ఏడాదిన్నరలో ‘ఈఎంయూ’ల ఉత్పత్తి మొదలుపెట్టనున్న రైల్వే
తొలుత నెలకు 24 చొప్పున కోచ్‌ల తయారీ..
భవిష్యత్తులో సామర్థ్యం పెంపు
ముంబై లోకల్ రైళ్లకు కూడా ఇక్కడి నుంచే సరఫరా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తిరుగుతున్న ఎంఎంటీఎస్ రైళ్లు ఇకపై మన రాష్ట్రంలోనే తయారుకాబోతున్నాయి. ఇక్కడే కాకుండా, ముంబై లోకల్ రైల్ సర్వీసులకు అవసరమైన కోచ్‌లను కూడా ఇక్కడే తయారు చేసి సరఫరా చేయనున్నారు. ఇందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వే కాజీపేటకు మంజూరు చేసిన వ్యాగన్ తయారీ కేంద్రాన్ని ఇటీవలే కోచ్ తయారీ కేంద్రంగా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2026 మార్చి నాటికి ఫ్యాక్టరీ ఏర్పాటు పూర్తిచేసి, ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఫ్యాక్టరీలో ఎల్‌హెచ్‌బీ, వందేభారత్ కోచ్‌లతో పాటు ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ (ఈఎంయూ)లను కూడా తయారు చేయనున్నారు. ఫ్యాక్టరీ సిద్ధమైన వెంటనే ఈఎంయూల ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది.
తొలుత నెలకు 24 కోచ్‌ల ఉత్పత్తి..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోకల్ రైళ్లుగా ఈఎంయూ కోచ్‌లతో కూడిన రేక్స్‌ను వినియోగి స్తున్నారు. ప్రధాన నగరాలకు చేరువగా ఉన్న అన్ని రూట్లను దాదాపు విద్యుదీకరించడంతో వీటి వినియోగం పెరిగింది. హైదరాబాద్‌లోని మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టు సిస్టం (ఎంఎంటీఎస్)లో వాడుతున్న కోచ్‌లు కూడా ఈఎంయూలే. ఈ కోచ్‌లలోనే లోకోమోటివ్ అంతర్భాగంగా ఉంటుంది. ఇవి పుష్–పుల్ తరహాలో పనిచేస్తాయి. వీటిని ఎక్కువగా ముంబైలో లోకల్ రైళ్లుగా, చెన్నై శివారులో సబర్బన్ రైళ్లుగా వినియోగిస్తున్నారు. మరికొన్ని నగరాల్లోనూ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో ఈఎంయూ కోచ్‌లను ఉత్పత్తి చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపుతున్నారు.
వందే భారత్‌కు డిమాండ్ పెరగటంతో..
దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతున్నందున ఐసీఎఫ్‌లో వందే భారత్ కోచ్‌ల ఉత్పత్తిని పెంచారు. దీనితో అక్కడ ఈఎంయూల ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ మేరకు ఇతర కోచ్ ఫ్యాక్టరీలలో వాటిని ఉత్పత్తి చేయనున్నారు. కాజీపేటలో సిద్ధమవుతున్న కోచ్ తయారీ కేంద్రానికి కూడా ఈ బాధ్యత అప్పగించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 16 ఎంఎంటీఎస్ రేక్స్ నడుస్తున్నాయి. 12 కోచ్‌లతో కూడిన రైలును ఒక రేక్ అంటారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ విస్తరణ నేపథ్యంలో మరిన్ని రేక్స్ అవసరం ఏర్పడింది. ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తయితే ఇంకా వినియోగం పెరుగుతుంది.
అప్పటికల్లా కాజీపేట ఫ్యాక్టరీ సిద్ధంకానుండటంతో.. ఆ కోచ్‌లను ఇక్కడే తయారు చేయనున్నారు. దేశంలో ఎక్కువ ఈఎంయూలను వాడుతున్నది ముంబై లోకల్ రైల్వే వ్యవస్థ. అక్కడ ప్రస్తుతం నిత్యం 191 రేక్స్ 2,500కు పైగా ట్రిప్పులు తిరుగుతున్నాయి. భవిష్యత్తులో ముంబైకి కూడా కాజీపేట నుంచే ఈఎంయూ కోచ్‌లు సరఫరా కానున్నాయి. నెలకు 24 కోచ్‌ల (రెండు రేక్స్) సామర్థ్యంతో యూనిట్ ప్రారంభం కానుంది. తర్వాత క్రమంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment