
తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో క్యాన్సర్ మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఇది ఇప్పుడు చిన్నవయసు వారిని సైతం బలితీసుకుంటుంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 40 శాతం కేసులు టొబాకో రిలేటెడ్ కేన్సర్(టీఆర్సీ).. అంటే పొగాకు వినియోగించే వారివని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం 20–25 ఏళ్ల యువతనూ పట్టిపీడిస్తోందంటున్నారు. పొగాకు తీసుకోవడం ప్రారంభించిన 10–20 ఏళ్ల తర్వాత కేన్సర్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రతీ ముగ్గురిలో ఇద్దరికి వ్యాధి ముదిరిన తర్వాతే నిర్ధారణ అవుతోందని, దీంతో బతికే అవకాశాలు తగ్గుతున్నాయని పేర్కొంటున్నారు.
ఒత్తిడితో ప్రమాదమే..
మానసిక ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలతో శరీరంలో వ్యాధి నిరోరధకశక్తిపై తీవ్రప్రభావం చూపి కొన్ని రకాల హర్మోన్లు లోపిస్తాయి. దీంతో కూడా కేన్సర్ బారిన పడుతున్నారు.
జీవనశైలిలో మార్పులు..
ఏటా కరీంనగర్ జిల్లాలో వందల మంది కేన్సర్‌తో చనిపోతున్నారు. దురలవాట్లు, జీవనశైలిలో మార్పుతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. పురుషుల్లో నోటి, వివిధ రకాల కేన్సర్లు వస్తుండగా, మహిళల్లో రొమ్ము, సర్విక్ కేన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో కేన్సర్ నిర్ధారణ, చికిత్స అందుబాటులో ఉన్నాయి.
నోటి కేన్సర్‌కు కారణాలు..
పురుషుల్లో స్మోకింగ్, స్మోక్లెస్ టొబాకో వినియోగం ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. బీడీ, సిగరేట్తోపాటు నాన్ స్మోకింగ్ టొబాకోలో పాన్ మసాలా, తంబాకు, గుట్కా, ఖైనీ తినడం, ఆల్కహాల్ తాగడం వంటివి కారణమవుతున్నాయి.
పొగాకు 14 రకాల కేన్సర్లకు కారణమవుతోంది. దీని పొగలో కనీసం 80 రకాల కేన్సర్ కారకాలు(కార్సినోజెనిక్ ఏజెంట్లు) ఉంటాయి. పొగను పీల్చినప్పుడు రసాయనాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. రక్త ప్రవాహంలోకి వెళ్లి శరీరమంతా విస్తరిస్తాయి. అందుకే ఊపిరితిత్తులు, నోటి కేన్సర్లు మాత్రమే కాకుండా ఇతర రకాలు కూడా వస్తాయి. మహిళలు బాధితులవడం ఆందోళన కలిగిస్తోంది.
అందుబాటులో టీకా..
కేన్సర్ దరిచేరకుండా వ్యాక్సిన్(టీకా) అందుబాటులో ఉంది. 9 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు హెచ్‌పీవీ రెండు డోసుల్లో వేసుకోవాలి. 21ఏళ్ల వరకు కూడా వేసుకోవచ్చు.
రొమ్ము కేన్సర్‌కు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతీ లక్ష మంది మహిళల్లో 35 మంది రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నారు. జన్యులోపాలు, వంశపారంపర్యం, ఇన్ఫెక్షన్లు, రొమ్ములో గడ్డలు ఏర్పడడం, ఆధునిక జీవనశైలి, సంతానలేమి, 12 ఏళ్లలోపు రజస్వల అవడం, 55 ఏళ్ల కన్నా ముందుగానే రుతుక్రమం ఆగిపోవడం ఇందుకు కారణం. వ్యాధి నిర్ధారణ పద్ధతులున్నా అవగాహన లేక చివరిదశలో బాధితులు వైద్యులను సంప్రదిస్తున్నారు.
ఇలా గుర్తించండి..
నోటి, రొమ్ము, సర్విక్ కేన్సర్లను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. రొమ్ములో గడ్డలు ఏర్పడితే మామోగ్రామ్ పరీక్ష చేయించాలి. మలం, యూరిన్‌లో రక్తం, తెల్లబట్ట, ఎర్రబట్ట, ఒక్కసారిగా బరువు తగ్గితే.. సర్విక్ కేన్సర్‌గా భావించి హెచ్‌పీవీ డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలి. ఏడాదికోసారి స్క్రీనింగ్ చేసుకోవడంతో ముందస్తుగా కేన్సర్‌ను గుర్తించే వీలుంటుంది. నోటి ఆల్సర్లు, దగ్గితే రక్తం పడడం, బరువు తగ్గడం లక్షణాలు కనిపిస్తే నోటి కేన్సర్ పరీక్ష చేయించాలి.
‘ఆరోగ్య మహిళ’ వరం
ఆరోగ్య మహిళ కార్యక్రమంలో అన్నివ్యాధులకు నిర్ధారణపరీక్షలతోపాటు ముఖ్యంగా కేన్సర్ స్క్రీనింగ్‌పై దృష్టి పెడుతున్నాం. మహిళలకు బ్రెస్ట్, సర్వికల్, గర్భాశయ, ఇతర కేన్సర్లు ఉంటే మేం చేసే పరీక్షల్లో ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో చికిత్స సులభమవడమే కాకుండా కేన్సర్ నిర్మూలన ఫలితం మెరుగ్గా ఉంటుంది.
– డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి, కరీంనగర్
తొలిదశలో గుర్తిస్తే నయం చేయవచ్చు
కేన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే నయం చేయొచ్చు. మగవారు ఎక్కువగా ఊపిరితిత్తుల కేన్సర్‌కు గురవుతున్నారు. స్మోకింగ్, నాన్ స్మోకింగ్ టొబాకో, రెడ్‌మీట్, ఆయిల్స్, జంక్ఫుడ్స్ మానేయాలి. మద్యపానం నియంత్రించాలి. నిర్దేశిత బరువు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం అర్ధగంటపాటు వాకింగ్, వ్యాయామం చేయాలి. భోజనంలో ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
– డాక్టర్ రవీంద్రచారి, పల్మనాలజిస్టు
(చదవండి: పారేయకండి.. పదును పెట్టండి..!)