సాక్షి, అమరావతి: పేద విద్యార్థులకు పెద్ద చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన కోసం 392 దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఈ పథకంలో దరఖాస్తులకు సెప్టెంబర్ 30 వరకు ఇచ్చిన గడువు శుక్రవారం ముగిసింది. ప్రభుత్వ ఆర్థికసాయంతో విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ఉద్దేశించిన ఈ పథకం రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలు (ఈబీసీ), బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వర్తిస్తుంది. వచ్చిన దరఖాస్తులు, వాటికి జతచేసిన ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించిన తరువాత ప్రత్యక్ష ఇంటర్వ్యూల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
జగనన్న విదేశీ విద్యాదీవెనను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటుగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారందరికీ వర్తింపజేయడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఒకటి నుంచి 200 క్యూఎస్ ర్యాంకులు కలిగిన విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఇది మేలు చేస్తుంది. ఒకటి నుంచి వంద క్యూఎస్ ర్యాంకింగ్ కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్న వారికి ఫీజు రూ.కోటి అయినా నూరుశాతం ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ ఇస్తుంది.
101 నుంచి 200 క్యూఎస్ ర్యాంకులున్న యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకుంటే రూ.50 లక్షల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తుంది. ఈ పథకానికి వార్షిక ఆదాయ పరిమితిని రూ.8 లక్షల వరకు పెంచడం విశేషం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత ఉన్న ఎంతమందికైనా ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు కె.హర్షవర్ధన్ తెలిపారు. (క్లిక్ చేయండి: ట్రిపుల్ ఐటీ సీట్లలో అగ్రభాగంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా)
Comments
Please login to add a commentAdd a comment