
బైపీసీలో 420 మార్కులు సాధించిన సృజనామృత
గోనెగండ్ల: ఓ విద్యార్థిని క్యాన్సర్‌ను జయిస్తూ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. గోనెగండ్లకు చెందిన ఉరుకుందు గౌడ్, జానకి దంపతులకు కుమార్తె సృజనామృత, కుమారుడు భగీరథ్ గౌడ్‌లు ఉన్నారు. ఉరుకుందు ప్రస్తుతం కర్నూలు రెండో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. కర్నూలులోనే నివాసం ఉంటున్నారు. గత ఏడాది సృజనామృత పదో తరగతి చదువుతుండగా క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు బయటపడింది.
మహమ్మారితో పోరాడుతూనే చదువు కొనసాగిస్తోంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఉదయం రాసి మధ్యాహ్నం నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందింది. పరీక్షల్లో ప్రతిభ చాటుతూ 493 మార్కులు సాధించింది. అప్పటి నుంచి క్యాన్సర్‌తో బాధపడుతూనే కర్నూలులో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇంటర్ పరీక్షలు రాసింది. శనివారం విడుదలైన ఫలితాల్లో 420 మార్కులు సాధించింది. ఎంబీబీఎస్ సీటు సాధించి పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని సృజనామృత చెబుతోంది.