విస్తరణకు విస్ఫోటం | Dangerous Hills removing With Bomb Blast In Visakhapatnam | Sakshi
Sakshi News home page

విస్తరణకు విస్ఫోటం

Published Mon, Jul 1 2019 10:29 AM | Last Updated on Mon, Jul 1 2019 10:29 AM

Dangerous Hills removing With Bomb Blast In Visakhapatnam - Sakshi

బ్లాస్ట్‌ తర్వాత ఘాట్‌రోడ్డు మార్గంలో పడ్డ రాళ్లు

సాక్షి, సింహాచలం(పెందుర్తి) : కొండపై కొలువైన వరాహ నారసింహ స్వామిని చేరాలంటే ఘాట్‌ రోడ్డు ప్రధాన మార్గమన్నది తెలిసిందే. మెట్ల మార్గం నడకదారి మాత్రమే కావడంతో వాహనాలకు ఉన్న ఏకైక మార్గం ఘాట్‌ రోడ్డు ఒక్కటే. ఇంత కీలకమైన మార్గంలో ఒక్క చోట మాత్రం వాహన చోదకులు బెంబేలెత్తే పరిస్థితి ఉంది. అతి ప్రమాదకరంగా ఉన్న మలుపు (అదే వ్యూ పాయింట్‌ కూడా) వద్ద వాహన చోదకులు దేవుడిపైనే భారం వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొండదిగువ నుంచి సింహగిరికి వెళ్లేందుకు ఐదు కిలోమీటర్ల పొడవుండే సింహగిరి ఘాట్‌రోడ్డులో వ్యూ పాయింట్‌ వద్ద వాహనాలు మలుపు తీసుకోవడం ఓ సమస్యగా ఉండేది. ఈప్రాంతంలో ఒక పక్క పెద్ద రాతి కొండ, మరొక పక్క లోతైన లోయ ఉండడంతో ఈరెండింటి మధ్య గల ఇరుకైన మార్గంలో వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ముప్పు భయం సంగతి అటుంచితే.. ఒకేసారి ఎదురెదురుగా వాహనాలు వస్తే ఇక్కడ తప్పించలేని పరిస్థితి నెలకొంటోంది. దీంతో ఈప్రాంతంలో భారీ ఎత్తున ట్రాఫిక్‌ స్తంభిస్తోంది.

60 ఏళ్ల మార్గం
సింహగిరికి వెళ్లేందుకు 1959 వరకు రోడ్డు మార్గం లేదు. మెట్లమార్గంలోనే భక్తులు వెళ్లి వస్తూండేవారు. ఆలయంలో విధులు నిర్వర్తించే పూజారులు, ఇతర ఉద్యోగులు సైతం ఈమార్గంలోనే వెళ్లి వచ్చేవారు. దీంతో దేవస్థానం అప్పటి అనువంశిక ధర్మకర్త పీవీజీ రాజు ఘాట్‌రోడ్డు వేయాలని సంకల్పించారు. అప్పటి ఈవో డీఎల్‌ఎన్‌రాజు తోడ్పడ్డారు. దీంతో 1959 లోనే ఘాట్‌రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అప్పటి మద్రాస్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన నాగేశ్వర్‌ అయ్యర్‌తో ఘాట్‌ రోడ్డు ప్రణాళిక రూపొందించారు. కొండను, చెట్లను తుప్పలను తొలగించి మార్గాన్ని సిద్ధం చేశారు. అనంతరం తారు రోడ్డు పనులను గోపాలపట్నానికి చెందిన సదరం అప్పలనాయుడు అనే కాంట్రాక్టర్‌ పూర్తి చేశారు. ఇలా నాలుగేళ్లలోనే దాదాపు 1963లో ఘాట్‌రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఐదు కిలోమీటర్లు ఉండే ఘాట్‌రోడ్డులో ట్రాఫిక్‌ నానాటికీ పెరుగుతూ ఉండడంతో రెండేళ్ల కిందట ఇక్కడి మహాత్మా జ్యోతీబా పూలే  గురుకుల పాఠశాలవైపు నుంచి రెండో ఘాట్‌రోడ్‌ను దేవస్థానం అధికారులు నిర్మించారు. కానీ ఘాట్‌రోడ్డు మలుపు వద్ద మాత్రం ట్రాఫిక్‌ సమస్య తలనొప్పిగా మారింది. దీంతో కొండను తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. 

నానాటికీ జటిలం
పదేళ్ల నుంచి సింహగిరికి భక్తుల సంఖ్య పెరుగుతూ రావడంతో దానికి అనుగుణంగా ఘాట్‌రోడ్డులో వెళ్లే వాహనాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఐదేళ్ల వ్యవధిలో భక్తుల సంఖ్య, వాహనాల సంఖ్య మరింతగా పెరిగింది. సింహగిరిపై జరిగే ప్రముఖ ఉత్సవాలైన చందనోత్సవం, ముక్కోటి ఏకాదశి, వార్షిక కల్యాణోత్సవం, గిరిప్రదక్షిణ ఉత్సవం రోజుల్లో మలుపు వద్ద గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. చందనోత్సవం రోజుల్లో భక్తుల కోసం ఏర్పాటు చేసే క్యూలు మలుపు వరకు విస్తరిస్తున్నాయి. దాంతో వారి మధ్య నుంచి బస్సులు నడిపించడం మరీ దుర్లభంగా మారుతోంది. ఈ పరిణామం భక్తులను మరింతగా భయపెడుతోంది. అంతే కాక స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రముఖుల వాహనాలు కూడా ఈప్రాంతంలో ఇరుక్కుపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మలుపు వద్ద రోడ్డు విస్తరణకు దేవస్థానం ఎంతో కాలంగా కసరత్తు చేస్తోంది. 

ఎన్నోసార్లు తెరపైకి..
మలుపు దగ్గర నెలకొన్న క్లిష్ట పరిస్థితిని నిశితంగా పరిశీలించిన దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతి రాజు, అప్పటి కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్, సీపీ మహేష్‌చంద్ర లడ్డా మలుపు వద్ద కొండలో కొంత భాగాన్ని తొలగించడం ఒక్కటే శరణ్యమని గతంలో భావించారు. దీనికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని దేవస్థానం అధికారులకు సూచించారు. నిజానికి 2008 లోనే తొలిసారిగా ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ అది కార్యరూపం ధరించలేదు. అప్పటి నుంచి అనేకసార్లు ప్రణాళిక తెరపైకి రావడం, కనుమరుగు కావడం ఆనవాయితీగా జరిగేది. అవసరమైన అనుమతులపై సందిగ్థత నెలకొనడంతో ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు పదకొండేళ్ల తర్వాత ఇప్పుడు పనులు మొదలయ్యాయి.

రెండు దశల్లో ప్రణాళిక
ప్రమాదకర మలుపు వద్ద కొండను రెండు దశల్లో తొలగించి విస్తరించాలని సింహాచల దేవస్థానం అధికారులు ప్రణాళిక రూపొందించారు. తొలిదశలో దాదాపు 75 మీటర్ల పొడవు, సుమారు పది అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు మేర కొండను తొలగించాలని నిర్ణయించారు. ఇటీవల పనుల నిమిత్తం టెండర్లు పిలిచారు. లైసెన్స్‌ బ్లాస్టర్‌గా నమోదైన వై.వి.కన్‌స్ట్రక్షన్స్‌(విశాఖపట్నం)కు పనులను అప్పగించాలని, ఇందుకు రూ. 10 లక్షలు వెచ్చించాలని అప్పగించారు. పనులకు అనుమతివ్వాలని నగర పోలీస్‌ కమిషనర్‌కు దరఖాస్తు పెట్టారు. అన్ని అనుమతులూ రావడంతో గడిచిన శుక్రవారం నుంచి కొండను తొలగించే పనులు చేపట్టారు.

రోజూ 150 క్యూబిక్‌ మీటర్ల మేర రాళ్ల తొలగింపు
మలుపు వద్ద కొండను రోజుకి 150 క్యూబిక్‌ మీటర్ల మేర తొలగిస్తున్నారు. భద్రతా ప్రమాణాల దృష్ట్యా అంతకన్నా ఎక్కువ తొలగించకూడదని నిర్ణయించారు. మలుపు వద్ద లోయకు ఒక వైపు మెట్ల మార్గం ఉండడం ఒక కారణమైతే.. ఎక్కువ పరిమాణంలో కొండను తొలగిస్తే ఉదయం భక్తుల దర్శన సమయానికి రాళ్లను క్లియర్‌ చేయలేని పరిస్థితి ఉండడం రెండో కారణం. రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి బ్లాస్టింగ్‌ పనులు చేపడుతున్నారు. విస్ఫోటం తర్వాత ఘాట్‌ రోడ్డుపై పడే కొండ రాళ్లను వెంటనే తొలగిస్తున్నారు. ఈపనుల దృష్ట్యా సాయంత్రం 6 గంటల నుంచే ఘాట్‌ రోడ్డు లోను, మెట్లమార్గంలో భక్తులను, లేదా వాహనాలను అనుమతించడం లేదు. రాత్రి ఏడు గంటలకే దర్శనాలు నిలిపివేస్తున్నారు. బాంబ్‌ బ్లాస్టింగ్‌ జరిగే సమయంలో టోల్‌గేట్ల ప్రవేశం వద్ద, మెట్ల మార్గం వద్ద సిబ్బందిని అప్రమత్తంగా ఉంచుతున్నారు. బ్లాస్టింగ్‌ చేసే సమయం ముందు మైకుల్లో సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఈనెల 10 వరకు బ్లాస్టింగ్‌ పనులు జరగనున్నాయి. 

‘నియంత్రిత’ విస్ఫోటం
కొండకు ముక్కలు చేసేందుకు బాంబులు పేల్చాలని నిర్ణయించి ఇందుకు కంట్రోల్‌ బ్లాస్టింగ్‌ సిస్టంను అనుసరించడానికి వ్యూహం సిద్ధం చేశారు. ఈ పద్ధతిని సెకెండరీ కంట్రోల్‌ బ్లాస్టింగ్‌ లేదా జాకీ హోల్స్‌ బ్లాస్టింగ్‌ అని కూడా అంటారు. రాతి స్థితిని బట్టి తొలగించాల్సిన కొండకు డ్రిల్లింగ్‌ యంత్రంతో ఎనిమిది అడుగుల లోతుకు రంధ్రాలు చేసి బాంబ్‌ స్టిక్స్‌ను అమరుస్తున్నారు. రంధ్రాల్లో 25 సెంమీ లావు, 10 సెంమీ పొడవు ఉండే బాంబులను అమరుస్తున్నారు. ఎంతమేర కొండని తొలగించాలో దానికి సరిపడా బాంబులను అమరుస్తున్నారు. విస్ఫోటం కారణంగా రాళ్లు భారీ ఎత్తున కిందికి తుళ్లకుండా, ఎగరకుండా ఒక్కొక్కటి 1200 కిలోల బరువు ఉండే నాలుగు టైర్‌ మ్యాట్‌లను క్రేన్‌ సాయంతో కొండపై వేస్తున్నారు. దాదాపు రెండు వందల మీటర్ల దూరం వరకు వైర్లు లాగి మైనింగ్‌ మెగ్గరు బాక్స్‌ సాయంతో కొండని పేల్చుతున్నారు. దీని వల్ల 10 మీటర్ల లోపు లేదా దాని కన్నా తక్కువ పరిధిలోనే రాళ్లు పడతాయని ప్రస్తుతం పనులు చేస్తున్న లైసెన్స్‌డ్‌ బాంబ్‌ బ్లాస్టర్‌ టి.ప్రసాద్‌ తెలిపారు. ప్రమాద మలుపు వద్ద విస్తరణ జరిగే ప్రదేశానికి ఒక వైపు ఉన్న లోయ భాగంలోనే మెట్ల మార్గం ఉండటంతో అటు రాళ్లు ఎగిరిపడే ప్రమాదం ఉందని, అందుకే కంట్రోల్‌ బ్లాస్టింగ్‌ సిస్టంను ఉపయోగిస్తున్నామని తెలిపారు. 


కొండకి వైర్లు అమరుస్తున్న బాంబ్‌ బ్లాస్టర్స్‌ 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement