ప్రైవేటుతో పర్యాటక శోభ.. | Telangana tourism sector is more or less run by private companies worldwide | Sakshi
Sakshi News home page

ప్రైవేటుతో పర్యాటక శోభ..

Published Tue, Mar 18 2025 3:30 AM | Last Updated on Tue, Mar 18 2025 3:30 AM

Telangana tourism sector is more or less run by private companies worldwide

ప్రత్యేక పర్యాటక పాలసీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 

భారీగా పెట్టుబడులు వచ్చేలా ప్రోత్సాహకాలు

రూ.15 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యం.. 3 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి 

టూరిస్టు ప్రదేశాలు భద్రమేనన్న నమ్మకం కలిగించే చర్యలు 

అన్ని చోట్లా సీసీ కెమెరాలతో నిఘా.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం ప్రైవేటు సంస్థల పెట్టుబడులతో వర్ధిల్లుతోంది. మన దేశంలోనూ ప్రధాన పర్యాటక ప్రాజెక్టులు ప్రైవేటు సంస్థల చేయూతతోనే ముందుకు సాగుతున్నాయి. దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే ప్రాంతాలు తెలంగాణలో ఎన్నో ఉన్నా.. కనీస వసతులు లేక పర్యాటకులు కన్నెత్తి చూడటం లేదు.

ఈ క్రమంలో రాష్ట్రంలో పర్యాటకానికి ఊపు ఇచ్చేందుకు ప్రత్యేక టూరిస్టు పాలసీని ప్రభుత్వం రూపొందించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2030 నాటి అవసరాలకు సరిపోయేలా పాలసీని రూపొందించినట్టు పేర్కొంది. ఆధ్యాత్మిక, వారసత్వ, సాంస్కృతిక, సాహసక్రీడలు, మెడికల్, వెల్‌నెస్, ఎకో–టూరిజం.. ఇతివృత్తాలుగా ఆయా సెక్టార్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటక ప్రాజెక్టులు చేపట్టే ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహకాలివ్వాలని నిర్ణయించింది. 

భద్రమైన గమ్యం 
పర్యాటకులు ముందుగా గమనించేది ఆ ప్రాంతం భద్రమేనా, కాదా అన్నది. దీని కి పాలసీలో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ భద్రమైన ప్రాంతమన్న భావన పర్యాటకుల్లో వచ్చేలా ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు. పర్యాటకులతో స్థానికులు, గైడ్లు, దుకాణదారులు ఫ్రెండ్లీగా మెలిగేలా చర్యలు తీసుకోవటంతోపాటు ఆయా ప్రాంతాలను సీసీ కెమె రాల నిఘా పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. 

ప్రోత్సాహకాలు ఇలా..: అడ్వెంచర్‌ టూరిజం కేంద్రాల్లో కనీస పెట్టుబడి మొత్తం రూ.25లక్షలుగా నిర్ధారించారు. దీనికి ఈపీసీపై సబ్సిడీ మొత్తం 25శాతంగా ఖరారు చేశారు. కారవాన్‌ పార్క్‌ ప్రాజెక్టుల్లో కనీసం పెట్టుబడి రూ.25 లక్షలు, సబ్సిడీ 25 శాతం, టూర్‌ ఆపరేటర్ల కారవాన్‌లలో కనీస పెట్టుబడి రూ.25 లక్షలు సబ్సిడీ 25శాతం, హౌస్‌ బోట్‌ ప్రాజెక్టుల్లో కనీస పెట్టుబడి రూ.కోటి, ఈపీసీ సబ్సిడీ 25 శాతం, వే సైడ్‌ ఎమినిటీస్‌ విషయంలో కనీస పెట్టుబడి రూ.2 కోట్లు, సబ్సిడీ 10 శాతంగా ఖరారు చేశారు.

వీటికితోడు నెట్‌ స్టేట్‌ జీఎస్టీని పెట్టుబడిదారులకు ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుంది. స్పెషల్‌ టూరిజం ఏరియా (ఎస్‌టీఏ)ల విషయంలో ఆయా ప్రాజెక్టుల ఆధారంగా వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ (బేసిక్‌ ఎమినిటీస్‌ కోసం), ఎస్‌జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, భూములకు తక్కువ లీజు మొత్తం వంటి రాయితీలు కల్పిస్తారు. కొన్ని రకాల ప్రాజెక్టుల్లో ఇండస్ట్రియల్‌ పవర్‌ శ్లాబ్స్, ప్రాపర్టీ ట్యాక్సుల్లో రాయితీలుంటాయి. నిర్ధారిత ప్రాజెక్టులకు ల్యాండ్‌ కన్వర్షన్‌ చార్జీలను రీయింబర్స్‌ చేస్తారు.

సర్కారు పెట్టుకున్న లక్ష్యాలివీ.. 
వచ్చే ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు సాధించాలి. ఈ ఐదేళ్లలో కనీసం 3 లక్షల మందికి అదనంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. 
జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య ఆధారంగా తెలంగాణను దేశంలో మొదటి ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలి. 
అంతర్జాతీయ పర్యాటక పటంలో తెలంగా ణ సమున్నతంగా నిలిచేలా డిజిటల్‌ మార్కెటింగ్, సోషల్‌ మీడియా ద్వారా ప్రభావం చూపాలి. రాష్ట్ర జీఎస్‌డీపీలో పర్యాటక రంగం వాటా 10 శాతానికి మించి ఉండాలి.

స్పెషల్‌ టూరిజం ఏరియాలు.. అద్భుత వసతులు – సాక్షి ప్లస్‌(ఈ–పేపర్‌)లో 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement