సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలోని మొత్తం విస్తీర్ణంలో ఐదు శాతం భూమిని పేదల నివాసాల నిమిత్తం కేటాయించాలని సీఆర్‌డీఏ చట్టం స్పష్టంగా చెబుతోందని, అయితే గత ప్రభుత్వం మాత్రం పేదలను గాలికొదిలేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. పేదల కోసం రాజధాని ప్రాంతంలో సెంటు భూమి కూడా కేటాయించలేదని, ఆ తప్పును తాము ఇప్పుడు సరిచేసి, చట్టానికి అనుగుణంగా 5 శాతం భూమిని పేదల నివాసకల్పన కోసం కేటాయించామని చెప్పారు.
చట్ట ప్రకారం వ్యవహరించడం కూడా తప్పు అంటూ పిటిషన్ దాఖలు చేశారని ఆయన వివరించారు. పేదలులేని ప్రపంచస్థాయి రాజదాని కావాలని రాజధాని రైతులు కోరుకుంటున్నారని, తాము మాత్రం పేదలు సైతం రాజధానిలో ఇళ్లు కట్టుకుని ఉండాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే పేదల కోసం ఆర్ 5 జోన్‌ను ఏర్పాటుచేసి, వందల ఎకరాల భూమిని కేటాయించామన్నారు. రాజధాని రైతుల వాదనను పరిగణనలోకి తీసుకోవద్దని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అంటరానితనం ఆలోచనలు ఉండటం దురదృష్టకరమని సుధాకర్‌రెడ్డి తెలిపారు.
సీఆర్‌డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్–57 ప్రకారం పూలింగ్ ద్వారా సమీకరించిన భూమిపై సర్వహక్కులు సీఆర్‌డీఏకే ఉంటాయన్నారు. ఆ భూమి సీఆర్‌డీఏ ఆస్తి అవుతుందే తప్ప, రైతులది కాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఇప్పటికే ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పడంతో ఈ వ్యాజ్యాన్ని సైతం త్రిసభ్య ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వుల నిమిత్తం ఈ వ్యాజ్యాన్ని ఆయన ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఇళ్లు కావాలని ఎవరూ అడగలేదు..
రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ఆర్ 5 జోన్‌ను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా, కృష్ణాయపాళెం గ్రామానికి చెందిన రైతు అవల నందకిషోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై మంగళవారం జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ వాదనలు వినిపిస్తూ, రాజధాని ప్రాంతంలో తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజలెవ్వరూ కోరలేదన్నారు. గ్రామసభల్లో రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
పేదల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది
ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకారం చేయాల్సిన పనిని గత ప్రభుత్వం విస్మరించిందని, ఆ తప్పును సరిదిద్ది మాస్టర్ ప్లాన్‌కు ఓ విలువను తీసుకొచ్చామని, దాన్ని కూడా పిటిషనర్ తప్పుపడుతున్నారని తెలిపారు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో 900 ఎకరాలను పేదల కోసం కేటాయించామని చెప్పారు. ప్రజలు తమకు ఫలానాది కావాలని అడిగేంత వరకు ప్రభుత్వాలు ఎదురుచూడవని.. వారి అవసరాలను గుర్తించడమే ప్రభుత్వ విధి అన్నారు.
ఇదే అంశంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది..
వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని, తరువాత పూర్తిస్తాయిలో విచారణ జరుపుతామన్నారు. ఈ సమయంలో ఇంద్రనీల్.. ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.
తమకు ఏ ధర్మాసనమైనా ఒక్కటేనని, తాము చట్ట ప్రకారమే ఆర్ 5 జోన్‌ను ఏర్పాటుచేశామని సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని త్రిసభ్య ధర్మాసనానికి నివేదించారు. దీనిపై తగిన ఉత్తర్వులు జారీచేసేందుకు ఈ వ్యాజ్యాన్ని సీజే ముందుంచాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment