పుట్టకముందే ప్రైవేటుపరం! | Railway department decides to hand over management of Kazipet Coach Factory to private companies | Sakshi
Sakshi News home page

పుట్టకముందే ప్రైవేటుపరం!

Published Tue, Mar 4 2025 11:01 AM | Last Updated on Tue, Mar 4 2025 11:01 AM

Railway department decides to hand over management of Kazipet Coach Factory to private companies

కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని రైల్వేశాఖ సూత్రప్రాయ నిర్ణయం

ఫ్యాక్టరీ ఉద్యోగులలో 80 శాతానికి పైగా ప్రైవేటువారే ఉండే చాన్స్‌ 

వచ్చే డిసెంబర్‌ నాటికి యూనిట్‌ రెడీ..  తర్వాత ఏడెనిమిది నెలల్లో ఉత్పత్తి ప్రారంభం 

ఐదేళ్లపాటు తయారీ పనిని టెండర్‌ ద్వారా ప్రైవేటు సంస్థకు అప్పగించాలని రైల్వే యోచన 

కొన్ని కీలక పోస్టులు తప్ప అన్నీ ప్రైవేటు సంస్థ పరిధిలోకి వెళ్లే చాన్స్‌ 

భారీగా రైల్వే శాఖ ఉద్యోగాలు వస్తాయనుకుంటున్న స్థానిక యువతకు షాక్‌

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ దశాబ్దాల కల కాజీపేట రైలు కోచ్‌ ఫ్యాక్టరీ.. అందినట్టే అంది, చేజారుతూ, ఊరిస్తూ చివరికి రైల్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ రూపంలో ఏర్పాటవుతున్న ఈ ఫ్యాక్టరీతో ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి లభి స్తుందన్నది రాష్ట్ర యువత ఆశ. కానీ రైల్వేశాఖ ఈ ఆశలను కుదిపేసే నిర్ణయం తీసుకుంది. రైల్వేశాఖ వర్గాల ప్రకారం.. ఈ కోచ్‌ ఫ్యాక్టరీ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని రైల్వేశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఏడాదిన్నరలో ఉత్పత్తి ప్రారంభమవనున్న ఈ యూనిట్‌ నిర్వహణను టెండర్ల ద్వారా ప్రైవేటుకు అప్పగించాలని భావిస్తోంది. ఇదే జరిగితే కొన్ని కీలక పోస్టులు తప్ప మిగతా ఉద్యోగాలన్నీ ప్రైవేటు సంస్థ ఆదీనంలోనే ఉండనున్నాయి. 

రూ.530 కోట్ల వ్యయంతో... 
కాజీపేటకు మంజూరైన రైలు తయారీ కేంద్రం నిర్మాణం వచ్చే డిసెంబరు నాటికి సిద్ధం కాబోతోంది. తర్వాత ఏడెనిమిది నెలల్లో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాజీపేట శివారులోని మడికొండ సమీపంలో రూ.530 కోట్ల వ్యయంతో 160 ఎకరాల విస్తీర్ణంలో ఇది రూపొందుతోంది.

రైల్వే అనుబంధ సంస్థ రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌), జపాన్‌కు చెందిన టైకిషా సంస్థ జాయింట్‌ వెంచర్‌గా దీన్ని నిర్మిస్తున్నాయి. ఈ యూనిట్‌లో వందేభారత్‌ రైలు కోచ్‌లు, ఎలక్ట్రిక్‌ మల్టీపుల్‌ యూనిట్‌(ఈఎంయూ) రైళ్లు, ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు తయారు చేయనున్నారు. 

మెల్లగా ప్రైవేటువైపు రైల్వే చూపు.. 
ఇన్నాళ్లూ రైల్వేను సొంత నిర్వహణలోనే ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం.. క్రమంగా ప్రైవేటు వైపు దృష్టి సారిస్తోంది.  తొలుత రైళ్ల తయారీ యూనిట్లను ప్రైవేటుకు అప్పగించటం ద్వారా వేతనాల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా ఉన్న భారతీయ రైల్వేలో ప్రస్తుతం 12.52 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఏటా రూ.లక్ష కోట్లకుపైగా జీతాలకే ఖర్చవుతోంది.

ఇది రైల్వేకు భారంగా మారింది. రైల్వే ఉద్యోగుల వేతనాలు కూడా భారీగా ఉండటం, క్రమం తప్పకుండా సవరించాల్సి రావడంతో.. ఈ పద్దులో పొదుపు సాధ్యంకాని పరిస్థితి. రైల్వే నష్టాలకు ఇది కూడా ఓ కారణమన్న వాదన ఉంది. ఈ క్రమంలో కొన్ని విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించటం ద్వారా భారం తగ్గించుకోవాలని రైల్వే భావిస్తోంది. 

అంతా సిద్ధం చేసి.. నిర్వహణ ప్రైవేటుకు.. 
కాజీపేట ఫ్యాక్టరీలోనే రైళ్లను పూర్తి స్థాయిలో తయారు చేసేందుకు వీలుగా అన్ని రకాల విభాగాలను ఆర్‌వీఎన్‌ఎల్‌ నిర్మిస్తోంది. ఆధునిక రైలు కోచ్‌ల తయారీ కోసం స్థానికంగా లభించే యంత్రాలతోపాటు టైకిషా కంపెనీ నుంచి అధునాతన యంత్రాలను దిగుమతి చేసుకోనుంది. అన్ని విభా గాలు, వాటిలో యంత్రాలు, పరికరాలను సిద్ధం చేసిన త ర్వాత ప్రైవేటు సంస్థకు టెండర్‌ ద్వారా అప్పగించాలని రైల్వే భావిస్తోంది.

టెండర్‌ ఖరారయ్యే నాటి నుంచి తర్వాతి ఐదేళ్లలో ఎన్ని ఏయే రకాల రైళ్లు, కోచ్‌లు ఎన్ని కావాలనేది అందులో పేర్కొంటుంది. టెండర్‌ దక్కించుకున్న సంస్థ ఆ మేర కు రైళ్లు, కోచ్‌లను తయారు చేసి అందించాల్సి ఉంటుంది. అయితే కీలక విభాగాల్లోని ఉన్నతాధికారులు, ప్రధాన ఇంజనీర్లు కొందరిని రైల్వే రిక్రూట్‌ చేస్తుంది. మిగతా ఉద్యోగులను ప్రైవేటు సంస్థనే నియమించుకోవాల్సి ఉంటుంది. 

80 శాతానికిపైగా ప్రైవేటు ఉద్యోగులే! 
కాజీపేట రైలు కోచ్‌ తయారీ యూనిట్‌కు 3 వేల మంది వరకు ఉద్యోగులు అవసరమని రైల్వే వర్గాలు చెబుతున్నా యి. వీరంతా ప్రత్యక్ష ఉద్యోగులు, పరోక్షంగా మరో 15వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. అయితే ఫ్యాక్టరీలో అవసరమైన 3 వేల మంది రెగ్యులర్‌ ఉద్యోగుల్లో.. సుమారు 2.5వేల మందిని ప్రైవేటు సంస్థనే సమకూర్చుకుంటుందని, 500 మంది వరకు మాత్రమే రైల్వే శాఖ ద్వారా రిక్రూట్‌ అవుతారని అంటున్నారు. అంటే 80శాతానికిపైగా ఉద్యోగులు ప్రైవేటువారే ఉంటారని స్పష్టమవుతోంది.  

ఈ ఫ్యాక్టరీలో ఏమేం తయారు చేస్తారు? 
    రైల్వే అధికారుల అంచనాలు, ప్రాథమిక సమాచారం ప్రకారం.. 
కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీలో ఏటా 15 వందే భారత్‌ రైళ్లు (ఒక్కోదానిలో 16 కోచ్‌లు) తయారు చేసే సామర్థ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో వందే భారత్‌ రైలు తయారీకి రూ.140 కోట్లు ఖర్చవుతుంది. 

 నెలకు 10 చొప్పున ఎంఎంటీఎస్‌ తరహా రైలు రేక్స్‌ (ఎలక్ట్రిక్‌ మల్టీపుల్‌ యూనిట్లు) తయారు చేయనున్నారు. ఈ ఒక్కో రైలుకు రూ.90 కోట్ల వరకు ఖర్చు అవుతుంది.  
  సాధారణ రైళ్లలో వినియోగించే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను నెలకు 50 వరకు తయారు చేస్తారు. ఒక్కో కోచ్‌ ధర రూ.1.6 కోట్లు ఉంటుంది. అదే ఏసీ కోచ్‌ అయితే రూ.2 కోట్లు ఖర్చవుతుంది.

దశాబ్దాల కల ఇది..
మాజీ ప్రధాని పీవీ ఒత్తిడితో 1980వ దశకంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం కాజీపేటకు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని మంజూరు చేసింది. దానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో నాటి ప్రధాని ఇందిర హత్యకు గురయ్యారు. ఆ సమయంలో జరిగిన సిక్కుల ఊచకోతతో కాంగ్రెస్‌ పార్టీపై సిక్కుల్లో వ్యతిరేకత నెలకొంది. రాజీవ్‌ గాంధీ ప్రధాని అయిన తర్వాత సిక్కులను సముదాయించే చర్యల్లో భాగంగా.. కాజీపేటకు రావాల్సిన కోచ్‌ ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తలాకు మళ్లించారు. అప్పటి నుంచి కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ కోసం తెలంగాణ ఎదురుచూస్తూనే ఉంది.

మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో కాజీపేటకు రైలు చక్రాల తయారీ యూనిట్‌ మంజూరు చేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని రైల్‌ పీరియాడికల్‌ ఓవర్‌ హాలింగ్‌ వర్క్‌షాప్‌గా మార్చింది. కానీ పనులేవీ మొదలుకాలేదు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక కేంద్ర ప్రభుత్వం కాజీపేటకు వ్యాగన్‌ తయారీ కేంద్రాన్ని మంజూరు చేసి, ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే దీనిని రైల్వే కోచ్‌ తయారీ కేంద్రంగా అప్‌గ్రేడ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement