
దశావతారాల్లో వరాహావతారం ప్రసిద్ధి గాంచింది. జలప్రళయంలో చిక్కుకున్న భూ మండలాన్ని ఆదిదేవుడు వరాహావతారమెత్తి రక్షించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. అలాంటి ఆదివరాహావతారం తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల కేంద్రంలో ఉంది. ఆదిదేవునికి ఏటా శ్రావణ మాసంలో పుట్టిన రోజు, ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం, ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా ఉత్సవ వేడుకలు, మాస కల్యాణాలు నిర్వహిస్తారు.
40 ఏళ్లుగా నిత్యపూజలు
సుమారు 40 ఏళ్లుగా ఏటా స్వామివారికి భక్తులు నిత్యపూజలతోపాటు అభిõÙకాలు చేస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే ఆదిదేవుడు వరాహస్వామిగా భక్తులు కొలుస్తుంటారు. స్వామివారికి భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎంతోమంది ప్రముఖులు స్వామి దర్శనం కోసం వచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
పాదాలకు పూజలు
గతంలో ఆలయం చుట్టూ డోజర్‌తో చదును చేస్తుండగా బండరాయిపై స్వామివారి పాదాలు దర్శనమిచ్చాయి. అప్పటినుంచి స్వామివారు నడిచి వచ్చిన పాదాలుగా భక్తులు పేర్కొంటున్నారు. ఇక్కడ కూడా భక్తులు పూజలు చేస్తుంటారు.
గుడి లేని క్షేత్రంగా..
కమాన్‌పూర్ గ్రామానికి తూర్పున ఒక బండరాయిపై ఆదివరాహస్వామి విగ్రహం ఉంది. స్వామివారు గుడి లేకుండా వరాహావతారంలో భక్తులకు దర్శనమిస్తారు.
కోరిక నెరవేరేందుకు ముడుపులు
స్వామివారి దర్శనం కోసం వచి్చన భక్తులు.. తమ కోరికలు నెరవేరాలని ముడుపులు కట్టి అన్నదానాలు చేయడం ఇక్కడ ప్రత్యేకం. ఆదివరాహస్వామి ఆలయంలో ఈనెల 30న ఉగాది పర్వదినం సందర్భంగా ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇలా చేరుకోవాలి
కమాన్‌పూర్ మండల కేంద్రంలో కొలువుదీరిన ఆదివరాహస్వామి దేవాలయానికి వచ్చే భక్తులు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి మంథని, కాళేశ్వరం వెళ్లే ప్రధాన రహదారి కమాన్‌పూర్ ఎక్స్ రోడ్డు వద్ద బస్సు దిగాలి. అక్కడి నుంచి ఆటోలో నాలుగు కిలోమీటర్ల దూరంలో స్వామివారి దేవాలయానికి చేరుకోవాలి.
(చదవండి: Ugadi Special Recipes: పూర్ణాలు, పరమాన్నం, మామిడికాయ పులిహోర చేసేయండిలా..!)