
కలెక్టరేట్ ఎదుట హెడ్‌కానిస్టేబుల్ కుటుంబం ఆందోళన
కర్నూలు(సెంట్రల్): తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నాలుగు నెలలుగా తిరుగుతున్నా కర్నూలు రూరల్ సీఐ, ఎస్‌ఐలు పట్టించుకోవడం లేదని ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబం సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగింది. తమపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డీఐజీ, ఎస్పీలను కోరినా స్పందించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆందోళనకు దిగినట్లు ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ ఏ.శ్యామ్ విద్యాసాగర్ కోడలు సి.ఉమాదేవి, భర్త అడ్డాకుల మహేష్ వాపోయారు. తమకు న్యాయం చేకపోతే ఆత్మహత్యే గతి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తాము కర్నూలు నగరంలోని రాజ్ ఫంక్షన్ హాలు సమీపంలో శ్రీరామ రెసిడెన్షీలో మామ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఏ.శ్యామ్ విద్యాసాగర్‌తో కలిసి ఉంటున్నామన్నారు. గత జనవరి 22న సీసీఎస్ హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు(వాసు), ఎస్‌పీఎఫ్ పోలీసు మల్లికార్జున, ఏఆర్ కానిస్టేబుల్ లక్ష్మన్న ఇంటి వద్దకు వచ్చి తన మామను తీసుకెళ్లి మరో పదిమందితో కలిసి దాడి చేశారన్నారు. విషయం తెలిసి తాము అక్కడికి వెళ్లగా తమపై కూడా దాడి చేశారన్నారు. కత్తి మొన తనకు కుచ్చుకొని తీవ్ర రక్తగాయం కాగా తప్పించుకొని ఇంటికి వచ్చేశానన్నారు. అయినా వదలకుండా వారు తమ ఇంటికి వచ్చి తనతోపాటు తన భర్త అడ్డాకుల మహేస్, తన బావలు హరీష్, గిరీష్‌లపై దాడి చేసి గాయపరిచారన్నారు.
తామంతా పెద్దాసుపత్రిలో చికిత్స చేయించుకుంటుండగా కర్నూలు రూరల్ స్టేషన్ నుంచి సీఐ, ఎస్‌ఐ పిలుపుస్తున్నారంటూ కానిస్టేబుల్ చంద్ర ఫోన్ చేయగా అక్కడికి వెళ్లామన్నారు. స్టేషన్‌లో సీఐ, ఎస్‌ఐ సమక్షంలోనే మరోసారి తమపై పోలీసులు దాడి చేశారన్నారు. ఫిర్యాదు తీసుకోకుండా సీఐ చింపివేసి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోవాలని పంపించేశారన్నారు. ఇదే విషయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ, ఎస్పీకి విన్నవించినా పట్టించుకోకపోవడంతో ధర్నాకు దిగినట్లు ఆమె వివరించారు.