వరాహ లక్ష్మీ నరసింహ స్వామి నిజరూప దర్శనం
నిత్యం చందనపు పూతల మాటున అసలు రూపమేమిటో అంతుపట్టకుండా ఉంటాడాయన. ఏడాదికి ఒక్కసారి మాత్రం ఆ చందనపు పూతలను తొలగించుకుని, భక్తులకు తన నిజరూప దర్శన భాగ్యం కల్పిస్తాడా స్వామి. ఆయనే సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి. స్వామి నిజరూప దర్శనం లభించే ఈ శుభ తరుణం... ఈ నెల 29, శనివారం అక్షయ తదియ నాడే. ఈ సందర్భంగా ఆలయం గురించిన ఆసక్తికరమైన విశేషాలు...
చుట్టూ కొండలు, అనాస, జీడి, మామిడి, పనస, సంపెంగ తదితర వృక్ష, ఫల, పుష్ప వనాల మధ్య సింహాచల క్షేత్రం విరాజిల్లుతోంది. హిరణ్యాక్షుణ్ణి సంహరించిన వరాహావతారం, హిరణ్యకశిపుని సంహరించిన నారసింహ అవతారాల కలయికలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఇక్కడ వెలిశాడు. విహంగ వీక్షణంలో ఈ కొండ సింహాకారంలో కనిపిస్తుంది. దాంతో ఈ క్షేత్రాన్ని సింహగిరిగా కూడా పిలుస్తారు.
అద్భుత శిల్పసంపద
అద్భుతమైన శిల్పసంపద, రాతి కట్టడాలతో ఆలయం నిర్మితమైంది. ఆలయంలోని బేడా మండపం, ఆస్థానమండపం, భోగమండపం, అంతరాలయంలో స్వామి వేంచేసే ప్రహ్లాదమంటపం, కల్యాణమంటపం, హంసమూల రాతిరథం, రాజగోపురం ఈ క్షేత్రంలో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. బేడామండపంలో 32 నారసింహ రూపాలు దర్శనమిస్తాయి.
మహిమాన్విత కప్పస్తంభం
ఎంతో మహిమాన్వితమైన కప్పస్తంభం ఆలయంలో ఉంది. పూజారులు భక్తులను ఈ స్తంభానికి కట్టివేసి, కొంత కప్పం చెల్లిస్తే విడిపిస్తారు. అందుకే ఈ స్తంభానికి కప్పస్తంభమని పేరు. ఇలా చేస్తే మంచిదని విశ్వాసం. సంతాన వేణుగోపాలస్వామి యంత్రం ఈ స్తంభం అడుగుభాగంలో ప్రతిష్టింపబడింది. ఈస్తంభాన్ని ఆలింగనం చేసుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని విశ్వాసం. అలాగే పిల్లలు లేని దంపతులు ఈ స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటే సంతానప్రాప్తి కల్గుతుందని చెబుతారు.
పాపాలను నశింపజేసే గంగధార
ఈ క్షేత్రానికి ఈశాన్య దిక్కులో నిత్యం పారే గంగధార ఎంతో విశిష్టమైనది. ఇక్కడ స్నానమాచరిస్తే పాపాలు నశిస్తాయని, ఈ నీటిని సేవిస్తే రోగాలు నయమవుతాయని చెబుతారు.
స్థలపురాణం: హిరణ్యకశిపుడి కోపోద్రేకానికి గురై ప్రహ్లాదుడు విశాఖ పూర్వ సముద్రంలో పడవేయబడతాడు. ప్రహ్లాదుడ్ని రక్షించేందుకు శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి జారుతున్న వస్త్రాన్ని ఒకచేతితోను, మరొక చేతితో గరుత్మంతునికి అమృతాన్ని అందిస్తూ అమితవేగంతో ఒక్కసారిగా ఈ కొండపైకి దూకి ప్రహ్లాదుణ్ణి ర క్షించాడు. ప్రహ్లాదుడి కోరిక మేరకు స్వామి సింహగిరిపైనే ఉండి కొంతకాలం పూజలు అందుకున్నాడు. ప్రహ్లాదుడి అనంతరం పూజలు చేసేవారు కరువవడంతో మరుగునపడ్డ స్వామిపై పెద్ద పుట్ట వెలిసింది. కొంతకాలానికి షట్చక్రవర్తులలో ఒకరైన పురూరవుడు తన భార్య ఊర్వశితో కలిసి హంసవాహనంపై ఆకాశమార్గంలో విహారయాత్ర చేస్తుండగా ఉన్నట్టుండి హంసవాహనం ఈ కొండపై ఆగిపోయి ఎంతకీ కదల లేదు. చేసేదేమీ లేక ఆరోజు రాత్రి పురూరవుడు భార్యతో సహా ఈ కొండపైనే నిద్రించాడు.
పురూరవుడికి స్వప్నంలో సాక్షాత్కరించిన స్వామి పుట్టలో తాను ఉన్న విషయాన్ని చెప్పాడు. పుట్టను తొలగించి ఆలయాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించాడు. పుట్టమన్నుకు బదులుగా తనపై చందనాన్ని పూయాలని, ఏడాదంతా చందనంతో నిత్యరూపంతోనూ, ఒక్క వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రం చందనం మణుగుల్లోంచి బయటకి వచ్చి నిజరూపాన్ని కల్పిస్తానని తెలియజేశాడు. స్వామి ఆజ్ఞ ప్రకారం పురూరవుడు పుట్టను తొలగించి స్వామికి ఆలయాన్ని నిర్మించాడు. పురూరవుడు స్వామిపై ఉన్న పుట్టను తొలగించిన రోజే వైశాఖ శుద్ధ తదియ పర్వదినం. దీంతో ఈ రోజున ప్రతి ఏటా ఈ క్షేత్రంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆ ఒక్కరోజే స్వామి నిజరూప దర్శనం లభిస్తుంది. ఏడాదిలో నాలుగు విడతలుగా మూడు మణుగుల చొప్పున చందనాన్ని స్వామికి సమర్పిస్తారు. చందనోత్సవం రోజు నిజరూపదర్శనం అనంతరం తొలివిడతగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించి స్వామిని మళ్లీ నిత్య రూపుణ్ణి చేస్తారు. తదుపరి వైశాఖ, జ్యేష్ట, ఆషాడ పౌర్ణమి రోజుల్లో మరో మూడేసి మణుగులు చొప్పున చందనాన్ని సమర్పిస్తారు.
ఆద్యంతం సంప్రదాయకం
నాలుగు విడతలుగా సమర్పించే చందనాన్ని సిద్ధం చేయడం కూడా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ఆలయ సిబ్బంది ఎంతో నియమ నిష్ఠలతో ఆలయ బేడా మండపంలో చందనాన్ని అరగదీస్తుంటారు. ఒక్కో విడతలో నాలుగు నుంచి ఐదు రోజులపాటు ఈ అరగదీత కార్యక్రమం ఉంటుంది. ఇలా అరగదీసిన చందనంలో అర్చకులు పలు సుగంధ ద్రవ్యాలను కలిసి స్వామికి లేపనంగా అద్దుతారు.
సింహా చలంలో చూడదగ్గ ప్రదేశాలు
సింహాచలం క్షేత్రానికి సమీపంలో పలు చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. దేవస్థానానికి చెందిన వరాహ పుష్కరిణి, భైరవస్వామి వేంచేసిన భైరవవాక, ఉద్యానవనం చూడదగ్గ ప్రదేశాలు.
ఎలా చేరుకోవాలి....
విశాఖపట్నం ఆర్టీసికాంప్లెక్స్, రైల్వేస్టేషన్‌ల నుంచి ప్రతి పది నిమిషాలకు ఆర్టీసి బస్సులు అందుబాటులో ఉంటాయి. ఆర్టీసి కాంప్లెక్స్ నుంచి అయితే సింహాచలం 16 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్ నుంచి అయితే 15 కిలోమీటర్లు దూరం ఉంటుంది. కొన్ని బస్సులు నేరుగా కొండపైకి వెళ్తాయి.
విమానమార్గం: సింహాచలంకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో విశాఖ విమానాశ్రయం ఉంది. విమానాశ్రయం బయటకి రాగానే 55 నెంబరు బస్సులు సింహాచలం వెళ్లేందుకు అందుబాటులో ఉంటాయి.
– అవసరాల గోపాలరావు, సాక్షి, సింహాచలం