సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యార్థులను అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది చదువుల్లో నాణ్యత పెంపొందించి ప్రపంచంతో పోటీ పడేలా ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ కోర్సులకు సంబంధించి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో మేలు చేకూర్చేలా సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిభకు పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలను రూపొందించింది.
వార్షిక ఆదాయ పరిమితిని పెంచి ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ పేదలకు కూడా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చేలా చర్యలు చేపట్టింది. క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీల్లో సీటు సాధించిన ఏపీ విద్యార్థుల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్–100 యూనివర్సిటీల్లో సీటు సాధించే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వర్తింపచేస్తుంది.
టాప్ 100 – 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారికి రూ.50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. తద్వారా రాష్ట్ర విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచడంతోపాటు నాణ్యతతో కూడిన ఉన్నత చదువులు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు సైతం ఈ స్థాయిలో ప్రయోజనం చేకూర్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం దేశంలోనే మరొకటి లేదని విద్యారంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షలు
ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింప చేయనున్నారు. టాప్ 200 యూనివర్సిటీల్లో ఎన్ని సీట్లు సాధిస్తే అంతమందికీ సంతృప్త స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించనున్నారు. 35 ఏళ్లలోపు ఉన్న వారిని అర్హులుగా గుర్తిస్తారు. ఏపీలో స్థానికులై ఉండాలి. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింప చేయనున్నారు. ఏటా సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపు కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది.
విదేశీ విద్యా దీవెన ఎప్పుడు.. ఎలా?
టీడీపీ హయాంలో...
► 2016 – 17 నుంచి లబ్ధిదారులుగా ఎంపిక చేసిన 3,326 మందికి రూ.318 కోట్ల మేర బకాయి పెట్టిన గత సర్కారు.
► చంద్రబాబు అధికారంలో ఉండగా ఆర్ధికంగా వెనకబడ్డ అగ్రకులాలకు ఈ పథకాన్ని వర్తింప చేయలేదు.
► సంవత్సరాదాయం రూ.6 లక్షల లోపు ఉన్నవారికి మాత్రమే వర్తింపు.
► కొన్ని దేశాల్లో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తించేలా ఆంక్షలు.
► చంద్రబాబు హయాంలో ఎస్సీలకు రూ.15 లక్షలు, ఎస్టీలకు రూ.15 లక్షలు, కాపులకు రూ.10 లక్షలు, బీసీలకు రూ.10 లక్షలు, మైనార్టీలకు రూ.15 లక్షల వరకూ మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపు.
► 300 మంది ఎస్సీలు, 100 మంది ఎస్టీలు, 400 మంది కాపులు, 1,000 మంది బీసీలు, 500 మంది మైనార్టీ విద్యార్థులకే మాత్రమే వర్తించేలా పరిమితులు.
వైఎస్సార్ సీపీ పాలనలో..
► ప్రతిభను పరిగణలోకి తీసుకుంటూ అగ్రవర్ణ పేద విద్యార్థులకూ పథకం వర్తింపు.
► ఆదాయ పరిమితిని రూ.8 లక్షలకు పెంచి మరింత మందికి మేలు చేసేలా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు.
► ప్రపంచంలో ఎక్కడైనా సరే టాప్ 200 యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు సంతృప్త స్థాయిలో పథకం వర్తింపు.
► టాప్ 100 యూనివర్సిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపు. 101 – 200 లోపు ర్యాంకింగ్స్ యూనివర్సిటీల్లో సీటు సాధిస్తే రూ.50 లక్షల వరకూ ఫీజులు చెల్లించనున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.
► ఆంక్షలు లేకుండా టాప్ 200 యూనివర్సిటీల్లో ఎంతమంది సీట్లు సాధిస్తే అంతమందికీ వర్తింప చేయాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ నిర్ణయం.
నాడు అస్తవ్యస్థంగా..
► గత సర్కారు హయాంలో విదేశీ విద్యా పథకం అమల్లో పలు లోపాలున్నట్లు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం వెల్లడించింది.
► లబ్ధిదారుల ఎంపికలో ఆదాయ పరిమితులను పాటించలేదని నిర్ధారణ.
► ఆధీకృత సంస్థకు సమాచారం ఇవ్వకుండానే కొందరు విద్యార్థులు తాము చదివే యూనివర్సిటీని, వెళ్లాల్సిన దేశాన్ని మార్చుకున్నట్లు వెలుగులోకి.
► పథకం ద్వారా లబ్ధి పొందిన అనంతరం కోర్సులు పూర్తి చేయకుండానే వెనుదిరిగిన కొందరు విద్యార్థులు.
► నిబంధనలకు విరుద్ధంగా ఒకే కుటుంబంలో ఒకరికి మించి పథకం వర్తింపు.
► ప్రభుత్వానికి సమర్పించిన చిరునామాలో జాడలేని కొందరు లబ్ధిదారులు.
నాలుగు వాయిదాల్లో ఖాతాల్లో జమ
నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్‌మెంట్ జమ చేస్తారు. ల్యాండింగ్ పర్మిట్ లేదా ఐ–94 ఇమ్మిగ్రేషన్ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లించనున్నారు. ఫస్ట్ సెమిస్టర్ లేదా టర్మ్ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లిస్తారు. రెండో సెమిస్టర్ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లిస్తారు. నాలుగో సెమిస్టర్ లేదా ఫైనల్ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లించనున్నారు. పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ విద్యార్థులకు ఏడాది వారీగా లేదా సెమిస్టర్ వారీగా కోర్సు పూర్తయ్యే వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment