
స్టాక్ ట్రేడింగ్ చేసేవారికి జెరోధా పరిచయం అక్కర్లేని పేరు. ఎందరో దీంట్లో డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసి ట్రేడింగ్ చేస్తుంటారు. ఇక జెరోధా సంస్థ సీఈఓ నితిన్ కామత్ కూడా అందరికి సుపరిచితమే. ఎప్పుడూ ఫిట్‌గా ఉంటూ.. ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడమే గాక పలు సలహాలు సూచనలు ఇస్తుంటారు. అలాంటి ఆయనే పాకిక్ష పక్షవాతానికి(స్టోక్) గురయ్యినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. అంతేగాదు తాను కోలుకోవడానికే పద్నాలుగు నెలలు పట్టిందని అన్నారు. ఆరోగ్యం పట్ల ఇంతలా కేర్ తీసుకునేవాళ్లే స్టోక్ బారినపడితే సామాన్యుల పరిస్థితి ఏంటీ..?, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితా అంటే..
ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో జెరోధా సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన నితిన్ కామత్ తాను స్టోక్ అనంతరం ఎలా కోలుకుని యథావిధికి వచ్చారో షేర్‌చేసుకున్నారు. తాతను గతేడాది మైల్డ్ స్టోక్ బారినపడినట్లు వివరించారు. తండ్రి చనిపోవడం, నిద్రలేమి, అలసట, డీహైడ్రేషన్, అతి వ్యాయమం వంటి వాటి వల్ల ఆ పరిస్థితి ఎదురయ్యిందని పోస్ట్‌లో తెలిపారు. దాన్నంచి ఆరునెలలో కోలుకున్నా కానీ, ముఖంలో ఆ స్ట్రోక్ తాలుకా లక్షణాలు క్లియర్‌గా కనిపించేవన్నారు.
ఆ తర్వాత స్పష్టంగా చదవలేకపోవడం, రాయలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నా..కానీ ఆ తర్వాత నెమ్మదిగా మళ్లీ చదవడగలగడం, రాయడం వంటి సామర్థ్యాల్ని పొందగలిగానని అన్నారు. సుమారు 14 నెలలి తన శరీరం సాధారన స్థితికి చేరుకుందని అన్నారు. ఇప్పుడు దాదాపు 85% నా మనస్సు నా వద్దే ఉందన్నారు. అలాగే మునుపటిలో మరింత మెరుగుపడేలా సాధన చేయాల్సి ఉందని కూడా చెప్పారు. అయితే తాను ఇలా పూర్తి స్థాయిలో కోలుకోవడం చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారని అన్నారు.
అంతేగాదు ఫిట్‌గా ఉండటంపై కేర్ తీసుకోవడమే గాక ఎంతమేర ఏ స్థాయి వరకు వ్యాయమాలు చేస్తే చాలు అన్న అవగాహన కూడా అత్యంత ముఖ్యమని చెప్పారు. అలాకాదని అతిగా వర్కౌట్‌లు చేస్తే శరీరం మోటారు వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూసి స్ట్రోక్ బారినపడే ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చిరించినట్లు తెలిపారు. ఆయన జీరో 1 ఫెస్ట్ అనే జెరోధా వెంచర్ సాయంతో ఆరోగ్య సంపద, అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వాటి గురించి చర్చించడం వంటివి చేస్తుంటారు. ఇంతకీ ఈ స్ట్రోక్ అనేది అత్యంత ప్రమాదరకమైనదా? అంటే..
తస్మాత్ జాగ్రత్త..
ఉన్నట్టుండి తూలిపడిపోతున్నారా.. రెప్పపాటులోనే కంటి చూపు పోయి అంతా చీకటి అవుతోందా…పెదవులు ఓ పక్కికి లాగినట్టు అవుతున్నాయా? అయితే బీకేర్‌ఫుల్? అది బ్రెయిన్ స్ట్రోక్ లక్షణం కావచ్చు. గుండెపోటు వస్తే కాస్త ఆలస్యం అయితే ప్రాణం పోతుంది కానీ… బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఏకంగా బతికినంత కాలం అంగవైకల్యం భారిన పడేసి… మరొకరి మీద ఆధారపడే దీనస్థితికి తీసుకువస్తుంది. అందుకే స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే సత్వరం స్పందించాలని హెచ్చరిస్తుంటారు వైద్యులు.
లక్షణాలు..
బ్రెయిన్ స్ట్రోక్ వస్తే కొన్నిసార్లు ప్రాణం పోతుంది. ఇంకొన్నిసార్లు పక్షవాతం బారినపడతారు. తలలోని రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి రక్తం సరఫరా నిలిచిపోవటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఒక్కసారి స్ట్రోక్ బారిన పడితే నాలుగు గంటలలోపు సరైన చికిత్స అందించకపోతే మనిషి చనిపోవచ్చు లేదా జీవితకాలం వైకల్యం బారిన పడి మంచానికే పరిమితమవుతుంటారు. అందుకే బ్రెయిన్ స్ట్రోక్‌ని అత్యంత ప్రమాదకారిగా చెబుతుంటారు. శరీరంలోని ఓ చేయి బలహీనంగా అనిపించటం, అడుగువేసేందుకు కాళ్లు సహకరించకపోవటం, ఉన్నపళంగా బ్యాలెన్స్ తప్పి పడిపోతుండటం, కళ్లకు ఏమి కనిపించకుండా చీకట్లు కమ్మటం, మూతి ఓ పక్కకు తిరిగిపోతుండటం వంటివి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు.
భారత్లో ప్రతి నలభై సెకన్లకు ఒకరు బ్రెయిన్ స్ట్రోక్ భారిన పడుతుండగా… ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు దీని కారణంగానే చనిపోతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్స్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఇస్కిమిక్ స్ట్రోక్. ఇందులో మెదడులోని రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం వల్ల వచ్చే స్ట్రోక్. దాదాపు 87 శాతం బ్రెయిన్ స్ట్రోక్‌లు ఇలా రక్తనాళాల్లో అంతరాయం ఏర్పడటం వల్ల వచ్చేవే. రెండోది హిమోరేజిక్ స్ట్రోక్.
మెదడులో రక్తస్రావం అయినప్పుడు ఈ తరహా స్ట్రోక్‌లు వస్తాయి. కేవలం 13 శాతం మాత్రమే ఈ తరహా స్ట్రోక్‌లు ఉంటాయి. మనిషి శరీరంలో ఏ అవయవం పనిచేయాలన్నా మెదడు నుంచే సంకేతాలు రావాలి. అలాంటి మెదడు రక్తనాళాల్లో రక్తం సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు మనిషి మరణానికి దారి తీయటం లేదా పక్షవాతంతో కాళ్లు, చేతులు పనిచేయక శాశ్వత వైకల్యానికి దారి తీస్తోంది.
ఎందువల్ల వస్తుందంటే..
ఒక్కసారి స్ట్రోక్ బారినపడితే చాలు మనిషి జీవితం పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంది. వాస్తవానికి బ్రెయిన్ స్ట్రోక్‌కి కారణాలు అనేకం. మెదడులో రక్తం గడ్డకట్టడం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ప్రధాన కారణాలు కాగా.. కొన్ని రకాల గుండె జబ్బులు, వారసత్వం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవటం, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి, గురక, స్లీప్ ఆప్నియా వంటి అనేక కారణాలు స్ట్రోక్‌కి దారితీస్తున్నాయి.
ఇటీవలే వాతావరణ మార్పులు సైతం స్ట్రోక్‌కి కారణమవుతున్నట్టు నిపుణులు గుర్తించారు. అయితే స్ట్రోక్ లక్షణాలని సకాలంలో గుర్తిస్తే బాధితులను కాపాడుకునే అవకాశం ఉంది. స్ట్రోక్ భారిన పడిన వారిని ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి సౌకర్యాలు ఉన్న ఆస్పత్రులకు తీసుకువెళ్లి.. టెస్టులు చేసి నాలుగు గంటలలోపే కొన్ని రకాల ఇంజక్షన్లు ఇవ్వటం ద్వారా బాధితులు శాశ్వత వైకల్యం భారిన పడకుండా కాపాడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నామనే ఆలోచనతో దేన్ని తేలిగ్గా తీసుకోకండి, శరీరం మాట వినండి అని చెబుతున్నారు వైద్య నిపుణులు.
(చదవండి: అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలు ట్రిప్‌కి వెళ్లొద్దాం ఇలా..! చక్కటి ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్‌తో)