సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మార్చి 31తో దరఖాస్తుల స్వీకరణ ముగియగా... మొత్తం 12,59,812 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో రెన్యువల్స్ 7,36,799 కాగా, ఫ్రెషర్స్ దరఖాస్తులు 5,23,013 ఉన్నాయి. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం గత సెపె్టంబర్‌లో ప్రకటన విడుదల చేసింది.
అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ... డిసెంబర్ 31 వరకు గడువు విధించింది. కానీ వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికావడంలో తీవ్ర జాప్యం జరగడంతో జనవరి 31 వరకు గడువు పొడిగించారు. కానీ అప్పటివరకూ అడ్మిషన్లు కొనసాగుతుండటంతో చివరి అవకాశం కింద మార్చి 31 వరకు గడువు పొడిగించారు.
ఇప్పుడు దరఖాస్తుల గడువు ముగియడంతో అధికారులు వాటి అర్హత నిర్ధారణపై దృష్టి సారించారు. పరిశీలన ప్రక్రియ పూర్తయిన వెంటనే సంక్షేమ శాఖలు అందుబాటులో ఉన్న నిధులను ముందుగా ఉపకారవేతనాలు విడుదల చేసి, ఆ తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు చేపట్టనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
నెలరోజుల్లో పరిశీలన పూర్తి...
ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల పరిశీలనకు సంక్షేమ శాఖలు నెలరోజుల గడువును నిర్దేశించుకున్నాయి. ఏప్రిల్ ఆఖరు కల్లా వీటిని పరిశీలించి అర్హులను నిర్ధారించాలని నిర్ణయించాయి. ఈమేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ , వికలాంగుల సంక్షేమ శాఖల జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఆన్‌లైన్లో వచ్చిన దరఖాస్తులు ముందుగా సంబంధిత కాలేజీ యాజమాన్యం యూజర్ ఐడీకి చేరతాయి.
కళాశాల ప్రిన్సిపల్ దరఖాస్తులను పరిశీలించి వాటిని సంక్షేమాధికారికి ఫార్వర్డ్ చేస్తారు. అక్కడ ధ్రువపత్రాలను పరిశీలించి అర్హులను నిర్ధారిస్తారు. మరోవైపు కాలేజీ యాజమాన్యం ఆమోదం తెలిపిన తర్వాత ప్రతి విద్యార్థి మీసేవా కేంద్రాల్లో వేలిముద్రలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ తంతు పూర్తయ్యాక సంక్షేమ శాఖలు సదరు దరఖాస్తును ఆమోదిస్తాయి.
ఈ ప్రక్రియ కోసం సంక్షేమ శాఖలు నెలరోజులు గడువు నిర్దేశించుకున్నప్పటికీ మరింత ఎక్కువ సమయం పడుతుందని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. పరీక్షలు, ప్రిపరేషన్ నేపథ్యంలో విద్యార్థులు వేలిముద్రలు సమర్పించడంలో జాప్యం జరుగుతుందని, ఏటా ఇదే జాప్యం వల్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment