capital region lands
-
‘రాజధాని’ వ్యాజ్యాలన్నీ త్రిసభ్య ధర్మాసనానికి
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలను అడ్డుకునే దిశగా టీడీపీ దాఖలు చేయించిన పిటిషన్లో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజధానిలో పేదల ఇళ్ల నిర్మాణాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యంతో పాటు రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు ఆర్ 5 జోన్‌ను సృష్టిస్తూ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని, 1402 ఎకరాలు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయిస్తూ జారీ చేసిన జీవో 45ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను ద్విసభ్య ధర్మాసనానికి పంపేందుకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విముఖత వ్యక్తం చేసింది. సవరణ చట్టం, జీవో 45పై వ్యాజ్యాలన్నింటినీ వేర్వేరు ధర్మాసనాలు విచారించడం, వైరుధ్యమైన ఉత్తర్వులు రావడం అవసరం లేదని తెలిపింది. ఈ వ్యాజ్యాలన్నింటినీ తామే విచారిస్తామని స్పష్టంచేసింది. వాటన్నింటినీ తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రధాన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వుల కోసం దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలన్నింటిలో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఆర్డీఏని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ఇళ్ల నిర్మాణాలను సవాలు చేస్తూ ఇద్దరు న్యాయమూర్తుల ముందున్న వ్యాజ్యం కూడా త్రిసభ్య ధర్మాసనం ముందుకే వస్తుంది. రాజధాని ప్రాంతంలో సదుపాయాల కల్పన, అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు అప్పగించాలంటూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడంలేదంటూ రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాలు మంగళవారం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చాయి. రాజధానిపై ఇతర వ్యాజ్యాలు కూడా విచారణకు వచ్చాయి. రైతుల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. రాజధాని ప్రాంతంలో పేదలకిచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అన్నీ సిద్ధం చేసిందని, రేపు హైకోర్టు వ్యతిరేకంగా తీర్పునిస్తే ఇళ్ల నిర్మాణం కోసం వెచ్చించిన ప్రజాధనం వృథా అవుతుందని అన్నారు. అందుకే ఇళ్ల నిర్మాణాన్ని నిలిపేయాలని కోరుతూ అనుబంధ వ్యాజ్యం దాఖలు చేశామని చెప్పారు. ఆర్ 5 జోన్లో ఇళ్ల స్థలాలపై వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనమే ఈ వ్యాజ్యాన్ని కూడా విచారించడం సబబుగా ఉంటుందని తెలిపారు. సీఆర్డీఏ న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ.. సవరణ చట్టం, జీవో 45పై గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఉన్న అభ్యర్థనలే తాజా వ్యాజ్యంలో కూడా ఉన్నాయన్నారు. ఇళ్ల నిర్మాణం అన్నది తాజా వ్యాజ్యం దాఖలు చేయడానికి కారణమని, అందువల్లే ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చిందని మురళీధరరావు తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పందిస్తూ.. గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాలకు, తాజా వ్యాజ్యానికి పెద్ద తేడా ఏమీ లేదన్నారు. అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. ఇళ్ల నిర్మాణం మినహా మిగిలిన అభ్యర్థనలన్నీ ఒకటేనన్నారు. గతంలో సవరణ చట్టాన్ని, జీవో 45ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు త్రిసభ్య ధర్మాసనం ముందే ఉన్నాయన్నారు. అందువల్ల తాజా వ్యాజ్యాన్ని కూడా త్రిసభ్య ధర్మాసనమే విచారించడం సబబుగా ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా ధర్మాసనం అన్ని వ్యాజ్యాలలోని అభ్యర్థనలను పరిశీలించింది. అన్ని వ్యాజ్యాల్లోని అభ్యర్థనలు ఒకేలా ఉన్నాయని స్పష్టం చేసింది. కోర్టు ధిక్కార వ్యాజ్యాల్లో విచారణ 8 వారాలకు వాయిదా... రాజధాని ప్రాంతం అభివృద్ధి విషయంలో దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. రాజధానికి సంబంధించి తాము దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోందన్నారు. ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగా, అదే అంశంపై దిగువ న్యాయస్థానాలు విచారణ జరపడం సబబుగా ఉండదని వివరించారు. ఈ వాదనలతో త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించింది. రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాల విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు పరిశీలించాకే.. ఇళ్ల నిర్మాణాన్ని సవాలు చేస్తూ రాజధాని రైతులు తాజాగా దాఖలు చేసిన వ్యాజ్యం జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ జ్యోతిర్మయి ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. రైతుల తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది (జీపీ) బి.శశిభూషణ్‌రావు ఉదయం త్రిసభ్య ధర్మాసనం ముందు జరిగిన విషయాలను వివరించారు. అన్ని వ్యాజ్యాలను విచారిస్తామని త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీంతో ఆ ఉత్తర్వులను పరిశీలించిన తరువాత ఈ వ్యాజ్యంలో ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. -
AP:రాజధానిలో పేదలు ఉండొద్దంటే ఎలా?
సాక్షి, అమరావతి: ‘‘రాజధానిలో పేదలు ఉండకూడదంటే ఎలా?’’ అని హైకోర్టు ధర్మాసనం రాజధాని పిటిషనర్లను ప్రశ్నించింది. రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమని వ్యాఖ్యానించింది. ఫలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పజాలరని స్పష్టం చేసింది. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవేనని, అంతేకానీ భూములిచ్చిన వారివి కాదని పేర్కొంది. రాజధాని వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున అందుకు సంబంధించిన వ్యవహారంలో తాము జోక్యం చేసుకుని పరిస్థితిని జఠిలం చేయలేమని తెలిపింది. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా రాజధాని ప్రాంతంలో 1,134 ఎకరాలను ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించాలని సీఆర్డీఏ కమిషనర్‌ను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 45 విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తెలిపింది. ప్రస్తుత దశలో స్టే విధించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. భూములను కలెక్టర్లకు బదలాయించాలని మాత్రమే ప్రభుత్వం చెప్పిందని, అందువల్ల కేటాయింపులను ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యాలు అపరిపక్వమైనవని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయిస్తున్నారని వ్యాఖ్యానించింది. రాజధాని విషయంలో కొన్ని అంశాలను హైకోర్టులో, కొన్నింటిని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నారని ప్రస్తావిస్తూ జీవో 45పై కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేమని, అవి ప్రభుత్వ విధుల్లో భాగమని తేల్చి చెబుతూ జీవో 45పై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పురపాలక శాఖ, సీఆర్డీఏలను న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించిన తరువాతే మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలపై పిటిషన్లు.. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల నిమిత్తం 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 45ను సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దామా శేషాద్రినాయుడు, ఉన్నం మురళీధరరావు, దేవ్‌దత్ కామత్, వీఎస్ఆర్ ఆంజనేయులు తదితరులు వాదించారు. ఇళ్ల స్థలాల నిమిత్తం గతంలో జారీ చేసిన జీవోను హైకోర్టు నిలుపుదల చేసిందని మురళీధరరావు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తరువాత సీఆర్డీఏ చట్టానికి సవరణలు చేసి ఆర్ 5 జోన్ తెచ్చారన్నారు. తుది ఉత్తర్వులకు లోబడి ఉండేలా ఆదేశాలిస్తాం.. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ఇళ్ల స్థలాల కేటాయింపు తమ తుది ఉత్తర్వులకు లోబడి ఉండేలా ఆదేశాలు ఇస్తామని పేర్కొనగా దీన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. రాజధాని భూములను అన్యాక్రాంతం చేయడం, బదలాయించడం, థర్డ్ పార్టీ హక్కులు సృష్టించడం చేయరాదని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా 3 అంశాలపైనే స్టే విధించిందన్నారు. మిగిలిన అంశాల విషయంలో హైకోర్టు తీర్పు అమల్లోనే ఉందని నివేదించారు. పరిస్థితిని జఠిలం చేయలేం.. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. రాజధాని ప్రజలందరిదని, అది ఏ వ్యక్తిదో, వర్గానిదో కాదని స్పష్టం చేసింది. రాజధానిపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో జీవో 45 విషయంలో జోక్యం చేసుకుని పరిస్థితిని జఠిలం చేయలేమని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వమే సమస్యను జఠిలం చేస్తోందంటూ పిటిషనర్ల న్యాయవాది దేవ్‌దత్ కామత్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను చదివి వినిపించడంతో... సుప్రీంకోర్టు ఉత్తర్వులకు తమను భాష్యం చెప్పమని కోరుతున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. కావాలంటే సుప్రీంకోర్టుకే వెళ్లాలని స్పష్టం చేసింది. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని పిటిషనర్ల న్యాయవాదులు పేర్కొనగా దానిపై ఇప్పటికే కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైందని ధర్మాసనం తెలిపింది. జరగని కేటాయింపులపై వ్యాజ్యాలేమిటి? ఈ వ్యాజ్యాలను ఇప్పటికిప్పుడు విచారించాల్సినంత అత్యవసరం ఏముందో చెప్పాలని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతిదీ అత్యవసరమంటూ పిటిషన్లు దాఖలు చేయడాన్ని తాము ఎంతమాత్రం హర్షించబోమని, తమను ఒత్తిడి చేయవద్దని తేల్చి చెప్పింది. ఇళ్ల స్థలాల కేటాయింపులు తమ తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని, ఈ దశగా ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం పునరుద్ఘాటించింది. ముఖ్యమంత్రి ఓ సమావేశం నిర్వహించి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను ఆదేశించారని, అందువల్లే జీవోపై స్టే కోరుతున్నామని పిటిషనర్ల తరపు న్యాయవాదులు నివేదించారు. ‘ప్రభుత్వం పని చేయాల్సిందే కదా. నిర్ణయాలు తీసుకోకుండా ఎలా నిరోధించగలం? అసలు ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవి. ప్రభుత్వం భూములను కలెక్టర్లకు బదలాయించాలని మాత్రమే చెప్పింది. కేటాయింపులు ఇంకా జరగలేదు. జరగని కేటాయింపులపై వ్యాజ్యాలు దాఖలు చేయడం ఏమిటి? ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయనివ్వండి. ఆ తరువాత ఏం చేయాలో చూద్దాం...’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒత్తిడి చేసి మధ్యంతర ఉత్తర్వులు పొందలేరు.. ఈ సమయంలో సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు స్పందిస్తూ థర్డ్ పార్టీలకు భూములు కేటాయిస్తే విషయం జఠిలం అవుతుందన్నారు. తదుపరి దాఖలు చేసే వ్యాజ్యాల్లో వారందరినీ ప్రతివాదులుగా చేయాల్సి ఉంటుందని, ఆది అచరణ సాధ్యం కాదన్నారు. పిటిషనర్లు రైతులని, ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల వారి హక్కులు ప్రభావితం అవుతాయన్నారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. ఇవి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కావని, అందరి తరఫున వ్యాజ్యాలు వేసి జీవో మొత్తాన్ని నిలుపుదల చేయాలని కోరలేరని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల ఇతరులు కూడా లబ్ధి పొందుతున్నారని గుర్తు చేసింది. ప్రస్తుత దశలో జీవో 45 విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని తేల్చి చెప్పింది. అపరిపక్వమైన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదంది. ఒత్తిడి చేసి మధ్యంతర ఉత్తర్వులు పొందలేరని వ్యాఖ్యానించింది. రైతులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఇతరులకు ఇళ్ల స్థలాలివ్వడం చట్ట విరుద్ధమని మరో సీనియర్ న్యాయవాది వీఎస్ఆర్ ఆంజనేయులు వాదించారు. ఇన్సైడర్స్.. అవుట్ సైడర్స్ ఏమిటి? సీనియర్ న్యాయవాది మురళీధరరావు వాదనలు వినిపిస్తూ మే మొదటి వారంలో ఇళ్ల స్థలాలివ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు పత్రికల్లో వచ్చిందన్నారు. అవుట్‌సైడర్స్‌కు (రాజధానేతరులు) ఇళ్ల స్థలాలిస్తూ వివాదాలు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొనడంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. రాజధాని ప్రజలందరిదీ, కేవలం పూలింగ్ కింద భూములిచ్చిన వారిది మాత్రమే కాదని పేర్కొంది. అవుట్ సైడర్స్, ఇన్సైడర్స్ అంటూ మాట్లాడొద్దని సూచించింది. రాజధాని భూములను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇళ్ల స్థలాల కేటాయింపు ద్వారా అదే జరుగుతోందని తెలిపింది. -
గత ప్రభుత్వం పేదలను గాలికొదిలేసింది
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలోని మొత్తం విస్తీర్ణంలో ఐదు శాతం భూమిని పేదల నివాసాల నిమిత్తం కేటాయించాలని సీఆర్డీఏ చట్టం స్పష్టంగా చెబుతోందని, అయితే గత ప్రభుత్వం మాత్రం పేదలను గాలికొదిలేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. పేదల కోసం రాజధాని ప్రాంతంలో సెంటు భూమి కూడా కేటాయించలేదని, ఆ తప్పును తాము ఇప్పుడు సరిచేసి, చట్టానికి అనుగుణంగా 5 శాతం భూమిని పేదల నివాసకల్పన కోసం కేటాయించామని చెప్పారు. చట్ట ప్రకారం వ్యవహరించడం కూడా తప్పు అంటూ పిటిషన్ దాఖలు చేశారని ఆయన వివరించారు. పేదలులేని ప్రపంచస్థాయి రాజదాని కావాలని రాజధాని రైతులు కోరుకుంటున్నారని, తాము మాత్రం పేదలు సైతం రాజధానిలో ఇళ్లు కట్టుకుని ఉండాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే పేదల కోసం ఆర్ 5 జోన్‌ను ఏర్పాటుచేసి, వందల ఎకరాల భూమిని కేటాయించామన్నారు. రాజధాని రైతుల వాదనను పరిగణనలోకి తీసుకోవద్దని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అంటరానితనం ఆలోచనలు ఉండటం దురదృష్టకరమని సుధాకర్‌రెడ్డి తెలిపారు. సీఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్–57 ప్రకారం పూలింగ్ ద్వారా సమీకరించిన భూమిపై సర్వహక్కులు సీఆర్డీఏకే ఉంటాయన్నారు. ఆ భూమి సీఆర్డీఏ ఆస్తి అవుతుందే తప్ప, రైతులది కాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఇప్పటికే ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పడంతో ఈ వ్యాజ్యాన్ని సైతం త్రిసభ్య ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వుల నిమిత్తం ఈ వ్యాజ్యాన్ని ఆయన ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇళ్లు కావాలని ఎవరూ అడగలేదు.. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ఆర్ 5 జోన్‌ను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా, కృష్ణాయపాళెం గ్రామానికి చెందిన రైతు అవల నందకిషోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ వాదనలు వినిపిస్తూ, రాజధాని ప్రాంతంలో తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజలెవ్వరూ కోరలేదన్నారు. గ్రామసభల్లో రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పేదల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకారం చేయాల్సిన పనిని గత ప్రభుత్వం విస్మరించిందని, ఆ తప్పును సరిదిద్ది మాస్టర్ ప్లాన్‌కు ఓ విలువను తీసుకొచ్చామని, దాన్ని కూడా పిటిషనర్ తప్పుపడుతున్నారని తెలిపారు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో 900 ఎకరాలను పేదల కోసం కేటాయించామని చెప్పారు. ప్రజలు తమకు ఫలానాది కావాలని అడిగేంత వరకు ప్రభుత్వాలు ఎదురుచూడవని.. వారి అవసరాలను గుర్తించడమే ప్రభుత్వ విధి అన్నారు. ఇదే అంశంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది.. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని, తరువాత పూర్తిస్తాయిలో విచారణ జరుపుతామన్నారు. ఈ సమయంలో ఇంద్రనీల్.. ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. తమకు ఏ ధర్మాసనమైనా ఒక్కటేనని, తాము చట్ట ప్రకారమే ఆర్ 5 జోన్‌ను ఏర్పాటుచేశామని సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని త్రిసభ్య ధర్మాసనానికి నివేదించారు. దీనిపై తగిన ఉత్తర్వులు జారీచేసేందుకు ఈ వ్యాజ్యాన్ని సీజే ముందుంచాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. -
రాజధాని పేరుతో ప్రజాధనం దోచేశారు
-
చంద్రబాబు అండతోనే భూదందా: నారాయణ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూదందా వ్యవహారంపై అన్ని రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ భూదందాపై సీపీఐ సీనియర్ నేత నారాయణ నేడు తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో సీపీఐ నేత గురువారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ భూదందాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో గత రెండేళ్లుగా జరిగిన భూ లావాదేవీలన్నీ సీజ్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలోనే ఆ లావాదేవీలను సీజ్ చేయడం మందిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే టీడీపీ నేతలు భూములు కొల్లగొట్టారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. మరోవైపు ఎక్కడా అవకతవకలు జరగలేదంటూనే టీడీపీ నేతలు, మంత్రులు భూదందా అక్రమాలు, రైతుల నుంచి బలవంతంగా కొనుగోలు చేసిన వేల ఎకరాల భూముల వివరాలపై దాటవేస్తుండటం గమనార్హం. -
మంత్రులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం!
విజయవాడ: కేబినెట్ మంత్రులతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. ప్రతిపక్షాల విమర్శలపై స్పందించలేదని మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య తనపై అంతగా వ్యాఖ్యలు చేస్తే కనీసం ఎందుకు స్పందించలేదని మంత్రి గంటా శ్రీనివాసరావును సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. తనపై గానీ, ఏపీ ప్రభుత్వంపై గానీ ఎవరు విమర్శలు చేసినా గట్టిగా మాట్లాడాలని, వారికి సమాధానాలివ్వాలని చంద్రబాబు హుకుం జారీ చేశారు. కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖపై సీఎం చంద్రబాబు, కేబినెట్ మంత్రులతో చర్చించారు. ముద్రగడ తనను డిక్టేట్ చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాజధాని భూముల దందాపై ఓ ప్రముఖ పత్రికలో వాస్తవాలు అంటూ కథనాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రభుత్వంపై ఈ విషయంలో తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.