహిస్తున్నారని కక్షగట్టిన వైజీ రాజేశ్వరరెడ్డి ఇక కడప జిల్లాకే చెందిన వైజీ రాజేశ్వరరెడ్డి వ్యాపారరిత్యా అనంతపురం జిల్లా తాడిపత్రిలో స్థిరపడ్డారు. అతను వైఎస్సార్సీపీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నారు. కాగా అతని రాజకీయ ప్రత్యర్థి నారాయణరెడ్డిని వైఎస్సార్సీపీలోకి తీసుకురావాలని వైఎస్ వివేకానందరెడ్డి భావించారు. దాంతో అతను వివేకానందరెడ్డిపై కక్ష పెంచుకున్నారు. వైఎస్ వివేకానందరెడ్డిపై అప్పటికే కక్ష పెంచుకున్న నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్ రెడ్డి వైజీ రాజేశ్వరరెడ్డితో హైదరాబాద్‌లో కలిసి ఈ కుట్ర పన్నారు. అప్పటికే ఆర్థిక వ్యవహారాల్లో వివేకానందరెడ్డితో తీవ్రంగా విభేదిస్తున్న కొమ్మా పరమేశ్వరరెడ్డిని వీరు తమ కుట్రతో భాగస్వామిని చేసుకున్నారు. మరోవైపు కొమ్మా పరమేశ్వరరెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో టచ్‌తో ఉన్నారు. ఈ విధంగా వీరు అయిదుగురు వైఎస్‌వివేకానందరెడ్డి హత్యకు కుట్ర పన్నారు. ఆ కుట్ర అమలులో పులివెందులకు చెందిన నీరుగుట్టు ప్రసాద్ కూడా సహకరించారు. ఆ రోజు రాత్రి ఇంటి తలుపుతీసి ఉంచిన నీరుగట్టు ప్రసాద్ హత్య జరిగిన రోజు అంటే 2019, మార్చి 14 రాత్రి వివేకానందరెడ్డి పులివెందులలోని తన ఇంటికి వస్తూ మార్గమధ్యంలో ఎర్రగంగిరెడ్డిని ఆయన ఇంటి వద్ద విడిచిపెట్టారు. వివేకానందరెడ్డి తన నివాసానికి చేరుకున్న తరువాత నీరుగుట్టు ప్రసాద్ ఆ ఇంటికి ఉత్తరవైపు తలుపుకు లోపల నుంచి గడియపెట్టి వెళ్లిపోతున్నట్టుగా చెబుతారు. కానీ వాస్తవానికి అతను ఉద్దేశ్యపూర్వకంగా తలుపు గడియపెట్టకుండానే వెళ్లిపోయారు. దాంతోనే హంతకులు ఆ రోజు వివేకానందరెడ్డి ఇంటిలోకి ప్రవేశించగలిగారు. - వివేకానందరెడ్డి హత్య జరిగిన 2019, మార్చి 14 అర్ధరాత్రి 12.42 నిముషాలకు కొమ్మా పరమేశ్వరరెడ్డి నీరుగుట్టు ప్రసాద్‌తో ఫోన్లో మాట్లాడారు. మళ్లీ అర్ధరాత్రి దాటిన తరువాత 2.37గంటలకు ఎర్ర గంగిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఆ విధంగా వరుసగా ఫోన్లు చేస్తూ తమ కుట్ర సక్రమంగా అమలవుతోందా లేదా అని పర్యవేక్షించారు. తెల్లవారుజామున 4.43గంటలకు నీరుగుట్టు ప్రసాద్ మరో నిందితుడు వైజీ రాజేశ్వరరెడ్డికి ఫోన్ చేశారు. తెల్లవారు జాము 5.22గంటలకు వైజీ రాజేశ్వరరెడ్డి అనంతపురం నుంచి పులివెందుల బయలుదేరారు. ఆ తరువాత అతను వివేకానందరెడ్డి ఇంటి చుట్టుపక్కలే తిరిగారు. ఆ తరువాత అతను నీరుగట్టు ప్రసాద్‌కు ఎస్ఎంఎస్ చేయడంతోపాటు ఉదయం 7.21గంటలకు ఫోన్ చేశారు. ఆ విధంగా వారిద్దరూ ఆ రాత్రి నుంచి తెల్లవారే వరకూ ఒకరితో ఒకరు మాట్లాడుతునే ఉన్నారు. ఆ తరువాత కూడా ఈ కేసులో సీబీఐ రెండో నిందితుడిగా చేర్చిన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, వైజీ రాజేశ్వరరెడ్డి పరస్పరం ఎస్ఎంఎస్ల ద్వారా చాటింగ్ చేసుకున్నారు. - వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు చేసిన సిట్ బృందాలు కీలక శాస్త్రీయ ఆధారాలు సేకరించాయి. సీసీ టీవీ ఫుటేజీలు, కాల్‌డేటా, ఇతర శాస్త్రీయ ఆధారాలన్నీ కూడా ఈ హత్య కేసుతో ఆ ఆరుగురి పాత్ర ఉందనే చెబుతున్నాయి. అందుకే ఈ హత్యలో తమ పాత్ర బయటపడుతుందనే ఆందోళనలతోనే నిందితులు ఆ కేసు దర్యాప్తును అడ్డుకున్నారు. కాబట్టి ఈ హత్య కేసుకు సంబంధించి సిట్ బృందాలు నమోదు చేసిన కేస్ డైరీలు రెండింటిని న్యాయస్థానం తెప్పించుకోవాలి. - సీబీఐ ఉద్దేశపూర్వకంగానే ఈ కేసు దర్యాప్తును తప్పుదారి పట్టిస్తోంది. హత్యలో స్వయంగా పాల్గొన్న దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం, అతని ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించకపోవడం సీబీఐ దురుద్దేశాలను వెల్లడిస్తున్నాయి. ఈ హత్య కేసులో అసలు నిందితులైన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్‌రెడ్డి, కొమ్మా పరమేశ్వరరెడ్డి, బీటెక్ రవి, వైజీ రాజేశ్వరరెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌లను విచారించకుండా... అమాయకులను ఈ కేసులో ఇరికించేందుకు యత్నిస్తోంది. -
మా నాన్నను విడిపించండి
న్యూఢిల్లీ: భారతదేశంలో జన్మించిన తమ తండ్రిని అన్యాయంగా పాకిస్తాన్ జాతీయుడిగా నిర్ధారించి జైలుశిక్ష విధించారని, శిక్షాకాలం ముగిసినా నిర్బంధించారని, ఆయనను విడిపించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన అక్కాతమ్ముడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొహమ్మద్ ఖమర్(62)ను యూపీలోని మీరట్‌లో 2011 ఆగస్టు 8న పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ జాతీయుడైన ఖమర్ అక్కడి పాస్పోర్టుతో భారత్‌కు వచ్చాడని, వీసా గడువు ముగిసినా ఇంకా దేశంలో ఉంటున్నాడని కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయస్థానం అతడికి మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించింది. 2015 ఫిబ్రవరి 6న జైలుశిక్ష ముగిసింది. అతడిని తీసుకెళ్లేందుకు పాకిస్తాన్ నిరాకరించడంతో అధికారులు 2015లో∙లాంపూర్‌లోని నిర్బంధ కేంద్రానికి తరలించారు. దీంతో ఖమర్ ఏడేళ్లుగా నిర్బంధంలోనే కొనసాగుతున్నాడు. భారతీయురాలిని వివాహమాడిన ఖమర్‌కు భారత్‌లోనే ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. తమ తండ్రి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, తక్షణమే విముక్తి కలిగించాలని ఖమర్ కుమార్తె, కుమారుడు తాజాగా సుప్రీంను ఆశ్రయించారు. -
‘జెఫ్ బెజోస్ మారువేశంలో ఉన్న సూపర్ విలన్’
వాషింగ్టన్: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన తొలి అంతరిక్షయాత్ర కోసం సిద్ధమైన విషయం తెలిసిందే. బ్లూ ఆరిజిన్ కంపెనీ తన తొలి మానవసహిత అంతరిక్షయాత్రను జూలై 20న ప్రయోగించనుంది. ఈ ప్రయోగంలో జెఫ్ బెజోస్ తన సోదరుడితో న్యూషెపార్డ్ అంతరిక్షనౌకతో కలిసి ప్రయాణించనున్నాడు. వీరితో పాటుగా సుమారు రూ. 280 కోట్ల మేర బిడ్ చేసిన వ్యక్తి ఈ యాత్రలో పాలుపంచుకోనున్నాడు. జెఫ్ బెజోస్ తన తొలి అంతరిక్షయాత్ర కోసం సన్నాద్దమౌతుంటే కొంతమంది నెటిజన్లు అతనిపై విరుచుకుపడుతున్నారు. బెజోస్‌ను తిరిగి భూమిపైకి రానివ్వదంటూ ఆన్లైన్లో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన జెఫ్ బెజోస్ మారువేశంలో ఉన్న సూపర్ విలన్ అని, అతడు ప్రపంచాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదే సరైనా అవకాశం జెఫ్ బెజోస్‌ను తిరిగి భూమిపైకి రానివ్వకుండా ఉంటే మానవాళి పెనుముప్పునుంచి తప్పించుకోవచ్చునని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్‌కు సుమారు వారం వ్యవధిలో 6781 మంది మద్దతు తెలిపారు. చదవండి: జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం..! ఏకంగా తన సోదరుడితో కలిసి.. -
హైకోర్టును ఆశ్రయించిన జమున హ్యాచరీస్
-
Etela:హైకోర్టును ఆశ్రయించిన ఈటల కుటుంబం
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా అసైన్డ్ భూముల వివాదం వ్యవహారంలో జమున హ్యాచరీస్ హైకోర్టును ఆశ్రయించింది. కలెక్టర్ నివేదిక తప్పులతడకగా ఉందంటూ పిటిషన్ దాఖలు చేసింది. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా విచారణ చేశారని పిటిషన్లో పేర్కొంది. అధికారులపై చర్యలు తీసుకోవాలని జమున హ్యాచరీస్ పిటిషన్లో కోరింది. అచ్చంపేటలో తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి సర్వే చేశారని పిటిషన్లో పేర్కొంది. కాగా, జమున హ్యాచరీస్ భూ వివాదాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఒకదాని వెంట మరొకటిగా వేగంగా జరుగుతున్న పరిణామాలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. ఇక మెదక్ జిల్లా అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇప్పటికే మంత్రివర్గం నుంచి ఈటలను తొలగించగా, తాజాగా దేవరయాంజాల్ భూముల వ్యవహారంపైనా నలుగురు ఐఏఎస్‌లతో కూడిన కమిటీ విచారణ, విజిలెన్స్ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో మెదక్ జిల్లా అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందింది. ఏసీబీ, ఇంటిలిజెన్స్ ఇతర విభాగాలు రంగంలోకి దిగి ముమ్మర విచారణ కొనసాగిస్తున్నాయి. మరోవైపు సోమవారం కమిటీ ఏర్పాటు చేయగానే పంచాయతీరాజ్ అధికారులు కూడా రంగంలో దిగి పౌల్ట్రీ నిర్మాణ అనుమతులు, పన్నుల చెల్లింపు కోణాల్లో విచారణ మొదలు పెట్టారు. ఏ ప్రభుత్వ శాఖల పరిధిలో నిబంధనలు ఉల్లంఘించారో నివేదికలు తయారు చేస్తున్నారు. చదవండి: ఈటల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! చావునైనా భరిస్తా.. ఆత్మ గౌరవం కోల్పోను -
ఎల్ఎల్బీ ఎందుకు చదవకూడదు?
న్యూఢిల్లీ : మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సు చదివేందుకు చేసుకున్న దరఖాస్తును కళాశాల అధికారులు తిరస్కరించారంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్‌కు మారి త్యాగి(77) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) పెట్టిన 30 ఏళ్ల వయో పరిమితి నిబంధన తనకు గల రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఐదేళ్ల ఎల్ఎల్బీకి గరిష్ట వయోపరిమితి 20, మూడేళ్ల ఎల్ఎల్బీకి 30 ఏళ్ల వయోపరిమితి విధిస్తూ బీసీఐ ఇటీవల నిబంధనలు అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. భర్త మరణంతో తమకున్న ఎస్టేట్‌ను కాపాడుకోవడానికి లా చదవాలని అనుకుంటున్నట్లు సాహిబా బాద్‌కు చెందిన రాజ్‌కుమారి త్యాగి పేర్కొన్నారు. బీసీఐ నిబంధనలతో రాజ్యాంగంలోని సమానత్వపు హక్కు, ఏ వృత్తినైనా చేపట్టే హక్కు, జీవించే హక్కులకు భంగం కలుగుతున్నాయని ఆ పిటిషన్లో తెలిపారు. -
డిగ్రీ,పీజీ పరీక్షలపై హైకోర్టు విచారణ
-
డిగ్రీ,పీజీ పరీక్షలపై హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు చేయాలంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున ఏజీ తన వాదనలు వినిపించారు. పరీక్షలు రద్దు చేయడం కుదరదని, యూజీసీ మార్గదర్శకాల ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. పరీక్షల తేదీలను రెండు,మూడు వారాల తర్వాత ఖరారు చేస్తామని తెలిపారు. పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్నల్ మార్కుల ద్వారా గ్రేడింగ్ ఇవ్వాలని పిటిషనర్ తరపున న్యాయవాది దామోదర్‌రెడ్డి వాదనలు వినిపించారు. యూజీసీ మార్గదర్శకాలు కేవలం సూచనలు మాత్రమేనని, 8 రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా.. నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. మామిడి గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలిపై రేపు జరగాల్సిన బహిరంగ విచారణ వాయిదా వేయాలని ధర్మాసనం తెలిపింది. కరోనా పరిస్థితుల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశించింది. -
చేపమందుపై హైకోర్టులో పిటిషన్.. నేడు విచారణ
సాక్షి, హైదరాబాద్: చేపమందు పంపిణిని ఆపాలని తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజనావ్యాజ్యం దాఖలైంది. జూన్ 8న మృగశిర కార్తె ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం చేయనున్న విషయం తెలిసిందే. అయితే దానిని ఆపాలని కోరుతూ బాలల హక్కుల సంఘం లంచ్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. చేప మందుకు ఎలాంటి సైంటిఫిక్ అథారిటి లేదని.. దానిని పంపిణీ చేయడం చట్ట విరుద్దమంటూ పిటిషన్లో పేర్కొన్నారు. చేప మందు కోసం అనవసరంగా ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని పటిషనర్ అభిప్రాయపడ్డారు. అయితే ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం ఈరోజు మధ్యాహ్నాం విచారిస్తామని తెలిపింది. జూన్8, 9వ తేదీల్లో అస్తమా బాధితులకు చేప మందు పంపిణీ చేస్తామని బత్తిని మృగశిర ట్రస్ట్ కార్యదర్శి బత్తిని హరినాథ్‌గౌడ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ సహకారంతో చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. తొలుత నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప మందును పంపిణీ చేస్తామని, అక్కడ పూర్తయిన తర్వాత దూద్‌బౌలి, కవాడిగూడ, వనస్థలిపురం, కూకట్‌పల్లిలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసి అందిస్తామని తెలిపారు. -
విద్యార్థుల ఆత్మహత్యలపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించడంతోపాటు, ఆత్మహత్యలకు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలకు ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులందరి జవాబుపత్రాలను పునర్ మూల్యాంకనం చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. మూల్యాంకనం కాంట్రాక్ట్ పొందిన గ్లోబరీనా సంస్థ పూర్తి నిర్లక్ష్యంతో, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిందని, అంతిమంగా విద్యార్థులు నష్టపోయారన్నారు. పలువురు విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చాయన్న భావనతో ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. 900లకు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఫెయిల్ అయ్యారన్నారు. మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికలో గ్లోబరీనా సంస్థ నిర్వాకం వల్లే ఇదంతా జరిగిందంటూ పేర్కొన్నట్లు పత్రికల్లో వచ్చిందని వివరించారు. -
మహిళల పిటిషన్‌ను విచారించనున్న సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి 2న శబరిమల ఆలయంలోకి ప్రవేశించి హిందూ సంస్ధల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న ఇద్దరు మహిళలు కనకదుర్గ, బిందు అమ్మిని తమకు 24 గంటల పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన ఉమ్మడి పిటిషన్లను సుప్రీం కోర్టు శుక్రవారం విచారించనుంది. కన్నూర్ జిల్లాకు చెందిన వీరిద్దరూ అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించడాన్ని నిలువరిస్తూ హిందూ సంఘాలకు చెందిన నిరసనకారులు అడ్డుకున్నారు. అయ్యప్ప ఆలయంలోకి తమను అనుమతించాలని డిమాండ్ చేస్తూ వీరు నిరవధిక దీక్షకు దిగడం కలకలం రేపింది. మరోవైపు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై ఆగ్రహిస్తూ కనక దుర్గపై ఆమె అత్త కర్రతో దాడి చేసింది. దీనిపై ఐపీసీ సెక్షన్ 341, 324 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కాగా అయ్యప్ప ఆలయంలోకి ఇరువురు మహిళలు దుర్గ, బిందులు ప్రవేశించడంతో ఆలయ ప్రధాన పూజారి ఆలయాన్ని మూసివేసి శుద్ధి చేయడం వివాదాస్పదమైంది. -
నాపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వడం లేదు
సాక్షి, హైదరాబాద్: తనపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలు అందచేసేలా డీజీపీని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని కోరినా డీజీపీ ఇవ్వడం లేదని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకు నాపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నాపై నమోదైన పలు కేసుల్లో నాకు పోలీసుల నుంచి ఎటువంటి నోటీసులు రాలేదు. అందువల్ల ఈ కేసుల వివరాలు తెలిసే అవకాశం నాకు లేదు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేటప్పుడు నిబంధనల ప్రకారం అందులో అభ్యర్థిపై ఉన్న కేసుల వివరాలన్నింటినీ ప్రస్తావించాలి. నాకు తెలియకుండానే నాపై అనేక కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఆ కేసుల వివరాలు ఇవ్వాలని ఈ ఏడాది మార్చి 14న సమాచార హక్కు చట్టం కింద డీజీపీని కోరాను. అయితే ఇప్పటి వరకు నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇదే అంశంపై డీజీపీకి గత నెల 12న వినతిపత్రం ఇచ్చాను. అయినా డీజీపీ ఇప్పటి వరకు ఎటువంటి వివరాలు ఇవ్వలేదు. నేను కోరిన వివరాలు ఇవ్వని పక్షంలో నాకు తీరని ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల మరో ప్రత్యామ్నాయం లేక హైకోర్టును ఆశ్రయించా. నాపై వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను అందచేసేలా డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆదేశించండి’ అని రేవంత్‌రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. -
తాత్కాలిక డీజీపీ పద్ధతి వద్దు
న్యూఢిల్లీ: తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) నియామక పద్ధతికి స్వస్తి పలకాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఉన్నత స్థాయి నియామకాల్లో పక్షపాతం, బంధుప్రీతి లేకుండా ఉండేందుకు తాజా ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొంది. డీజీపీ, ఎస్పీల పదవీ కాల పరిమితి కచ్చితంగా రెండేళ్లు ఉండాలని ఇచ్చిన మార్గదర్శకాల్లో మార్పులు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే 2006లో పోలీసు నియామకాలపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదంటూ బీజేపీ నాయకుడు అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై మంగళవారం విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ వైవీ చంద్రచూడ్‌ల ధర్మాసనం పోలీసు సంస్కరణలపై పలు మార్గదర్శకాలు జారీ చేసింది. యూపీఎస్సీ ద్వారా డీజీపీ ఎంపిక డీజీపీలు లేదా పోలీస్ కమిషనర్లుగా నియమించదగ్గ సీనియర్ పోలీసు అధికారుల పేర్లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కు ఆ పదవి ఖాళీ అవడానికి మూడు నెలలు ముందుగానే పంపాలని అన్ని రాష్ట్రాలను కోరింది. వారిలో యూపీఎస్సీ ముగ్గురు అర్హులైన అధికారులను ఎంపిక చేస్తుందని.. వీరి నుంచి ఒకరిని పోలీస్ చీఫ్‌గా రాష్ట్రాలు నియమించుకోవచ్చని పేర్కొంది. డీజీపీగా ఎంపిక చేసే వ్యక్తి రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగవచ్చని అయితే పొడిగించిన కాలవ్యవధి సహేతుకంగా ఉండాలని తెలిపింది. ‘‘కొన్ని రాష్ట్రాలు తాత్కాలిక డీజీపీలను నియమించి, రిటైర్మెంట్ వయస్సు దగ్గర పడే సమయంలో మరో రెండేళ్లు (62 ఏళ్ల వరకు) కొనసాగేందుకు వీలుగా పర్మనెంట్ చేస్తున్నాయని తమ దృష్టికి వచ్చిందని, ఇటువంటి నియామక పద్ధతి మా ఆదేశాల స్ఫూర్తికి విరుద్ధం’’ అని ధర్మాసనం పేర్కొంది. రెండేళ్ల సర్వీసుండేలా చూసుకోవాలి యూపీఎస్సీ కూడా డీజీపీ ప్యానల్ పేర్లను ఎంపిక చేసేటప్పుడు వారి పదవీ విరమణకు ఇంకా రెండేళ్ల సర్వీసు మిగిలి ఉందా లేదా అనేది చూసుకోవాలని సూచించింది. అలాగే ప్యానెల్ పేర్ల ఎంపికలో ప్రతిభ, సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ఈ సందర్భంగా పోలీసు అధికారుల నియామకానికి సంబంధించిన నిబంధనలు, కేంద్ర, రాష్ట్ర చట్టాలను నిలుపుదల చేస్తున్నట్లు తెలిపింది. పోలీసు సంస్కరణలపై సుప్రీం కోర్టు 2006లో ఇచ్చిన చారిత్రక తీర్పును అనుసరించి తాజా మార్గదర్శకాలు విడుదల చేసినట్లు ధర్మాసనం వివరించింది. తమ ఆదేశాల్లో మార్పులు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకు ఇచ్చింది. విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ వేణుగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్తాన్ రాష్ట్రాలు డీజీపీ ఎంపిక కోసం యూపీఎస్సీని సంప్రదించాయని చెప్పారు. 19 రాష్ట్రాలు సుప్రీం ఆదేశాలు ధిక్కరిస్తూ తాత్కాలిక డీజీపీ పద్ధతిని అనుసరిస్తున్నాయని చెప్పారు. పూర్తి వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం మంగళవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. నాటి తీర్పులో ఏముంది? పోలీసు సంస్కరణలపై 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు సరిగా అమలుకాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ తీర్పులో ఏముంది? ♦ ప్రతిభ ఆధారంగా, పారదర్శకంగా సీనియర్ అధికారుల్ని డీజీపీ/ఎస్పీలుగా నియమించాలి. వారు కనీసం రెండేళ్లు ఆ పదవిలో కొనసాగేలా పదవీకాలంపై నిర్ణయం తీసుకోవాలి. ♦ ప్రస్తుత డీజీపీ పదవీ విరమణకు మూడు నెలలకు ముందుగానే యూపీఎస్సీకి అర్హులైన సీనియర్ అధికారుల జాబితా పంపాలి. యూపీఎస్సీ సూచించిన ముగ్గురిలో ఒకరిని డీజీపీగా నియమించుకోవచ్చు. ♦ డీఎస్పీ అంతకంటే తక్కువ హోదా ఉన్న పోలీసు అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు, పదోన్నతులు, ఇతర సర్వీసు సంబంధిత విషయాల్లో సిఫార్సుల కోసం పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్‌ను ఏర్పాటు చేయాలి ♦ పోలీసు కస్టడీలో అత్యాచారం, తీవ్రగాయాలు, లాకప్ మరణం వంటి తీవ్రమైన కేసుల్లో.. ఎస్పీ కంటే పై స్థాయి అధికారులపై వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు ఫిర్యాదుల అథారిటీని ఏర్పాటు చేయాలి. ♦ కేంద్ర పోలీసు సంస్థ (సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్)ల అధిపతుల ఎంపిక, నియామకాల కోసం జాతీయస్థాయిలో నేషనల్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటుచేయాలి ♦ పోలీసులపై అనవసర ఒత్తిళ్లు, ప్రభావం పడకుండా చూసేందుకు స్పష్టమైన మార్గదర్శకాలతో రాష్ట్ర భద్రతా కమిషన్(ఎస్ఎస్సీ) ఏర్పాటుచేయాలి. -
సాధువులకు కేబినెట్ మంత్రుల హోదా..
ఇండోర్ : అర్హతలు లేకున్నా ఒక మతానికి చెందిన ఐదుగురు సాధువులకు క్యాబినేట్ హోదా కల్పించడంపై మధ్యప్రదేశ్‌లో వివాదం రాజుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వారికి మంత్రి హోదా కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, తక్షణమే ఆ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెనక్కి తీసుకునేలా చూడాలని పిటిషనర్ రాం బహాదూర్ శర్మ కోర్టును కోరారు. తప్పేమీలేదు: దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నా.. ఆ నిర్ణయంలో ఏ విధమైన తప్పులేదని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమర్థించుకున్నారు. ‘మా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకూ సమానమైన అవకాశాలు కల్పిస్తుంది. కులం, మతం, ప్రాంతీయ భేదాలు ఉండబోవు’’అని సీఎం చెప్పుకొచ్చారు. కాగా, కాషాయ దుస్తులు ధరించినవారికి మంత్రి హోదాలిచ్చి, వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. (చదవండి: సన్యాసిని సీఎం చేస్తే ఏం ఒరిగింది!) (మతగురువులకు క్యాబినెట్ హోదా) -
రాష్ట్రపతి పాలనపై పిటిషన్
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ప్రకటించటాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర మాజీ సీఎం నబమ్‌టుకీ గురువారం తాజా పిటిషన్ దాఖలు చేశారు. దీనితో పాటు.. కాంగ్రెస్ శాసనసభాపక్ష చీఫ్ విప్ రాజేశ్ టాచో వంటి వారు వేసిన పిటిషన్లను జస్టిస్‌జె.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణకు స్వీకరించే అవకాశముంది. ఇంతకుముందు వేసిన పిటిషన్లు రాష్ట్రపతి పాలనను ప్రశ్నించలేదని.. రాష్ట్రపతి పాలన విధించటానికి ముందే వాటిని దాఖలు చేశారని కేంద్రం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. పిటిషన్ల సవరణకు ధర్మాసనం అవకాశం ఇవ్వగా నబమ్‌టుకీ తాజాపిటిషన్ వేశారు. సుప్రీం కోర్టు.. రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ ఇచ్చిన నివేదికను తమ ముందుంచాలని ఆ రాష్ట్ర గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవాతో పాటు కేంద్ర హోంశాఖకు బుధవారం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీకి తాళం వేశారు.. అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో శాంతిభద్రతలు సహా రాష్ట్రంలో పరిపాలన పతనమవటం, శాసనసభ భవనానికి తాళం వేయటాన్ని రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలటానికి కారణాలుగా అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజ్‌ఖోవా పేర్కొన్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలపై నిషిద్ధ రహస్య నాగా సంస్థ ఎన్ఎస్సీఎన్ (ఖాప్లాంగ్) ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని నివేదికలు సూచిస్తున్నాయని గవర్నర్ చెప్పారు. శాసనసభ సమావేశం శాసనసభ ఆవరణలో జరగకుండా స్పీకర్, ప్రభుత్వంతో కలిసి అడ్డుకున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య సూత్రాలను కాలరాసే ప్రయత్నం ఇక కేంద్ర మంత్రివర్గం అరుణాచల్‌లో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ.. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మెజారిటీ మద్దతు లేదని, మైనారిటీ సర్కారుతో చేతులుకలిపిన స్పీకర్ శాసనసభ సమావేశాలు జరగకుండా అడ్డుకోవటం ద్వారా ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలను.. ముఖ్యమంత్రికి సభలో మెజారిటీ మద్దతు ఉండాలని, ఆ మెజారిటీని సభలో పరీక్షించాలని చెప్తున్న రాజ్యాంగ కనీస అవసరాన్ని కాలరాసే ప్రయత్నం చేశారని పేర్కొంది. రాజ్‌భవన్ ప్రాంగణాన్ని సీఎం, స్పీకర్ల మద్దతుదారులు పలు గంటల పాటు దిగ్బంధించారని, గవర్నర్‌ను ఘెరావ్ చేయటం రాష్ట్రంలో రాజ్యాంగం కుప్పకూలటమేనని అభివర్ణించింది. -
సీబీఐ విచారణ జరిపించాలి