ప్రైవేటు స్కూళ్లలో ‘ఉచిత’మెప్పుడు? | 25 percent seats in private schools are free as per Right to Education Act | Sakshi
Sakshi News home page

ప్రైవేటు స్కూళ్లలో ‘ఉచిత’మెప్పుడు?

Published Sun, Feb 2 2025 4:58 AM | Last Updated on Sun, Feb 2 2025 4:58 AM

25 percent seats in private schools are free as per Right to Education Act

విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు ఉచితం 

పేదలు, వికలాంగులు, అనాథలకు ఇవ్వాలని నిబంధన 

వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని హైకోర్టుకు తెలిపిన సర్కారు 

అధ్యయనం చేస్తున్నామంటున్న విద్యాశాఖ 

ఫీజు రీయింబర్స్‌ చేస్తే సీట్లిస్తామంటున్న ప్రైవేటు స్కూళ్లు

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలన్న చట్ట నిబంధన అమలుపై సందిగ్ధత నెలకొంది. విద్యా హక్కు చట్టంలోని ఈ నిబంధన అమలుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపినప్పటికీ.. అందుకోసం ఇంకా కార్యాచరణ ప్రణాళిక మాత్రం రూపొందించలేదు. దీనిని ఎలా అమలు చేయాలనే అంశంపై అధ్యయనం చేస్తున్నామని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

మరోవైపు కొన్ని కార్పొరేట్‌ స్కూళ్లు వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు మొదలు పెట్టాయి. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్లల్లో అడ్మిషన్లు ముగింపు దశకు చేరాయి. 25 శాతం ఉచితంపై తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆ సంస్థలు అంటున్నాయి. ప్రభుత్వం ఫీజులను రీయింబర్స్‌ చేస్తే పేదలకు ఉచితంగా సీట్లు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. \

ఎవరికి ఉచితం? 
రాష్ట్రంలో దాదాపు 10 వేలకుపైగా ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 38 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం అనాథలు, వికలాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 4, బీసీ, మైనారీ్ట, అల్పాదాయ వర్గాల పిల్లలకు 6 శాతం కలిపి మొత్తం 25 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వాలి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధన అమలు తీరును విద్యాశాఖ పర్యవేక్షించాలి. స్థాయిని బట్టి ప్రైవేటు స్కూళ్లలో ప్రస్తుతం రూ.40 వేల నుంచి రూ.20 లక్షల వరకు వార్షిక ఫీజు వసూలు చేస్తున్నారు.

రూ.40 వేల లోపు ఫీజులుండే ప్రైవేటు స్కూళ్లల్లో ఆశించిన మేర అడ్మిషన్లు జరగవు. కాబట్టి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌ చేస్తే ఈ పథకం అమలుకు సిద్ధమేనని చెబుతున్నారు. కార్పొరేట్‌ స్కూళ్లు మాత్రం రూ.20 లక్షల ఫీజు లావాదేవీలను రికార్డుల్లో చూపించకుండా, స్కూల్‌ డెవలప్‌మెంట్‌ ఫీజుగా వసూలు చేస్తున్నాయి. వీటికి ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదు. ఉచిత సీట్లిస్తే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌ చేసినా ట్యూషన్‌ ఫీజుగా వసూలు చేసే రూ.2 లక్షల లోపే వస్తుందని ఆ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర సిలబస్‌తో నడిచే సీబీఎస్‌సీ, ఐసీఎస్‌ఈ వంటి స్కూళ్లపై రాష్ట్రానికి అంతగా ఆధిపత్యం ఉండదని అధికారులు అంటున్నారు.  

కొన్ని రాష్ట్రాల్లో అమలు 
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, మరో మూడు రాష్ట్రాల్లో మాత్రమే 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపు అమలు జరగడం లేదని అధికారులు తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో ఈ పథకం వివిధ మార్గాల్లో అమలవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌ చేస్తోంది. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రైవేటు స్కూళ్లే స్వచ్ఛందంగా అమలు చేస్తున్నాయి. కాగా, విద్యాహక్కు చట్టం ప్రకారం ఆవాసాలకు కిలోమీటర్‌ దూరంలో ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నతపాఠశాల లేకపోతే ఆయా విద్యార్థులకు ప్రైవేట్‌ బడుల్లో 25 శాతం సీట్లను కేటాయించాల్సి ఉంటుందని కొన్ని ప్రైవేటు స్కూళ్లు వాదిస్తున్నాయి.

అయితే, ఈ నిబంధనతో పనిలేదని విద్యాశాఖ చెబుతోంది. పథకం అమలుపై ఇటీవల ప్రభుత్వం నివేదిక కోరడంతో అధికారులు సమర్పించారు. 38 లక్షల్లో 25 శాతం మందికి ఉచితంగా సీట్లిస్తే దాదాపు 9 లక్షల మందికిపైగా విద్యార్థులు సీట్లు పొందుతారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తే ఈ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలి. ఇది ఆర్థికంగా గుదిబండ అవుతుందనే భావనతో ప్రభుత్వం ఉన్నదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌ చేయకుండా, ప్రైవేటు స్కూళ్లు సామాజిక బాధ్యతగా 25 శాతం ఉచితం అమలు చేసేలా చూడాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement