చంద్రబాబు అండతోనే భూదందా: నారాయణ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూదందా వ్యవహారంపై అన్ని రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ భూదందాపై సీపీఐ సీనియర్ నేత నారాయణ నేడు తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో సీపీఐ నేత గురువారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ భూదందాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో గత రెండేళ్లుగా జరిగిన భూ లావాదేవీలన్నీ సీజ్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలోనే ఆ లావాదేవీలను సీజ్ చేయడం మందిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే టీడీపీ నేతలు భూములు కొల్లగొట్టారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. మరోవైపు ఎక్కడా అవకతవకలు జరగలేదంటూనే టీడీపీ నేతలు, మంత్రులు భూదందా అక్రమాలు, రైతుల నుంచి బలవంతంగా కొనుగోలు చేసిన వేల ఎకరాల భూముల వివరాలపై దాటవేస్తుండటం గమనార్హం.