సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల్లో ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకొస్తోంది. ఆన్‌లైన్ విధానంతో అత్యంత పారదర్శకంగా ఈ పథకాలను అమలు చేస్తుండగా... ఇప్పుడు విద్యార్థులు దరఖాస్తు చేసుకొనే విధానాన్ని మరింత సులభతరం చేయాలని నిర్ణయించింది. పోస్టుమెట్రిక్ కోర్సులో చేరిన విద్యార్థులు ఫ్రెషర్స్ కేటగిరీలో దరఖాస్తు చేసుకుంటుండగా... కోర్సు ముగిసే వరకు ఏటా దరఖాస్తును రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారు.
ఇలా దరఖాస్తులు సమర్పించేందుకు ప్రభుత్వం ఏటా నోటిఫికేషన్ ఇవ్వడం... కళాశాల యాజమాన్యాలు, విద్యార్థులకు సమాచారం అందించడంలో జాప్యం జరగడంతో దరఖాస్తు ప్రక్రియను ప్రతి సంవత్సరం పొడిగిస్తుండటం పరిపాటిగా మారింది. ఇలాంటి పరిస్థితులు పథకాల అమల్లో జాప్యానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తు విధానాన్ని సులభతరం చేయాలని సంక్షేమ శాఖలు ప్రభుత్వానికి సూచనలు చేశాయి.
ఈ క్రమంలో నోడల్ విభాగంగా వ్యవహరిస్తున్న ఎస్సీ అభివృద్ధి శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. కోర్సులో చేరిన విద్యార్థి కేవలం ఒకసారి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే... ఆ కోర్సు పూర్తయ్యే వరకు ఆ దరఖాస్తునే పరిగణనలోకి తీసుకొనేలా మార్పులు చేస్తోంది. రాష్ట్రంలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల కింద ఏటా సగటున 12.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందులో రెన్యువల్స్ 8 లక్షలు ఉండగా... ఫ్రెషర్స్ 4లక్షల మంది విద్యార్థులుంటున్నారు.
వన్‌టైమ్ రిజిస్ట్రేషన్...
ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ప్రతి విద్యార్థి ఈపాస్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుమెట్రిక్ కోర్సులో చేరిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్ ఆధారంగా అందులో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ దరఖాస్తును కోర్సు ముగిసే వరకు ఫార్వర్డ్ చేసే బాధ్యతను కాలేజీ యాజమాన్యానికి ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
దీంతో విద్యార్థి డ్రాపౌట్ కావడం, కోర్సు నుంచి ఎగ్జిట్ కావడంలాంటి విషయాలు కాలేజీ పరిధిలో ఉండటంతో ఈ బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుందని అధికారులు యోచిస్తున్నారు. ఈ అంశంపై ప్రతిపాదనలను ఎస్సీ అభివృద్ధి శాఖ అతిత్వరలో ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వం ఆమోదిస్తే ఈ సంస్కరణలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment