సాక్షి, అమరావతి: పునాది బాగుంటేనే ఓ భవనమైనా, చదువులైనా పది కాలాల పాటు పటిష్టంగా ఉంటాయి! ప్రాథమిక స్థాయి నుంచి విద్యారంగ సంస్కరణలను చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇందుకోసం నాలుగేళ్లలో రూ.65 వేల కోట్లకుపైగా వెచ్చించడం చదువులకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. ఉన్నత విద్యలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తూ తల్లిదండ్రులపై ఫీజుల భారం పడకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంతో పాటు భోజన, వసతి ఖర్చులను సైతం ప్రభుత్వమే భరిస్తోంది.
ఇంటర్ తర్వాత ఏ విద్యార్థి చదువుకూ ఆటంకం కలుగకుండా 2019 జూన్ నుంచి ఈ ఏడాది జూలై వరకు దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకు మొత్తం రూ.14,912.43 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో జగనన్న విద్యాదీవెన కింద రూ.10,636.67 కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయగా విద్యార్థుల వసతి, భోజన ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన కింద మరో రూ.4275.76 కోట్లు అందించింది.
ఇక జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా మరో రూ.132.41 కోట్లను 1,858 మంది విద్యార్థులకు అందచేసి ఉన్నత చదువులకు అండగా నిలిచింది. మరోవైపు ఇంజనీరింగ్‌తో పాటు సంప్రదాయ డిగ్రీ కోర్సులు చదివిన వారికి చక్కటి ఉపాధి, ఉద్యోగాలు లభించేలా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, సర్టిఫికేషన్ కోర్సులను ప్రవేశపెట్టింది.
తొలిసారిగా ప్రైవేట్ వర్సిటీల్లో 35 శాతం సీట్ల కోటా
ప్రైవేట్ వర్సిటీల్లో రూ.5 లక్షల వరకు ఫీజులు చెల్లించాల్సిన ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు సంబంధించి దేశంలోనే తొలిసారిగా ఆ వర్సిటీల్లో 35 శాతం సీట్ల కోటాను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తద్వారా పేద మెరిట్ విద్యార్థులకు వాటిల్లో చదువుకునే అవకాశాన్ని కల్పించింది.
27 వేల సంస్థల్లో ఇంటర్న్‌షిప్
గతంలో డిగ్రీ చేతికొచ్చినా తగినన్ని నైపుణ్యాలు లేకపోవడంతో ఉద్యోగం, ఉపాధి లభిస్తుందన్న నమ్మకం లేదు. దీన్ని సరిదిద్ది నూతన బోధనా విధానాలపై శిక్షణ కార్యక్రమాలతోపాటు ఎడెక్స్ లాంటి ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థల ద్వారా సర్టిఫికేషన్ కోర్సులను అందుబాటులోకి తెస్తోంది. ఇంటర్న్‌షిను తప్పనిసరి చేసింది. ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు ఏడాది పాటు ఇంటర్న్‌షి అమలు చేస్తుండగా నాన్ ప్రొఫెషనల్ కోర్సుల్లో నాలుగేళ్ల డిగ్రీ (ఆనర్స్) కోర్సులు చదివే వారికి ఏడాది ఇంటర్న్‌షి ప్రవేశపెట్టారు.
మూడేళ్లలో డిగ్రీ కోర్సు నుంచి బయటకు వచ్చేవారికి 10 నెలల ఇంటర్న్‌షి తప్పనిసరి చేసింది. జిల్లాకు ఒక డిగ్రీ కాలేజీని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దుతోంది. ఇంటర్న్‌షి కోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని 27,119 సంస్థలను గుర్తించారు. వీటిలో ఏపీ జెన్‌కో, హ్యుందాయ్, కియా మోటార్స్, విప్రో, అమర్‌రాజా బ్యాటరీస్, కోల్గేట్ పామోలివ్ (ఇండియా) లిమిటెడ్, హీరో మోటోకార్ప్ లిమిటెడ్, జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్, రా్రïÙ్టయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, సెంబ్‌కార్ప్ ఎనర్జీ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్, హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, మైలాన్ లేబోరేటరీస్ లిమిటెడ్ లాంటి ప్రముఖ సంస్థలున్నాయి. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ లాంటి కోర్సులు చదివిన 2,91,022 మంది విద్యార్థులు తమ సర్టిఫికేషన్‌ను పూర్తి చేయడం విశేషం. కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కోర్సుల్లో ఇంటర్న్‌షిప్ కోసం యునిసెఫ్‌కు అనుబంధంగా ఐదు లక్షల మంది విద్యార్థులు తమ కోర్సును పూర్తి చేశారు.
భారీగా ప్లేస్‌మెంట్స్
విద్యార్థులకు సాంకేతిక శిక్షణ అందించేందుకు నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్‌తో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో లక్ష మంది విద్యార్థులు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, సేల్స్‌ఫోర్స్ వంటి కంపెనీల్లో వర్చువల్ ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. ఎడ్యుస్కిల్, సేల్స్‌ఫోర్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో మరో 1.45 లక్షల మంది విద్యార్థులు నైపుణ్యాభివృద్ధి కోర్సులు పూర్తి చేశారు. లక్షల మంది విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. వీటివల్ల ప్లేస్‌మెంట్స్ గణనీయంగా పెరిగాయి. క్యాంపస్ ఎంపికల్లో 2019–20లో 52 వేల మంది, 2020–21లో 69 వేల మంది, 2021–22లో 85 వేల మంది ఉద్యోగాలు పొందగా 2022–23లో ఈ సంఖ్య 1.20 లక్షలకు పెరగడం విశేషం.
నైపుణ్యాలకు పదును
విద్యార్థులను ఉత్తమ రీతిలో తీర్చిదిద్దాలంటే అధ్యాపకులకు నైపుణ్యాలపై శిక్షణ అవసరం. ఇందుకోసం 400 మంది అధ్యాపకులకు వరంగల్‌లోని ఎన్‌ఐటీలో మరో వెయ్యి మంది అధ్యాపకులకు ఆన్‌లైన్ ద్వారా ఈ–కంటెంట్‌పై శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు నచ్చిన సమయంలో కోరుకున్న సబ్జెక్టును చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. వీడియో పాఠాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, సమస్యలకు పరిష్కారాలు, ప్రశ్నాబ్యాంకు లాంటి వనరులను అందుబాటులో ఉంచుతున్నారు. 3,146 వీడియోలను సిద్ధం చేసి ఎల్‌ఎంఎస్‌కు జోడించారు. న్యాక్ అక్రిడిటేషన్, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల ద్వారా కళాశాలల సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు డిపార్ట్‌మెంట్ అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆడిట్‌ను ప్రభుత్వం చేపట్టింది.
బడ్జెట్‌లో భారీగా నిధులు
యువత నైపుణ్యాలను పెంపొందించేందుకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ప్రత్యేక శిక్షణ సంస్థలనూ నెలకొల్పుతున్నారు. ఇందుకోసం 2022–23 బడ్జెట్‌లో రూ.969.91 కోట్లు కేటాయించడం గమనార్హం. 2035 నాటికి అన్ని కాలేజీలు స్వయం ప్రతిపత్తితో డిగ్రీలను ప్రదానం చేసే సంస్థలుగా ఎదగాలన్న యూజీసీ లక్ష్యం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కాలేజీల్లో విద్యలో సంస్కరణలను అమలు చేస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల డ్యూయల్ మేజర్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఆనర్స్) ప్రవేశపెట్టింది. 144 కాలేజీల్లో వర్చువల్ క్లాస్ రూములను ఏర్పాటు చేసి అధునాతన విధానాల్లో బోధించేలా చర్యలు తీసుకుంది. ఐసీటీ ఆధారిత బోధన, అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు 56 కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూములను నెలకొల్పారు.
ఉపాధికి ఊతమిచ్చేలా కోర్సులు
రాష్ట్రంలో 152 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 111 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, 1,022 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో మొత్తం 3,65,563 సీట్లుండగా 2 లక్షల నుంచి 2.5 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. కాలేజీ విద్యను పటిష్టం చేయడంలో భాగంగా ప్రమాణాలు పాటించని విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 30 మంది కన్నా తక్కువ చేరికలున్న కాలేజీలకు ముందుగా నోటీసులిచ్చి ఆ తర్వాత మూసివేతకు, కోర్సుల రద్దుకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే ఇతర కాలేజీలకు తరలించేలా ఏర్పాట్లు చేసింది. అన్ని డిగ్రీ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలని నిర్ణయించి అమల్లోకి తెచ్చింది.
యూజీసీ కంటే ముందే ఉమ్మడి పీజీసెట్
దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష ఉండాలని సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు (సీయూఈటీ)ని యూజీసీ అమల్లోకి తెచ్చింది. దీనిద్వారా విద్యార్థులకు బహుళ పరీక్షలు రాసే ఇబ్బంది తప్పడంతో పాటు ఫీజుల వ్యయమూ తగ్గుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం యూజీసీ కంటే ముందే అన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సులకు 2021లోనే కామన్ ఎంట్రెన్స్ టెస్టును అమల్లోకి తెచ్చింది. యూజీసీ ఆలోచనలను ఏడాది ముందుగానే అమల్లోకి తెచ్చింది. విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ అందరి కంటే ఒక అడుగు ముందే ఉంది.
జాతీయ సగటుకు మించి జీఈఆర్
పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తుండడంతో మన రాష్ట్రంలో గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (జీఈఆర్) గణనీయంగా పెరిగింది. 2020–21లో దేశంలో సగటు జీఈఆర్ 27.3 శాతం ఉండగా రాష్ట్రంలో 37.2 శాతంగా నమోదైంది. కాలేజీల్లో ఎస్సీ విద్యార్థుల చేరికల పెరుగుదలలో జాతీయ స్థాయిలో కంటే మన రాష్ట్రం మెరుగ్గా ఉంది. చదువుల వ్యయంతోపాటు ఇంటర్న్‌షిప్, స్కిల్ కోర్సులను అందిస్తుండటంతో జీఈఆర్ గణనీయంగా పెరిగింది. కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు యువతుల వివాహ వయసు 18 ఏళ్లు నిండడంతో పాటు 10వ తరగతి చదవడం తప్పనిసరి అనే నిబంధన విధించడంతో బాలికల విద్యా రేటు పెరిగింది. ఈ పథకాలతో ప్రయోజనం పొందిన 50 శాతానికి పైగా యువతులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారే కావడం గమనార్హం.
సమున్నతం!
Published Fri, Aug 25 2023 3:29 AM | Last Updated on Fri, Aug 25 2023 3:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment