ముందే ఫీ‘జులుం’ | Private colleges that charge fees at time of admission | Sakshi
Sakshi News home page

ముందే ఫీ‘జులుం’

Published Wed, Aug 23 2023 1:26 AM | Last Updated on Wed, Aug 23 2023 1:26 AM

Private colleges that charge fees at time of admission - Sakshi

పాలిసెట్‌ ద్వారా ధనుంజయ్‌ రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లోని ఓ కాలేజీలో సీటు సాధించాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి అర్హత ఉంది. ట్యూషన్‌ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదని అనుకున్నాడు. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ పూర్తి చేసిన తర్వాత అడ్మిషన్‌కు కాలేజీకి వెళ్లాడు. అయితే పాలిటెక్నిక్‌ ఫస్ట్‌ ఇయర్‌ ట్యూషన్‌ ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్‌ ఇస్తామని కాలేజీ యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో ఒక్కసారిగా రూ.18వేలు చెల్లించే పరిస్థితి లేక ధనుంజయ్‌ సతమతమయ్యాడు. సీటు కోల్పోతాననే ఆందోళనతో తండ్రికి అసలు విషయం చెప్పగా, అప్పు చేసి వెంటనే ఫీజు చెల్లించి కాలేజీలో చేరాడు.  

ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకానికి అర్హత ఉన్న ధనుంజయ్‌ ఒక్కడే కాదు..ఆ కాలేజీలో కన్వినర్‌ కోటాలో వివిధ బ్రాంచ్‌ల్లో సీటు దక్కించుకున్న దాదాపు 500 మందికి పైగా విద్యార్థులంతా ఇదే తరహాలో ట్యూషన్‌ ఫీజు సొంతంగా చెల్లించి అడ్మిషన్లు తీసుకున్నారు. పలు ఇంజనీరింగ్‌ కాలేజీలు, ఇతర వృత్తివిద్యా కాలేజీలన్నీ ఇదే తరహాల్లో విద్యార్థుల నుంచి ముందస్తుగా ఫీజు చెల్లిస్తేనే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. 

రాష్ట్రంలో ఆయా కోర్సులు అందించే కాలేజీలు ఇలా...

 సాక్షి, హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలు చేస్తోంది. వృత్తివిద్యా కోర్సుల అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఆదాయపరిమితికి లోబడిన, కన్వినర్‌ కోటాలో సీటు దక్కించుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇంటర్‌లో చేరే విద్యార్థులు, దో­స్త్‌ ద్వారా జనరల్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారికి కూడా ఈ పథకం అమలవుతోంది.

వాస్తవానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద సీటు సాధిస్తే నిబంధనలకు లోబడి ఎలాంటి ట్యూషన్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. నేరుగా కాలేజీలో అడ్మిషన్‌ తీసుకొని కోర్సు పూర్తిచేసే వరకు ఉచితంగా చదువుకోవచ్చు. కానీ మెజారిటీ కాలేజీలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నా­యి. అడ్మిషన్‌ సమయంలోనే కొన్ని కా­లే­జీ యాజమాన్యాలు విద్యార్థి నుంచి ముందస్తుగా ట్యూషన్‌ ఫీజు వసూలు చే­స్తు­న్నాయి. అలా ఫీజును చెల్లించిన వా­రికి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. 


ఇప్పుడు చెల్లిస్తే.. అప్పుడు రికవరీ
రాష్ట్రంలో పోస్టుమెట్రిక్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 12.65లక్షలు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద అర్హత ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు నిధులు విడుదల చేస్తుంది. నేరుగా కాలేజీ యాజమాన్యం ఖాతాలో అవి జమ అవుతాయి. పాలిటెక్నిక్‌ కోర్సు మూడు సంవత్సరాలు, ఇంజనీరింగ్‌ కోర్సు నాలుగేళ్లు... ఇలా ఆయా కోర్సు కాలపరిమితి ఉండగా, విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత ఆ సంవత్సరానికి సంబంధించిన నిధులను తదుపరి అకడమిక్‌ ఈయర్‌ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం కాలేజీ ఖాతాలో జమ చేస్తుంది. ఆ తర్వాత కాలేజీ యాజమాన్యం విద్యార్థి చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెక్కు రూపంలో అతనికే చెల్లిస్తుంది. వాస్తవానికి విద్యార్థి నుంచి ఫీజు వసూలు చేసుకోవడం, తర్వాత అతడికి తిరిగి చెల్లించడం నిబంధనలకు విరుద్ధం.

లిఖిత పూర్వక ఫిర్యాదులు నిల్‌  
రెండేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు అదే కాలేజీలో చదవాల్సి ఉండడంతో ముందస్తు ఫీజు వసూళ్లపై విద్యార్థులు ఎ­లాంటి ఫిర్యాదులు చేయడం లేదు. ఇలా ఫిర్యాదు చేస్తే కాలేజీల్లో ఏదైనా యా­క్ష­న్‌ తీసుకునే అవకాశం ఉంటుందనే భావన మెజారిటీ విద్యార్థుల్లో ఉంది. ఫీజుల చెల్లింపులపై సంక్షేమ శాఖలకు ఎలాంటి ఫిర్యాదులు రాలేద­ని అధికారులు చెబుతున్నా­రు. ఒకవేళ లిఖితపూర్వకంగా ఫిర్యాదు­లు వస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement