సాక్షి, తిరుమల: శ్రీవరాహస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ సంప్రోక్షణము వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో కె.ఎస్.జవహర్ రెడ్డి దంపతులు, అదనపు ఈవో ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. వరాహస్వామి వారి ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో వేంచేపు చేసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారిని, శ్రీ వరాహస్వామివారి ఉత్సవర్లను సుప్రభాతంతో మేల్కొలిపి, పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, ప్రధాన కుంభారాధన, అర్చన నిర్వహించారు. అనంతరం శ్రీ వరాహస్వామివారి ప్రధాన హోమగుండమైన సభ్యహోమ గుండంలో మహా పూర్ణాహూతి నిర్వహించారు. తరువాత విమాన గోపురం, ద్వార పాలకులు, ఎదురు ఆంజనేయస్వామివారికి, విష్వక్సేనులవారికి, భాష్యకారులవారి హోమగుండాలలో మహా పూర్ణాహూతి జరిగింది. (చదవండి: తిరుమల: మహాసంప్రోక్షణ ప్రారంభం)
పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామివార్లు ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. తరువాత సుమూహర్తంలో భగవత్ వైఖానస ఆగమోక్తంగా ఆచార్య పురుషులు బాలాలయంలోని వరాహస్వామివారికి ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీ వరాహస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూయబడిన రాగి రేకులు అమర్చేందుకు బాలాలయం నిర్వహించినట్లు తెలిపారు. బంగారు తాపడం పనులు పూర్తవ్వడానికి దాదాపు 5 నెలలు సమయం పడుతుందన్నారు. కావున అప్పటి వరకు భక్తులకు శ్రీ వరాహస్వామివారి మూల విరామూర్తి దర్శనం ఉండదన్నారు. ఇందుకోసం డిసెంబర్ 5వ తేదీ నుండి బాలాలయం కార్యక్రమాలు నిర్వహించి, గురువారం ఉదయం బాలాలయ సంప్రోక్షణ శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. తదుపరి మహా సంప్రోక్షణ జరుగువరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారని వివరించారు. (చదవండి: ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో..)
Comments
Please login to add a commentAdd a comment