
గ్రామం వెలుపల పోలీసుల పహారా, 10నెలల తర్వాత ఇంటి తలుపు తెరుస్తున్న బాధితుడు
కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లెలో టీడీపీ నేతల అరాచకం
గతేడాది ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీ కుటుంబాలపై దాడులు.. ఊరు నుంచి 37 మందిని తరిమేసిన టీడీపీ నేతలు
10 నెలలుగా వీరంతా అజ్ఞాతంలోనే..
హైకోర్టును ఆశ్రయించిన 32 మంది
బాధితులు గ్రామంలోకి వెళ్లేలా పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు తీర్పు
పోలీసు బందోబస్తుతో గ్రామానికి చేరుకున్న బాధితులు.. అయినా.. వారిపై టీడీపీ శ్రేణుల రాళ్ల దాడి
ఇరువర్గాలతో పోలీసుల చర్చలు
చివరికి.. 27 కుటుంబాలకు అనుమతి
గ్రామాన్ని వీడిన మిగతా బాధితులు
వెల్దుర్తి : హైకోర్టు తీర్పు ఇచ్చినా తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం రెడ్‌బుక్ రాజ్యాంగాన్నే అమలుచేస్తున్నారు. తాము చెప్పిందే తీర్పు.. చేసేదే పాలన.. హైకోర్టు, పోలీసులతో ఏమాత్రం పనిలేదన్నట్లు అరాచకంగా వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లెలో గత ఏడాది ఎన్నికల తర్వాత జరిగిన ఓ హత్యోదంతం అనంతరం 37 మందిని ఊరు నుంచి టీడీపీ నేతలు తరిమేశారు. వీరిని తిరిగి ఊళ్లోకి పంపాలని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది.
టీడీపీ నేతలు మాత్రం ససేమిరా అన్నారు. అయినా, భారీ పోలీసు బందోబస్తు మధ్య బాధితులు సోమవారం ఊళ్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే రాళ్ల దాడికి తెగబడ్డారు. పోలీసులు అడ్డుపడినా ఖాతరుచేయలేదు. చివరికి.. వీరిలో కొంతమంది ఇళ్లకు చేరుకుంటే, ఇంకొందరు వారి గడప తొక్కకుండానే వెనుదిరిగారు. కర్నూలు జిల్లాలో సోమవారం ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటన వివరాలు..
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు..
పత్తికొండ నియోజకవర్గం బొమ్మిరెడ్డిపల్లెలో గత ఏడాది ఎన్నికల కౌంటింగ్ ముగిశాక గ్రామంలో గిరినాథ్ చౌదరి అనే వ్యక్తి ఓ ఇంట్లోకి వెళ్లి మహిళపై అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె భర్త కర్రతో దాడిచేశారు. దీంతో గిరినాథ్ చనిపోయాడు. ఈ ఘటన అప్పట్లో గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. హత్య తర్వాత నిందితులతో పాటు వైఎస్సార్‌సీపీ సర్పంచ్, వార్డు మెంబర్లు, ఇతర నేతలు 11మందిని అక్రమంగా కేసులో ఇరికించారు. మొత్తం 37 మందిని ఊరు నుంచి తరిమేశారు. శాంతిభద్రతల పేరుతో పోలీసులు కూడా అప్పట్లో వీరిని గ్రామంలోకి అనుమతించలేదు.
దీంతో పదినెలలుగా వీరంతా పిల్లలను వేరేచోట చదివించుకుంటూ, పొలాలను బీడుగా వదిలి గ్రామంలోకి రాకుండా అజ్ఞాతంలో ఉంటున్నారు. ఈ క్రమంలో వీరిలో 32 మంది హైకోర్టును ఆశ్రయించారు. బాధితుల పక్షాన సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘పోలీసులు, వైరివర్గాలు 10 నెలలుగా బాధితులను గ్రామంలోకి రానివ్వలేదని, వారంతా బంధువుల ఇళ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని’ వాదించారు.
పొన్నవోలు వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్.. పిటిషనర్లు గ్రామంలోకి వెళ్లేలా మార్చి 26న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు కాపీలతో బాధితులు వెల్దుర్తి పోలీసుస్టేషన్ చుట్టూ పలుమార్లు తిరిగినా శాంతిభద్రతల పేరుతో పోలీసులు వారిని గ్రామంలోకి
పంపకుండా జాప్యంచేశారు. బాధితులు తిరిగి హైకోర్టుకు వెళ్తామని హెచ్చరించడంతో ఎట్టకేలకు సోమవారం వారిని బందోబస్తు మధ్య గ్రామంలోకి పంపేందుకు ప్రయత్నించారు.