సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలను అడ్డుకునే దిశగా టీడీపీ దాఖలు చేయించిన పిటిషన్‌లో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజధానిలో పేదల ఇళ్ల నిర్మాణాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యంతో పాటు రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు ఆర్ 5 జోన్‌ను సృష్టిస్తూ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని, 1402 ఎకరాలు ఎన్‌టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయిస్తూ జారీ చేసిన జీవో 45ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను ద్విసభ్య ధర్మాసనానికి పంపేందుకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విముఖత వ్యక్తం చేసింది.
సవరణ చట్టం, జీవో 45పై వ్యాజ్యాలన్నింటినీ వేర్వేరు ధర్మాసనాలు విచారించడం, వైరుధ్యమైన ఉత్తర్వులు రావడం అవసరం లేదని తెలిపింది. ఈ వ్యాజ్యాలన్నింటినీ తామే విచారిస్తామని స్పష్టంచేసింది. వాటన్నింటినీ తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రధాన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వుల కోసం దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలన్నింటిలో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఆర్‌డీఏని ఆదేశించింది.
తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ఇళ్ల నిర్మాణాలను సవాలు చేస్తూ ఇద్దరు న్యాయమూర్తుల ముందున్న వ్యాజ్యం కూడా త్రిసభ్య ధర్మాసనం ముందుకే వస్తుంది.
రాజధాని ప్రాంతంలో సదుపాయాల కల్పన, అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు అప్పగించాలంటూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడంలేదంటూ రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాలు మంగళవారం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చాయి. రాజధానిపై ఇతర వ్యాజ్యాలు కూడా విచారణకు వచ్చాయి. రైతుల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. రాజధాని ప్రాంతంలో పేదలకిచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అన్నీ సిద్ధం చేసిందని, రేపు హైకోర్టు వ్యతిరేకంగా తీర్పునిస్తే ఇళ్ల నిర్మాణం కోసం వెచ్చించిన ప్రజాధనం వృథా అవుతుందని అన్నారు.
అందుకే ఇళ్ల నిర్మాణాన్ని నిలిపేయాలని కోరుతూ అనుబంధ వ్యాజ్యం దాఖలు చేశామని చెప్పారు. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల స్థలాలపై వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనమే ఈ వ్యాజ్యాన్ని కూడా విచారించడం సబబుగా ఉంటుందని తెలిపారు. సీఆర్‌డీఏ న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ.. సవరణ చట్టం, జీవో 45పై గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఉన్న అభ్యర్థనలే తాజా వ్యాజ్యంలో కూడా ఉన్నాయన్నారు. ఇళ్ల నిర్మాణం అన్నది తాజా వ్యాజ్యం దాఖలు చేయడానికి కారణమని, అందువల్లే ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చిందని మురళీధరరావు తెలిపారు.
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పందిస్తూ.. గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాలకు, తాజా వ్యాజ్యానికి పెద్ద తేడా ఏమీ లేదన్నారు. అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. ఇళ్ల నిర్మాణం మినహా మిగిలిన అభ్యర్థనలన్నీ ఒకటేనన్నారు. గతంలో సవరణ చట్టాన్ని, జీవో 45ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు త్రిసభ్య ధర్మాసనం ముందే ఉన్నాయన్నారు. అందువల్ల తాజా వ్యాజ్యాన్ని కూడా త్రిసభ్య ధర్మాసనమే విచారించడం సబబుగా ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా ధర్మాసనం అన్ని వ్యాజ్యాలలోని అభ్యర్థనలను పరిశీలించింది. అన్ని వ్యాజ్యాల్లోని అభ్యర్థనలు ఒకేలా ఉన్నాయని స్పష్టం చేసింది.
కోర్టు ధిక్కార వ్యాజ్యాల్లో విచారణ 8 వారాలకు వాయిదా...
రాజధాని ప్రాంతం అభివృద్ధి విషయంలో దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. రాజధానికి సంబంధించి తాము దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోందన్నారు. ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగా, అదే అంశంపై దిగువ న్యాయస్థానాలు విచారణ జరపడం సబబుగా ఉండదని వివరించారు. ఈ వాదనలతో త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించింది. రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాల విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.
త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు పరిశీలించాకే..
ఇళ్ల నిర్మాణాన్ని సవాలు చేస్తూ రాజధాని రైతులు తాజాగా దాఖలు చేసిన వ్యాజ్యం జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ జ్యోతిర్మయి ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. రైతుల తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది (జీపీ) బి.శశిభూషణ్‌రావు ఉదయం త్రిసభ్య ధర్మాసనం ముందు జరిగిన విషయాలను వివరించారు. అన్ని వ్యాజ్యాలను విచారిస్తామని త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీంతో ఆ ఉత్తర్వులను పరిశీలించిన తరువాత ఈ వ్యాజ్యంలో ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment