ఫీజు పైసల్‌... ముందే వసూల్‌ ! | Telangana Govt Delays Fee Reimbursement For Students, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఫీజు పైసల్‌... ముందే వసూల్‌ !

Published Fri, Nov 8 2024 6:26 AM | Last Updated on Fri, Nov 8 2024 10:59 AM

Telangana Govt delays fee reimbursement

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదలలో ప్రభుత్వం తీవ్ర జాప్యం 

దీంతో విద్యార్థుల నుంచే వసూళ్లకు పాల్పడుతున్న యాజమాన్యాలు

సాయివర్ధన్‌ (పేరుమార్చాం) పాలీసెట్‌లో మెరుగైన ర్యాంకు సాధించి రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో కన్వీనర్‌ కోటాలో సీటు దక్కించుకున్నాడు. కాలేజీలో రిపోర్టింగ్‌ చేసేందుకు వెళ్లిన ఆ విద్యార్థికి యాజమాన్యం షాక్‌ ఇచ్చింది. కన్వీనర్‌ కోటాలో సీటు వచ్చినా, ట్యూషన్‌ ఫీజు చెల్లించాలని, లేకుంటే అడ్మిషన్‌ ఇవ్వలేమని తెలియచెప్పింది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదలైన తర్వాత, ఆ మొత్తాన్ని విద్యార్థి ఖాతాలో జమ చేస్తామని స్పష్టం చేయడంతో తప్పనిసరి పరిస్థితిలో రూ.52 వేల రూపాయలు చెల్లించి అడ్మిషన్‌ పొందాడు. 

వికారాబాద్‌ జిల్లాకు చెందిన టి.మానస (పేరుమార్చాం) డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈడీ) కోర్సు పూర్తి చేసింది. కన్వీనర్‌ కోటాలో సీటు వచ్చినా, యాజమాన్య ఒత్తిడితో ఫీజు చెల్లించింది. ఏడాది క్రితం కోర్సు పూర్తి కావడంతో ఒరిజినల్‌ సరి్టఫికెట్ల కోసం కాలేజీకి వెళితే ఫీజు బకాయిలు చెల్లించాలని చెప్పారు. దీంతో మళ్లీ డబ్బు కట్టింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.46 వేలు ఇప్పటికీ అందలేదు.

సాక్షి, హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ కోర్సులు చదువుకునే విద్యార్థులకు ఆర్థికభారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలు చేస్తోంది. దీని కింద అర్హత సాధించిన విద్యార్థులు ట్యూషన్‌ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకుండా నేరుగా కాలేజీలో ప్రవేశం పొంది కోర్సు పూర్తి చేయొచ్చు. కానీ ప్రస్తుతం కాలేజీల్లో పరిస్థితి తారుమారైంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద అర్హత సాధించినా సరే... అడ్మిషన్‌ సమయంలో ట్యూషన్‌ ఫీజు పూర్తిగా చెల్లించాల్సిందే.

సీనియర్‌ విద్యార్థులయితే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే చెల్లించాలి. ప్రభుత్వం రీయింబర్స్‌ నిధులు కాలేజీకి విడుదల చేసినప్పుడు... సదరు విద్యార్థుల బ్యాంకు ఖాతాకు నిధులు బదిలీ చేయడమో... లేక చెక్కు రూపంలో విద్యారి్థకి అందిస్తామంటూ యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని వృత్తి విద్యాకాలేజీలు ఇదే తరహా ముందస్తుగా ఫీజు వసూళ్లు చేస్తున్నాయి. ఉచితంగా ఉన్నత చదువులు చదవాలనుకున్న విద్యార్థులకు తాజా పరిస్థితులు సంకటంగా మారాయి.  

ఏటా 12లక్షల దరఖాస్తులు  
రాష్ట్రంలో 5,539 పోస్టుమెట్రిక్‌ కాలేజీలున్నాయి. ఇందులో 2,641 జూనియర్‌ కాలేజీలు, 1,514 డిగ్రీ, పీజీ కాలేజీలున్నాయి. 235 ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు కాగా, 217 పారా మెడికల్‌ కాలేజీలున్నాయి. ఇతర వృత్తివిద్యా కేటగిరీల్లో మిగిలిన కాలేజీలున్నాయి. వీటి పరిధిలోని 12 లక్షల మంది విద్యార్థులు ఏటా ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు ముందస్తు వసూళ్లకు దూరంగా ఉంటున్నా, వృత్తి విద్యా కళాశాలలు మాత్రం అడ్మిషన్ల సమయంలోనే ఫీజులు వసూలు చేస్తున్నాయి. ,ఇంత జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. కనీసం కాలేజీలకు వెళ్లి ఫీజులపై తనిఖీలు కూడా చేయడం లేదు,  

లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల చెల్లింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.1,550 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు చెల్లిపులు చేస్తున్నాం. మా కార్యాలయానికి విద్యార్థులు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – చంద్రశేఖర్, బీసీ సంక్షేమశాఖ అదనపు సంచాలకులు  

విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి 
ముందస్తు ఫీజు వసూలపై సంక్షేమ శాఖల అధికారులు సీరియస్‌గా పరిగణించాలి. కాలేజీల వారీగా విచారణ చేపట్టాలి. అలా వసూళ్లకు పాల్పడిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులెవరూ ముందస్తుగా ఫీజులు చెల్లించొద్దు. – ఆర్‌.కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ 

సంఘం అధ్యక్షుడు 
బకాయిలు పేరుకుపోవడంతోనే ఈ పరిస్థితి ఫీజు రీయింబర్స్‌ నిధులు విడుదల చేయకపోవడంతోనే యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. సకాలంలో ఫీజు నిధులు విడుదల చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు.  – కందడి శ్రీరామ్, ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement