![Constable candidates demand for justice](/styles/webp/s3/article_images/2025/02/16/police.jpg.webp?itok=AMZZCt51)
కానిస్టేబుల్ అభ్యర్థులతో ప్రభుత్వం చెలగాటం
రేంజ్ కో రీతిలో వ్యవహరిస్తున్న హోమ్ శాఖ
నష్టపోతున్న 1,500 మంది అభ్యర్థులు
న్యాయం చేయాలని కోరుతున్నా పట్టించుకోని వైనం
సాక్షి, అమరావతి : పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల అభ్యర్థులతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షల నిర్వహణకు వచ్చేసరికి వయో నిబంధన అడ్డంకిగా చెబుతూ అడ్డుకోవడం విడ్డూరంగా ఉంది. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రీతిలో కాకుండా రేంజ్ కో రీతిలో వ్యవహరిస్తుండటం విస్మయ పరుస్తోంది. కర్నూలు రేంజ్ పరిధిలో కొందరు అభ్యర్థులకు అడ్డంకికానీ వయో నిబంధన.. ఇతర రేంజ్‌ల పరిధికి వచ్చే సరికి అడ్డంకిగా చూపిస్తుండటం ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనంగా నిలుస్తోంది.
2022లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జనరల్, బీసీ అభ్యర్థులకు 18 ఏళ్ల నుంచి 27 ఏళ్లు.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 18 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య వయసు ఉండాలని వయో నిబంధన పెట్టారు. కానిస్టేబుల్ పోస్టులకు 5,03,487 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. రాష్ట్ర పోలీస్ నియామక మండలి (ఎస్‌ఎల్‌పీఆర్‌బీ) అధికారిక వెబ్‌సైట్ ద్వారా వచ్చిన ఆ దరఖాస్తులను ఆమోదించారు. అంటే అర్హత నిబంధనలు సరిపోబట్టే దరఖాస్తులను ఆమోదించినట్టుగా భావించాలి.
ఇక 2023 జనవరి 22న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో 91,507 మంది అర్హత సాధించారు. అనంతరం తమ సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని హోమ్ గార్డులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో ప్రిలిమ్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించాల్సిన దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయే సరికి ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించలేకపోయారు.
రేంజ్‌కో రీతా.. ఇదేం ద్వంద్వ నీతి?
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనవరిలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. నాలుగు కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు ఎన్నో ఆశలతో హాజరైన అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం వయో నిబంధన పేరిట సైంధవుడిలా అడ్డుకోవడం విభ్రాంతి కలిగించింది. రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసి, ప్రిలిమ్స్ పరీక్షల్లో అర్హత సాధించిన వారిలో 1,500 మందికిపైగా అభ్యర్థుల వయసు పైబడిందని వారిని అనర్హులుగా ప్రకటించింది.
జనరల్, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయసు 27 ఏళ్లు.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయసు 32 ఏళ్ల పరిమితి దాటిపోయిందని 1,500 మంది అభ్యర్థులను దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించ లేదు. దరఖాస్తు చేసే నాటికి తమకు తగిన అర్హతలు ఉన్నందునే ఎస్‌ఎల్‌పీఆర్‌బీ తమ దరఖాస్తులను ఆమోదించిందని అభ్యర్థులు ఎంతగా ప్రాథేయపడినా హోమ్ శాఖ పట్టించుకోలేదు. 1990, 1991లలో జన్మించిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట అర్హత వయసు దాటిపోయింది కాబట్టి వారిని దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించ లేదు.
కానీ కర్నూలు రేంజ్ పరిధిలో 1989 మేలో జన్మించిన ఓ ఎస్సీ అభ్యర్థికి దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించిన విషయం వెలుగు చూసింది. ఆ అభ్యర్థి దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. అందులో అర్హత కూడా సాధించారు. మరి అదెలా సాధ్యమని కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఆ అభ్యర్థి ఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో చేసిన దరఖాస్తు, దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించిన పత్రం, ఆ పరీక్షల్లో అర్హత సాధించినట్టుగా ఇచ్చిన ధ్రువీకరణ పత్రం కాపీలను సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
కొందరు అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబడుతున్నారు. తమను కూడా దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించాలని, ఈ ప్రక్రియను పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయ పోరాటం చేస్తామని కూడా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment