హైదరాబాద్ : పేదల అభ్యున్నతికి వైఎస్ రాజశేఖరరెడ్డి తపించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు రీయింబర్స్మెంట్పై వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దాంతో ఫీజు రీయింబర్స్మెంట్పై చర్చ జరగాలంటూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు.
అంతకు ముందు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే ఆశయంతో వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టారన్నారు. ఆయన మరణంతో ఆ పథకం నీరుగారిపోయిందన్నారు.
రూ.4,400 కోట్లు అవసరమయ్యే ఈ పథకానికి..చంద్రబాబు సర్కార్ రూ. 2 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని ఎమ్మెల్యేలు విమర్శించారు. పేద విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారని, దీనిపై వైఎస్ఆర్ సీపీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణలో చదువుతున్న 60వేలమంది విద్యార్థులు ఫీజులను ఆంధ్రప్రదేశ్ సర్కారే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.