eligibility criteria
-
జగనన్న విదేశీ విద్యా దీవెనకు 392 దరఖాస్తులు
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులకు పెద్ద చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన కోసం 392 దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఈ పథకంలో దరఖాస్తులకు సెప్టెంబర్ 30 వరకు ఇచ్చిన గడువు శుక్రవారం ముగిసింది. ప్రభుత్వ ఆర్థికసాయంతో విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ఉద్దేశించిన ఈ పథకం రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలు (ఈబీసీ), బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వర్తిస్తుంది. వచ్చిన దరఖాస్తులు, వాటికి జతచేసిన ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించిన తరువాత ప్రత్యక్ష ఇంటర్వ్యూల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. జగనన్న విదేశీ విద్యాదీవెనను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటుగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారందరికీ వర్తింపజేయడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఒకటి నుంచి 200 క్యూఎస్ ర్యాంకులు కలిగిన విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఇది మేలు చేస్తుంది. ఒకటి నుంచి వంద క్యూఎస్ ర్యాంకింగ్ కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్న వారికి ఫీజు రూ.కోటి అయినా నూరుశాతం ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుంది. 101 నుంచి 200 క్యూఎస్ ర్యాంకులున్న యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకుంటే రూ.50 లక్షల వరకు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తుంది. ఈ పథకానికి వార్షిక ఆదాయ పరిమితిని రూ.8 లక్షల వరకు పెంచడం విశేషం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత ఉన్న ఎంతమందికైనా ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు కె.హర్షవర్ధన్ తెలిపారు. (క్లిక్ చేయండి: ట్రిపుల్ ఐటీ సీట్లలో అగ్రభాగంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా) -
TS EDCET 2021: నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ కోర్సులు చదివిన వారు మాత్రమే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో (బీఎడ్) చేరే అవకాశం ఉండగా ఇకపై ఇతర సబ్జెక్టులు చదివిన వారికి బీఎడ్‌లో చేరే అవకాశం వచ్చింది. ఈ మేరకు బీఎడ్ ప్రవేశాల నిబంధనలను ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో 16 జారీ చేశారు. ఇప్పటివరకు డిగ్రీలో ఓరియంటల్ లాంగ్వేజెస్ చదువుకున్న వారికి బీఎడ్‌లో చేరే అవకాశం లేకపోగా ఇప్పుడు వారికి కొత్తగా అవకాశం దక్కింది. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ (హోంసైన్స్), బీసీఏ, బీబీఎం, బీఏ (ఓరియంటల్ లాంగ్వేజెస్), బీబీఏ, బీటెక్ చేసిన వారు కూడా బీఎడ్ చదివే వీలు ఏర్పడింది. వారు ఆయా డిగ్రీల్లో 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఇవి చదివిన వారంతా అర్హులే.. ► బీఎడ్ ఫిజికల్ సైన్స్ చేయాలంటే.. బీఎస్సీ విద్యార్థులు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా సంబంధిత సబ్జెక్టును పార్ట్–2 గ్రూపులో చదివి ఉండాలి. బీటెక్ విద్యార్థులు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ; బీసీఏ విద్యార్థులు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ సబ్జెక్టులను ఇంటర్మీడియట్లో చదివి ఉంటే చాలు. ► బీఎడ్ బయోలాజికల్ సైన్స్‌లో చేరాలంటే బీఎస్సీ/బీఎస్సీ (హోంసైన్స్) చేసిన వారు బోటనీ, జువాలజీలో ఏదో ఒక సబ్జెక్టు డిగ్రీలో పార్ట్–2 గ్రూపులో చదివి ఉండాలి. బీసీఏ విద్యార్థులైతే ఇంటర్లో బయోలాజికల్ సైన్స్ చదివి ఉండాలి. ► బీఎడ్ సోషల్ సైన్సెస్ చేయాలంటే బీకాం/బీబీఎం/బీబీఏ/బీసీఏ అభ్యర్థులు ఇంటర్లో సోషల్ సైన్స్ చదివి ఉండాలి. ► ఓరియంటల్ లాంగ్వేజెస్‌లో బీఎడ్ చేయాలనుకునే వారు బీఏలో తెలుగు/హిందీ/మరాఠీ/ఉర్దూ/అరబిక్/సంస్కృతంను ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా చదివి ఉండాలి. లిటరేచర్ అభ్యర్థులు (బీఏ–ఎల్) తెలుగు/హిందీ/మరాఠీ/ఉర్దూ/అరబిక్/సంస్కృతం చదివి ఉంటే చాలు. బీఏ ఓరియెంటల్ లాంగ్వేజెస్ వారు తెలుగు/హిందీ/మరాఠీ/ఉర్దూ/అరబిక్/సంస్కృతం చదివి ఉండాలి. ఎంఏ తెలుగు/ హిందీ/ మరాఠీ/ ఉర్దూ/ అరబిక్/ సంస్కృతం చేసిన వారు కూడా అర్హులే. చదవండి: 10 వేలకు పైగా ఉద్యోగాలు.. ఆశావహులకు తీపికబురు NMDC Recruitment 2021: ఎన్ఎండీసీలో 89 పోస్టులు -
కొత్త ‘ఆసరా’పై స్పష్టత కరువు
సాక్షి, హుస్నాబాద్: ప్రభుత్వం ఎన్నికల ముందు ఆసరా పింఛన్ల అర్హత వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 వరకు తగ్గించి పథకం వర్తింప చేస్తామని చెప్పింది. రూ.1000 పింఛన్‌ను రూ.2,016లకు పెంచుతామని ప్రజలకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఓటరు జాబితాల ఆధారంగా ఐకేపీ సిబ్బందితో 57 నుంచి 65 మధ్య వయస్సు ఉన్న జాబితాను అందించాలని చెప్పడంతో గ్రామాల వారిగా సర్వే చేసి జాబితాలను సిద్ధం చేశారు. ఇటీవల పెంచిన ఫించన్లు అమలు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు చేసి ఆసరా పింఛన్‌దారులకు మంజూరు పత్రాలను అందజేసింది. ఆసరా ఫింఛన్లకు వయస్సును తగ్గించడంతో మాకు కూడా అందుతాయని ఆశపడ్డ లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతోంది. కొత్త ఆసరా పింఛన్లపై ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో వారి ఎంపిక అధికారులకు స్పష్టత లేకుండా పోయింది. ప్రభుత్వం వీటిపై మళ్లీ నిర్ణయం తీసుకునేవరకు ఆశావాదులు నిరీక్షించక తప్పడం లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా కొత్త ఆసరా లబ్ధిదారుల ఎంపికపై నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఆసరాకు అర్హులెవరు? ప్రభుత్వం ఆసరా పథకానికి 65 నుంచి 57 సంవత్సరాలకు వయస్సు తగ్గించడంతో చాలా మంది రైతులు, వ్యవసాయ కూలీలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ ఉద్యోగులు మినహా తెల్లరేషన్‌కార్డు ఉన్న వారికి 57 సంవత్సరాలు ఉంటే ఆసరా పథకానికి అర్హలవుతారు. కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. ఆసరాకు దరఖాస్తు చేసుకునే వారికి ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి. వీరందరూ ఆయా గ్రామ పంచాయతీల్లో దరఖాస్తు చేసుకుంటే వాటిని అధికారులు పరిశీలించి ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడగానే అధికారులు కొత్త ఆసరా లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. కొత్తగా 4,207 మంది అర్హులు.. హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని 49 గ్రామ పంచాయతీల్లో గతంలోనే స్వశక్తి సంఘాల అధ్వర్యంలో ఓటరు జాబితలను అధారంగా ఐకేపీ అధికారులు గ్రామాల వారిగా సర్వే చేయించారు. అప్పటి వరకు 57 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిని సర్వే చేసి గ్రామ పంచాయతీల వారిగా జాబితలను ఉన్నతాధికారులకు పంపించారు. అక్కన్నపేట మండలంలోని 32 గ్రామ పంచాయతీల్లో 2,939, హుస్నాబాద్ మండలంలోని 17 పంచాయతీల్లో 1,268 మంది ఉన్నట్లు సర్వే చేశారు. వీరందరూ ప్రభుత్వం కొత్తగా ఇచ్చే ఆసరా ఫించన్లకు అర్హులుగా అధికారులు గుర్తించారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, ఉద్యోగ విరమణ చేసి ఫించన్ పొందేవారు కూడ ఇదే జాబితాలో ఉన్నారు. అయితే వారిని తొలగించి అర్హతగల వారికి ఆసరా పింఛన్లు అందించుటకు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో కొత్త ఆసరా పింఛన్ల మంజూరుకు మరికొంత సమయం పట్టనుంది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదు కొత్త ఆసరా పథకం అమలుకు వయస్సును 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించారు. ఓటరు జాబితాల ఆధారంగా సర్వే చేసి గ్రామాల వారీగా జాబితాలను సిద్ధం చేశాం. కొత్త వారిని ఎంపిక చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ నుంచి ఉత్తర్వులు వెలువడగానే ఎంపికపై కసరత్తు చేస్తాం. అర్హులకు అందేలా చూస్తాం. – ఉదయ్‌భాస్కర్, ఇన్చార్జి ఎంపీడీఓ, అక్కన్నపేట -
ఏపీ నిరుద్యోగుల మహాగర్జన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో చేపట్టనున్న పోలీస్ రిక్రూట్మెంట్లో అభ్యర్థుల వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలని కోరుతూ నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. నగరంలోని ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం జరుగుతున్న ఏపీ నిరుద్యోగ మహగర్జనలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొన్నారు. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ఐదేళ్ల వయోపరిమితి ఇవ్వాలంటూ ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య గరిష్టంగా పెంచాలని, ఎస్సై పోస్టులను 1,500 చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కాసేపట్లో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించనుండటంతో..అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.