Varaha Lakshmi Narasimha Swami
-
సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదక్షిణ ప్రారంభం
-
దివ్య మంగళరూపం నిజరూప దర్శనం
అణువణువూ అనంత భక్తితత్వంతో నిండిన ప్రకృతి రమణీయతలో భువిపై కొలువుదీరిన లక్ష్మీనారాయణుడు.. భూలోక వైకుంఠం.. సింహగిరిపై వెలసిన వరాహనరసింహుడు. ఏడాదిపొడవునా చందనలేపిత సుగంధ ద్రవ్యాల్లో చల్లబడుతూ వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రమే మంగళకర నిజరూప దర్శనమిచ్చే భక్తవరదుడు.. నిండైన చందనంలో నిత్యం కొలువుండే నరహరి నిజరూపాన్ని కనులారా తిలకించి మనసారా తరించేందుకు సమయం ఆసన్నమైంది.. చందనోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 4 గంటల నుంచి ఆ భాగ్యం భక్తులకు లభించనుంది. సింహాచలం: సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనానికి వేళాయింది. చందనోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆ భాగ్యం భక్తులకు లభించనుంది. ఉదయం నాలుగు గంటల నుంచి స్వామి నిజరూప దర్శనం ప్రారంభం కానుంది. చందనోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఆలయ అర్చకులు, వైదిక కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి విశేష పూజలు నిర్వహించిన అనంతరం వెండి బొరుగులతో చందనం వలుపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నిజరూపభరితుడ్ని చేస్తారు. అనంతరం ఆరాధన నిర్వహించి తొలి దర్శనాన్ని ఉదయం 3గంటల సమయంలో దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుకు అందిస్తారు. తదుపరి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి స్వామికి పట్టువస్త్రాలు అందించే దేవాదాయశాఖ మంత్రి, ఉన్నతాధికారులు, టీటీడీ తరఫున పట్టువస్త్రాలు అందించే అధికారులకు దర్శనం అందిస్తారు. అనంతరం ఉదయం 4 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభిస్తారు. రాత్రి 7గంటల వరకే క్యూలో అనుమతి స్వామివారి నిజరూపదర్శనానికి విచ్చేసే భక్తులను రాత్రి 7 గంటలలోపు క్యూల్లోకి అనుమతిస్తారు. అనంతరం క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి అప్పటివరకు క్యూల్లో వేచిఉన్న భక్తులకు స్వామివారి దర్శనాలు అందజేస్తారు. దర్శన సమయాలు ఉచిత, రూ.300 టిక్కెట్లు కలిగిన భక్తులందరికీ ఉదయం 4 గంటల నుంచి రాత్రి వరకు దర్శనం అందజేస్తారు. రూ.1500 టిక్కెట్టుపై వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు ఉదయం 4నుంచి 6 గంటలు తిరిగి 7 గంటల నుంచి 9 గంటల వరకు రెండు స్లాట్లు పెట్టారు. అలాగే రూ.1200 టిక్కెట్టుపై వచ్చే వీవీఐపీలకు కూడా ఉదయం 4గంటల నుంచి 6గంటల వరకు, తిరిగి 7గంటల నుంచి 9గంటల వరకు దర్శనాల సమయం కేటాయించారు. దివ్యాంగుల కోసం.. దివ్యాంగులకు సాయంత్రం 5గంటల నుంచి 6 గంటలలోపు దర్శన సమయాన్ని కేటాయించారు. ఉచిత, రూ.300,రూ.1000,రూ.1200,రూ.1500 టిక్కెట్ల క్యూలను, క్యూలపై షామియానాలు, టెంట్ల్ ఏర్పాటు చేశారు. 25వేల మంది భక్తులు మొత్తం క్యూల్లో పట్టేలా ఏర్పాట్లు చేశారు. మంచినీరు, మజ్జిగ, ఇతర శీతలపానియాలు క్యూల్లో అందించే ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటల నుంచి సహస్రఘటాభిషేకం రాత్రి 9 గంటల నుంచి సహస్రఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఇందుకోసం వెండి కలశాలను, మట్టి కలశలను సిద్ధం చేశారు. అలాగే ఆలయ దక్షిణ రాజగోపురం వద్ద బ్రిడ్జిపై నుంచి సహస్రఘటాభిషేకం నిర్వహణలో పాల్గొనే శ్రీవైష్ణవస్వాములు వెళ్లేలా, దుగువ నుంచి దర్శనం అనంతరం వెళ్లే భక్తులు వెళ్లేలా వంతెన ఏర్పాటు చేశారు. ఒక పక్క ఏడు గంటలలోపు క్యూలో ఉన్న భక్తులకు దర్శనాలు అందిస్తూనే, మరో వైపు సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వíస్తారు. విధుల్లో పోలీసులు చందనోత్సవం సందర్భంగా విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు సోమవారం ఉదయానికే చేరుకున్నారు. కొండదిగువ ట్రాఫిక్ పోలీసులకు, సింహగిరిపై లా అండ్ ఆర్డర్ పోలీసులకు వేర్వేరుగా శిబిరాలు ఏర్పాటు చేసి పోలీస్ అధికారులు ఏయే ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాలో డ్యూటీ చార్ట్‌లు వేశారు. విద్యుత్ కాంతులతో సింహగిరి చందనోత్సవాన్ని పురస్కరించుకుని సింహగిరి విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. అలాగే ఆలయాన్ని పెద్ద ఎత్తున పుష్పాలంకరణ చేశారు. -
అఖండ సినిమాతో పరిశ్రమకు ధైర్యం వచ్చింది: బాలకృష్ణ
సాక్షి, విశాఖపట్నం: అఖండ సినిమా ఘన విజయంతో ఫుల్లు ఖుషీలో ఉన్నారు హీరో బాలకృష్ణ. అఖండ భారీ విజయం నేపథ్యంలో గురువారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నాడు బాలకృష్ణ. ఆయనతో పాటు దర్శకుడు బోయపాటి కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘అఖండ సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా విశాఖలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశాం. ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలియ చేసుకునేందుకు వచ్చాము. సంవత్సరం తొమ్మిది నెలల తర్వాత విడుదలైన సినిమాకు మంచి ఆదరణ చూపించారు.ఘన విజయం అందించారు. ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. ఇది మా విజయం కాదు....చిత్ర పరిశ్రమ విజయం’’ అన్నారు. (చదవండి: ‘అఖండ’ ఫైట్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు) అంతేకాక ‘‘ఈ సినిమాతో చలనచిత్ర పరిశ్రమకు ఒక ధైర్యం వచ్చింది. మంచి సినిమాలను ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు సినిమాను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు’’ అన్నారు బాలకృష్ణ. చదవండి: అన్‌స్టాపబుల్ షోలో సూపర్ స్టార్ సందడి.. ఫొటోలు వైరల్ -
తెలుగు ప్రేక్షకులు బెస్ట్: నటుడు
సాక్షి, సింహాచలం(పెందుర్తి): ముద్దుల మావయ్య సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చిందని, అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నానని ప్రముఖ సినీ నటుడు ఆనంద్‌రాజ్ అన్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని ఆదివారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. తెలుగు ప్రేక్షకులు బెస్ట్ అంటూ ప్రశంసించారు. బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా విశాఖలో షూటింగ్ జరుగుతున్న సమయంలో తొలిసారిగా సింహాచలం వచ్చానన్నారు. అప్పటి నుంచి ఎప్పుడు విశాఖ వచ్చినా.. వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుంటున్నట్టు తెలిపారు. 1986 నుంచి సినిమాల్లో నటిస్తున్నానని వెల్లడించారు. ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీగా ఉన్నానన్నారు. ఈ సందర్భంగా ఆనంద్‌రాజ్ స్వామికి పూజలు నిర్వహించారు. (చదవండి: కిల్ రాజు అంటావా..సినిమా ఎవడు ఇస్తాడు?) -
తిరుమల: శాస్త్రోక్తంగా బాలాలయ సంప్రోక్షణ
సాక్షి, తిరుమల: శ్రీవరాహస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ సంప్రోక్షణము వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో కె.ఎస్.జవహర్ రెడ్డి దంపతులు, అదనపు ఈవో ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. వరాహస్వామి వారి ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో వేంచేపు చేసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారిని, శ్రీ వరాహస్వామివారి ఉత్సవర్లను సుప్రభాతంతో మేల్కొలిపి, పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, ప్రధాన కుంభారాధన, అర్చన నిర్వహించారు. అనంతరం శ్రీ వరాహస్వామివారి ప్రధాన హోమగుండమైన సభ్యహోమ గుండంలో మహా పూర్ణాహూతి నిర్వహించారు. తరువాత విమాన గోపురం, ద్వార పాలకులు, ఎదురు ఆంజనేయస్వామివారికి, విష్వక్సేనులవారికి, భాష్యకారులవారి హోమగుండాలలో మహా పూర్ణాహూతి జరిగింది. (చదవండి: తిరుమల: మహాసంప్రోక్షణ ప్రారంభం) పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామివార్లు ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. తరువాత సుమూహర్తంలో భగవత్ వైఖానస ఆగమోక్తంగా ఆచార్య పురుషులు బాలాలయంలోని వరాహస్వామివారికి ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీ వరాహస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూయబడిన రాగి రేకులు అమర్చేందుకు బాలాలయం నిర్వహించినట్లు తెలిపారు. బంగారు తాపడం పనులు పూర్తవ్వడానికి దాదాపు 5 నెలలు సమయం పడుతుందన్నారు. కావున అప్పటి వరకు భక్తులకు శ్రీ వరాహస్వామివారి మూల విరామూర్తి దర్శనం ఉండదన్నారు. ఇందుకోసం డిసెంబర్ 5వ తేదీ నుండి బాలాలయం కార్యక్రమాలు నిర్వహించి, గురువారం ఉదయం బాలాలయ సంప్రోక్షణ శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. తదుపరి మహా సంప్రోక్షణ జరుగువరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారని వివరించారు. (చదవండి: ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో..) -
తిరుమల: మహాసంప్రోక్షణ ప్రారంభం
సాక్షి, తిరుమల: శ్రీవరాహస్వామి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. డిసెంబరు 10న మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వరాహస్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో 20 మంది ప్రముఖ రుత్వికులు 13హోమగుండాలలో విశేష హోమాలు నిర్వహించనున్నారు. నేడు ఉదయం 7.00 నుండి 10.00 గంటల వరకు యాగశాలలో హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం, వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. కళాకర్షణ : రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతో పాటు ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేస్తారు. డిసెంబరు 7, 8, 9వ తేదీల్లో : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరల రాత్రి 8 నుండి 10 గంటల వరకు విశేషహోమాలు, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. డిసెంబరు 10న: ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ మహాసంప్రోక్షణము వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు శ్రీ వరాహస్వామివారు తిరు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. వరాహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూయబడిన రాగి రేకులు అమర్చేందుకు బాలాలయం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు భక్తులకు వరాహస్వామి వారి మూల విరామూర్తి దర్శనం ఉండదు. ఇందుకోసం ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల తరహాలో అత్తి చెక్కతో విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. తదుపరి మహా సంప్రోక్షణ జరుగు వరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు. -
శాశ్వత పరిష్కారం చూపుతాం - మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ శనివారం శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని సింహాచలం పంచ గ్రామాల భూసమస్య పరిష్కారం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ సర్కారు ఎన్నికలకు ముందు తప్పుడు జీవోల పేరుతో మాయ చేసిందే తప్ప సమస్యకు పరిష్కారం చూపలేదు. ఫలితంగా పీఠాధిపతులు కోర్టును ఆశ్రయించారు. ప్రజాసంకల్పయాత్రలో ప్రజలు విన్నవించిన ఈ సమస్యను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ హామీని నిలబెట్టుకునేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నెలన్నర రోజుల్లోనే ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చలు జరపడమే కాకుండా.. పంచ గ్రామాల భూ సమస్యలపై శాశ్వత పరిష్కారం లభించేలా సమగ్రమైన జీవో ఇచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. -
దేవాలయాల్లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
విశాఖపట్నం : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సోమవారం శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సింహగిరిపై రూ. 25 - 30 కోట్ల రూపాయల వరకూ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే ప్రతి భక్తుడికి వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పంచగ్రామాల భూసమస్యల కోసం ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రత్యేక కమిటీ వేసి బాధితులకు న్యాయం జరిగిలే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఇక మీదట దేవాలయంలో ఇటువంటి అవినీతి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. దైవ భక్తి, ఆలయ అభివృద్ధికోసం పాటు పడే వారిని ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలిపారు. -
విస్తరణకు విస్ఫోటం
సాక్షి, సింహాచలం(పెందుర్తి) : కొండపై కొలువైన వరాహ నారసింహ స్వామిని చేరాలంటే ఘాట్ రోడ్డు ప్రధాన మార్గమన్నది తెలిసిందే. మెట్ల మార్గం నడకదారి మాత్రమే కావడంతో వాహనాలకు ఉన్న ఏకైక మార్గం ఘాట్ రోడ్డు ఒక్కటే. ఇంత కీలకమైన మార్గంలో ఒక్క చోట మాత్రం వాహన చోదకులు బెంబేలెత్తే పరిస్థితి ఉంది. అతి ప్రమాదకరంగా ఉన్న మలుపు (అదే వ్యూ పాయింట్ కూడా) వద్ద వాహన చోదకులు దేవుడిపైనే భారం వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొండదిగువ నుంచి సింహగిరికి వెళ్లేందుకు ఐదు కిలోమీటర్ల పొడవుండే సింహగిరి ఘాట్‌రోడ్డులో వ్యూ పాయింట్ వద్ద వాహనాలు మలుపు తీసుకోవడం ఓ సమస్యగా ఉండేది. ఈప్రాంతంలో ఒక పక్క పెద్ద రాతి కొండ, మరొక పక్క లోతైన లోయ ఉండడంతో ఈరెండింటి మధ్య గల ఇరుకైన మార్గంలో వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ముప్పు భయం సంగతి అటుంచితే.. ఒకేసారి ఎదురెదురుగా వాహనాలు వస్తే ఇక్కడ తప్పించలేని పరిస్థితి నెలకొంటోంది. దీంతో ఈప్రాంతంలో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభిస్తోంది. 60 ఏళ్ల మార్గం సింహగిరికి వెళ్లేందుకు 1959 వరకు రోడ్డు మార్గం లేదు. మెట్లమార్గంలోనే భక్తులు వెళ్లి వస్తూండేవారు. ఆలయంలో విధులు నిర్వర్తించే పూజారులు, ఇతర ఉద్యోగులు సైతం ఈమార్గంలోనే వెళ్లి వచ్చేవారు. దీంతో దేవస్థానం అప్పటి అనువంశిక ధర్మకర్త పీవీజీ రాజు ఘాట్‌రోడ్డు వేయాలని సంకల్పించారు. అప్పటి ఈవో డీఎల్ఎన్రాజు తోడ్పడ్డారు. దీంతో 1959 లోనే ఘాట్‌రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అప్పటి మద్రాస్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన నాగేశ్వర్ అయ్యర్‌తో ఘాట్ రోడ్డు ప్రణాళిక రూపొందించారు. కొండను, చెట్లను తుప్పలను తొలగించి మార్గాన్ని సిద్ధం చేశారు. అనంతరం తారు రోడ్డు పనులను గోపాలపట్నానికి చెందిన సదరం అప్పలనాయుడు అనే కాంట్రాక్టర్ పూర్తి చేశారు. ఇలా నాలుగేళ్లలోనే దాదాపు 1963లో ఘాట్‌రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఐదు కిలోమీటర్లు ఉండే ఘాట్‌రోడ్డులో ట్రాఫిక్ నానాటికీ పెరుగుతూ ఉండడంతో రెండేళ్ల కిందట ఇక్కడి మహాత్మా జ్యోతీబా పూలే గురుకుల పాఠశాలవైపు నుంచి రెండో ఘాట్‌రోడ్‌ను దేవస్థానం అధికారులు నిర్మించారు. కానీ ఘాట్‌రోడ్డు మలుపు వద్ద మాత్రం ట్రాఫిక్ సమస్య తలనొప్పిగా మారింది. దీంతో కొండను తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. నానాటికీ జటిలం పదేళ్ల నుంచి సింహగిరికి భక్తుల సంఖ్య పెరుగుతూ రావడంతో దానికి అనుగుణంగా ఘాట్‌రోడ్డులో వెళ్లే వాహనాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఐదేళ్ల వ్యవధిలో భక్తుల సంఖ్య, వాహనాల సంఖ్య మరింతగా పెరిగింది. సింహగిరిపై జరిగే ప్రముఖ ఉత్సవాలైన చందనోత్సవం, ముక్కోటి ఏకాదశి, వార్షిక కల్యాణోత్సవం, గిరిప్రదక్షిణ ఉత్సవం రోజుల్లో మలుపు వద్ద గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తోంది. చందనోత్సవం రోజుల్లో భక్తుల కోసం ఏర్పాటు చేసే క్యూలు మలుపు వరకు విస్తరిస్తున్నాయి. దాంతో వారి మధ్య నుంచి బస్సులు నడిపించడం మరీ దుర్లభంగా మారుతోంది. ఈ పరిణామం భక్తులను మరింతగా భయపెడుతోంది. అంతే కాక స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రముఖుల వాహనాలు కూడా ఈప్రాంతంలో ఇరుక్కుపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మలుపు వద్ద రోడ్డు విస్తరణకు దేవస్థానం ఎంతో కాలంగా కసరత్తు చేస్తోంది. ఎన్నోసార్లు తెరపైకి.. మలుపు దగ్గర నెలకొన్న క్లిష్ట పరిస్థితిని నిశితంగా పరిశీలించిన దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతి రాజు, అప్పటి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, సీపీ మహేష్‌చంద్ర లడ్డా మలుపు వద్ద కొండలో కొంత భాగాన్ని తొలగించడం ఒక్కటే శరణ్యమని గతంలో భావించారు. దీనికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని దేవస్థానం అధికారులకు సూచించారు. నిజానికి 2008 లోనే తొలిసారిగా ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ అది కార్యరూపం ధరించలేదు. అప్పటి నుంచి అనేకసార్లు ప్రణాళిక తెరపైకి రావడం, కనుమరుగు కావడం ఆనవాయితీగా జరిగేది. అవసరమైన అనుమతులపై సందిగ్థత నెలకొనడంతో ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు పదకొండేళ్ల తర్వాత ఇప్పుడు పనులు మొదలయ్యాయి. రెండు దశల్లో ప్రణాళిక ప్రమాదకర మలుపు వద్ద కొండను రెండు దశల్లో తొలగించి విస్తరించాలని సింహాచల దేవస్థానం అధికారులు ప్రణాళిక రూపొందించారు. తొలిదశలో దాదాపు 75 మీటర్ల పొడవు, సుమారు పది అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు మేర కొండను తొలగించాలని నిర్ణయించారు. ఇటీవల పనుల నిమిత్తం టెండర్లు పిలిచారు. లైసెన్స్ బ్లాస్టర్గా నమోదైన వై.వి.కన్స్ట్రక్షన్స్(విశాఖపట్నం)కు పనులను అప్పగించాలని, ఇందుకు రూ. 10 లక్షలు వెచ్చించాలని అప్పగించారు. పనులకు అనుమతివ్వాలని నగర పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు పెట్టారు. అన్ని అనుమతులూ రావడంతో గడిచిన శుక్రవారం నుంచి కొండను తొలగించే పనులు చేపట్టారు. రోజూ 150 క్యూబిక్ మీటర్ల మేర రాళ్ల తొలగింపు మలుపు వద్ద కొండను రోజుకి 150 క్యూబిక్ మీటర్ల మేర తొలగిస్తున్నారు. భద్రతా ప్రమాణాల దృష్ట్యా అంతకన్నా ఎక్కువ తొలగించకూడదని నిర్ణయించారు. మలుపు వద్ద లోయకు ఒక వైపు మెట్ల మార్గం ఉండడం ఒక కారణమైతే.. ఎక్కువ పరిమాణంలో కొండను తొలగిస్తే ఉదయం భక్తుల దర్శన సమయానికి రాళ్లను క్లియర్ చేయలేని పరిస్థితి ఉండడం రెండో కారణం. రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి బ్లాస్టింగ్ పనులు చేపడుతున్నారు. విస్ఫోటం తర్వాత ఘాట్ రోడ్డుపై పడే కొండ రాళ్లను వెంటనే తొలగిస్తున్నారు. ఈపనుల దృష్ట్యా సాయంత్రం 6 గంటల నుంచే ఘాట్ రోడ్డు లోను, మెట్లమార్గంలో భక్తులను, లేదా వాహనాలను అనుమతించడం లేదు. రాత్రి ఏడు గంటలకే దర్శనాలు నిలిపివేస్తున్నారు. బాంబ్ బ్లాస్టింగ్ జరిగే సమయంలో టోల్గేట్ల ప్రవేశం వద్ద, మెట్ల మార్గం వద్ద సిబ్బందిని అప్రమత్తంగా ఉంచుతున్నారు. బ్లాస్టింగ్ చేసే సమయం ముందు మైకుల్లో సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఈనెల 10 వరకు బ్లాస్టింగ్ పనులు జరగనున్నాయి. ‘నియంత్రిత’ విస్ఫోటం కొండకు ముక్కలు చేసేందుకు బాంబులు పేల్చాలని నిర్ణయించి ఇందుకు కంట్రోల్ బ్లాస్టింగ్ సిస్టంను అనుసరించడానికి వ్యూహం సిద్ధం చేశారు. ఈ పద్ధతిని సెకెండరీ కంట్రోల్ బ్లాస్టింగ్ లేదా జాకీ హోల్స్ బ్లాస్టింగ్ అని కూడా అంటారు. రాతి స్థితిని బట్టి తొలగించాల్సిన కొండకు డ్రిల్లింగ్ యంత్రంతో ఎనిమిది అడుగుల లోతుకు రంధ్రాలు చేసి బాంబ్ స్టిక్స్‌ను అమరుస్తున్నారు. రంధ్రాల్లో 25 సెంమీ లావు, 10 సెంమీ పొడవు ఉండే బాంబులను అమరుస్తున్నారు. ఎంతమేర కొండని తొలగించాలో దానికి సరిపడా బాంబులను అమరుస్తున్నారు. విస్ఫోటం కారణంగా రాళ్లు భారీ ఎత్తున కిందికి తుళ్లకుండా, ఎగరకుండా ఒక్కొక్కటి 1200 కిలోల బరువు ఉండే నాలుగు టైర్ మ్యాట్లను క్రేన్ సాయంతో కొండపై వేస్తున్నారు. దాదాపు రెండు వందల మీటర్ల దూరం వరకు వైర్లు లాగి మైనింగ్ మెగ్గరు బాక్స్ సాయంతో కొండని పేల్చుతున్నారు. దీని వల్ల 10 మీటర్ల లోపు లేదా దాని కన్నా తక్కువ పరిధిలోనే రాళ్లు పడతాయని ప్రస్తుతం పనులు చేస్తున్న లైసెన్స్డ్ బాంబ్ బ్లాస్టర్ టి.ప్రసాద్ తెలిపారు. ప్రమాద మలుపు వద్ద విస్తరణ జరిగే ప్రదేశానికి ఒక వైపు ఉన్న లోయ భాగంలోనే మెట్ల మార్గం ఉండటంతో అటు రాళ్లు ఎగిరిపడే ప్రమాదం ఉందని, అందుకే కంట్రోల్ బ్లాస్టింగ్ సిస్టంను ఉపయోగిస్తున్నామని తెలిపారు. కొండకి వైర్లు అమరుస్తున్న బాంబ్ బ్లాస్టర్స్ -
శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ
తిరుమల: తిరుమలలోని వరాహస్వామివారి ఆలయంలో శనివారం శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ నిర్వహించారు. ఇందులో భాగంగా ఐదు రోజుల పాటు ప్రత్యేక ఆరాధనలు, అభిషేకాలు నిర్వహించారు. తిరుమల శ్రీభూవరాహస్వామి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ సందర్భంగా 4 రోజుల పాటు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించా రు. ఈనెలæ 22న ఉదయం రుత్విక్ వరణం, రాత్రి అంకురార్పణ చేశారు. 23న కళాకర్షణం చేపట్టారు. 25న అష్టబంధన కార్యక్రమం, 26న మహాశాంతి హోమం, మహాశాంతి అభిషేకం నిర్వహించారు. శనివా రం ఉదయం 11.07 నుంచి మధ్యాహ్నం 1.16 గంటల మధ్య కర్కాటక లగ్నంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ నిర్వహించారు. ఉదయం మహాపూర్ణాహుతి, తర్వాత ఆలయ విమాన గోపురానికి యాగశాలలోని కలశంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలిపి వేశారు. విశేష ఆరాధనలు, నైవేద్యాలు విమాన గోపుర శిఖరంలో నలుగురు దేవతలుంటారు. వీరిని విమానం ప్రపధ్యే.., విష్ణుమయం ప్రపధ్యే.., దేవావాసం ప్రపధ్యే.., వైకుంఠోద్భవం ప్రపధ్యే.. అనే మంత్రాలతో ప్రార్థిస్తారు. గోపురం చుట్టూ 24 మంది ఆవరణ దేవతలు ఉంటారు. మహాసంప్రోక్షణతో యాగశాలలో కుంభంలో ఉన్న దేవతామూర్తుల శక్తిని బింబం(విగ్రహం)లోకి ఆవాహన చేశారు. విమానగోపురంలోని దేవతల శక్తితో పాటు వరాహస్వామి, విష్వక్సేనుడు, రామానుజాచా ర్యులు, పుష్కరిణి వద్ద ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాలకు తిరిగి దైవశక్తి చేకూరింది. దేవతా మూర్తుల విగ్రహాలకు 12 జీవస్థానాలు, 4 ఉపస్థానాలు, 48 కళలు ఉంటాయి. కళాకర్షణతో తొలగించిన ఈ 48 కళలను మహాసంప్రోక్షణతో తిరిగి ఆవాహన చేశారు.. మహాసంప్రోక్షణ అనంతరం విశేష ఆరాధనలు, నైవేద్యాలు సమర్పించారు. ఆ తర్వాత అక్షతారోపణం చేపట్టారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. రాత్రి 7 నుంచి 9గంటల వరకు వరాహస్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమాల్లో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, వీఎస్వోలు మనోహర్, ప్రభాకర్, డెప్యూటీ ఈఓలు హరీంద్రనాథ్, నాగరత్న, ఆలయ ఓఎస్డీ పాల శేషాద్రి, బొక్కసం బాధ్యులు గురురాజారావు తదితరులు పాల్గొన్నారు. మహద్భాగ్యం మహాసంప్రోక్షణ నిర్వహించే అవకాశం రావడం మహద్భాగ్యంగా భావిస్తున్నట్టు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గతంలో 1982లో ఈ ఆలయంలో మహాసంప్రోక్షణ జరిగిందని, తిరిగి ఇప్పుడు నిర్వహించే అవకాశం తమకు దక్కిందని అన్నారు. ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు ఈ బాలాలయ కార్యక్రమాల సందర్భంగా కొలతలు తీసుకున్నట్టు ఈవో తెలిపారు. ఇక్కడి సేనాధిపతి వారికి, ఆంజనేయ స్వామికి, రామానుజులకు బంగారు పూత పూసిన మకరతోరణాలు సమర్పించామని, వీటి విలువ దాదాపు రూ.7 లక్షలని తెలిపారు. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు భక్తులందరూ సహకరించారని, టీటీడీ అర్చకస్వాములు, ఇంజినీరింగ్ తదితర అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది బాగా కృషి చేశారని కృతజ్ఞతలు తెలియజేశారు. 37 ఏళ్ల తర్వాత వరాహస్వామి ఉత్సవమూర్తి దర్శనం తిరుమలలో వరాహస్వామి ఉత్సవమూర్తి శనివారం రాత్రి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వరాహస్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ పూర్తయిన సందర్భంగా స్వామివారి ఊరేగింపు జరిగింది. ఈ ఆలయంలో గతంలో 1982వ సంవత్సరంలో మహాసంప్రోక్షణ నిర్వహించినపుడు వరాహస్వామి ఉత్సవమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు. తిరిగి 37 ఏళ్ల తరువాత శనివారం స్వామివారు ఊరేగింపుగా రావడంతో పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారులు మోహనరంగాచార్యులు, అనంతశయన దీక్షితులు తదితరులు పాల్గొన్నారు. -
సాధారణ భక్తులకే పెద్ద పీట
సింహాచలం(పెందుర్తి): వచ్చే నెల 7న వైశాఖ శుద్ద తదియని పురస్కరించుకుని సింహగిరిపై జరిగే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. చందోత్సవ ఏర్పాట్లపై బుధవారం దేవస్థానం వైదికులు, సెక్షన్ హెడ్లు, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందితో సమీక్ష ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులకే పెద్ద పీట వేస్తూ చందనోత్సవ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఒకేసారి 17,300 పట్టేలా ఉచిత, 200, 500, వీఐపీ, ప్రోటోకాల్ వీఐపీ దర్శన క్యూలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వీఐపీలు, దాతలు కోసం పరిమిత సంఖ్యలోనే రూ.1000 టిక్కెట్లు జారీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే న్యాయమూర్తులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు, దేవస్థానానికి బూరి విరాళం అందించిన ముఖ్య దాతలకు, వారి కుటుంబ సభ్యులకు రూ.1200 టిక్కెట్లు పరిమితంగా ఇస్తామన్నారు. దేవస్థానం సంప్రదాయం ప్రకారం చందనోత్సవం రోజు ఉదయం 3 గంటలకు వంశపార ధర్మకర్తకు తొలిదర్శనాన్ని అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వస్త్రాలు తీసుకొచ్చే దేవాదాయశాఖ కమిషనర్, ప్రిన్సిపాల్ సెక్రటరీ, టీటీడీ తరపున స్వామికి పట్టువస్త్రాలు అందించే వారికి ఉదయం 4 గంటలలోపు దర్శనాలు అందిస్తామన్నారు. అనంతరం ఉచిత, రూ.200, రూ.500 దర్శన క్యూల్లో ఉన్న సాధారణ భక్తులందరికీ స్వామివారి దర్శనాన్ని నిరంతరంగా అందిస్తామన్నారు. రాత్రి 7 గంటల తర్వాత క్యూల్లోకి అనుమతించమని, అప్పటివరకు క్యూల్లో ఉన్న వారందరికీ దర్శనాలు అందించడం జరుగుతుందన్నారు. ♦ రూ. 1200 టిక్కెట్లపై వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు ఉదయం 5 నుంచి 6 గంటల వరకు, తిరిగి ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే దర్శనాలు అందిస్తామన్నారు. ♦ రూ. 1000 టిక్కెట్లపై వచ్చే వీఐపీలకు ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు, తిరిగి ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 3గంటల వరకు మాత్రమే దర్శనాలు ఉంటాయన్నారు. ♦ ఏ స్లాట్‌కి ఆస్లాట్కి దర్శన సమయాలు పొందుపరుస్తూ వేర్వేరు రంగుల్లో టిక్కెట్లు జారీ చేయడం జరుగుతుందన్నారు. ♦ దివ్యాంగులకు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు దర్శన సమయాన్ని కేటాయించామన్నారు. వారితో పాటు ఒక్కరిని మాత్రమే సహాయకులుగా అనుమతిస్తామన్నారు. ♦ కొండదిగువన అడవివరం కూడలి, పాత గోశాల జంక్షన్ల నుంచి ఆర్టీసీ బస్సులను ఉచితంగా దేవస్థానం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులంతా వారివారి వాహనాలను పాత గోశాల జంక్షన్, అడవివరం జంక్షన్లలో పార్కింగ్ ప్రదేశాల్లో నిలుపుచేసి బస్సుల్లో కొండకి వెళ్లేలా ఏర్పాటు చేశామన్నారు. ♦ రూ.1000 టిక్కెట్లుపై వచ్చే వీఐపీలు కూడా వారి వాహనాలు కొండదిగువనే పార్కింగ్ చేసి, దేవస్థానం ఏర్పాటు చేసే మిని బస్సుల్లో సింహగిరికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. ♦ నగరంలోని 25 బ్యాంకుల్లో ఈనెల 3 లేదా 4వ తేదీ నుంచి రూ.200, రూ.500 దర్శన టిక్కెట్లు విక్రయాలు జరుపుతామన్నారు. ♦ జీవీఎంసీ పారిశుధ్య ఏర్పాట్లు, పోలీస్‌శాఖ 1000 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తోందన్నారు. అలాగే ఫైర్, దేవాదాయాశాఖ, విద్యుత్, ఆర్టీసీ, మెడికల్ అండ్ హెల్త్, రెవెన్యూ, ఎక్సైజ్ తదితర ప్రభుత్వశాఖలు ఏర్పాట్లలో పాలు పంచుకుంటున్నాయని తెలిపారు. ♦ మొత్తం 2500 మంది వరకు పలు ప్రభుత్వ శాఖల సిబ్బంది చందనోత్సవ ఏర్పాట్లలో విధులు నిర్వర్తిస్తున్నట్టు తెలిపారు. ♦ 2వేల మందికిపైగా వలంటీర్లు క్యూల్లో భక్తులకు సేవలందించేందుకు పాల్గొంటున్నారని తెలిపారు. అలాగే 60 స్వచ్ఛంద సంస్థలు క్యూల్లో భక్తులకు మజ్జిగ, మంచినీరు, బిస్కట్లు, ఫలహారాలు అందిస్తాయన్నారు. సమీక్షలో దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఉప ప్రధానార్చకులు కరి సీతారామాచార్యులు, ఇంజనీరింగ్ అధికారులు మల్లేశ్వరరావు, కోటేశ్వరరావు, రమణ, రాంబాబు, తాతాజి, అప్పారావు, ఏఈవొలు ఆర్.వి.ఎస్.ప్రసాద్, రామారావు, కె.కె.రాఘవకుమార్, మోర్తా వెంకట కృష్ణమాచార్యులు, నక్కాన ఆనందకుమార్, సూపరింటిండెంట్లు తిరుమలేశ్వరరావు, రమణమూర్తి, బంగారునాయుడు, జగన్నాథం, పద్మజ తదితరులు పాల్గొన్నారు. -
వరాహ లక్ష్మీ నరసింహ స్వామి నిజరూప దర్శనం
నిత్యం చందనపు పూతల మాటున అసలు రూపమేమిటో అంతుపట్టకుండా ఉంటాడాయన. ఏడాదికి ఒక్కసారి మాత్రం ఆ చందనపు పూతలను తొలగించుకుని, భక్తులకు తన నిజరూప దర్శన భాగ్యం కల్పిస్తాడా స్వామి. ఆయనే సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి. స్వామి నిజరూప దర్శనం లభించే ఈ శుభ తరుణం... ఈ నెల 29, శనివారం అక్షయ తదియ నాడే. ఈ సందర్భంగా ఆలయం గురించిన ఆసక్తికరమైన విశేషాలు... చుట్టూ కొండలు, అనాస, జీడి, మామిడి, పనస, సంపెంగ తదితర వృక్ష, ఫల, పుష్ప వనాల మధ్య సింహాచల క్షేత్రం విరాజిల్లుతోంది. హిరణ్యాక్షుణ్ణి సంహరించిన వరాహావతారం, హిరణ్యకశిపుని సంహరించిన నారసింహ అవతారాల కలయికలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఇక్కడ వెలిశాడు. విహంగ వీక్షణంలో ఈ కొండ సింహాకారంలో కనిపిస్తుంది. దాంతో ఈ క్షేత్రాన్ని సింహగిరిగా కూడా పిలుస్తారు. అద్భుత శిల్పసంపద అద్భుతమైన శిల్పసంపద, రాతి కట్టడాలతో ఆలయం నిర్మితమైంది. ఆలయంలోని బేడా మండపం, ఆస్థానమండపం, భోగమండపం, అంతరాలయంలో స్వామి వేంచేసే ప్రహ్లాదమంటపం, కల్యాణమంటపం, హంసమూల రాతిరథం, రాజగోపురం ఈ క్షేత్రంలో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. బేడామండపంలో 32 నారసింహ రూపాలు దర్శనమిస్తాయి. మహిమాన్విత కప్పస్తంభం ఎంతో మహిమాన్వితమైన కప్పస్తంభం ఆలయంలో ఉంది. పూజారులు భక్తులను ఈ స్తంభానికి కట్టివేసి, కొంత కప్పం చెల్లిస్తే విడిపిస్తారు. అందుకే ఈ స్తంభానికి కప్పస్తంభమని పేరు. ఇలా చేస్తే మంచిదని విశ్వాసం. సంతాన వేణుగోపాలస్వామి యంత్రం ఈ స్తంభం అడుగుభాగంలో ప్రతిష్టింపబడింది. ఈస్తంభాన్ని ఆలింగనం చేసుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని విశ్వాసం. అలాగే పిల్లలు లేని దంపతులు ఈ స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటే సంతానప్రాప్తి కల్గుతుందని చెబుతారు. పాపాలను నశింపజేసే గంగధార ఈ క్షేత్రానికి ఈశాన్య దిక్కులో నిత్యం పారే గంగధార ఎంతో విశిష్టమైనది. ఇక్కడ స్నానమాచరిస్తే పాపాలు నశిస్తాయని, ఈ నీటిని సేవిస్తే రోగాలు నయమవుతాయని చెబుతారు. స్థలపురాణం: హిరణ్యకశిపుడి కోపోద్రేకానికి గురై ప్రహ్లాదుడు విశాఖ పూర్వ సముద్రంలో పడవేయబడతాడు. ప్రహ్లాదుడ్ని రక్షించేందుకు శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి జారుతున్న వస్త్రాన్ని ఒకచేతితోను, మరొక చేతితో గరుత్మంతునికి అమృతాన్ని అందిస్తూ అమితవేగంతో ఒక్కసారిగా ఈ కొండపైకి దూకి ప్రహ్లాదుణ్ణి ర క్షించాడు. ప్రహ్లాదుడి కోరిక మేరకు స్వామి సింహగిరిపైనే ఉండి కొంతకాలం పూజలు అందుకున్నాడు. ప్రహ్లాదుడి అనంతరం పూజలు చేసేవారు కరువవడంతో మరుగునపడ్డ స్వామిపై పెద్ద పుట్ట వెలిసింది. కొంతకాలానికి షట్చక్రవర్తులలో ఒకరైన పురూరవుడు తన భార్య ఊర్వశితో కలిసి హంసవాహనంపై ఆకాశమార్గంలో విహారయాత్ర చేస్తుండగా ఉన్నట్టుండి హంసవాహనం ఈ కొండపై ఆగిపోయి ఎంతకీ కదల లేదు. చేసేదేమీ లేక ఆరోజు రాత్రి పురూరవుడు భార్యతో సహా ఈ కొండపైనే నిద్రించాడు. పురూరవుడికి స్వప్నంలో సాక్షాత్కరించిన స్వామి పుట్టలో తాను ఉన్న విషయాన్ని చెప్పాడు. పుట్టను తొలగించి ఆలయాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించాడు. పుట్టమన్నుకు బదులుగా తనపై చందనాన్ని పూయాలని, ఏడాదంతా చందనంతో నిత్యరూపంతోనూ, ఒక్క వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రం చందనం మణుగుల్లోంచి బయటకి వచ్చి నిజరూపాన్ని కల్పిస్తానని తెలియజేశాడు. స్వామి ఆజ్ఞ ప్రకారం పురూరవుడు పుట్టను తొలగించి స్వామికి ఆలయాన్ని నిర్మించాడు. పురూరవుడు స్వామిపై ఉన్న పుట్టను తొలగించిన రోజే వైశాఖ శుద్ధ తదియ పర్వదినం. దీంతో ఈ రోజున ప్రతి ఏటా ఈ క్షేత్రంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆ ఒక్కరోజే స్వామి నిజరూప దర్శనం లభిస్తుంది. ఏడాదిలో నాలుగు విడతలుగా మూడు మణుగుల చొప్పున చందనాన్ని స్వామికి సమర్పిస్తారు. చందనోత్సవం రోజు నిజరూపదర్శనం అనంతరం తొలివిడతగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించి స్వామిని మళ్లీ నిత్య రూపుణ్ణి చేస్తారు. తదుపరి వైశాఖ, జ్యేష్ట, ఆషాడ పౌర్ణమి రోజుల్లో మరో మూడేసి మణుగులు చొప్పున చందనాన్ని సమర్పిస్తారు. ఆద్యంతం సంప్రదాయకం నాలుగు విడతలుగా సమర్పించే చందనాన్ని సిద్ధం చేయడం కూడా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ఆలయ సిబ్బంది ఎంతో నియమ నిష్ఠలతో ఆలయ బేడా మండపంలో చందనాన్ని అరగదీస్తుంటారు. ఒక్కో విడతలో నాలుగు నుంచి ఐదు రోజులపాటు ఈ అరగదీత కార్యక్రమం ఉంటుంది. ఇలా అరగదీసిన చందనంలో అర్చకులు పలు సుగంధ ద్రవ్యాలను కలిసి స్వామికి లేపనంగా అద్దుతారు. సింహా చలంలో చూడదగ్గ ప్రదేశాలు సింహాచలం క్షేత్రానికి సమీపంలో పలు చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. దేవస్థానానికి చెందిన వరాహ పుష్కరిణి, భైరవస్వామి వేంచేసిన భైరవవాక, ఉద్యానవనం చూడదగ్గ ప్రదేశాలు. ఎలా చేరుకోవాలి.... విశాఖపట్నం ఆర్టీసికాంప్లెక్స్, రైల్వేస్టేషన్ల నుంచి ప్రతి పది నిమిషాలకు ఆర్టీసి బస్సులు అందుబాటులో ఉంటాయి. ఆర్టీసి కాంప్లెక్స్ నుంచి అయితే సింహాచలం 16 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్ నుంచి అయితే 15 కిలోమీటర్లు దూరం ఉంటుంది. కొన్ని బస్సులు నేరుగా కొండపైకి వెళ్తాయి. విమానమార్గం: సింహాచలంకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో విశాఖ విమానాశ్రయం ఉంది. విమానాశ్రయం బయటకి రాగానే 55 నెంబరు బస్సులు సింహాచలం వెళ్లేందుకు అందుబాటులో ఉంటాయి. – అవసరాల గోపాలరావు, సాక్షి, సింహాచలం