
దేశవ్యాప్తంగా చిన్నారులపై పెరిగిన ఆన్‌లైన్ వేధింపులు
అసభ్య వీడియోలు,ఫొటోల సర్క్యులేషన్‌లోనూ పెరుగుదల
వెల్లడించిన ‘వల్నరబుల్ ఆన్‌లైన్
ఏ స్టడీ ఆన్ సైబర్ క్రైమ్ ఎగెనెస్ట్‌చిల్డ్రన్ ఇన్ ఇండియా’ నివేదిక
ఈ తరహా కేసులపై ఫోకస్ పెడుతున్న చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు
దేశవ్యాప్తంగా చిన్నారులపై సైబర్ నేరాల్లో పెరుగుదల నమోదవుతోందని ‘వల్నరబుల్ ఆన్‌లైన్– ఏ స్టడీ ఆన్ సైబర్ క్రైమ్ ఎగెనెస్ట్‌చిల్డ్రన్ ఇన్ ఇండియా’నివేదిక వెల్లడించింది. ఆన్‌లైన్ వేదికగా చిన్నారుల అశ్లీల వీడియోలు, ఫొటోలను పంపిణీ చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. సీఎస్‌ఈఏఎం (చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేటివ్ అండ్ అబ్యూస్ మెటీరియల్) ఇంటర్నెట్‌లో పెరగడం ప్రమాదకరమని నివేదిక స్పష్టం చేసింది.
ఇటీవల విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. చిన్నారులపై లైంగిక వేధింపులు, అశ్లీల కంటెంట్ సర్క్యులేషన్‌పై 2018లో దేశవ్యాప్తంగా 27,248 కేసులు నమోదు కాగా, 2022లో కేసుల సంఖ్య 65,893కి చేరినట్టు నివేదిక వెల్లడించింది. ఈ తరహా కేసుల కట్టడికి జాతీయ స్థాయిలో ది ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ (ఐసీపీ) చర్యలు ప్రారంభించింది. చిన్నారులు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కకుండా కాపాడేందుకు వారిలో అవగాహన పెంచేలా ఆన్‌లైన్ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు.
చిన్నారులపై ఆన్‌లైన్లో లైంగిక వేధింపులు, వారి అశ్లీల వీడియోలు, ఫొటోలవ్యాప్తి కట్టడికి తెలంగాణ పోలీసులు సైతం కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ)లో ప్రత్యేకంగా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (సీపీయూ)ను 2024లో నెలకొల్పారు. ఈ యూనిట్ ప్రధానంగా సీఎస్‌ఈఏఎం (చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్) ఫోకస్ పెడుతోంది. ఆన్‌లైన్‌లో పెట్రోలింగ్, డెకాయి ఆపరేషన్స్ నిర్వహిస్తూ సీపీయూ సిబ్బంది నిఘా పెడుతున్నారు. 2024లోనూ టీజీసీఎస్‌బీ అధికారులు డార్క్‌వెబ్, ఇతర వెబ్‌సైట్లలో వెబ్ పెట్రోలింగ్ ద్వారా 7,247 మంది అనుమానితుల జాడ గుర్తించారు.
ఈ సమాచారం ఆధారంగా ఆయా రాష్ట్రాల్లోనూ కేసుల నమోదులో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా ఈ ఏడాది రెండు నెలల్లో ఇలాంటి వేధింపులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 71 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంతోపాటు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 47 మందిని అరెస్టు చేశారు. పిల్లలను లైంగిక చర్యలకు ప్రలోభపెట్టడం, వారిపై లైంగిక వేధింపులు, అశ్లీలత, పిల్లల లైంగిక అక్రమ రవాణా, పిల్లలకు ఆయాచిత అశ్లీల పదార్థాల పంపిణీ, మోసపూరిత డిజిటల్ కంటెంట్ వంటి నేరాలపైనా ఈ ప్రత్యేక యూనిట్ల ద్వారా దృష్టి పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment