AP: ప్రభుత్వ పథకాలతో ఉన్నత చదువులకు విద్యార్థుల మొగ్గు | Students interested towards higher studies with AP govt schemes | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ‘ఉన్నత’ ఉత్సాహం 

Published Fri, Nov 18 2022 3:10 AM | Last Updated on Fri, Nov 18 2022 8:01 AM

Students interested towards higher studies with AP govt schemes - Sakshi

సాక్షి, అమరావతి: ఉన్నత చదువులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రవేశాలు పెరుగుతున్నాయి. ఇంటర్‌ ఉత్తీర్ణుల్లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 93.38 శాతం మంది ఉన్నత విద్యా కోర్సుల్లో చేరడం గమనార్హం. ఇది దేశంలోనే కొత్త రికార్డు సృష్టించింది. జాతీయ సగటుకు మించి ఏపీలో గరిష్ట చేరికల నిష్పత్తి నమోదవుతోంది. ఏ రాష్ట్రంతో పోల్చినా ఆంధ్రప్రదేశ్‌ విద్యా రంగంలో మూడున్నరేళ్లలో గణనీయమైన పురోగతి సాధించింది. టీడీపీ హయాంలో 2018–19లో 20.37 శాతం మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరలేక డ్రాపౌట్లుగా మిగలగా ప్రస్తుతం 6.62 శాతానికి తగ్గిపోవడం గమనార్హం.

గత సర్కారు అరకొర ఫీజులనూ ఇవ్వకుండా రూ.1,800 కోట్లకు పైగా బకాయిలు పెట్టి దిగిపోగా వాటిని కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించి విద్యార్థుల చదువులకు అండగా నిలిచింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏ ఒక్క విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న ఆశయంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన విద్యాదీవెన, వసతి దీవెన పథకాలతో పాటు అకడమిక్‌ అంశాలు, నైపుణ్యాభివృద్ధి కోసం చేపట్టిన సంస్కరణల వల్లే ఉత్తమ ఫలితాలు వస్తున్నాయనేది కాదనలేని నిజం. విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తూ సదుపాయాలు మెరుగు పరుస్తుండడం, వివిధ పథకాలతో అడుగడుగునా అండగా నిలుస్తుండటంతో చదువుల నాణ్యతలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 

రాష్ట్రానికే ప్రాధాన్యం
బయట రాష్టాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గతంలో కన్నా తగ్గి రాష్ట్ర కాలేజీల్లో చేరికలు పెరిగాయి. 2022 – 23లో రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరిన వారు 35.50 శాతం ఉండగా డిగ్రీ కోర్సుల్లో 43.79 శాతం మంది చేరారు. 11.13 శాతం మంది అగ్రికల్చర్, ఫార్మసీ, నర్సింగ్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యలో చేరిన వారు 2.96 శాతం మంది ఉన్నారు. మరో 6.62 శాతం మంది మాత్రమే డ్రాపౌట్లుగా మిగిలారు.

2018–19లో ఇంటర్‌మీడియెట్‌ ఉత్తీర్ణులైన వారిలో 20.37 శాతం మంది డ్రాపౌట్లుగా మిగిలిపోగా ఈసారి అది 6.62 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. 2018 – 19లో టీడీపీ అధికారంలో ఉండగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌  కాకుండా కేవలం రూ.35 వేలు మాత్రమే చెల్లించినందున మిగతా ఫీజుల భారాన్ని  భరించలేక ఇంజనీరింగ్‌ కోర్సుల్లో 21.77 శాతం మంది మాత్రమే చేరారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తుండడంతో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరికల శాతం అమాంతం 35.50 శాతానికి పెరగడం గమనార్హం.

నాడు.. ప్రైవేట్‌కే విద్య
టీడీపీ హయాంలో ఉన్నత విద్య మొత్తం ప్రైవేట్‌పరం కావడం విద్యార్థులకు శాపంగా పరిణమించింది. ఇంటర్‌ చదువులకే రూ.లక్షలు ధారపోయాల్సిన దుస్థితి నెలకొంది. తూతూ మంత్రంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలైంది. కాలేజీల్లో ఫీజు ఎంతున్నా ఇంజనీరింగ్‌కు రూ.35 వేలు, ఇతర డిగ్రీ కోర్సులకు రూ.7 వేల నుంచి రూ. 10 వేల లోపు మాత్రమే విదిలించి గత సర్కారు చేతులు దులుపుకొంది. అది కూడా అరకొరగానే ఇవ్వడంతో మిగతా ఫీజుల మొత్తాన్ని తలిదండ్రులే భరించాల్సి వచ్చేది. ఫలితంగా పిల్లల చదువులు పూర్తయ్యేసరికి అప్పుల్లో మునిగిపోయేవారు. ఇలాంటి పరిస్థితి కారణంగా ఎంతోమంది విద్యార్థులు ఇంటర్‌తోనే చదువు ముగించి చిన్నా చితకా ఉద్యోగాలు, కూలి పనుల అన్వేషణలో నిమగ్నమైన పరిస్థితి ఏర్పడింది. 

నేడు.. సమూల మార్పులు
ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత విద్యా రంగం పరిస్థితి సమూలంగా మారిపోయింది. పేద విద్యార్థుల చదువులకయ్యే ఫీజు మొత్తాన్ని జగనన్న విద్యా దీవెన ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తోంది. చదువులు సాఫీగా సాగేలా వసతి, భోజనాల కోసం ఏటా రూ.20 వేల వరకు చెల్లిస్తున్నారు. వీటిని నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉన్నత చదువులపై భరోసా ఏర్పడింది. ఫలితంగా డ్రాపౌట్లు గణనీయంగా తగ్గాయి. కరోనా ఉన్న రెండేళ్లలోనూ చేరికలు పెరగడం విశేషం.

లక్ష ప్లేస్‌మెంట్స్‌ లక్ష్యం
► టీడీపీ హయాంలో 2015–16లో ఉన్నత విద్యా కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య 11,25,510 కాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక 2021–22 నాటికి 14,23,952కి చేరుకుంది. చదువుల కోసం నయాపైసా భారం పడకుండా ప్రభుత్వమే మొత్తం ఫీజులను చెల్లిస్తుండటంతో ప్రవేశాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. 

► అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గణాంకాల ప్రకారం 2014–15లో రాష్ట్రంలో ప్లేస్‌మెంట్లు 56 వేలు కాగా 2021–22లో 78 వేలకు చేరాయి. ప్లేస్‌మెంట్స్‌ను లక్షకు పైగా తీసుకెళ్లటాన్ని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

► జీఈఆర్‌ (ప్రతి వంద మందిలో కాలేజీల్లో చేరేవారి సంఖ్య)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏటా రాష్ట్రాల వారీగా ఆలిండియా ఉన్నత విద్యా సర్వే (ఐష్‌) పేరిట నివేదికలను వెలువరిస్తుంది. ఐష్‌ సర్వే ప్రకారం ఏపీలో జీఈఆర్‌ 2015–16లో 30.8 ఉండగా 2019–20లో 35.2కు పెరిగింది. జాతీయ స్థాయిలో 24.5 నుంచి 27.1కు పెరిగింది. జీఈఆర్‌ పెరుగుదల జాతీయ స్థాయిలో 3.04 శాతంగా ఉండగా ఏపీలో  8.64 శాతంగా ఉండడం విశేషం. కేరళ 4.86 శాతం, తమిళనాడు 4.89 శాతం, తెలంగాణ –1.65 శాతంగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement