AP:రాజధానిలో పేదలు ఉండొద్దంటే ఎలా? | AP High Court bench questioned Amaravati Capital petitioners | Sakshi
Sakshi News home page

రాజధానిలో పేదలు ఉండొద్దంటే ఎలా?: ఏపీ హైకోర్టు

Published Wed, Apr 5 2023 1:46 AM | Last Updated on Wed, Apr 5 2023 9:54 AM

AP High Court bench questioned Amaravati Capital petitioners - Sakshi

సాక్షి, అమరావతి: ‘‘రాజధానిలో పేదలు ఉండ­కూడదంటే ఎలా?’’ అని హైకోర్టు ధర్మాసనం రాజధాని పిటిషనర్లను ప్రశ్నించింది. రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమని వ్యాఖ్యానించింది. ఫలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పజాలరని స్పష్టం చేసింది. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్‌డీఏవేనని, అంతేకానీ భూములిచ్చిన వారివి కాదని పేర్కొంది.

రాజధాని వ్యవ­హారం సుప్రీంకోర్టు పరి­ధిలో ఉన్నందున అందుకు సంబంధించిన వ్యవహారంలో తాము జోక్యం చేసుకుని పరిస్థితిని జఠిలం చేయలేమని తెలిపింది. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా రాజధాని ప్రాంతంలో 1,134 ఎకరాలను ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలా­యించాలని సీఆర్‌డీఏ కమిష­నర్‌ను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 45 విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసు­కోలేమని తెలిపింది.

ప్రస్తుత దశలో స్టే విధించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. భూములను కలెక్టర్లకు బదలాయించాలని మాత్రమే ప్రభుత్వం చెప్పిందని, అందువల్ల కేటాయింపులను ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యాలు అపరిపక్వ­మైనవని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంపై హైకోర్టును ఆశ్ర­యి­స్తున్నారని వ్యాఖ్యానించింది.

రాజధాని విషయంలో కొన్ని అంశాలను హైకోర్టులో, కొన్నింటిని సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తున్నారని ప్రస్తావిస్తూ జీవో 45పై కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభు­త్వాన్ని నిరోధించలేమని, అవి ప్రభుత్వ విధుల్లో భాగమని తేల్చి చెబుతూ జీవో 45పై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పురపాలక శాఖ, సీఆర్‌డీ­ఏలను న్యాయస్థానం ఆదేశించింది.

ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించిన తరువాతే మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మంతోజు గంగారావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

పేదలకు ఇళ్ల స్థలాలపై పిటిషన్లు..
రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల నిమిత్తం 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 45ను సవాల్‌ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు దామా శేషాద్రినాయుడు, ఉన్నం మురళీధరరావు, దేవ్‌దత్‌ కామత్, వీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తదితరులు వాదించారు. ఇళ్ల స్థలాల నిమిత్తం గతంలో జారీ చేసిన జీవోను హైకోర్టు నిలుపుదల చేసిందని మురళీధరరావు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తరువాత సీఆర్‌డీఏ చట్టానికి సవరణలు చేసి ఆర్‌ 5 జోన్‌ తెచ్చారన్నారు.

తుది ఉత్తర్వులకు లోబడి ఉండేలా ఆదేశాలిస్తాం..
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ఇళ్ల స్థలాల కేటాయింపు తమ తుది ఉత్తర్వులకు లోబడి ఉండేలా ఆదేశాలు ఇస్తామని పేర్కొనగా దీన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. రాజధాని భూములను అన్యాక్రాంతం చేయడం, బదలాయించడం, థర్డ్‌ పార్టీ హక్కులు సృష్టించడం చేయరాదని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా 3 అంశాలపైనే స్టే విధించిందన్నారు. మిగిలిన అంశాల విషయంలో హైకోర్టు తీర్పు అమల్లోనే ఉందని నివేదించారు. 

పరిస్థితిని జఠిలం చేయలేం..
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. రాజధాని ప్రజలందరిదని, అది ఏ వ్యక్తిదో, వర్గానిదో కాదని స్పష్టం చేసింది. రాజధానిపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో జీవో 45 విషయంలో జోక్యం చేసుకుని పరిస్థితిని జఠిలం చేయలేమని తేల్చి చెప్పింది.

రాష్ట్ర ప్రభుత్వమే సమస్యను జఠిలం చేస్తోందంటూ పిటిషనర్ల న్యాయవాది దేవ్‌దత్‌ కామత్‌ సుప్రీంకోర్టు ఉత్తర్వులను చదివి వినిపించడంతో... సుప్రీంకోర్టు ఉత్తర్వులకు తమను భాష్యం చెప్పమని కోరుతున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

కావాలంటే సుప్రీంకోర్టుకే వెళ్లాలని స్పష్టం చేసింది. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని పిటిషనర్ల న్యాయవాదులు పేర్కొనగా దానిపై ఇప్పటికే కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలైందని ధర్మాసనం తెలిపింది.

జరగని కేటాయింపులపై వ్యాజ్యాలేమిటి?
ఈ వ్యాజ్యాలను ఇప్పటికిప్పుడు విచారించాల్సినంత అత్యవసరం ఏముందో చెప్పాలని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతిదీ అత్యవసరమంటూ పిటిషన్లు దాఖలు చేయడాన్ని తాము ఎంతమాత్రం హర్షించబోమని, తమను ఒత్తిడి చేయవద్దని తేల్చి చెప్పింది. ఇళ్ల స్థలాల కేటాయింపులు తమ తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని, ఈ దశగా ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం పునరుద్ఘాటించింది.

ముఖ్యమంత్రి ఓ సమావేశం నిర్వహించి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను ఆదేశించారని, అందువల్లే జీవోపై స్టే కోరుతున్నామని పిటిషనర్ల తరపు న్యాయవాదులు నివేదించారు. ‘ప్రభుత్వం పని చేయాల్సిందే కదా. నిర్ణయాలు తీసుకోకుండా ఎలా నిరోధించగలం? అసలు ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవి. ప్రభుత్వం భూములను కలెక్టర్లకు బదలాయించాలని మాత్రమే చెప్పింది.

కేటాయింపులు ఇంకా జరగలేదు. జరగని కేటాయింపులపై వ్యాజ్యాలు దాఖలు చేయడం ఏమిటి? ప్రభుత్వాన్ని కౌంటర్‌ దాఖలు చేయనివ్వండి. ఆ తరువాత ఏం చేయాలో చూద్దాం...’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఒత్తిడి చేసి మధ్యంతర ఉత్తర్వులు పొందలేరు..
ఈ సమయంలో సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు స్పందిస్తూ థర్డ్‌ పార్టీలకు భూములు కేటాయిస్తే విషయం జఠిలం అవుతుందన్నారు. తదుపరి దాఖలు చేసే వ్యాజ్యాల్లో వారందరినీ ప్రతివాదులుగా చేయాల్సి ఉంటుందని, ఆది అచరణ సాధ్యం కాదన్నారు. పిటిషనర్లు రైతులని, ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల వారి హక్కులు ప్రభావితం అవుతాయన్నారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది.

ఇవి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కావని, అందరి తరఫున వ్యాజ్యాలు వేసి జీవో మొత్తాన్ని నిలుపుదల చేయాలని కోరలేరని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల ఇతరులు కూడా లబ్ధి పొందుతున్నారని గుర్తు చేసింది. ప్రస్తుత దశలో జీవో 45 విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని తేల్చి చెప్పింది.

అపరిపక్వమైన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదంది. ఒత్తిడి చేసి మధ్యంతర ఉత్తర్వులు పొందలేరని వ్యాఖ్యానించింది. రైతులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఇతరులకు ఇళ్ల స్థలాలివ్వడం చట్ట విరుద్ధమని మరో సీనియర్‌ న్యాయవాది వీఎస్‌ఆర్‌ ఆంజనేయులు వాదించారు.

ఇన్‌సైడర్స్‌.. అవుట్‌ సైడర్స్‌ ఏమిటి?
సీనియర్‌ న్యాయవాది మురళీధరరావు వాదనలు వినిపిస్తూ మే మొదటి వారంలో ఇళ్ల స్థలాలివ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు పత్రికల్లో వచ్చిందన్నారు. అవుట్‌సైడర్స్‌కు (రాజధానేతరులు) ఇళ్ల స్థలాలిస్తూ వివాదాలు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొనడంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.

రాజధాని ప్రజలందరిదీ, కేవలం పూలింగ్‌ కింద భూములిచ్చిన వారిది మాత్రమే కాదని పేర్కొంది. అవుట్‌ సైడర్స్, ఇన్‌సైడర్స్‌ అంటూ మాట్లాడొద్దని సూచించింది. రాజధాని భూములను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇళ్ల స్థలాల కేటాయింపు ద్వారా అదే జరుగుతోందని తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement