కాశీ కంటే పురాతన క్షేత్రం: 'వృద్ధాచల క్షేత్రం'..! | Virudhachalam Thirumudhukundram In Cuddalore District Tamil Nadu | Sakshi
Sakshi News home page

కాశీ కంటే పురాతన క్షేత్రం: 'వృద్ధాచల క్షేత్రం'..!

Published Thu, Mar 27 2025 10:26 AM | Last Updated on Thu, Mar 27 2025 10:26 AM

Virudhachalam Thirumudhukundram In Cuddalore District Tamil Nadu

వృద్ధాచలాన్ని వృద్ధ కాశి అని కూడా పిలుస్తారు. ఇక్కడి స్థలపురాణం ప్రకారం వృద్ధ కాశిగా పేరొందిన ఈ విరుదాచలంలో మరణిస్తే కాశీలో మరణించిన వారికంటే ఎక్కువ పుణ్యమే లభిస్తుందని చెబుతారు. కాశీలో చెప్పినట్టే ఇక్కడ కూడా చనిపోతున్నవారి శిరస్సును తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ కొలువై ఉన్న వృద్ధాంబిక తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతారు. 

అదే విధంగా పరమశివుడు నటరాజ రూపంలో నాట్యానికి ప్రసిద్ధి. ఈయన చిదంబరంలో కాళీమాతతో పోటిపడి నాట్యం చేస్తే ఈ విరుదాచలం లేదా వృద్ధాచలంలో తన సంతోషం కోసం నాట్యం చేశాడని చెబుతారు. అంతే స్వామి సంతోష తరంగాల్లో తేలి΄ోతూ నాట్యం చేసిన ప్రదేశం ఇదే.

స్థలపురాణం...
పూర్వం ఇక్కడ ప్రజలు కరువు కాటకాల వల్ల నిత్యం అష్ట కష్టాలు పడేవారు. దీంతో స్థానికంగా ఉండే విభాసిత మహర్షి, స్వామివారికి సేవ చేస్తే ఫలితం ఉంటుందని చె΄్పాడు. దీంతో ఆ ఊరిపెద్దలంతా కలిసి స్వామి వారికి దేవాలయం నిర్మించాలని తీర్మానించారు. అయితే ఆ సమయంలో వారి జీవనం ఎలా అన్న అనుమానం మొదలయ్యింది. 

దీనికి విభాసిత మహర్షి, వృద్ధేశ్వర స్వామి వారిపై నమ్మకంతో పని చేయండి చేసుకొన్నవారికి చేసుకొన్నంతగా లాభం చేకూరుతుందని చెప్పారు. దీంతో ప్రజలు ఆ పనికి పూనుకొన్నారు. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేసిన వారికి విభాసిత మహర్షి స్థానికంగా ఉంటున్న చెట్టు నుంచి కొన్ని ఆకులు తీసుకొని పనిచేసిన వారికి ఇచ్చేవాడు.

 ఆశ్చర్యం... ఎవరు ఎంత పని చేసారో అంతకు సమానంగా ఆ ఆకులు నాణాలుగా మారేవి. అప్పటి నుంచే చేసిన వారికి ‘చేసినంత, చేసుకున్నవారికి చేసుకొన్నంత’ అనే నానుడి మొదలయ్యిందని చెబుతారు. 

ఐదుతో అవినాభావ సంబంధం...
ఈ ఆలయంలో 5 అంకెకు విశిష్ట స్థానం ఉంది. ఈ ప్రాంగణంలో పూజలందుకొనే మూర్తులు 5. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, శక్తి, భైరవుడు. ఇక్కడ స్వామి వారికి 5 పేర్లు ఉన్నాయి. అవి విరుధ గిరీశ్వరుడు, పఝమలైనాధార్, విరుద్ధాచలేశ్వర్, ముద్దుకుండ్రీశ్వరుడు, వృద్ధ గిరీశ్వరుడు. ఆలయానికి 5 గోపురాలు, 5 ప్రాకారాలు, 5 మండపాలు, 5 నందులు ఉన్నాయి. వేకువ జాము నుంచి రాత్రిదాకా స్వామికి నిర్ణీత సమయంలో 5 సార్లు పూజలు చేస్తారు. ఇక్కడ 5 రథాలు ఉన్నాయి. 

ఇక్కడ స్వామివారు స్వయంభువుడు. ఇక్కడ శివుడిని ప్రార్థించిన వారికి మనశ్శాంతి కలగడమే కాకుండా అన్నిరకాల శరీర రుగ్మతల నుంచి వెంటనే విముక్తి కలుగుతుందని చెబుతారు. ఇక్కడ ఉన్న దుర్గాదేవిని పూజిస్తే వివాహం, సంతానం కలగడం వంటి కోరికలు నెరవేరుతాయని చెబుతారు. ΄ాతాళ వినాయకుడు శ్రీ కాళహస్తిలో ఉన్నట్లు ఇక్కడ విఘ్నేశ్వరుడు భూతలం నుంచి కిందికి ఉన్న ఆలయంలో ఉంటాడు. ఈ ఆలయంలోని స్వామివారిని సందర్శించడానికి 18 మెట్లు దిగి కిందికి వెళ్లాల్సి ఉంటుంది. చని΄ోయిన వారి చితా భస్మాన్ని ఇక్కడున్న మణి ముత్తా నదిలో నిమజ్జనం చేస్తే అవి చిన్న రాళ్లుగా మారి నది అడుగున చేరుతాయని చెబుతారు. ఈ విరుదా చలంలోని నదిలో వేసిన నాణాలు తిరువారూరు కోవెల పుష్కరిణిలో తేలుతాయని చెబుతారు. 

వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు... 
ఇక్కడ వల్లీ దేవసేనలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు. ఆయన ఆలయంలో పైన చక్రాలు ఉంటాయి. అవి శ్రీ చక్రం, సుబ్రహ్మణ్య చక్రం, అమ్మవారి చక్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి చక్రాలు చాలా తక్కువ శివాలయంలో చూస్తాం. అందులో ఇది ఒకటి. అందుకే ఇక్కడ స్వామివారికి విన్నించుకొన్న కోరికలు త్వరగా తీరుతాయని చెబతారు.

ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకూ అదే విధంగా సాయంకాలం 3.30 గంటల నుంచి 9 గంటల వరకూ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కూడా తిరువణ్ణామలైలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికీ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. దీనివల్ల వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.
చెన్నై నుంచి 230 కిలోమీటర్ల దూరంలో కడలూర్‌ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి నిత్యం బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి.

ఇక్కడ వేసిన నాణేలు అక్కడి కొలనులో ...
ఒకసారి సుందరర్‌ అనే శివభక్తుడు ఈ దారి గుండా వెడుతూ ఇక్కడి స్వామివారిని స్తుతించాడు. దీంతో స్వామి వారు స్వయంగా 12 వేల బంగారు నాణాలను అంద జేస్తాడు.తాను తిరువారూర్‌ వెళ్లాల్సి ఉందని అయితే తోవలో దొంగల భయం ఉందని సుందరార్‌ భయపడుతాడు.

ఇదే విషయాన్ని శివుడికి చెబుతాడు. దీంతో శివుడు తాను ఈ నాణాలను ఇక్కడే ఉన్న మణిముత్తా నదిలో వేస్తానని, నీవు తిరువారూర్‌ వెళ్లిన తర్వాత అక్కడి కొలనులో తీసుకోవచ్చని చెబుతాడు. ఇందుకు అంగీకరించిన సుందరార్‌ తిరువారూర్‌ వెళ్లి అక్కడ కొలనులో నుంచి 12వేల బంగారు నాణాలను తీసుకొన్నాడని కథనం. అదే విధంగా ఆ నాణ్యాల నాణ్యతను సాక్షాత్తు వినాయకుడు పరీక్షించి అటు పై ఆ భక్తాగ్రేసరుడికి ఇచ్చారని చెబుతారు. 
డి.వీ.ఆర్‌

(చదవండి: ప్రియాంక చోప్రా..ఫ్రీడమ్‌ సెలబ్రేషన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement