Private Companies
-
ప్రైవేటు ‘కోటా’ వివాదం.. కర్ణాటక ప్రభుత్వం వెనకడుగు
బెంగళూరు: కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో గ్రూప్ సీ, డీ గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. పరిశ్రమవర్గాల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. దీనిపై రానున్న రోజుల్లో సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.ప్రైవేటు రంగంలో స్థానికులకు రిజర్వేషన్ తప్పనిసారి చేస్తూ కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం కొత్త బిల్లును ఆమోదించింది. అయితే కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లుపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ఆయన ట్వీట్ ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పరిశ్రమల్లోని గ్రూప్ సీ, డీ గ్రేడ్ ఉద్యోగాల్లో వంద శాతం కన్నడిగుల నియామకాన్ని తప్పనిసరి చేస్తూ రూపొందించిన బిల్లును రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించిందని సీఎం పేర్కొన్నారు.కన్నడిగులు తమ రాష్ట్రంలో సంతోషంగా జీవించేందుకు అవకాశం కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్ధేశ్యమని సీఎం పేర్కొన్నారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగానికి వారు దూరం కాకూడదని తెలిపారు. కన్నడిగుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు. అయితే పోస్టుపై అనేక విమర్శలు వెల్లువెత్తడంతో.. తరువాత ఆయన దానిని డిలీట్ చేశారు. అనంతరం మళ్లీ సరిచేసి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. -
‘ఆయిల్‌పామ్’..అంతంతే
సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌పామ్ సాగు రాష్ట్రంలో ఆశించినస్థాయిలో పెరగలేదు. దీనిపై సర్కారు దృష్టి సారిస్తున్నా..కొన్ని కంపెనీలు మాత్రం వెనుకడుగు వేస్తున్నాయి. ఆయిల్‌పామ్ విస్తీర్ణాన్ని వచ్చే దశాబ్దంలోగా ఏకంగా 20 లక్షల ఎకరాలకు విస్తరించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.రాష్ట్రంలో ఆయిల్‌ఫెడ్ సహా 14 ప్రైవేట్ కంపెనీలకు ఆయిల్‌పామ్ సాగుకు అవసరమైన బాధ్యతలు అప్పగించింది. మొత్తం 31 జిల్లాలను గుర్తించింది. కొన్నేళ్లుగా ప్రైవేట్ కంపెనీలు తమ నిర్ణీత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవుతున్నాయి. సాగు చేయించడంలోనూ, ఆ మేరకు రైతులను ఒప్పించడంలోనూ అనాసక్తి చూపిస్తున్నాయి. మరోవైపు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి అవసరమైన భూమిని కొన్ని కంపెనీలు సేకరించలేదు. దాదాపు మూడేళ్ల క్రితమే ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నా, కంపెనీలు పట్టించుకోలేదు. ఇప్పటి వరకు భూములు కొనకపోతే ఫ్యాక్టరీలు ఎప్పుడు నిర్మిస్తారోనన్న విమర్శలు వస్తున్నాయి. ఒప్పందం ప్రకారం మూడేళ్లలోపు ఫ్యాక్టరీ నిర్మించాలి. కానీ ఈ నిబంధనను అనేక కంపెనీలు అమలు చేయడం లేదు. పంట చేతికొచ్చే సమయానికి ఫ్యాక్టరీ అందుబాటులో లేకుంటే రైతులు ఇబ్బందులు పడతారు. ఇప్పటికే కొత్తగా ఆయిల్‌పామ్ సాగు చేసిన జిల్లాల్లో పంట గెలలు అందుబాటులోకి వచ్చాయి. మరో ఏడాదిలో మరింత ఎక్కువగా అందుబాటులోకి వస్తాయంటున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు ఇంకా నిర్లిప్తంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్ష్యాన్ని చేరుకోలేని దుస్థితి ఆయిల్‌పామ్ సాగులో 14 కంపెనీలు తమ లక్ష్యంలో కేవలం 20 శాతం వరకే చేరుకున్నాయని అధికారులు అంటున్నారు. ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ఫెడ్ మినహా ఇతర ప్రైవేట్ కంపెనీల్లో పెద్దగా పురోగతి లేదు. వంట నూనెల జాతీయ పథకం (ఎన్ఎంఈఓ) ద్వారా కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని వాటికి జిల్లాలు, అందులో భూముల సాగు లక్ష్యాలను నిర్దేశించింది. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు స్థాపించండం, రైతులను ఒప్పించి మొక్కలు వేయడం, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, పంట వచ్చిన తర్వాత కొనుగోలు చేయడం వంటి వాటిని ఈ కంపెనీలు చేపట్టాలి. 2020–21లో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు ఇప్పటివరకు కేవలం 1,52,957 ఎకరాల్లోనే పంటలు వేయించాయి. వీటిలో టీఎస్ ఆయిల్‌ఫెడ్ 87 వేల ఎకరాల్లో..మిగిలిన సంస్థలు 65 వేల ఎకరాల్లోనే పంటలను వేయించాయి. ఈ నేపథ్యంలో సాగు లక్ష్యాన్ని చేరుకోని కంపెనీలతోపాటు ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోలేని కంపెనీలకు ఉద్యానశాఖ నోటీసులు జారీ చేసింది. అయితే కంపెనీలు మాత్రం సాగుకు రైతులు ముందుకు రావడం లేదంటూ వివరణ ఇచ్చాయి. ప్రైవేట్ కంపెనీలు రైతుల వద్దకు వెళ్లడానికి అవసరమైన సిబ్బందిని నియమించడంలోనూ... రైతులను ప్రోత్సహించడంలోనూ విఫలం అవుతున్నాయి. పైగా ప్రైవేట్ కంపెనీలు కావడంతో వాటిని రైతులు నమ్మడం లేదన్న చర్చ జరుగుతోంది. తమకు ప్రోత్సాహకాలు అందుతాయో లేదోనని, పంట కొనుగోలు చేయరేమోనని అనుమానపడుతున్నారు. వారి అనుమానాలను తొలగించే ప్రయత్నాలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో లక్ష్యంలో 20 శాతం కూడా సాధించక పోవడంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా కంపెనీలతో సమావేశం నిర్వహించాలని, వాటి నుంచి ఆశించిన స్పందన లేకపోతే అవసరమైతే ఒప్పందాలను రద్దు చేయాలని ఆయన అన్నట్టు సమాచారం. -
పెరిగిన బ్యాంక్ లోన్స్.. ఆ రంగానికే ప్రాధాన్యం
ముంబై: ప్రైవేటు కార్పొరేట్ రంగానికి బ్యాంకుల రుణ వితరణ సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 14.9 శాతం పెరిగినట్టు ఆర్బీఐ డేటా వెల్లడింంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోనూ 14.7 శాతం వృద్ధి నమోదు కాగా, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలోనూ 11.5 శాతం చొప్పున వృద్ధి చెందడం గమనార్హం. బ్యాంకుల మొత్తం రుణాల్లో పరిశ్రమలకు ఇచ్చినవి 25 శాతంగా ఉన్నాయి. వార్షికంగా చూస్తే సెప్టెంబర్ క్వార్టర్లో 8.6 శాతం పెరిగాయి. వర్కింగ్ క్యాపిటల్ రుణాల వృద్ధి గత ఆరు త్రైమాసికాలుగా రెండంకెల వృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది. బ్యాంక్ రుణాల్లో వ్యక్తిగత రుణాల వాటా ఐదేళ్ల క్రితం ఉన్న 22 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. మహిళా రుణ గ్రహీతల సంఖ్యలోనూ వృద్ధి కనిపిస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంక్‌లతో పోలిస్తే ప్రైవేటు బ్యాంక్‌లు రుణాల్లో ఎక్కువ వృద్ధిని చూపిస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరిగిపోవడంతో, అధిక ఈల్డ్స్ వచ్చే డిపాజిట్లలోకి పెట్టుబడులు మళ్లుతున్నాయి. 6 శాతం వడ్డీలోపు డిపాజిట్లు 2022 మార్చి నాటికి 85.7 శాతంగా ఉంటే, 2023 మార్చి నాటికి 38.7 శాతానికి, సెప్టెంబర్ వరికి 16.7 శాతానికి తగ్గాయి. రేట్లు పెరగడంతో కరెంట్, సేవింగ్స్ డిపాజిట్ల కంటే టర్మ్ డిపాజిట్లలోకి ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి. దీంతో బ్యాంక్‌ల మొత్తం డిపాజిట్లలో టర్మ్ డిపాజిట్ల వాటా ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న 57 శాతం నుం సెప్టెంబర్ చివరికి 60 శాతానికి చేరింది. డిపాజిట్లను ఆకర్షించడంలోనూ ప్రభుత్వరంగ బ్యాంక్‌లతో పోలిస్తే ప్రైవేటు బ్యాంక్‌లే ముందున్నాయి. మొత్తం టర్మ్ డిపాజిట్లలో 44 శాతం రూ.కోటికి పైన ఉన్నవే కావడం గమనార్హం. -
అన్ని ప్రైవేట్ కంపెనీల షేర్లు డీమ్యాట్‌లోనే.. ఎంసీఐ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ కంపెనీల సెక్యూరిటీల విషయంలో పారదర్శకతను పెంచే దిశగా కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఐ) కీలక ఆదేశాలిచ్చింది. 2024 సెప్టెంబర్ నుంచి ప్రైవేట్ కంపెనీలన్నీ డీమ్యాట్ (డిజిటల్) రూపంలోనే సెక్యూరిటీలను జారీ చేయాలని ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. చిన్న సంస్థలు, ప్రభుత్వ రంగ కంపెనీలకు దీన్నుంచి మినహాయింపునిచ్చింది. కొన్ని సంస్థలు భౌతిక ఫార్మాట్లో జారీ చేసే షేర్లకు సంబంధించి అవకతవకలు చోటుచేసుకునే అవకాశాలను కట్టడి చేసేందుకు ఈ ఆదేశాలు ఉపయోగపడనున్నాయి. కంపెనీల చట్టం కింద ప్రస్తుతం రిజిస్టరయిన 14 లక్షల పైచిలుకు ప్రైవేట్ సంస్థలపై దీని ప్రభావం పడవచ్చని న్యాయ సేవల సంస్థ సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్ట్నర్ ఆనంద్ జయచంద్రన్ తెలిపారు. సాధారణంగా షేర్ల జారీకి సంబంధించి కంపెనీల చట్టం 2013 కింద ప్రైవేట్ కంపెనీలకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిలో షేర్‌హోల్డర్ల సంఖ్య 200కు మించి ఉండకూడదు. నోటిఫికేషన్ ప్రకారం 2024 సెప్టెంబర్ తర్వాత నుంచి ప్రైవేట్ సంస్థలు షేర్ల జారీ, బైబ్యాక్, బోనస్ ఇష్యూ లేదా రైట్స్ ఆఫర్ మొదలైనవన్నీ డీమ్యాట్ రూపంలోనే జరగాలి. నాలుగు కోట్ల రూపాయల వరకు పెయిడప్ షేర్ క్యాపిటల్, రూ. 40 కోట్ల వరకు టర్నోవరు ఉన్న చిన్న సంస్థలకు, కొన్ని పరిమితులకు లోబడి, మినహాయింపు ఉంటుంది. మరోవైపు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్ (ఎల్ఎల్పీ)ల నిబంధనలను కూడా ఎంసీఏ సవరించింది. వీటి ప్రకారం .. ఏర్పాటైన తేదీ నుంచి ప్రతి ఎల్ఎల్పీ తమ భాగస్వాముల చిరునామా, పాన్ నంబరు మొదలైన వివరాలతో ఒక రిజిస్టర్‌ను నిర్వహించాలి. -
ఆరు కంపెనీలుగా వేదాంతా
బిలియనీర్ అనిల్ అగర్వాల్ గ్రూప్.. వేదాంతా రిసోర్సెస్.. సరికొత్త ప్రణాళికలకు తెరతీసింది. వీటి ప్రకారం డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ ఆరు లిస్టెడ్ కంపెనీలుగా విడిపోనుంది. ఇక మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ విభిన్న విభాగాల కార్పొరేట్ నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించనుంది. తద్వారా ఓవైపు రుణ భారాన్ని తగ్గించుకోవడం, మరోపక్క వాటాదారులకు అధిక విలువను రాబట్టడం లక్ష్యాలుగా పెట్టుకుంది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ కీలక బిజినెస్‌లను ప్రత్యేక కంపెనీలుగా విడదీయనుంది. అల్యూమినియం, ఆయిల్– గ్యాస్, స్టీల్, ఫెర్రస్ మెటల్స్, బేస్ మెటల్స్ పేరుతో ఐదు విభాగాలను విడదీసేందుకు ప్రణాళికలు వేసింది. వీటిని విడిగా లిస్ట్ చేయడం ద్వారా వాటాదారులకు మరింత విలువ చేకూర్చనున్నట్లు వేదాంతా తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా సరళతర విభజనకు తెరతీయనుంది. వెరసి వేదాంతా వాటాదారులకు తమవద్దగల ప్రతీ 1 షేరుకీ విడదీయనున్న 5 కంపెనీలకు చెందిన ఒక్కో షేరు చొప్పున కేటాయించనున్నారు. ఆపై వీటిని స్టాక్ ఎక్సే్చంజీలలో లిస్ట్ చేయనున్నట్లు వేదాంతా తెలియజేసింది. వెరసి వేదాంతాసహా.. ఆరు లిస్టెడ్ కంపెనీలకు తెరలేవనుంది. ఇక మరోవైపు హిందుస్తాన్ జింక్‌సహా.. కొత్తగా ఏర్పాటు చేసిన స్టెయిన్లెస్ స్టీల్, సెమీకండక్టర్ డిస్ప్లే బిజినెస్‌లలో 65 శాతం చొప్పున వాటాను కలిగి ఉండనుంది. ఈ మొత్తం ప్రణాళికల అమలును 12–15 నెలలలోగా పూర్తిచేయాలని వేదాంతా భావిస్తోంది. గ్రూప్‌నకు మాతృ సంస్థ వేదాంతా రిసోర్సెస్.. హోల్డింగ్ కంపెనీగా కొనసాగనుంది. హింద్ జింక్ కార్పొరేట్ సమీక్ష వేదాంతా గ్రూప్ కంపెనీ హిందుస్తాన్ జింక్ పూర్తిస్థాయిలో కార్పొరేట్ నిర్మాణాన్ని సమీక్షించనుంది. కంపెనీ విలువలో మరింత వృద్ధికి వీలుండటంతో కార్పొరేట్ నిర్మాణ సమీక్షకు బోర్డు నిర్ణయించినట్లు మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ వెల్లడించింది. ప్రధానంగా జింక్, లెడ్, సిల్వర్, రీసైక్లింగ్ బిజినెస్‌లను ప్రత్యేక చట్టబద్ధ సంస్థలుగా ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేసింది. కంపెనీకిగల భిన్న విభాగాల పరిమాణం, కార్యకలాపాలు, వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని తాజా ప్రతిపాదనలకు తెరతీసినట్లు వివరించింది. వీటిలో బిజినెస్ అవసరాలరీత్యా మూలధన నిర్మాణం, పెట్టుబడి కేటాయింపుల విధానాలు, కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి తదితర అంశాలున్నట్లు తెలియజేసింది. తద్వారా విభిన్న బిజినెస్‌లు తమ మార్కెట్ పొజిషన్‌ను వినియోగించుకుని దీర్ఘకాలిక వృద్ధి సాధించేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేసింది. వెరసి అన్ని రకాల వాటాదారులకు విలువ చేకూర్చే వ్యూహంతో ఉన్నట్లు పేర్కొంది. బిజినెస్‌ల విడదీత వార్తలతో ఎన్ఎస్ఈలో వేదాంతా షేరు 7 శాతం దూసుకెళ్లి రూ. 223 వద్ద నిలవగా.. హిందుస్తాన్ జింక్ 3.5 శాతం జంప్‌చేసి రూ. 308 వద్ద ముగిసింది. నిధుల సమీకరణ.. ప్రతీ ప్రత్యేక విభాగాన్నీ ఒక్కొక్క కంపెనీగా విడదీయడం ద్వారా వేదాంతా గ్రూప్ కార్పొరేట్ నిర్మాణాన్ని సరళతరంగా మార్చివేయనుంది. ఆయా రంగాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించే బాటలో స్వతంత్ర సంస్థలుగా ఏర్పాటు చేయనుంది. దీంతో సావరిన్ వెల్త్‌ఫండ్స్ తదితర గ్లోబల్ ఇన్వెస్టర్లతోపాటు.. సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడి అవకాశాలను కలి్పంచే యోచనలో ఉంది. వెరసి దేశ ఆర్థిక వృద్ధిని అవకాశాలుగా మలచుకునే ప్యూర్‌ప్లే కంపెనీలలో పెట్టుబడులకు వ్యూహాత్మక ఇన్వెస్టర్లను ఆకట్టుకోనుంది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్న భారత్‌లో కమోడిటీలకు భారీ డిమాండ్ కనిపించనున్నట్లు వేదాంతా భావిస్తోంది. ఇటీవలే సెమీకండక్టర్లు, డిస్ప్లే తయారీలోకి సైతం ప్రవేశించింది. -
బొగ్గు గనుల వేలం అడ్డుకుంటాం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ప్రాంతంలో బొగ్గు గనులను వేలం పాట ద్వారా ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు కట్టబెట్టే చర్యలను గట్టిగా ఎదుర్కొంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఉన్నంత వరకు, అక్కడి గనులు సింగరేణికే దక్కేలా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు భట్టి విక్రమార్క, దివాకరరావు, శ్రీధర్‌బాబు, బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలోనే ఇలా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం మొదలైందన్నారు. ఇటీవల ప్రస్తుత ప్రభుత్వం సవరణతో ముందుకొచ్చినా.. బహిరంగ వేలం అంశానికే ప్రాధాన్యమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ గనులను స్థానిక ప్రభుత్వానికి అప్పగించే వెసులుబాటు చట్ట సవరణలో ఉన్నా దాన్ని పట్టించుకోవటం లేదన్నారు. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకురాగా, సింగరేణి కూడా బహిరంగ వేలంలో పాల్గొని దక్కించుకోవచ్చని పేర్కొందన్న విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని, ఎట్టి పరిస్థితుల్లో సింగరేణికి నష్టం జరిగే ఎలాంటి ప్రయత్నాన్ని జరగనీయమని మంత్రి తెలిపారు. ఇంకో 20 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, అప్పటి వరకు సింగరేణికి నష్టం జరగనీయమని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తలసరి ఆదాయంలో మూడో స్థానం.. తలసరి ఆదాయం జాబితాలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మన కంటే ముందు సిక్కిం, గోవాలాంటి చిన్న రాష్ట్రాలే ఉన్నందున తెలంగాణ అగ్రభాగంలో ఉన్నట్టుగానే భావించొచ్చన్నారు. అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాలో కింది నుంచి ఐదో స్థానంలో ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సబ్సిడీ విస్తీర్ణ పరిమితి పెంచే యోచన.. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, సబ్సిడీ పరిమితిని పన్నెండున్నర ఎకరాల నుంచి మరింత ఎక్కువ పరిధికి పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కేంద్రం అంగీకరించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా దాన్ని అమలు చేసే దిశగా యోచిస్తున్నట్టు శాసనసభ దృష్టికి తెచ్చారు. వాయిదా తీర్మానాల తిరస్కరణ.. సభలో పలువురు సభ్యులు అడిగిన వాయిదా తీర్మానాలను స్పీకర్ పోచారం తిరస్కరించారు. -
స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్రయివేట్ సంస్థలకు..
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా) : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఇటీవలే అభివృద్ధి చేసిన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ)ను ప్రయివేట్ అంతరిక్ష సంస్థలకు అప్పగించేందుకు ఆ సంస్థలకు ఆహ్వానం పలుకుతోంది. ప్రపంచ మార్కెట్లో చిన్న తరహా ఉపగ్రహాలకు వాణిజ్యపరంగా మంచి డిమాండ్ ఉండటంతో భూమికి అతి తక్కువ దూరంలో, అంటే లియో ఆర్బిట్‌లోకి వాటిని పంపేందుకు ఎస్ఎస్ఎల్వీ రాకెట్‌కు రూపకల్పన చేశారు. ప్రపంచంలో అంతరిక్ష కేంద్రాలు లేని దేశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి దేశాలకు భారతదేశం అతి తక్కువ ధరకే చిన్న తరహా ఉపగ్రహ ప్రయోగాలు చేస్తోంది. ఇటీవల దాకా పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగిస్తూ వచ్చారు. ఈ ప్రయోగాల కోసమే ఎస్ఎస్ఎల్వీ రాకెట్లతో పాటు ప్రయోగ కేంద్రాన్ని కూడా తమిళనాడులో కులశేఖర్‌పట్నంలో నిర్మిస్తున్నారు. ఇస్రో రూపొందించిన ఆరు రకాల రాకెట్ సిరీస్‌లలో ఎస్ఎస్ఎల్వీ రాకెట్ మాత్రమే ప్రయివేట్ సంస్థలకు అప్పగించబోతున్నారన్న మాట. -
చాక్లెట్లు కాదు.. రాకెట్లు
కె.జి.రాఘవేంద్రారెడ్డి (సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం) : రండి బాబూ రండి.. కోరుకున్న డిజైన్‌లో రాకెట్ తయారు చేయబడును! వినటానికి ఇది వింతగానే అనిపించినా నిజమే మరి! స్పేస్ స్టార్టప్స్‌లో అగ్రదేశాలు పోటీ పడుతున్నాయి. స్కాట్లాండ్కు చెందిన స్కైరోరా సంస్థ కావాల్సిన రీతిలో రాకెట్లు తయారు చేస్తోంది. ప్రైవేట్ సంస్థలు స మాచారాన్ని పొందేందుకు శ్రమ పడాల్సిన అవసరం లే కుండా తాము చేసి పెడతామని చెబుతోంది. వన్‌స్టాప్ సొల్యూషన్ తరహాలో సేవలందిస్తామని భరోసా ఇస్తోంది. రాకెట్లండీ.. రాకెట్లు! ప్రైవేట్ కంపెనీలు తమ కమ్యూనికేషన్స్, పర్యవేక్షణల సామర్థ్యాలు పెంచుకునేందుకు సొంతంగా రాకెట్లను అంతరిక్ష కక్ష్యలోకి పంపిస్తున్నాయి. గతంలో కేవలం ప్రభుత్వ రంగంలోనే అనుమతించిన మనదేశం ప్రైవేట్ రాకెట్ల ప్రయోగానికి కూడా అవకాశం కల్పిస్తూ ముందుకు వెళుతోంది. స్పేస్ ఎక్స్‌తో ప్రైవేట్ రాకెట్ల రేసును ఎలన్ మస్క్ ప్రారంభించారు. ఆయనకు చెందిన ఉపగ్రహ ఇంటర్నెట్ నెట్వర్క్ 42 వేల శాటిలైట్స్‌తో, జెఫ్ బెజోస్‌కు చెందిన కూపర్ నెట్వర్క్ 3,200 శాటిలైట్స్‌తో, యూకే ప్రభుత్వానికి చెందిన వన్‌వెబ్ నెట్వర్క్ 650 శాటిలైట్స్‌తో ఏర్పాటు చేసేలా పనులు సాగుతున్నాయి. పెద్ద ఎత్తున స్పేస్ స్టార్టప్స్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పేస్ స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయి. అమెరికా, చైనా, భారత్‌తోపాటు ఐరోపా అంతరిక్ష అంకుర పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నాయి. 2030 నా టికి గ్లోబల్ స్పేస్ మార్కెట్లో 10 శాతం వాటాను సొంతం చేసుకునేలా బ్రిటన్ సిద్ధమైంది. దీనికి సంబంధించి యూకే మార్కెట్ విలువ 483 బిలియన్ డాలర్లుగా అంచ నా వేస్తున్నారు. స్కాట్లాండ్కు చెందిన అంతరిక్ష శాస్త్రవేత్త వోలోడిమిర్ లెవికిన్ 2017లో స్కైరోరాని ప్రారంభించా రు. లానార్క్‌షైర్ కంబర్నాల్డ్లోని ఫ్యాక్టరీలో స్కైరో రా తన రాకెట్లని డిజైన్ చేస్తోంది. ఎడిన్బర్గ్ శివార్లలోని టెస్ట్‌బ్లాస్ట్ ఏరియాలో వాటిని ఉంచుతోంది. ప్యాసింజర్ రాకె ట్స్ కాకుండా పేలోడ్ రాకెట్లను తయారు చేస్తోందీ సంస్థ. స్కైరోరా ఫ్లాగ్షిప్ రాకెట్ తొమ్మిది ఇంజన్లు, 50 వేల లీటర్ల ఇంధన సామర్థ్యం, 7 మెట్రిక్ టన్నుల్ని మోసుకెళ్లే సత్తాతో సెకనుకు 8 కి.మీ. వేగంతో దూసుకెళ్లగల ఫ్లాగ్షిప్ రాకెట్‌ని స్కైరోరా సిద్ధం చేసింది. స్కైరోరా ఎక్స్ఎల్ పేరుతో 315 కిలోగ్రాముల పేలోడ్ తీసుకెళ్లగల ఫ్లాగ్షిప్ రాకెట్‌ని ఈ ఏడాది షెట్‌ల్యాండ్ దీవుల నుంచి ప్రయోగించేందుకు సిద్ధమైంది. వ్యవసాయ పరిశ్రమలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, బీమా సంస్థలు.. ఇలా భిన్న రంగాలకు సంబంధించి అంతరిక్షం నుంచి ఆప్టికల్, టెంపరేచర్ సెన్సార్స్ లాంటి వాటితో సమాచారం సేకరించి రియల్‌టైమ్‌లో డేటా రూపొందించేందుకు రాకెట్లను తయారు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే మొదటి దశ ప్రాజెక్టును పూర్తి చేసింది. 22.7 మీటర్ల పొడవైన రాకెట్ మొదటి దశ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. స్పేస్ ఎక్స్‌కు భిన్నంగా స్కైరోరా.. రాకెట్ల తయారీలో ఎలన్మస్్కకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థకు, స్కైరోరాకు గట్టి పోటీ నడుస్తోంది. స్పేస్ఎక్స్ అనేది బస్సు ప్రయాణంలాంటిదని, ఇతర ప్రయాణికులతో కలసి నిర్దేశించిన ప్రాంతం నుంచే వినియోగించుకునే అవకాశం ఉందని స్కైరోరా సీఈవో లెవికిన్ చెబుతున్నారు. స్కైరో రా మాత్రం ట్యాక్సీ ప్రయాణం లాంటిదని, ప్ర యాణికులు నచ్చిన ప్రాంతానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయలుదేరేలా రూపొందించా మని తెలిపారు. స్పేస్ఎక్స్లో రాకెట్ కోసం రెండేళ్ల పాటు నిరీక్షించాల్సి ఉండగా స్కైరోరాలో మా త్రం ఆర్నెల్లు చాలని స్పష్టం చేస్తున్నారు. యూకే అంతరిక్ష పరిశ్రమలో స్కైరోరా సరికొత్త విప్లవాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇదే తరహాలో భారత్, చైనా సొంత రాకెట్లను తయారు చేసే స్పేస్ స్టార్టప్స్‌ని ప్రోత్సహిస్తూ అంతరిక్ష రంగంలో దూసుకెళ్లే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. -
ప్రైవేటుకే ఉపాధి కల్పన.. ఉద్యోగాల నియామకాలకు జాబ్ మేళాలు
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఉపాధి కల్పనా శాఖ కార్పొరేట్, ప్రైవేటు రంగాలకు కల్పతరువుగా మారింది. ఆయా సంస్థల కోసం జాబ్ మేళాలను నిర్వహిస్తూ ఉద్యోగులను వెతికి పెడుతోంది. ఒకప్పుడు నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఈ శాఖ ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగాల భర్తీలో బిజీగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్హతలతో సహా పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులు లక్షల్లో ఉన్నా.. వయోపరిమితి దాటిపోయే వరకు ఒక్క ఉద్యోగం కూడా కలి్పంచలేని పరిస్థితి నెలకొంది. కనీసం ప్రభుత్వ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో ఏజెన్సీ ఎంప్యానల్‌మెంట్‌కే పరిమితమైంది. పొరుగు సేవల్లో అంతంతే.. ► ఉపాధి కల్పనా శాఖ ప్రైవేటుపై దృష్టి సారించింది. సాధారణంగా కార్పొరేట్, ప్రైవేటు సంస్థలు వ్యాపార ఆర్థిక లావేదేవీలను బట్టి ఉద్యోగుల సంఖ్యను కుదించడం, పెంచడం చేస్తుంటాయి. కరోనా నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. సాధారణ పరిస్థితులు ఏర్పడగానే తిరిగి నిపుణులైన ఉద్యోగుల కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఉపాధి కల్పనా శాఖ ఆయా సంస్థలకు ఉద్యోగులను వెతికిపెట్టే బాధ్యతను భుజానా ఎత్తుకుంది. జాబ్ మేళాలు నిర్వహిస్తూ చిరు ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగుల ఎంపిక కోసం సంధాన కర్తగా వ్యవహరిస్తోంది. ► ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం కేవలం ఏజెన్సీల నమోదుకు పరిమితమైంది. కొత్త ఉద్యోగ భర్తీ లేక పొరుగుసేవల కింద నియామకాలు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఉపాధి కల్పన కేంద్రంలో నమోదు చేసుకున్న నిరుద్యోగుల్లో అర్హులైన వారికి సమాచారం అందించి ఎంపిక చేయాలి. ఇందు కోసం ఏర్పాటు చేసిన కమిటీకి ఉపాధి కల్పనా శాఖ అధికారి కో కనీ్వనర్‌గా వ్యవహరించాలి. పొరుగుసేవల ఉద్యోగాలు నియామకాలు సాగుతున్నా.. అవి ఉపాధి కల్పనా శాఖ ద్వారా ఎంపిక జరిగిన దాఖలాలు మాత్రం లేవు. ఫలితంగా ఏజెన్సీలు తమకు నచ్చిన వారిని ఎంపిక చేస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. అచేతనంగా.. రెండు దశాబ్దాల వరకు ఉపాధి కల్పనా శాఖ నిరుద్యోగుల పాలిట కల్పతరువుగా వెలిగి ప్రస్తుతం అచేతనంగా తయారైంది. అప్పట్లో ఏ శాఖకు లేని ప్రతిష్ట ఈ శాఖ ఉండేది. సర్కారు కొలువులకు ఉపాధి కల్పన శాఖలో నమోదు తప్పనిసరిగా ఉండేది. దీంతో నిరుద్యోగులు ఈ ఆఫీస్‌కు క్యూ కట్టి నమోదు చేసుకున్నారు. అభ్యర్థులకు సీనియారిటీ ప్రకారం విద్యార్హతలను బట్టి ఆయా శాఖల్లో ఉన్న ఉద్యోగాల ఇంటర్వ్యూల కోసం వర్తమానం అందేది. ప్రభుత్వ నోటిఫికేషన్ విధానం అందుబాటులో రావడంతో శాఖకు వన్నె తగ్గినట్లయింది. ప్రస్తుతం కేవలం అభ్యర్థుల పేర్లు నమోదు, పునరుద్ధరణ, ప్రైవేటు సేవలకు పరిమితమైంది. ఆశల్లోనే అభ్యర్థులు.. ఉపాధి కల్పనా శాఖపై అభ్యర్థుల్లో ఆశలు సన్నగిల్లలేదు. సర్కారు కొలువుపై ఆశతో నమోదు, పునరుద్ధరణ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అభ్యర్థుల నమోదు కొంత మేరకు పెరిగింది. రాష్ట్రం మొత్తం మీద 2014 జూన్ నుంచి ఇప్పటి వరకు సుమారు 2,72,124 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఆ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో పురుషులు 1,62,928 ఉండగా, మహిళా అభ్యర్థులు 1,09,196 ఉన్నారు. ఒక్క కాల్ లెటర్ రాలేదు ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో ఉపాధి కల్పనా శాఖలో విద్యార్హతతో పేరు నమోదు చేసుకున్నా.. ఒక్క కాల్ లేటర్ రాలేదు. కేవలం ప్రైవేటు ఉద్యోగాల జాబ్ మేళాలకే ఉపాధి కల్పనా శాఖ పరిమితమైంది. సర్కారు కొలువుల్లో ప్రాధాన్యం ఇవ్వాలి – సీలం దీపిక, హైదరాబాద్ అవుట్ సోర్సింగ్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి అవుట్సోర్సింగ్ లోనైనా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలి. సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం కలి్పంచి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలి. – పి.ప్రవీణ్ కుమార్ చదవండి: సమ్మోహన తీరం.. సరికొత్తగా హుస్సేన్ సాగర్ -
పని మధ్యలో ఆఫీసులో కునుకేస్తే! దీనిపై నిపుణులు ఏమంటున్నారు?
సాక్షి, హైదరాబాద్: పొద్దున లేస్తే హడావుడి. ఇంట్లో పనులు చక్కబెట్టుకుని ఆఫీసుకు పరుగులు పెట్టాలి. ఉదయం 9–10 గంటల నుంచి సాయంత్రం 5–6 గంటల వరకు పనేపని. ఆఫీసు నుంచి బయల్దేరగానే సరుకులు తీసుకెళ్లడమో, మరేదైనా చోటికి వెళ్లడమో ఆలోచనలు. మొత్తంగా అన్నీ కలిసి ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది. ఆఫీసులో ఉదయం ఉత్సాహంగానే ఉన్నా.. మధ్యాహ్నం కల్లా నీరసం వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే కాసేపు కునుకు తీసి, రీఫ్రెష్ అయ్యేందుకు కంపెనీలు వీలు కల్పిస్తున్నాయి. ‘షార్ట్ స్లీప్ ఇన్ ఆఫీస్’ కరోనా మహమ్మారి తర్వాతి పరిస్థితుల్లో ఆఫీసు పని విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి. వర్క్ ఫ్రం హోంతో మొదలై హైబ్రిడ్ మోడల్ వరకు చేరాయి. ఇటీవలికాలంలో షార్ట్ స్లీప్ ఇన్ ఆఫీస్ (స్వల్ప నిద్ర) విధానం మొదలైంది. ఆఫీసు పని సమయంలో మధ్యలో స్వల్ప విశ్రాంతి తీసుకునే వెసులుబాటును పలు సంస్థలు కల్పిస్తున్నాయి. ఇందుకోసం కార్యాలయంలోనే నిద్ర పోయేందుకు వీలుగా ఏర్పాట్లను చేస్తున్నాయి. ఇలా విశ్రాంతి ఇవ్వటంతో ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గి, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని, ఉత్పాదకత పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. స్టార్టప్ కంపెనీల్లో ఎక్కువగా.. సాధారణ ఆఫీసులలో లాగా స్టార్టప్ కంపెనీలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు అంటూ పనివేళలు ఉండవు. ఉదయం, సాయంత్రం మరింత ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉంటుంది. అలాంటి సంస్థలలో ఉద్యోగులకు పనిమధ్యలో కాసేపు విశ్రాంతి ఇస్తే.. అన్ని వేళల్లో ఒకేరకమైన ఏకాగ్రతతో పనిచేయగలుగుతారని నిపుణులు చెప్తున్నారు. ఫర్నిచర్ కంపెనీ వేక్‌ఫిట్ తాజాగా ‘రైట్ టు న్యాప్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో ప్రతి ఉద్యోగి రోజూ మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల వరకు కునుకు తీయవచ్చు. నిద్ర ఒక్కటే కాదు.. ఆఫీసులో నిద్ర గదులేకాదు.. బ్రేక్ అవుట్ జోన్లు, మీటింగ్‌లు లేనిరోజు వంటి వినూత్న పని విధానాలను కూడా సంస్థలు అందుబాటులోకి తెస్తున్నాయి. ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నాయి. ఎక్కువసేపు ఒకేచోట కూర్చోకుండా మధ్యలో కాసేపు వాకింగ్, ధ్యానం చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ వంటి ఇండోర్ గేమ్స్‌లను కూడా అందిస్తున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులకు మీటింగ్‌లు లేని వారం, రోజు అని ముందుగానే సమాచారం ఇస్తున్నాయి. దీంతో ఉద్యోగులు జాబ్ తర్వాత వ్యక్తిగత పనుల షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకునే వీలు ఉంటుంది. ఏ కంపెనీలలో ఉందంటే.. లీసియస్, సింప్లీ లెర్న్, సాల్వ్, నో బ్రోకర్, వేక్‌ఫిట్, రేజర్‌పే వంటి యువ యాజమాన్య కంపెనీలు, స్టార్టప్స్ తమ ఉద్యోగులు ఆఫీసులో స్వల్ప సమయం పాటు కునుకుతీసే వెసులుబాటును కల్పిస్తున్నాయి. నిపుణులు చెప్తున్న లాభాలివీ.. ►పని మధ్యలో విశ్రాంతి వల్ల ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. ►పనిలో ఉత్పాదకత మరింతగా పెరుగుతుంది. ►దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగేలా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ►మానసిక, శారీరక ఒత్తిడి లేకుండా ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేయగలుగుతారు. ►చీటికి మాటికీ అనారోగ్య సమస్యలతో గైర్హాజరు కావటం తగ్గుతుంది. ►ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటుండటంతో ఉద్యోగులకు యాజమాన్యంపై గౌరవం పెరుగుతుంది. వీ హబ్‌లో మదర్స్ రూమ్ పని మధ్యలో కొంత సమయం విశ్రాంతి అనేది మహిళా ఉద్యోగులకు అత్యవసరం. అందుకే వీ–హబ్‌లో మదర్స్ రూమ్, రిలాక్స్ రూమ్ వంటి ప్రత్యేక వసతులను ఏర్పాటు చేశాం. ఉద్యోగులకు 24/7 భద్రత, అవసరమైన వసతులను కల్పించినప్పుడే వారు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. – దీప్తి రావుల, సీఈఓ, వీ–హబ్ కాసేపు నిద్ర మా పాలసీలో భాగం మా కంపెనీలో ఉద్యోగుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. మధ్యాహ్నం అరగంట సేపు ఉద్యోగులకు నిద్ర సమయం అనేది పాలసీలో భాగం చేశాం. కాసేపు విశ్రాంతితో ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిమీద ఏకాగ్రత చూపుతున్నారు. – ఉమానాథ్ నాయక్, హెచ్ఆర్ హెడ్, వేక్‌ఫిట్ -
ఇండియన్ ఆర్మీలోకి ప్రైవేట్ సంస్థలు! ఇప్పటికే..
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మానిర్బర్ భారత్ పథకం కింద మిలటరీ హార్డ్‌వేర్ విభాగంలోకి ప్రైవేట్ సంస్థల్ని ఆహ్వానించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ డిఫెన్స్ అక్విజేషన్ ప్రొసిజర్స్ (డీఏపీ) మ్యాన్యువల్‌గా సవరించాలని నిర్ణయించింది. ఇండియన్ డిఫెన్స్‌కు (పీఎస్‌యూ) చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు మిలటరీకి సంబంధించిన ఆయుధాలు తయారు చేసేవి. ఇప్పుడీ డీఏపీ సవరణలతో ప్రైవేట్ సంస్థలు ఎక్కువ భాగం డిఫెన్స్‌కు చెందిన ఆయుధాల్ని తయారు చేసేందుకు ఊతం ఇచ్చినట్లైందని నివేదికలు చెబుతున్నాయి. ప్రైవేట్ సంస్థల సహకారంతో ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ (ఐఎంఆర్‌హెచ్ )నను అభివృద్ధి, తయారీని కేంద్ర రక్షణ శాఖ ప్రయత్నిస్తుంది. దీంతో ఇండియన్ ఆర్మీ ఇన్వెంటరీలో ఉన్న రష్యా తయారు చేసిన ఎంఐ-17,ఎంఐ-8 హెలికాప్టర్లు భర్తీ కానున్నాయి. కాగా,13టన్నుల బరువైన ఈ మల్టీరోల్ హెలికాఫ్టర్ వైమానిక దాడిలో భారత సాయుధ బలగాల్ని రంగంలోకి దించడంతో పాటు, ఎయిర్ ఎటాక్, యాంటీ సబ్ మెరైన్, యాంటీ షిప్, మిలటరీ ట్రాన్స్ పోర్ట్, వీవీఐపీ వంటి విభాగాల్లో కీలకంగా పనిచేస్తుంది. ఫ్రెంచ్ కంపెనీతో ఎంఓయూ ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఎరో నాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), ప్రైవేట్ సంస్థలు కలిసి వచ్చే ఏడేళ్లలో ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ తయారీని పూర్తి స్థాయిలో ప్రారంభించేలా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. దీంతో పాటు నేవల్ వేరియంట్‌తో సహా ఐఎంఆర్ హెచ్ ఇంజిన్‌ను తయారీ, ఉత్పత్తితో పాటు మద్దతు అందించేలా కొత్త జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు కానుంది. జులై 8న ఈ జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేసేందుకు హెచ్ఏఎల్ తో విమానాల విడిభాగాల తయారీలో పేరు గాంచిన ఫ్రెంచ్ సంస్థ సఫ్రాన్ అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు సమాచారం. -
భారత్‌కు రష్యా క్రూడ్.. 50 రెట్లు అప్
న్యూఢిల్లీ: భారత్‌కు రష్యా నుంచి చమురు దిగుమతులు ఏప్రిల్ నుండి దాదాపు 50 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొత్తం క్రూడాయిల్ పరిమాణంలో 10 శాతానికి చేరాయి. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి దిగడానికి ముందు ఆ దేశం నుంచి భారత్‌కు చమురు దిగుమతులు 0.2 శాతం మాత్రమే ఉండేవి. రష్యా ప్రస్తుతం టాప్ 10 సరఫరా దేశాల్లో ఒకటిగా మారిందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ రిఫైనరీ సంస్థలు దాదాపు 40 శాతం మేర రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. మేలో దేశీ రిఫైనర్లు 2.5 కోట్ల బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాయి. ఇక, ఏప్రిల్ నెలకు చూస్తే సముద్రమార్గంలో భారత్‌కు వచ్చే మొత్తం దిగుమతుల్లో రష్యన్ క్రూడాయిల్ వాటా 10 శాతానికి పెరిగింది. ఇది 2021 ఆసాంతం, 2022 తొలి త్రైమాసికంలో 0.2 శాతమే. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో తమ ముడిచమురును డిస్కౌంటుకే రష్యా విక్రయిస్తోంది. క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల పైనే తిరుగాడుతున్న తరుణంలో 30 డాలర్ల వరకూ డిస్కౌంటు లభిస్తుండటంతో దేశీ రిఫైనర్లు పెద్ద ఎత్తున రష్యా చమురును కొనుగోలు చేస్తున్నాయి. -
బడా వ్యాపారులకే ‘బ్యాడ్ బ్యాంక్’
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎస్బీఐ, పీఎన్బీ తదితర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మూసివేయాలని లేక అమ్మివేయాలని కోరుకుంటున్న పార్లమెంటరీ పండితులు వాస్తవానికి ఏకాంతంలో ఉన్న సోషలిస్టులు అని చెప్పాలి. సోషలిజం అనేది బడా వ్యాపార వర్గాలకోసం ప్రత్యేకించినంత కాలం వీరు సోషలిజాన్ని గాఢంగా ప్రేమిస్తారు. అయినా సోషలిజం అంటే అర్థం ఏమిటి? పెట్టుబడులు, వనరులపై సామాజిక యాజమాన్యమే కదా. మనం సోషల్ అని చెబుతున్నప్పుడు తప్పనిసరిగా దాన్ని ప్రభుత్వ లేక రాజ్య యాజమాన్యం అనే అర్థంలోనే తీసుకుంటాం మరి. ప్రైవేట్ కంపెనీలు నిరర్థక పెట్టుబడులను పెడతాయి. నిష్ఫలమైన వ్యాపార నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ వాటి ఫలితాన్ని మాత్రం పన్ను చెల్లింపుదారులే తప్పకుండా భరించాల్సి వస్తోంది. సాంప్రదాయికంగా, కంపెనీలపై, ఆస్తులపై ప్రభుత్వ యాజమాన్యం అనే భావనను ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలే పెంచి పోషించారు. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర ఉండరాదని వీరు చెబుతుంటారు. కానీ ఈ వ్యాపారస్తులు పెట్టుబడులపై తప్పుడు నిర్ణయాలు తీసుకుని, భారీ నష్టాలకు కారకులై సంస్థ మూలాలను క్షీణింపచేస్తే ఏం చేయాలి? ఇక్కడే మన ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు రంగంలోకి దిగి ఈ కంపెనీలను ప్రభుత్వం స్వాధీనపర్చుకుని వారిని శిక్షించకుండా వదిలేయాలని చెప్పేస్తుంటారు. దీని ఫలితమేంటి? పెట్టుబడిదారుల కోసం సోషలిజాన్ని ఆచరించడమే కదా! ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నది అక్షరాలా ఇలాంటి సోషలిజమే. టెలికాం రంగ సంస్కరణల రూపంలో మొట్టమొదటి అమ్మకం జరిగిపోయింది. ఈ సంస్కరణల సారం ఏమిటి? టెలికాం రంగంలో ప్రైవేట్ కంపెనీలు మరింతమంది వినియోగదార్లను చేజిక్కించుకునే పరుగుపందెంలో కారుచౌక ధరలకు స్పెక్ట్రమ్ కొనుగోలు, ఎయిర్ వేవ్స్ అమ్మకాలకోసం భారీ మదుపులు పెడుతూ ఉంటాయి. రిలయన్స్, జియో రంగంలోకి వచ్చి టెలికాం రంగ పరిస్థితిని మార్చివేయడానికి ముందుగానే ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా వంటి సంస్థలు రాయితీలతో కూడిన ప్యాకేజీలు ప్రతిపాదించి, అసంఖ్యాక జీబీలకొద్దీ డేటాను ఉపయోగించుకుంటూ, సుదీర్ఘ ఫోన్ కాల్స్ చేసుకునే వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించేవి. అయితే తన వినియోగదారులకు పరిమిత కాలానికి ఉచిత డేటా ఇస్తానని ప్రతిపాదించడం ద్వారా రిలయన్స్ జియో తన పోటీ కంపెనీల కాళ్లకింది భూమిని లాగిపడేసింది. జియో శరవేగంగా విస్తరించడం ప్రారంభించగానే, ఇతర బడా టెలికాం కంపెనీలు కూడా ఇదేరకమైన తాయిలాలను అందించడానికి ప్రయత్నించాల్సి వచ్చింది. దీంతో వినియోగదారునుంచి వచ్చే సగటు రాబడి పడిపోయింది. పైగా డేటా వినియోగం పెరిగిపోయింది. దీంతో ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా కంపెనీలు అనేక త్రైమాసికాల పాటు భారీ నష్టాల బారినపడ్డాయి. జియోతో నేరుగా తలపడుతూ వొడాఫోన్, ఐడియా సంస్థలు విలీనమైనప్పుడు, భారత్‌లోనే అతిపెద్ద టెలికాం కంపెనీ (వీఐ) ఆవిర్భావానికి నాంది అయ్యింది. కానీ జియో ప్రత్యేకమైన బిజినెస్ నమూనాని పాటించడమే అసలు సమస్య అయింది. దీంతో జియో విజృంభణ ముందు నిలబడలేక, వొడాఫోన్–ఐడియా లేదా వీఐకి ఇప్పటికీ రక్తమోడటమే తప్ప మరొక అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడది రూ. 1.9 లక్షల కోట్ల భారీ రుణ ఊబిలో చిక్కుకుపోయింది. ఇప్పుడు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంస్కరణలకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే మరి. అయితే, నాలుగేళ్ళ రుణ విరామ సమయం తర్వాత కూడా టెలికాం కంపెనీలు తమ బకాయిలను చెల్లించలేకపోతే, ఇవి ప్రభుత్వానికి ఈక్విటీల రూపంలో చెల్లించవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతో వొడాఫోన్–ఐడియా ప్రభుత్వ కంపెనీగా మారే అవకాశం కూడా ఉందని ఊహాగానాలు మొదలైపోయాయి కూడా. ఇన్నాళ్లుగా ప్రభుత్వ రంగం అసమర్థంగా ఉందని, ప్రైవేట్ రంగం అత్యంత సమర్థంగా పనిచేస్తోందని మనం వింటూ వచ్చాం. కానీ ఇప్పుడు మాత్రం ప్రజా ప్రయోజనాల రీత్యా వొడాఫోన్, ఐడియా సంస్థ మూతపడటాన్ని అనుమతించకూడదని మనకు చెబుతున్నారు. ఇప్పటికీ అనేకమంది చందాదారులను కలిగిన ఈ సంస్థను కాపాడాల్సిన అవసరముందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అది కూడా ప్రజా శ్రేయస్సు పేరిట పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించాలట. కాబట్టి ప్రైవేట్ టెలికాం కంపెనీలు నిరర్థక పెట్టుబడులు పెడతాయి, నిష్ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రజలు మాత్రం పన్ను చెల్లింపుదారులుగా వాటిని తాము చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవలే ప్రకటించిన బ్యాడ్ బ్యాంక్ అనే రూపంలోని మరొక సాహసోపేతమైన సంస్కరణ వెనుకఉన్న ఆలోచన కూడా ఇదే మరి. రెగ్యులర్ వాణిజ్య బ్యాంకుల ఖాతాల్లో పేరుకుపోయిన 2 లక్షల కోట్ల రూపాయల నిరర్థక రుణాలను ఈ బ్యాడ్ బ్యాంకు తీసుకుం టుంది. నిర్దిష్ట కాలంలో వాటిని రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇదెలా పనిచేస్తుంది? వ్యాపారంలో విఫలమైన కంపెనీకి కొన్ని బ్యాంకుల సముదాయం రూ. 500 కోట్లను రుణంగా ఇచ్చిందని ఊహిద్దాం. ఇలా విఫలమైన కంపెనీకి తామిచ్చిన రుణం తిరిగి రాబట్టుకోవడంపై బ్యాంకులకు ఏమాత్రం ఆసక్తి లేదనుకోండి. అప్పుడు ఈ రూ. 500 కోట్ల రుణాన్ని అవి రూ. 300 కోట్లకు అమ్మేయాలని నిర్ణయించుకుంటాయి. అంటే ఏకకాలంలో బ్యాంకులు 200 కోట్ల రూపాయలను నష్టపోతాయి. కానీ తాము ఇచ్చిన రుణంలో 60 శాతాన్ని పొందుతాయి. బ్యాడ్ బ్యాంక్ ఇలా నష్టపోయిన కంపెనీ ఆస్తులను తీసుకుని తాను బ్యాంకులకు చెల్లించిన దానికంటే ఎక్కువ మొత్తానికి వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తుంది. ఇక బ్యాంకులు తాము తీసుకున్న రుణాల్లో కొంత భాగాన్ని రద్దు చేసుకుని తమ ఖాతా పుస్తకాలను క్లీన్ చేసుకుంటాయి. తొలిదశలో బ్యాడ్ బ్యాంక్ దాదాపు రూ. 90,000 కోట్ల మొండి బకాయిలను తీసుకుంటుందని భావిస్తే, దానికి చాలా మొత్తం నగదు అవసరమవుతుంది. తమ మొండి బకాయిలను బ్యాడ్ బ్యాంకుకు అమ్మివేసిన బ్యాంకులకు కనీసం 15 శాతం డబ్బు నగదు రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాలు సెక్యూరిటీ రిసిప్టులుగా ఉంటాయి. బ్యాడ్ బ్యాంకు తాను చేసిన వాగ్దానం మేరకు డబ్బు చెల్లించకలేకపోతే భారత ప్రభుత్వం దాన్ని పూరించి సార్వభౌమాధికార గ్యారంటీతో ఈ రిసిప్టులకు మద్దతిస్తుంది. అయితే దీనివల్ల లాభపడేది ఎవరు? మొండి బకాయిల్లో మెజారిటీని తమ స్వాధీనంలో ఉంచుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకులే లాభపడతాయని పైకి కనిపిస్తుంది కానీ, వాస్తవానికి బడా కార్పొరేట్ సంస్థలే అతిపెద్ద లబ్ధిదారులుగా ఉంటాయి. తమ ఖాతాల నుంచి మొండి బకాయిలను పూర్తిగా పరిష్కరించిన తర్వాతే ఈ బ్యాంకులు కార్పొరేట్లకు సులువుగా రుణాలు ఇవ్వగలుగుతాయి. దీంతో అవి ఆచరణాత్మక అంచనాలతో పనిలేకుండానే మళ్లీ జూదమాడటం మొదలెడతాయి. ఈ బడా కంపెనీలే తొలి దశలో దేశంలో మొండి బకాయిల సంక్షోభానికి అసలు కారకులు అనే విషయం మర్చిపోకూడదు. మరోమాటలో చెప్పాలంటే, ఈ బ్యాంకింగ్, టెలికాం సంస్కరణలు ‘సోషలిజం’ నూతన రూపమే తప్ప మరొకటి కాదు. కానీ ఈసారి మాత్రం ఈ సోషలిజం ప్రత్యేకించి పెట్టుబడిదారులకే వర్తిస్తుంది. బ్యాడ్ బ్యాంక్ అంటే ఏమిటి? దేశంలో తొలి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో గత నాలుగేళ్లుగా దీనిపై సాగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లయింది. గత ఏడాది బడ్జెట్లోనే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్) గురించి ప్రస్తావించారు. ఇంతకీ బ్యాడ్ బ్యాంక్ అంటే ఏమిటి? దేశంలో వ్యాపారసంస్థల వద్ద పేరుకుపోయిన మొండి బకాయిలను తీసుకుని వాటికి పరిష్కారం చూపే ఒక రకమైన ఆర్థిక సంస్థ బ్యాండ్ బ్యాంక్. కంపెనీలు పేరుకుపోయిన మొండిబకాయిలను ఈ బ్యాడ్ బ్యాంకుకి అప్పగిస్తే వాటిని ఎన్ఏఆర్సీఎల్ స్వాధీనపర్చుకుని వాటిని మార్కెట్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తుంది. కంపెనీలు కాస్త నష్టానికి తమ అప్పులను బ్యాడ్ బ్యాంకుకు స్వాధీనపరిస్తే, వాటిని అధిక ధరకు అమ్మడంద్వారా లబ్ధిపొందాలనేది బ్యాడ్ బ్యాంక్ లక్ష్యం. మొత్తం ఎలా పరిణమిస్తుందనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది. -అనింద్యో చక్రవర్తి, సీనియర్ ఆర్థిక విశ్లేషకులు -
డ్రైవింగ్ లైసెన్సులు ఇక ప్రైవేటు చేతుల్లోకి..
సాక్షి, హైదరాబాద్: డ్రైవింగ్ లైసెన్సులు ఇక ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లనున్నాయి. అధికారిక ధ్రువీకరణకు మాత్రమే ఆర్టీఏ పరిమితం కానుంది. ప్రస్తుతం వాహనాల రిజిస్ట్రేషన్లలో ఆటోమొబైల్ సంస్థల భాగస్వామ్యం పెరిగినట్లుగానే డ్రైవింగ్‌లో శిక్షణ, నైపుణ్య పరీక్షలు సైతం ప్రైవేట్ సంస్థలే నిర్వహించనున్నాయి. ఈ దిశగా రవాణాశాఖ సన్నాహాలు చేపట్టింది. కేంద్రం కొత్తగా రూపొందించిన ‘అక్రెడిటెడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్’పథకం అమలుకు రవాణాశాఖ సన్నాహాలు చేపట్టింది. డ్రైవింగ్ పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అవసరమైన రెండెకరాల భూమి, అధునాతన శిక్షణా కేంద్రం, తేలికపాటి, భారీ వాహనాలు తదితర మౌలిక సదుపాయాలు కలిగిన సంస్థలు లేదా వ్యక్తులు కొత్త అక్రిడేటెడ్ ట్రైనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సంస్థలిచ్చే శిక్షణను ఆర్టీఏ అధికారులు ప్రామాణికంగా భావించి డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేస్తారు. అంటే ఒకసారి అక్రెడిటెడ్ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ కోసం చేరితే నెల రోజులపాటు శిక్షణ ఇవ్వడంతోపాటు ఈ స్కూళ్లే ఫారమ్–5 ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తాయి. దీని ఆధారంగా రవాణా అధికారులు డ్రైవింగ్ లెసెన్సులు ఇస్తారు. ఇదంతా డ్రైవింగ్ కేంద్రాల నుంచి ఆర్టీఏ కార్యాలయాలకు డేటా రూపంలో ఆన్లైన్లో చేరిపోతుంది. వీలైనంత వరకు అభ్యర్థులు ఆర్టీఏకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే లైసెన్సులు చేతికొచ్చేస్తాయి. కొరవడిన నాణ్యత... ►ప్రస్తుతం భారీ వాహనాలు నడిపేందుకు, కార్లు వంటి తేలికపాటి వాహనాలు నడిపేందుకు డ్రైవింగ్ స్కూళ్లు శిక్షణ ఇస్తున్నాయి. కొన్ని స్కూళ్లు మాత్రమే సిమ్యులేటర్లను ఏర్పాటు చేసుకొని నాణ్యమైన శిక్షణ ఇస్తుండగా వందలాది స్కూళ్లు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే అభ్యర్థుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ►అరకొర శిక్షణ పొందిన వ్యక్తులు దళారులు, ఏజెంట్ల సహాయంతో డ్రైవింగ్ లైసెన్సులు తీసుకొని వాహనాలు నడుపుతున్నారు. ఇలాంటివారు ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ తరచుగా ప్రమాదాలకు కారణమవుతున్నారు. ►ప్రస్తుతం ఉన్న స్కూళ్లలో శిక్షణ పొందినప్పటికీ ఆర్టీఏ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో అధికారులు మరోసారి అభ్యర్థుల నైపుణ్యాన్ని పరీక్షించిన అనంతరమే లైసెన్సులు ఇస్తున్నారు. నైపుణ్యానికి మెరుగులు... ►కొత్తగా ఏర్పాటయ్యే శిక్షణా కేంద్రాల్లో రెండెకరాల విశాలమైన స్థలంలో టెస్ట్ ట్రాక్ ఉంటుంది. దాంతోపాటు నెల రోజులు సిద్ధాంతపరమైన అంశాల్లో శిక్షణనిస్తారు. ►అభ్యర్థులకు మొదట సిమ్యులేటర్ శిక్షణనిచ్చి ఆ తరువాత వాహనాలను అప్పగిస్తారు. ఏ రోజుకారోజు అభ్యర్థుల హాజరు, శిక్షణ తీరు, నైపుణ్యం తదితర అంశాలను పరిశీలించి చివరకు ఫారమ్–5 ధ్రువీకరణతోపాటు శిక్షణ పొందిన వారి వివరాలను ఆర్టీఏకు అందజేస్తారు. ►ప్రాంతీయ రవాణా అధికారిస్థాయిలో అభ్యర్థులు పొందిన శిక్షణను పరిశీలించి డ్రైవింగ్ లైసెన్సులు జారీచేస్తారు. ఆర్టీఏ డ్రైవింగ్ కేంద్రాలు అలంకారప్రాయమే.. –ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో నాగోల్, మేడ్చల్, ఉప్పల్, కొండాపూర్, ఇబ్రహీంపట్నంలలో డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలు ఉన్నాయి. –ప్రతిరోజు సుమారు 300 మందికి పైగా అభ్యర్థులు ఈ కేంద్రాల్లో మోటారు వాహన తనిఖీ అధికారుల సమక్షంలో డ్రైవింగ్ పరీక్షలకు హాజరవుతారు. –అక్రిడేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో వీటి అవసరం ఉండకపోవచ్చు. ఆహ్వానించదగ్గ పరిణామమే: పాండురంగ్ నాయక్, జేటీసీ, హైదరాబాద్ డ్రైవింగ్‌లో నాణ్యత, నైపుణ్యం పెరిగేందుకు ఈ శిక్షణ కేంద్రాలు దోహదపడతాయి. నిరుద్యోగులకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రభుత్వం స్వయంగా ఇలాంటి శిక్షణ ఇచ్చేందుకు అవకాశం తక్కువ. అందుకే ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తున్నాం. -
భారత అంతరిక్షరంగంలోకి ప్రైవేటు కంపెనీలు..!
న్యూఢిల్లీ: భారత్‌ను అంతరిక్ష రంగంలో అగ్రదేశాల సరసన నిలిచేందుకు ఇస్రో ఎంతగానో కృషి చేసింది. పలు మైలురాళ్లను జయించి భారత్‌ను అంతరిక్షరంగ చరిత్రపుటల్లో తనకంటూ ఒక స్థానాన్ని ఇస్రో నెలకొల్పింది. ఇస్రో ప్రభుత్వ రంగ సంస్థ తెలిసిన విషయమే.. స్పేస్ సెక్టార్‌లోకి ప్రైవేటు రంగాన్ని అనుమతిస్తే మరిన్ని విజయాలను సాధించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అంతరిక్షరంగంలోకి ప్రైవేటు కంపెనీలు భవిష్యత్తులో రానున్నాయి. ప్రైవేటు సంస్థలు రాకెట్ ప్రయోగాలను, లాంచింగ్ స్టేషన్లను దేశ భూభాగంలో లేదా ఇతర దేశాల్లో ప్రయోగాలను చేసే వెసులబాటును కేంద్రం ప్రభుత్వం కల్పించనుంది. కేంద్ర అంతరిక్ష మంత్రిత్వ శాఖ (డీవోఎస్) ఆధీనంలోని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) అనే స్వతంత్ర సంస్థ నుంచి ప్రైవేటు సంస్థలు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్-2020 పేరుతో తెచ్చిన ముసాయిదాలో ప్రైవేటు కంపెనీలు రాకెట్ ప్రయోగాల కోసం లాంచింగ్ స్టేషన్లను సొంతంగా, లేదా లీజు ద్వారా భూమిని సేకరించుకోవచ్చునని తెలిపింది. ఈ ముసాయిదాపై ప్రముఖ భారత ప్రైవేటు కంపెనీలు అగ్నికుల్ కాస్మోస్, స్కైరూట్ ఎరోస్పేస్ కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి. కేంద్ర తెచ్చిన ముసాయిదాతో రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన స్టేషన్లను, లాంచింగ్ ప్యాడ్లను సులువుగా ఏర్పాటుచేసుకునే అవకాశం ఉందని కంపెనీలు పేర్కొన్నాయి. అగ్నికుల్ కాస్మోస్ చిన్న ఉపగ్రహలను భూ నిర్ణీత కక్ష్యలోకి ప్రయోగిస్తోంది. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ చిన్నచిన్న రాకెట్ నౌకలను తయారు చేస్తోంది. చదవండి: వ్యోమగాములను సైతం అవాక్కయేలా చేయనున్న టైడ్! -
కొత్త ప్రాజెక్టుల ఆకర్షణలో ఏపీకి రెండో స్థానం
సాక్షి, అమరావతి: కొత్త ప్రాజెక్టులను ఆకర్షించడంలో రాష్ట్రం ముందుకు వెళ్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో రాష్ట్రంలో కొత్తగా రూ.29,784 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి 108 ప్రతిపాదనలను వచ్చినట్లు ప్రాజెక్ట్స్ టుడే తాజా నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా రూ.2,76,483 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రకటన వెలువడితే అందులో 10.77 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచినట్లు ప్రాజెక్ట్స్ టుడే పేర్కొంది. మొత్తం రూ.54,714 కోట్ల పెట్టుబడితో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిచింది. ప్రాజెక్ట్స్ టుడే సంస్థ దేశంలో కొత్తగా ప్రకటించిన పెట్టుబడులు, పిలిచిన టెండర్లు ఆధారంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి నివేదికను రూపొందిస్తుంది. అందులో భాగంగా ప్రకటించిన తాజా సర్వేలో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచినట్లు పేర్కొంది. రాష్ట్రానికి వచ్చిన మొత్తం ప్రాజెక్టుల విలువలో మూడో వంతు కేవలం సాగు నీటి రంగానికి చెందిన అయిదు ప్రాజెక్టులు ఉన్నట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా సాగు నీటి రంగంలో పెట్టుబడులు తగ్గగా, కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ.10,044.5 కోట్ల విలువైన మూడు భారీ ప్రాజెక్టులను చేపట్టిందని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత రాయితీలు (పీఎల్ఐ) స్కీం కింద ఫార్మా రంగంలో ఈ మూడు నెలల కాలంలో రూ.11,527.21 కోట్ల విలువైన 196 పెట్టుబడుల ప్రకటనలు వెలువడగా అందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవి ఉన్నట్లుగా నివేదిక వివరించింది. కైనటిక్ గ్రీన్ ఎనర్జీ రూ.1,750 కోట్లతో ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్ట్‌తో పాటు లోయర్ సీలేరులో రూ.1,098.12 కోట్లతో ఏరా>్పటు చేస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టులు ముఖ్యమైన ప్రాజెక్టులుగా పేర్కొంది. పెరిగిన ప్రైవేట్ పెట్టుబడులు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పెట్టుబడులు తగ్గుతూ, ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నట్లు ప్రాజెక్ట్స్ టుడే స్పష్టం చేసింది. ద్వితీయ త్రైమాసికంతో పోలిస్తే మొత్తం పెట్టుబడుల ప్రతిపాదనల్లో ప్రైవేటు సంస్థల వాటా 49.5 శాతానికి చేరినట్లు పేర్కొంది. ప్రైవేటు రంగంలో రూ.1,36,946.3 కోట్ల విలువైన 711 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇదే సమయంలో ప్రాజెక్టులు అమల్లోకి వస్తున్న సంఖ్యలో కూడా వృద్ధి నమోదవుతోందని వివరించింది. అక్టోబర్–డిసెంబర్ మధ్య కాలంలో రూ.1,29,388.84 కోట్ల విలువైన 1,237 ప్రాజెక్టుల పనులు మొదలయ్యాయని, ఇది అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే 120 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. అక్టోబర్ – డిసెంబర్లో ప్రకటించిన కొత్త ప్రాజెక్టులు -
ప్రైవేట్ రైళ్లలో చార్జీలపై పరిమితి లేదు
న్యూఢిల్లీ: దేశంలో ప్రైవేట్ రంగంలో త్వరలో ప్రవేశపెట్టబోయే రైళ్లలో ప్రయాణ చార్జీలపై పరిమితి ఉండబోదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. చార్జీలపై నిర్ణయం ప్రైవేట్ సంస్థలదేనని, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో 151 ప్రైవేట్ రైళ్లను 35 ఏళ్లపాటు నడిపేందుకు అనుమతిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చార్జీల విషయంలో ప్రైవేట్ బిడ్డర్లు పలు సందేహాలు లేవనెత్తారు. మార్కెట్ డిమాండ్‌ను బట్టి ప్రైవేట్ సంస్థలే చార్జీలను నిర్ధారించవచ్చని తాజాగా రైల్వే శాఖ తెలియజేసింది. రైల్వేస్ యాక్ట్ ప్రకారం దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం లేదా పార్లమెంట్ అంగీకారంతో చట్టబద్ధత కల్పించాల్సి ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి. సాధారణంగా రైలు చార్జీలను రైల్వే శాఖ లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తాయి. ప్రైవేట్ రైళ్లలో అత్యాధునిక వసతులు ఉంటాయి కాబట్టి ప్రయాణ చార్జీలు అధికంగానే ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ సంస్థలు సొంతంగానే తమ వెబ్సైట్ల ద్వారా రైల్ టికెట్లు అమ్ముకోవచ్చు. కానీ, ఈ వెబ్సైట్లను రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌తో అనుసంధానించాల్సి ఉంటుంది. రైల్వే శాఖలో ఈ–ఆఫీస్ జోరు కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో రైల్వే శాఖ 4 నెలలుగా ఈ–ఆఫీస్‌కు పెద్దపీట వేస్తోంది. పత్రాలు, ఫైళ్లను డిజిటల్ రూపంలోకి మార్చేసి, ఆన్లైన్లోనే పంపించింది. లేఖలు, బిల్లులు, ఆఫీస్ ఆర్డర్లు వంటి 12 లక్షలకు పైగా డాక్యుమెంట్లను, మరో 4 లక్షల ఫైళ్లకు డిజిటల్ రూపం కల్పించారు. దీంతో నిర్వహణ వ్యయం కూడా భారీగా తగ్గింది. 2019 మార్చి నుంచి 2020 మార్చి వరకు రైల్వే శాఖ ఆన్లైన్లో 4.5 లక్షల ఈ–రసీదులు జారీ చేయగా, 2020లో ఏప్రిల్ నుంచి జూలై వరకు 16.5 లక్షల ఈ–రసీదులను జారీ చేసింది. ఈ–ఫైళ్ల సంఖ్య 1.3 లక్షల నుంచి 5.5 లక్షలకు పెరిగింది. -
ప్యాసింజర్ రైల్లో ప్రైవేటు కూత
న్యూఢిల్లీ: ప్యాసింజర్ రైళ్ల నిర్వహణలో ప్రైవేటు రంగానికి ఆహ్వానం పలికే కార్యక్రమానికి బుధవారం రైల్వే శాఖ లాంఛనంగా శ్రీకారం చుట్టింది. 109 మార్గాల్లో 151 ఆధునిక రైళ్లను నడిపేందుకు ప్రైవేటు సంస్థల నుంచి ‘రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్’లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సుమారు రూ. 30 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు సమకూరుతాయని ఆశిస్తున్నారు. ప్యాసింజర్ రైళ్ల నిర్వహణలో ప్రైవేటు పెట్టుబడులను ఆమోదించడం ఇదే ప్రథమం. అయితే, ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిర్వహణలో ‘ఇండియన్ రైల్వే అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ)’ భాగస్వామ్యం గత సంవత్సరమే ప్రారంభమైంది. లక్నో – ఢిల్లీ మార్గంలో తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు ఐఆర్సీటీసీకి గత సంవత్సరం అనుమతి లభించింది. దీంతోపాటు ప్రస్తుతం ఐఆర్సీటీసీ వారణాసి– ఇండోర్ మార్గంలో కాశి మహాకాళ్ ఎక్స్‌ప్రెస్‌ను, అహ్మదాబాద్– ముంబై మార్గంలో తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతోంది. ప్రైవేటు పెట్టుబడులతో ఆధునిక సాధన సంపత్తి, ప్రయాణీకులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు సమకూరుతాయని రైల్వే శాఖ భావిస్తోంది. ప్యాసింజర్ రైళ్ల నిర్వహణకు అనుమతించనున్న 109 మార్గాలను 12 క్లస్టర్లుగా విభజించారు. ఈ 151 ఆధునిక రైళ్లలో అత్యధికం భారత్‌లోనే రూపొందుతాయి. వీటిలో 16 కోచ్‌లు ఉంటాయి. గంటకు 160 కిమీల గరిష్ట వేగంతో వెళ్లేలా ఈ రైళ్లను డిజైన్ చేస్తున్నారు. -
బోర్డ్ మీటింగ్స్ వీడియోలో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల బోర్డ్ మీటింగ్స్‌లను వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించే వీలు కల్పించింది కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ). దీంతో కంపెనీల విలీనాలు, కొనుగోళ్లు, అమాల్గమేషన్, నిధుల సమీకరణ వంటి కీలక నిర్ణయాల బోర్డ్ మీటింగ్స్‌లను వీడియో లేదా ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించుకోవచ్చు. జూన్ 30 వరకు వీడియో, ఆడియో ద్వారా సమావేశాలకు అనుమతి ఇస్తున్నట్టు సౌతీస్ట్ రీజియన్ రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) తెలిపింది. ఫైనాన్సియల్ స్టేట్మెంట్స్, అకౌంట్స్, బోర్డ్ రిపోర్ట్స్, మెర్జింగ్స్, రీ–స్ట్రక్చరింగ్ వంటి బోర్డ్ ఆమోదానికి వీడియో కాన్ఫరెన్స్ సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం కేవలం బోర్డ్ మీటింగ్స్‌కు మాత్రమే వీడియో, ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహణకు అనుమతి ఉంది. మిగిలిన వాటికి కంపెనీ డైరెక్టర్లు సంబంధిత కార్యాలయాలను ఫిజికల్‌గా కలవాల్సిందే. ప్రయాణ ఆంక్షలున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఆర్వోసీ, ఎన్సీఎల్టీ, ఆర్డీ పరిధిలోని కాంపౌండింగ్ అప్లికేషన్స్ విచారణలను హైదరాబాద్‌లోని ఆర్డీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అధికారిక ఈ–మెయిల్, ఫ్యాక్స్ ద్వారా మాత్రమే సంప్రదింపులు జరపాలని నిర్ణయించినట్లు ఆర్వోసీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్, విజయవాడ ఆర్వోసీ లెక్కల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో 80 వేలు, ఆంధ్రప్రదేశ్‌లో 20 వేల కంపెనీలున్నాయి. కరోనా వైరస్ కారణంగా ప్రయాణ, గ్రూప్ సమావేశాలు వంటి వాటిపై ఆంక్షలున్న నేపథ్యంలో కంపెనీ డైరెక్టర్లు మౌఖికంగా ఆయా కార్యాలయాలను సందర్శించడం శ్రేయస్కరం కాదు. అంతేకాకుండా చాలా కంపెనీల్లో విదేశీ డైరెక్టర్లు, ఇన్వెస్టర్లు ఉంటారు. వీళ్లు ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో మౌఖికంగా బోర్డ్ సమావేశంలో పాల్గొనలేరు. అందుకే కంపెనీల రోజు వారి కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసెస్ (ఐసీఎల్ఎస్) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే సంబంధిత బోర్డ్ మీటింగ్స్ తాలూకు వీడియో, ఆడియో కాన్ఫరెన్స్ కాపీలను భద్ర పర్చుకోవాలని ఆయన సూచించారు. ఆర్థిక ఫలితాల ప్రకటనల నేపథ్యంలో ఎంసీఏ ఈ కీలక నిర్ణయం తీసుకోవటం ఆహ్వానించదగినది అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 27 వరకూ ఎన్సీఎల్టీ ఫైలింగ్స్ బంద్ దేశవ్యాప్తంగా అన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బెంచ్‌లలో ఈ నెల 27 వరకు ఫైలింగ్ కౌంటర్ మూసివేయాలని ఢిల్లీలోని ఎన్సీఎల్టీ ప్రిన్సిపల్ బెంచ్ నిర్ణయించింది. అన్ని ఎన్సీఎల్టీ బెంచ్‌ల ఫైలింగ్ కౌంటర్ల వద్ద ఎక్కువ మంది సభ్యులు సంచరిస్తున్నారని.. ఇది కోవిడ్ వ్యాప్తికి కారణమవుతుందని∙భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్సీఎల్టీ తెలిపింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, అమరావతి, జైపూర్ బెంచ్‌లలో మాత్రం అత్యవసర మ్యాటర్స్ విషయంలో ఆన్లైన్ ద్వారా ఫైలింగ్ చేసుకునే వీలు కల్పించారు. -
గ్రేటర్ రోడ్లు ప్రైవేటుకు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో రోడ్ల నిర్వహణ బాధ్యతల్ని పేరెన్నికగన్న జాతీయ, అంతర్జాతీయ సంస్థలు చేపట్టనున్నాయి. భారీ ఫ్లైఓవర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులతోసహా వివిధ ఇంజనీరింగ్ పనుల్లో పేరుగాంచిన సంస్థలు ఇకపై నగర రోడ్ల నిర్వహణ పనులు చేయనున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 9వేల కిలోమీటర్లకు పైగా రోడ్లుండగా, ప్రధాన మార్గాల్లో దాదాపు 3 వేల కిలోమీటర్లు ఉన్నాయి. వీటి మరమ్మతులు, రీకార్పెటింగ్, తదితర పనుల కోసం జీహెచ్ఎంసీ ఏటా రూ. 500– 600 కోట్లు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ రోడ్లు ఎప్పుడూ గుంతల మయమే. అధ్వానపు రోడ్లతో ప్రజలకు అవస్థలేకాకుండా, సామాజిక మాధ్యమాల్లో నిత్యం ప్రభుత్వంపై విమర్శలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో రోడ్ల నిర్వహణను పూర్తిగా ప్రైవేట్ సంస్థలకివ్వాలని మునిసిపల్ మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. విధివిధానాలు రూపొందించేందుకు జీహెచ్ఎంసీలోని ముగ్గురు చీఫ్ ఇంజనీర్లతోపాటు, పబ్లిక్‌హెల్త్ మాజీ ఈఎన్సీని కమిటీ సభ్యులుగా నియమించారు. దీనికి సంబంధించిన టెండర్లు పిలిచేందుకు ముందుగా పేరెన్నికగన్న పలు కంపెనీలతో కమిటీ సమావేశం నిర్వహించింది. వందలు, వేల కోట్ల భారీ ప్రాజెక్టులు చేసే పెద్ద కంపెనీలు రోడ్ల నిర్వహణకు ఒప్పుకుంటాయా అనే అనుమానాలున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రోడ్లను పరిశీలించేందుకు అంగీకరించాయి. ఆయా సంస్థలు రోడ్లను పరిశీలించాక, మరోమారు జరిగే సమావేశంలో టెండర్లలో పొందుపరిచే అంశాలు, నిబంధనలు, నిర్వహణ వ్యయం తదితర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. అది పూర్తయ్యాక టెండర్లను ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత ప్రీబిడ్ సమావేశాలు పూర్తిచేసి టెండర్లలో అర్హత పొందే కంపెనీకి రోడ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. సాఫీ ప్రయాణమే లక్ష్యం.. రోడ్ల నిర్వహణ, మరమ్మతులకు సిమెంట్ కాంక్రీట్ వేస్తారా లేక బీటీనా అన్న విషయంతో సంబంధం లేకుండా ఇరవై నాలుగు గంటలపాటు రోడ్లు సవ్యంగా, ప్రయాణానికి సాఫీగా ఉండేలా నిర్వహించడం నిర్వహణ చేపట్టే సంస్థ పని. వర్షాలు తదితర కారణాల వల్ల పెద్ద గుంతలు ఏర్పడ్డా, ఇతరత్రా దెబ్బతిన్నా, 24 నుంచి 48 గంటల్లో మరమ్మతులు పూర్తిచేయాలి. వివిధ సంస్థల అవసరాల కనుగుణంగా రోడ్ కటింగ్‌లకు అనుమతులిచ్చే అధికారం, ఆ తర్వాత త్వరితంగా తిరిగి పూడ్చటం వంటివాటిపై కాంట్రాక్టు సంస్థకే అధికారం ఉంటుంది. తొలిదశలో 687 కి.మీ.లు తొలిదశలో జోన్ల వారీగా ఎక్కువ వాహనరద్దీ ఉండే ప్రధాన మార్గాలను గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో 687.43 కి.మీ.ల రద్దీ రోడ్లు ఉన్నాయి. జోన్ల వారీగా రోడ్ల నిర్వహణ కోసం యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ (ఏఎంసీ) పేరిట వీటికి టెండర్లు ఆహ్వానించనున్నారు. -
మాయా విత్తనం
పెద్ద కంపెనీలూ కల్తీ విత్తనాలు అంటగట్టి మోసం చేయడం ఆవేదన కలిగిస్తోంది. కల్తీ విత్తనాలు ఏవో మాకు తెలియడంలేదు. రైతులకు ఇచ్చాక అవి మొలకెత్తకపోవడంతో వారు మమ్మల్ని నిలదీస్తున్నారు. ఈ విషయంపై వ్యవసాయశాఖకు ఫిర్యాదు చేశాం. రీసైక్లింగ్ చేస్తున్న కంపెనీల వివరాలను అధికారులకు తెలియజేశాం. – పృథ్వీ, విత్తన డీలర్, ఖమ్మం కంపెనీలు విత్తనాలను కల్తీ చేస్తున్న వ్యవహారం మా దృష్టికి వచ్చింది. గడువు తీరిన వాటిలో కొన్ని విత్తనాలను మరోసారి లేబొరేటరీలో పరీక్షించి మొలకెత్తే లక్షణం ఉన్న వాటిని అమ్ముకోవడానికి అనుమతి ఉంటుంది. అలా కాకుండా పూర్తిగా గడువు తీరిన విత్తనాలను గోదాముల్లో గుర్తించాం. వాటిని అలా ఉంచడం నేరం. విత్తనాలను రీసైక్లింగ్ చేయకూడదు. ఈ విషయంలో 15 కంపెనీలకు నోటీసులు జారీచేశాం. ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చాం. – రాహుల్ బొజ్జా, కమిషనర్, వ్యవసాయశాఖ సాక్షి, హైదరాబాద్ : ఆరుగాలం శ్రమించి పంట పండించే అన్నదాతలతో విత్తన కంపెనీలు ఆటలాడుతున్నాయి. కాలం చెల్లిన విత్తనాలను అంటగట్టి వారిని నిలువునా మోసం చేస్తున్నాయి. గడువు తీరిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి కొత్తవని చెప్పి రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. ఆ విత్తనం.. ఈ విత్తనం అనే తేడా లేకుండా దాదాపు అన్ని రకాల విత్తనాలనూ ఇలాగే విక్రయించి రైతన్నలను నష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. ఒకసారి రూపొందించిన విత్తనాలనే మళ్లీ మళ్లీ రీసైక్లింగ్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయి. నాణ్యత లేని విత్తనాల వల్ల సరైన దిగుబడి రాకపోవడంతో రైతాం గం కుదేలవుతోంది. చిన్న కంపెనీలే కాకుండా బడా కంపెనీలు కూడా ఈ విత్తన దందా కొనసాగిస్తున్నాయి. ఇవన్నీ తెలిసినప్పటికీ ఆయా కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం వెనకడుగు వేస్తోంది. ఈ వ్యవహారంలో పలువురు పెద్దలు ఉండటమే ఇందుకు కారణమనే ప్రచారం సాగుతోంది. భారీ కుంభకోణం... రాష్ట్రంలో రీసైక్లింగ్ విత్తన కుంభకోణం భారీగా జరుగుతోంది. వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, ఆవాలు, బఠానీ సహా దాదాపు 30 రకాల పంటలకు సంబంధించి రీసైక్లింగ్ చేసిన విత్తనాలనే పలు కంపెనీలు సరఫరా చేస్తూ రైతన్నలను దగా చేస్తున్నాయి. ఈ రీసైక్లింగ్ కుంభకోణంలో బహుళజాతి కంపెనీలు కూడా ఉండటం నివ్వెరపరుస్తోంది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని విజిలెన్స్ దాడుల్లో ఈ విషయాలు బయటపడినా చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకాడుతున్నారు. ఉన్నతస్థాయిలో అండదండలు ఉండటంతో ఈ వ్యవహారం యధేచ్ఛగా సాగిపోతోంది. తాజాగా 15 కంపెనీలపై చేసిన దాడుల్లో రీసైక్లింగ్ వ్యవహారం బయటపడింది. దీంతో పలు పెద్ద కంపెనీలపైనా దాడులు చేయడానికి అనుమతించాలని కిందిస్థాయి సిబ్బంది కోరినా.. ఉన్నతస్థాయి నుంచి ఆమోదం రావడంలేదని తెలిసింది. వీరికి అనేకమంది పెద్దలు సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన అంతర్జాతీయ విత్తన సదస్సుకు ఆయా కంపెనీలు చేయూత ఇవ్వడమే కారణమన్న విమర్శలూ ఉన్నాయి. దీంతో వాటిపై కన్నెత్తి చూడడానికి కూడా వెనకాడుతున్నట్లు సమాచారం. రీసైక్లింగ్ ఇలా జరుగుతోంది.. రాష్ట్రానికి అవసరమైన హైబ్రీడ్ విత్తనాలను ప్రైవేటు కంపెనీలే సరఫరా చేస్తుంటాయి. మొక్కజొన్న, వరి, బఠానీ, సోయాబీన్, పత్తి వంటి హైబ్రీడ్ రకాలన్నింటినీ కంపెనీలే అభివృద్ధి చేసి రైతులకు ప్రైవేటు డీలర్ల ద్వారా విక్రయిస్తుంటాయి. ఇందుకు వ్యవసాయశాఖ ప్రత్యేక అనుమతి ఇస్తుంది. మొదటిసారి విక్రయించిన విత్తన ప్యాకెట్లకు ఏడాదిన్నర గడువు ఉంటుంది. ఆ గడువు తీరాక ఆయా విత్తనాలను తిరిగి డీలర్ల నుంచి కంపెనీలు వెనక్కి తీసుకోవాలి. అలా వెనక్కు తీసుకున్న విత్తనాలను లేబొరేటరీలో పరీక్షించిన తర్వాత అందులో మొలకెత్తే లక్షణాలున్న విత్తనాలను వేరుచేసి మరోసారి విక్రయించేందుకు ప్రత్యేక అనుమతి తీసుకుంటారు. అలాంటి విత్తనాలకు తొమ్మిది నెలల గడువుతో అమ్మడానికి వ్యవసాయశాఖ అనుమతి ఇస్తుంది. ఇలా రెండోసారి విక్రయించే విత్తన ప్యాకెట్లపై రీవాలిడేటెడ్ అని తప్పనిసరిగా ముద్రించాలి. కానీ కంపెనీలు మాత్రం అలా ముద్రించడంలేదు. పైగా వాటి గడువును ఏడాదిన్నరగా పేర్కొంటూ కొత్త విత్తనాలుగా మళ్లీ అమ్మేస్తున్నాయి. ఇక్కడితోనూ ఊరుకోవడంలేదు. ఇలా రెండోసారి గడువు తీరిన విత్తనాలను మూడోసారి కూడా రీసైక్లింగ్ చేసి రైతులకు అంటగడుతున్నాయి. ఇలాంటివాటిని కొత్త విత్తనాలతో కలిపేసి విక్రయిస్తున్నారని విజిలెన్స్ దాడుల్లో వెల్లడైంది. ఇలా కొత్త విత్తనాల్లో కాలం చెల్లిన విత్తనాలను కలపడం వల్ల మొత్తం విత్తనాలన్నీ కల్తీ అయిపోతాయని వ్యవసాయ వర్గాలు పేర్కొంటున్నాయి. మూడోసారి రీసైక్లింగ్ చేసిన తర్వాత ఏమాత్రం పనికిరాని విత్తనాలను బయో కంపెనీలకు విక్రయిస్తామంటూ వ్యవసాయశాఖ నుంచి అనుమతి తీసుకుంటున్నారు. కానీ అలా చేయకుండా వాటిని నాలుగోసారి రీసైక్లింగ్ చేసి కొత్త వాటితో కలిపి మళ్లీ విక్రయించి రైతులను నిలువునా ముంచేస్తున్నారు. పలు రాష్ట్రాలకూ సరఫరా.. తెలంగాణలో తయారయ్యే విత్తనాల్లో రాష్ట్రానికి సరిపోను మిగిలిన వాటిని దేశంలో వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలకు కూడా ఈ రీసైక్లింగ్ విత్తనాలు తరలి వెళ్తున్నాయి. కేవలం ఒకే ఒక కంపెనీ సరఫరా చేసిన విత్తనాలే రాష్ట్రంలో లక్షన్నర ఎకరాలకు సరిపడా ఉంటాయని సమాచారం. అంటే మొత్తం రాష్ట్రంలో సరఫరా చేసిన విత్తనాల్లో దాదాపు 15 నుంచి 20 శాతం వరకు రీసైక్లింగ్ విత్తనాలే ఉంటాయని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఏమాత్రం పనికిరాని విత్తనాలను గోదాముల్లోనే ఉంచకూడదు. ఒకవేళ ఉంటే, తమ వద్ద అలాంటి విత్తనాలు ఉన్నాయనే సమాచారాన్ని ఆయా కంపెనీలు జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు తెలియజేయాలి. కానీ ఏ ఒక్క కంపెనీ కూడా ఈ నిబంధనలు పాటించడంలేదు. ఇటీవల జరిపిన దాడుల్లో అనేక కంపెనీల గోదాముల్లో ఈ విత్తనాలు కనిపించాయి. మేడ్చల్‌లో ఉన్న ఒక కంపెనీయే దాదాపు 1200 టన్నుల వివిధ రకాల రీసైక్లింగ్ విత్తనాలను సరఫరా చేసినట్లు తేలింది. మొత్తం 15 కంపెనీలు దాదాపు 20వేల టన్నుల రీసైక్లింగ్ విత్తనాలు సరఫరా చేసినట్లు అంచనా వేస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిగితే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. -
‘కోడ్’ ఉన్నా కమీషన్ల బేరం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళి(కోడ్) అమల్లో ఉన్నప్పటికీ ప్రైవేట్ సంస్థలతో రూ.వేల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడడం లేదు. ‘ముఖ్య’నేతకు భారీగా ముడుపులు చెల్లించిన సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిదారులకు ఆఖరి నిమిషంలో భారీగా లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఫెక్లీ పవర్, ఎనర్జీ షిప్పింగ్ స్టోరేజ్ సిస్టమ్ పేరుతో కొన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రైవేట్ సంస్థలు– ప్రభుత్వ పెద్దల మధ్య కుదిరిన ఈ డీల్‌కు రాష్ట్ర కేబినెట్ మార్చిలోనే ఆమోదముద్ర వేసింది. క్షేత్రస్థాయిలో అధికారులు దీనిపై అభ్యంతరాలు లేవనెత్తినా ప్రభుత్వం లెక్కచేయలేదు. ఇంతలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం మళ్లీ ఈ వ్యవహారంపై ఒత్తిడి పెంచింది. ఉత్పత్తిదారుల నుంచి అధిక ధరకు కరెంటు కొనుగోలు చేసి, వారికి లాభం చేకూర్చి, కమీషన్లు దండుకోవాలని ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చేలోగానే.. తక్షణమే విద్యుత్ సమన్వయ కమిటీ సమావేశమై, ఈ ప్రాజెక్టును ఆమోదించాలని గత రెండు రోజులుగా అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి పెంచుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేలోగానే సంబంధిత ఒప్పందాలు జరిగిపోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) హుకూం జారీ చేయడంతో విద్యుత్ అధికారులకు దిక్కు తోచడం లేదు. బుధవారం విద్యుత్ సమన్వయ కమిటీ భేటీ ఏర్పాటు చేసి, ప్రైవేట్ విద్యుత్ ప్రాజెక్టులకు అనుకూలంగా తీర్మానం చేయాలని సీఎంవో నుంచి ఒత్తిడి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉన్న ట్రాన్స్‌కో సీఎండీ వ్యక్తిగత సెలవులో ఉన్నారు. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) సీఎండీ ఎన్నికల విధుల్లో ఇతర రాష్ట్రానికి వెళ్లారు. ప్రస్తుతం ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీనే అన్ని బాధ్యతలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంత హడావిడిగా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏమిటని విద్యుత్ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కనీసం ప్రాజెక్టు సమగ్ర నివేదిక కూడా లేని ఈ ప్రాజెక్టును ఆమోదించమని ఒత్తిడి చేస్తే తాము సెలవుపై వెళ్తామని ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు తేల్చిచెప్పారు. తమను బలి పశువును చేస్తున్నారని ట్రాన్స్‌కో తాత్కాలిక జేఎండీ ఆవేదన వ్యక్తం చేశారు. ఏమిటీ ప్రాజెక్టు? రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఎక్కడా లేని విధంగా అత్యధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. తాజాగా ఫెక్లీ పవర్ పేరుతో 600 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఉత్పత్తిదారులు చెప్పిన రేటుకు 25 ఏళ్ల పాటు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలని ప్రతిపాదించింది. ఆయా సంస్థలు ఉత్పత్తి చేసిన సౌర, పవన విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసి, విద్యుత్ డిమాండ్ ఉన్న సమయంలో డిస్కమ్‌లకు అందిస్తాయి. ఇతర రాష్ట్రాల్లో పవన, సౌర విద్యుత్ యూనిట్ రూ.3 చొప్పున లభిస్తోంది. బ్యాటరీల్లో నిల్వ చేసి అందించడం వల్ల యూనిట్ రూ.6 వరకూ పడుతుందని ప్రైవేట్ సంస్థలు పేర్కొన్నాయి. అదేవిధంగా ఏపీ జెన్కో ఉత్పత్తి చేసే సౌర విద్యుత్‌ను 400 మెగావాట్ల మేర నిల్వ చేసి, అవసరం అయినప్పుడు అందించే మరో విధానాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. దీన్ని ఎనర్జీ షిప్పింగ్ స్టోరేజ్ సిస్టమ్ అంటారు. జెన్కో ఉత్పత్తి చేసేదాని కన్నా ప్రైవేటు సంస్థలు నిల్వ చేసి, తిరిగి ఇవ్వడానికే ఎక్కువ ఖర్చవుతుందని తేల్చారు. దాదాపు 1,000 మెగావాట్ల విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేయడం ఇంతవరకూ ఎక్కడా లేదని, ఏ ప్రయోగం లేకుండానే ఈ ప్రాజెక్టును ఎలా ఆమోదిస్తామని అధికారులు అంటున్నారు. అయినప్పటికీ ఆమోదించి తీరాలని ప్రభుత్వం పట్టుబడుతోంది. ప్రభుత్వ పెద్దలకు ప్రైవేట్ ఉత్పత్తిదారుల నుంచి భారీగా ముడుపులు అందాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఒత్తిడికి తాళలేక సెలవుపై అధికారులు ప్రభుత్వ పెద్దల ఒత్తిడి నేపథ్యంలో ఈ ప్రాజెక్టు వ్యవహారం వివాదాస్పదమవుతోంది. రాబోయే ప్రభుత్వం దీనిపై విచారణ జరిపిస్తే తాము చిక్కుల్లో పడతామని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ గుర్తించారు. అందుకే ఆయన ఈ నెల 22 వరకూ సెలవు పెట్టారని విద్యుత్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ కూడా వారం రోజులుగా సెలవులో ఉన్నారు. నిజానికి ఆయన మంగళవారం విధుల్లో చేరాల్సి ఉంది. ఆయన సెలవును పొడిగించినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఇంజనీర్లు సెలవుపై వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. -
రాజధానిలో భూమి తీసుకో..అమ్ముకో
సాక్షి, అమరావతి: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే చిప్ డిజైనింగ్ కంపెనీ సాక్‌ట్రానిక్స్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీల వర్షం కురిపించింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నాలుగు అంతస్థుల భవనంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీకి రాజధాని అమరావతిలో 40 ఎకరాల భూమిని కారుచౌకగా కేటాయించింది. రూ.160 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.20 కోట్లకే కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిలో ఎకరం భూమి ధరను ప్రభుత్వమే రూ.4 కోట్లుగా గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ, సాక్‌ట్రానిక్స్‌కు ఎకరం కేవలం రూ.50 లక్షలకే కేటాయిస్తూ హాడావిడిగా ఉత్తర్వులను జారీ చేసింది. విలువైన భూమి కేటాయించడమే కాకుండా పూర్తిగా అమ్ముకోవడానికి లేదా లీజుకు ఇచ్చుకోవడానికి హక్కులు సైతం కల్పించడం గమనార్హం. అమరావతిలో పరిశ్రమ ఏర్పాటు చేస్తామని సాక్‌ట్రానిక్స్ దరఖాస్తు చేసుకున్న రెండు నెలల్లోనే శరవేగంతో ఫైల్ ముందుకు కదిలింది. ఆ సంస్థకు అత్యంత తక్కువ ధరకే విలువైన భూమిని కేటాయించడమే కాకుండా భారీగా రాయితీలు కల్పించడం ఉన్నతస్థాయి అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. రాజధానిలో వేలం విధానంలోనే ప్రైవేట్ కంపెనీలకు భూ కేటాయింపులు చేయాలని ఏపీసీఆర్డీఏ స్పష్టంగా చెపుతోంది. కానీ, దాన్ని పక్కన పెట్టి సాక్‌ట్రానిక్స్‌కు భూ కేటాయింపులు చేయడం గమనార్హం. రాయితీల్లోనే రూ.250 కోట్ల లబ్ధి 2014–2020 ఎలక్ట్రానిక్స్ పాలసీ ప్రకారం లభించే రాయితీలే కాకుండా ఇంకా అదనపు ప్రయోజనాలను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అదనపు రాయితీల విలువ రూ.250 కోట్లు ఉంటుందని అధికారులు చెపుతున్నారు. కేవలం ఒక్క భూమిపైనే రూ.140 కోట్ల ప్రయోజనం నేరుగా లభించింది. ఇవికాకుండా ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం గ్రాంట్‌గా ఎకారానికి గరిష్టంగా రూ.30 లక్షలతోపాటు అన్ని గ్రాంట్లు కలిపి గరిష్టంగా రూ.50 కోట్లకు వరకు ఇచ్చారు. ఈ విషయాన్ని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాకుండా ల్యాండ్ కన్వర్జేషన్ చార్జీల నుంచి సైతం మినహాయింపు ఇచ్చారు. ఆంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో 54 ఎకరాల్లోనే అతిపెద్ద క్యాంపస్ నిర్మించింది. ఒక చిన్న చిప్ కంపెనీకి రాజధాని అమరావతిలో ఏకంగా 40 ఎకరాలు కేటాయిచండమే కాకుండా, ఇతరులకు అమ్ముకునే హక్కును కూడా కల్పించడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆ వేధింపులపై నివేదికలు ఇవ్వాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రైవేట్ కంపెనీలు తమ ప్రాంగణాల్లో జరిగే లైంగిక వేధింపులు కేసుల వివరాలను ఇకపై వార్షిక నివేదికల్లో పొందుపరచాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కంపెనీల (అకౌంట్స్) నిబంధనలు, 2014ను సవరించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ వినతి మేరకు ఈ మార్పులు చేపట్టారు. ప్రైవేట్ రంగంలో పని ప్రదేశాలను మహిళలకు సురక్షితంగా మలిచే క్రమంలో ఈ చర్య ఆహ్వానించదగినదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్వాగతించారు. కార్యాలయాల్లో మహిళా ఉద్యోగినులపై లైంగిక వేధింపులపై ఫిర్యాదులు,కేసుల వివరాలు చేపట్టిన చర్యలను వార్షిక నివేదికల్లో పొందుపరచని కంపెనీలపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
మోసాలను.. 'బ్లాక్' చేస్తుంది
సాక్షి, హైదరాబాద్: పారదర్శకతను ఈ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి తెస్తుంది. ఇంకోలా చెప్పాలంటే దొంగ చేతికి తాళమిస్తే చోరీలు జరగవన్నట్లు ఈ టెక్నాలజీలో సమాచారం అందరివద్దా ఉంటుంది. ఎవరు మోసం చేయాలన్నా నిమిషాల్లో అందరికీ తెలిసిపోతుంది. అంటే కంపెనీ, బ్యాంకు లేదా ఏ సంస్థలోనైనా లావాదేవీల నమోదుకు ఉండే పుస్తకాలు (లెడ్జర్స్) ఉంటాయి. లెక్కలు రాసేందుకు జనరల్ లెడ్జర్, అమ్మకాల నమోదుకు సేల్స్ లెడ్జర్, కొనుగోళ్లకు సంబంధించి పర్చేసింగ్ లెడ్జర్ ఇలా ఉంటాయి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో అన్ని లెడ్జర్లు అందరివద్దా అందుబాటులో ఉంటాయి. టెక్నికల్ భాషలో డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ అన్నట్లు. ఈ విభాగాల్లో దేనిలో ఏ చిన్న లావాదేవీ జరిగినా ఆ సమాచారం అందరికీ చేరుతుంది. అందరూ ఆమోదిస్తేనే ఆ లావాదేవీ ముందుకు సాగుతుంది. ఈ లావాదేవీల్లో సరుకులు అమ్మినవారితో పాటు కొనుగోలు చేసిన వారు కూడా ఈ నెట్‌వర్క్‌లో భాగంగా ఉంటారు. వారికి సంబంధించిన లావాదేవీలు ఎలా ముందుకెళ్తున్నాయో ఎప్పటికప్పుడు వీరికీ తెలుస్తుంటుంది. ఒకవేళ బ్యాంక్, కంపెనీ వాళ్లందరూ కుమ్మక్కై ఏదైనా ఫ్రాడ్ చేయాలనుకున్నా.. వీరికీ ఆ విషయం తెలిసిపోతుంది కాబట్టి చేయలేరన్నమాట! ఎవరి సృష్టి ఇది.. బిట్కాయిన్ల గురించి తెలుసు కదా..! వాటి కోసమే ఈ టెక్నాలజీ వచ్చింది. సటోషీ నకమోటో పేరుతో కొందరు అజ్ఞాత టెకీలు దీన్ని అభివృద్ధి చేశారు. అయితే అవగాహన పెరుగుతున్న కొద్దీ ఈ టెక్నాలజీని అన్ని రంగాల్లో ఉపయోగించొచ్చని నమ్మకం. నిపుణుల అంచనా ప్రకారం.. ఇది ఇంకోరకమైన ఇంటర్నెట్. సమాచారం కోసం సామాన్యుడు ఎలా ఉపయోగించుకుంటున్నాడో.. అచ్చం అలాగే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా అన్ని లావాదేవీలను సులువుగా ఎలాంటి మోసాలకు తావులేకుండా జరుపుకోవచ్చునని నిపుణులు అంటున్నారు. ఒక్కో లావాదేవీ.. ఒక బ్లాక్! ఈ టెక్నాలజీ పేరు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ. బ్లాక్ అంటే ఒక భాగం. ప్రతి లావాదేవీ.. అందులో భాగమైన వారందరి వివరాలు ఒక్కో బ్లాక్‌గా ఏర్పడతాయి. ఒకవేళ ఈ బ్లాక్‌లో ఉన్నవారితో ఇంకో లావాదేవీ జరిగిందనుకోండి. అది మునుపటి బ్లాక్‌కు అనుబంధంగా ఇంకో ప్రత్యేకమైన బ్లాక్‌గా ఏర్పడుతుంది. ఇలా బ్లాక్‌లన్నీ వరుసగా ఒక చెయిన్ మాదిరిగా ఏర్పడతాయి. మొత్తం చెయిన్‌లో దేంట్లో మార్పులు జరిగినా అది ఆ లావాదేవీ నమోదైన బ్లాక్‌లో నమోదవుతుంది. పది నిమిషాలకు ఒకసారి బ్లాక్‌లలోని వివరాలు నెట్‌వర్క్‌లో ఉండే అందరి కంప్యూటర్లలోకి చేరి లావాదేవీలన్నీ సక్రమంగా ఉన్నదీ లేనిదీ సరిచూసుకుంటాయి. ఏదన్నా తేడా వస్తే.. ఆ విషయాన్ని నెట్‌వర్క్‌లో ఉన్న వారందరికీ తెలియజేస్తాయి. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తప్పులు, మోసాలకు అస్సలు ఆస్కారం ఉండదు. ప్రతిఒక్కరూ వందశాతం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పరిస్థితి కల్పిస్తుంది. – ఇయాన్ ఖాన్, టెక్నాలజీ ఫ్యూచరిస్ట్ ఆఫ్రికా, ఇండియా, తూర్పు యూరప్‌లోని కొన్ని దేశాల్లో వ్యక్తులు కంపెనీలు, వ్యవస్థలను నమ్మడం మానేస్తున్నారు. అలాంటి చోట పరిస్థితులను పూర్తిగా మార్చేసే సామర్థ్యం ఈ టెక్నాలజీకి ఉంది. – విటాలిక్ బుటెరిన్, ఎథీరియం సృష్టికర్త ఇవి రెండు రకాలు.. పబ్లిక్ బ్లాక్ చెయిన్ అంటే అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వాలు, ప్రజలకు సంబంధించిన లావాదేవీలను నమోదు చేసుకునేందుకు ఏర్పాటు చేసుకునేవి. రెండోది ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులు, సంస్థలు ఏర్పాటు చేసుకునేవి. ఉపయోగాలు ఇవీ... బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అన్ని రంగాలకూ ఉపయోగకరమే. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నుంచి ప్రభుత్వాలను నిర్ణయించే ఓటింగ్ వరకూ అన్నింటిలోనూ దీన్ని ఉపయోగించొచ్చు. ఇది పారదర్శకత, నమ్మకాన్ని కలిగిస్తుంది. మోసాలకు తావుండదు. అందరి అంగీకారంతోనే ఏ వ్యవహారమైనా నడుస్తుంది. అధికారులు, లేదా రాజకీయ పార్టీల ఇష్టాఇష్టాలతో పని లేకుండా సంక్షేమ పథకాలు ప్రభుత్వాల నుంచి నేరుగా లబ్ధిదారులకు అందుతాయి. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీకి సంబంధించిన స్మార్ట్ కాంట్రాక్టును ఉపయోగించుకుని ఆస్తి కొనుగోలు చేస్తే దానికి సంబంధించిన అన్ని వివరాలు స్పష్టంగా ఉంటాయి. సమాచార భద్రతకు ఢోకా ఉండదు. కొన్న వ్యక్తి ఎవరో.. అమ్మిన వారు ఎవరో కూడా తెలియదు. లావాదేవీలు జరిపేవారందరూ ఇక్కడ సమాన భాగస్వాములు. ఫలితంగా అధికారం అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎవరూ దుర్వినియోగం చేసేందుకు వీలుండదు. – బుక్కపట్నం మురళి ఈ టెక్నాలజీతో బ్యాంకులే ఉండవని అంటున్నారు కానీ అది అంత నిజం కాదు. ఎందుకంటే లావాదేవీలను ధ్రువీకరించేందుకు కొంతమంది అధికారుల అవసరముంటుంది. అయితే ఈ టెక్నాలజీ వినియోగంలోకి వచ్చేందుకు కొన్ని ఇబ్బందులూ ఉన్నాయి. – అఖిలేష్ టుటేజా, గ్లోబల్ సెక్యూరిటీ ప్రాక్టీస్ కో లీడర్, కేపీఎంజీ -
కోల్‌మైనింగ్‌లో కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. బొగ్గుగనుల తవ్వకాల్లో ప్రయివేటు కంపెనీల ఎంట్రీకి ఆమోదం తెలుపుతూ నాలుగుదశాబ్దాల్లో మొదటిసారి నిర్ణయం తీసుకుంది. దేశంలో బొగ్గు గనుల తవ్వకాల వేలంలో పాల్గొనేందుకు ప్రయివేటు సంస్థలకు అనుమతినికి కేంద్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మైనింగ్ అండ్ మినరల్స్ (డెవెలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 1957ను ఆమోదిచినట్టు కేంద్ర, రైల్వే, బొగ్గు శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. తద్వారా తక్కువ ధరకే విద్యుత్ లభించనుందని చెప్పారు. తద్వారా బొగ్గు తవ్వకాల్లో కమర్షియల్ మైనింగ్‌కు గేట్లు తెరిచింది క్యాబినెట్ భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియాకు భారీ ప్రయోజనం కలగనుందన్నారు. అలాగే కోల్ ఇండియాలో పనితీరును, సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి ప్రైవేటు రంగాల పోటీ దోహదపడుతుందని చెప్పారు. ఒడిషా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్గడ్ వంటి వెనుకబడిన రాష్ట్రాల్లో అనేక ఉద్యోగాల కల్పనతోపాటు ఆదాయం పెరగనుందన్నారు. ఈ నిర్ణయం క్లీన్ కోల్ ఉత్పత్తికి కూడా దోహదపడుతుందన్నారు. పారదర్శకంగా ఇ-బిడ్డింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. బొగ్గు గనుల వేలం వాణిజ్య మైనింగ్‌కు అనుమతినివ్వడం చాలామంచి, ప్రోత్సాహకరమైన చర్యగా వేదాంత ప్రతినిది అనిల్ అగర్వాల్ అభివర్ణించారు. ఇది అసాధారణ అవకాశమని పేర్కొన్నారు. మరోవైపు అసోసియేషన్ ఆఫ్ పవర్ ప్రొడ్యూసర్స్ ఈ విధానాన్ని స్వాగతించింది. అయితే ప్రభుత్వం కఠినమైన నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కాగా భారతదేశ విద్యుత్ ఉత్పాదనలో 70శాతం బొగ్గుదే. ఈ నేపథ్యంలో దేశంలో 2022 నాటికి 1 బిలియన్ టన్నుల ఉత్పత్తిని కేంద్రం టార్గెట్‌గా పెట్టుకుంది. మరోవైపు ఈ ప్రకటనతో స్టాక్మార్కెట్లో కోల్ ఇండియా, వేదాంత తదితర షేర్లు భారీ లాభాల నార్జిస్తున్నాయి. -
‘లెక్క’లేని నిరుద్యోగులు!
సాక్షి, హైదరాబాద్: యువజనులు ఎక్కువ సంఖ్యలో ఉన్న మన రాష్ట్రంలో ఉపాధి ఎంతమందికి ఉంది.. నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారన్న దానిపై ప్రభుత్వ శాఖలవద్ద స్పష్టమైన లెక్కలు లేవని తెలుస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారనే దానిపై ప్రభుత్వ శాఖల్లో గందరగోళం నెలకొంది. ఉపాధి కల్పన, శిక్షణ విభాగం వద్ద గణాంకాలున్నప్పటికీ, వాటికీ వాస్తవ పరిస్థితులకు ఎక్కడా పొంతన కుదరడంలేదు. దీంతో ఉపాధి కల్పనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే దానిపై స్పష్టత కొరవడింది. అధికారిక లెక్కల్లో 9.26 లక్షలే.. సాధారణంగా నిరుద్యోగిగా ఉన్న ప్రతి వ్యక్తి ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకుంటారు. ప్రస్తుతం ఎంప్లాయిమెంట్ కార్డు పొందే వారి సంఖ్య భారీగా తగ్గింది. వివిధ కోర్సులు పూర్తి చేసిన వారిలో కనీసం పావువంతు కూడా ఈ కార్డులకోసం దరఖాస్తు చేసుకోవడంలేదు. ఉపాధి కల్పనలో ఈ కార్డుల ప్రాధాన్యం తగ్గిపోవడంతో అభ్యర్థులు వీటిపై దృష్టి సారించడం లేదు. ప్రస్తుతం ఉపాధి కల్పన శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 9,26,289 మంది నిరుద్యోగులున్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వారు 4,57,481. రాష్ట్రం ఏర్పాటై నాలుగేళ్లు కావస్తుండటంతో ఏటా సగటున లక్ష మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. కార్డులు పొందిన వారిలో అత్యధికంగా పదోతరగతి పూర్తి చేసినవారు 3.28 లక్షలు ఉండగా, ఇంటర్మీడియెట్ చదివినవారు 1.71లక్షలు, గ్రాడ్యుయేట్లు 1.53లక్షలు ఉన్నారు. ఆన్లైన్లో కార్డులు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల లెక్కలపై అంచనాల కోసం కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ విభాగం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. ఎంప్లాయిమెంట్ కార్డుల కోసం ఆన్లైన్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించి.. దాని ద్వారా దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ ప్రక్రియకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నారు. ఆన్లైన్ దరఖాస్తు విధానంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు.. వారి అర్హతలు, వయసు తదితర పూర్తిస్థాయి సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు. ఉపాధికల్పన శాఖ నిరుద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లోపు కార్డును పొందే వీలు కల్పిస్తోంది. అదనపు కోర్సులు చేసిన తర్వాత దాన్ని అప్డేట్ చేసుకునే వీలుంటుంది. ఒక వ్యక్తికి ఒకే ఎంప్లాయిమెంట్ ఐడీ ఉండేలా ఉపాధి కల్పన శాఖ చర్యలు చేపట్టింది. కాగా, అభ్యర్థుల విద్యార్హతలు, నైపుణ్యం ఆధారంగా జాబ్‌మేళాలు నిర్వహించి ఉపాధి కల్పించేందుకు వీలుంటుంది. నేషనల్ పోర్టల్‌తో వివరాలన్నీ అనుసంధానం.. ఎంప్లాయిమెంట్ వెబ్‌సైట్‌ను అత్యాధునికంగా రూపొందించాం. ఇది కేవలం నిరుద్యోగ నమోదు ప్రక్రియకే పరిమితం కాదు. ఈ వెబ్‌సైట్‌ను నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌తో అనుసంధానం చేస్తాం. నిరుద్యోగుల నమోదు ప్రక్రియలో వారి మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీలను తీసుకుంటాం. కొత్తగా ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో ఉపాధి అవకాశాలున్నప్పుడు అర్హతల ఆధారంగా ఆటోమేటిక్‌గా ఆయా అభ్యర్థులకు ఎస్సెమ్మెస్‌లు, ఈమెయిల్స్ వస్తాయి. స్థానికంగా ఉన్న పరిశ్రమలు, సంస్థలకు నియామకాల ప్రక్రియకు ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. - కె.వై. నాయక్, సంచాలకుడు, కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ విభాగం -
‘అరుణాచల్’ కథ కంచికి!
సాక్షి, హైదరాబాద్: నిబంధనలు మారలేదు.. బస్సుల యజమానులూ పద్ధతి మార్చుకోలేదు. కొన్ని నెలల క్రితం ప్రభుత్వానికి అక్రమంగా కనిపించిన తీరు ఇప్పు డు ఉన్నట్టుండి సక్రమమైంది. గత జూన్‌లో అరుణాచల్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న బస్సులపై ఆ రాష్ట్రం కన్నెర్ర చేసిన నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ కూడా అలాంటి బస్సులపై కొరడా ఝళిపించింది. కానీ ఆరు నెలలు తిరక్కుండానే రవాణా శాఖ ఆ హెచ్చరికలను ‘తాటాకు చప్పుళ్లు’ చేసి ఆ బస్సులకు లైన్ క్లియర్ చేసింది. వెరసి ఆర్టీసీ దివాలా దశకు చేరటానికి కారణంగా మారిన ప్రైవేటు బస్సులను నియంత్రించటం అసాధ్యమని మరోసారి నిరూపించింది. నిబంధనలతోపాటు భద్రత ప్రమాణాలను కూడా ప్రైవేటు బస్సులు పాటించటం లేదని ఆరోపించే రవాణా శాఖ.. ఇప్పుడు వాటికి అనుకూలంగా వ్యవహరించటం చర్చనీయాంశంగా మారింది. జరిగింది ఇదీ! గత జూన్‌లో అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు బస్సులపై విరుచుకుపడింది. అక్కడి చిరునామాలతో అక్కడే బస్సులను రిజిస్టర్ చేసి, అక్కడే పర్మిట్లు పొంది వేరే ప్రాంతాల్లో తిరగటం అక్రమమని గుర్తించి వాటి అనుమతులు రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అలాం టి బస్సులు దాదాపు వెయ్యి వరకు ఉండటంతో ఇక్కడా వాటిని నియంత్రించారు. తెలంగాణ ప్రభుత్వం ఆ బస్సులను గుర్తించి వాటి నుంచి త్రైమాసిక పన్ను వసూలును నిలిపివేసింది. వాటికి అనుమతి లేనందున రోడ్డెక్కితే జప్తు చేయాలని ఆదేశించింది. దీంతో రవాణా శాఖ అధికారులు ఆ బస్సులు ఎక్కడ కనిపిస్తే అక్కడ జప్తు ప్రారంభించారు. దీంతో ఆర్టీసీ బస్సులు కళకళలాడాయి. రద్దీ ఉన్న చోట్ల అదనపు బస్సులు తిప్పడాన్ని ఆర్టీసీ మొదలుపెట్టింది. ఇంతలో కొందరు దళా రులు ఆ బస్సులపై నిషేధం ఎత్తేయాలని రవాణా శాఖపై ఒత్తిడి ప్రారంభించారు. ఆ ఒత్తిడే పని చేసిందో, త్రైమాసిక పన్ను రూపంలో ఆదాయం కోల్పో వటం ఎందుకని అనుకున్నారో తెలియదు గాని సంక్రాంతి సమయంలో వాటికి పచ్చజెండా ఊపేశారు. రూ.5.5 లక్షల ఆదాయం ప్రతి ప్రైవేటు బస్సు మూడు నెలలకోసారి సీటుకు రూ.3,500 చొప్పున ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. వెరసి ఒక్కో బస్సు నుంచి ఏడాదికి రూ.ఐదున్నర లక్షల వరకు పన్ను వసూలవుతుంది. సీన్ రివర్స్! బెంగళూరు సహా విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుండటంతో హైదరాబాద్ నగరంలోని బీహెచ్ఈఎల్, మియాపూర్, కూకట్పల్లి.. తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ఏసీ బస్సులు నడుపుతోంది. బీహెచ్ఈఎల్, మియాపూర్, హైదరాబాద్–3 డిపోలకు సంబంధించి 20 గరుడ ప్లస్, 20 రాజధాని ఏసీ బస్సులు నడుస్తున్నాయి. ప్రైవేటు బస్సులపై నిషేధం ఉన్న సమయంలో ఈ బస్సుల్లో సీట్లు సరిపోక అదనపు బస్సులు నడపాల్సి వచ్చింది. ఫలితంగా ఆర్టీసీ గల్లా పెట్టె కళకళలాడింది. ప్రైవేటు బస్సులపై నిషేధం తొలగ్గానే ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో సగటున 45 శాతానికి పడిపోయింది. పగటి పూట నడిచే రాజధాని బస్సుల్లో ఇది 70 శాతం వరకు ఉండగా, గరుడ బస్సుల్లో పరిస్థితి దారుణంగా పడిపోయింది. రాత్రి వేళ ప్రైవేటు బస్సులు స్లీపర్ సర్వీసులు నడుపుతుండటంతో జనం అటువైపు మొగ్గు చూపుతున్నారు. విషయాన్ని డిపో మేనేజర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ప్రైవేటు బస్సుల నియంత్రణ తమ చేతుల్లో లేకపోవటంతో వారు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. ఏపీ చర్యలతో గండి..? నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఈ బస్సులు ఏపీ కేంద్రంగానే ఎక్కువగా ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్ ఉదంతం సమయంలో వాటిని నియంత్రించారు. కానీ రెండుమూడు నెలలకే అనుమతించేశారు. దీంతో ఏపీ నుంచి హైదరాబాద్‌కు ఎక్కువ బస్సులు తిరగటం మొదలుపెట్టాయి. ఇక్కడ నిషేధం ఉండటంతో అధికారులు వాటిని జప్తు చేయటం గందరగోళంగా మారింది. ఎలాగూ ఏపీ గేట్లు ఎత్తేసింది కాబట్టి ఇక్కడా నిషేధం తొలగించి పన్ను వసూలు చేసుకోవటం మంచిదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కొందరు అధికారులు చెబుతున్నారు. నిబంధనల ఉల్లంఘన ఇలా.. - కేంద్ర మోటారు వాహనాల చట్టం 1989 నిబంధన 128(10) ప్రకారం జాతీయ పర్మిట్ ఉన్న రవాణా వాహనాల్లో బెర్తులు ఏర్పాటు చేయొద్దు. కానీ రాష్ట్రంలో తిరుగుతున్న ప్రైవేటు బస్సుల్లో ఉంటున్నాయి. - నిబంధన 125(4) సి, ప్రకారం ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలు, రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి పర్మిట్లు పొందిన ప్రైవేటు బస్సులు మాత్రమే బెర్తులు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ వేర్వేరు రాష్ట్రాల పర్మిట్ పొంది రాష్ట్రాల మధ్య తిరుగుతున్నాయి. - తెలంగాణ మోటారు వాహనాల చట్టం నిబంధన 297(ఎ) ప్రకారం ఆర్టీసీ మినహా మరే బస్సులు స్టేజీ క్యారియర్లుగా తిరగొద్దు. ప్రైవేటు సంస్థలు బోర్డులు పెట్టి మరీ టికెట్లు అమ్ముకుంటున్నాయి. -
ప్రైవేట్ ఉద్యోగులూ ...మీ సెలవులు ఇలా
కడప : ఎవరికైనా ఉద్యోగంతో పాటు వ్యక్తిగత జీవితం ముఖ్యమే. వ్యక్తిగత కుటుంబ అవసరాలకు కూడా ఉద్యోగి తగినంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అందుకోసమే ఉద్యోగులకు సెలవుల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఫాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 ప్రకారం ప్రైవేట్ సంస్థల్లో కొన్ని రకాల సెలవులను అమలు చేయాల్సి ఉంటుంది. కనీసం ఏడాదిలో ఏడు రోజులను జాతీయ దినాలు, పర్వదినాలు కింద సెలవులు ఇవ్వాలని చట్టం చెబుతోంది. వాటిలో గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతికి తప్పని సరిగా సెలవులు ఇవ్వాలి. జాతీయ దినాలు జనవరి26, ఆగష్ట్ 15, అక్టోబర్ 2 వారాంతపు సెలవులు: వారంలో ఏడు రోజులకు గాను ఒకటి లేదా రెండు రోజులు సెలవుగా ఇస్తుంటారు. కంపెనీ పాలసీని బట్టి ఒకటా, రెండా అన్నది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ శాతం ఒక్క రోజే సెలవుగా ఉంటుంది. పండుగ దినాలు: వివిధ మతాలకు సంబంధించి ముఖ్యమైన పండగ రోజులోనూ సెలవులు ఉంటాయి. ఎర్న్డ్ లీవ్స్–ప్రివిలేజ్ లీవ్స్: ప్రతి ఉద్యోగికి ఏడాదిలో ఇన్ని రోజులు అంటూ ఈఎల్స్ అంటూ ఉంటాయి. గడిచిన ఏడాదిలో ఎన్ని పని దినాలు ఉద్యోగి పని చేశాడన్న దానిపై ఆధారపడి ఈ సెలవులు ఉంటాయి. ఈఎల్స్‌ను వాడుకోనట్టయితే దాని కింద అదనపు వేతనాన్ని పొందవచ్చు. ఈ సెలవులు వాడుకుంటే ఆ రోజుల్లో వేతనాన్ని ( మూలవేతనం ప్రకారం ) యథావిధిగా పొందవచ్చు. అయితే సెలవు తీసుకోవాలా, లేక పని చేసి వేతనాన్ని పొందాలా అన్నది కంపెనీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. క్యాజువల్ లీవ్: ఏడాదిలో 12 రోజులు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. నెలలో ఇన్ని రోజుల పాటు క్యాజువల్ లీవ్ అని ఇస్తుంటారు. గరిష్టంగా మూడు రోజుల వరకు ఉంటుంది. కొన్ని సంస్థల్లో నెలకు ఒక్కటే క్యాజువల్ లీవ్ ఆప్లయి అవుతుంది. సిక్‌లీవ్ , మెడికల్ లీవ్: కార్యాలయానికి రాలేని అనారోగ్యానికి గురైన పరిస్థితుల్లో వాడుకునేందుకు నెలకు ఒక్క రోజైనా సిక్ లీవ్ ఉంటుంది. ఒక్క నెలలో వాడుకోకపోతే అవసరం వచ్చినప్పుడు ఒకటికి మించి వాడుకోవచ్చు, ఈ లీవ్ కింద ఎన్ని రోజులు సెలవులు ఇవ్వాలన్న విషయాన్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు నిర్దేశిస్తున్నాయి. కాంపెన్సేటరీ ఆఫ్ (సీఆఫ్): సెలవు రోజుల్లో కూడా వచ్చి పని చేసినట్టయితే అందుకుగాను వేతనం చెల్లిస్తారు. లేదా ఒక రోజు సెలవు ఇస్తారు. ఈ సెలవునే ఆఫ్ లీవ్ అంటారు. మెటర్నిటీ లీవ్: మహిళా ఉద్యోగుల సంతాన అవసరం కోసం (గర్బధారణ నుంచి డెలివరీ వరకు లేదా మరికొంత కాలం మెటర్నిటీ లీవ్ ఇస్తారు. కాకపోతే తక్కువ రోజుల పాటు ఉంటుంది. 1988 ఏపీ యాక్ట్ ప్రకారం కనీస డెలివరీకి ముందు ఆరువారాలు డెలివరీ తర్వాత ఆరువారాలు మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి. పేటర్నిటీ లీవ్: పైన చెప్పుకున్న తరహాలో ఉద్యోగి భార్య డెలివరీ అయిన సందర్భంలో వారి అవసరాలు చూసుకునేందుకు వీలుగా కొన్ని రోజుల పాటు ఉద్యోగులకు ఈ సెలవులు ఇస్తుంటారు. క్యారంటైన్ లీవ్: ఇన్ఫెక్షన్ సంబంధిత వ్యాధికి లోనైన ఉద్యోగి వల్ల ఆ వ్యాధి కంపెనీలో ఇతర ఉద్యోగులకు కూడా వచ్చే ప్రమాదం ఉన్న పరిస్థితుల్లో సదరు ఉద్యోగికి ఈ సెలవు ఇస్తారు. స్టడీ లీవ్: ఉద్యోగి ఉన్నత చదువులు , వృత్తిపరమైన నాలెడ్జ్ పెంచుకునేందుకు గాను ఈ సెలవు ఇస్తారు. ఈ సెలవులో వేతనం ఉండదు. అంటే ఉద్యోగం విడిచి పెట్టకుండా కొంతకాలం పాటు సెలవు తీసుకొని చదవుకోవచ్చు. ఇవే కాకుండా వివిధ రంగాలు కంపెనీలను బట్టి చైల్డ్‌కేర్ లీవ్, హాస్పిటల్ లీవ్, స్పెషల్ డిజెబిలిటీ లీవ్, లాస్‌ఆఫ్ పే (వేతనం లేకుండా తీసుకునే సెలవు) ఇలా భిన్న రకాలు సెలవులు కూడా ఉన్నాయి. -
మరిన్ని ప్రైవేటు సంస్థలకు భూములు
సీఆర్డీఏ కసరత్తు సాక్షి, అమరావతి: రాజధానిలో ఇప్పటికే ఐదు ప్రైవేటు సంస్థలకు కారుచౌకగా వందలాది ఎకరాలు కట్టబెట్టిన సర్కారు మరికొన్ని సంస్థలకు అదేదారిలో భూములిచ్చేందుకు సిద్ధమవుతోంది. భూములు తీసుకున్న రైతులకు ఇంతవరకూ ప్లాట్లు ఎక్కడున్నాయో చూపించలేదు కానీ ప్రైవేటు సంస్థలకు మాత్రం అడిగిందే తడవుగా భూములిస్తామని చెబుతోంది. అవసరమైతే పెద్ద ప్రైవేటు సంస్థలకు ఉచితంగానైనా భూములిచ్చేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీంతో రాజధానిలో తమకు భూములు కేటాయించాలని అనేక సంస్థలు సీఆర్డీఏకు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిన్నింటికీ చాలావరకూ భూములిచ్చేందుకు ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకారం తెలిపింది. తొలిదశలో ప్రైవేటు విద్యా సంస్థలకు భూములు ధారాదత్తం చేయగా.. మలిదశలో మరికొన్ని విద్యా సంస్థలతోపాటు హోటళ్లు, ఆస్పత్రులు, రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములివ్వాలని చూస్తోంది. అమిటీ యూనివర్సిటీకి భూములిచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ తర్వాత గీతం యూనివర్సిటీ, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, ఏపీ ఎన్ఆర్టీ, ఎర్నెస్ట్ అండ్ ఎంగ్, ఎక్స్ట్రీమ్ ప్రాజెక్ట్స్, ఇండ్ రాయల్ హోటల్స్ వంటి పలు సంస్థలు రేసులో ఉన్నాయి. రానున్న రెండు నెలల్లో పదికి పైగా సంస్థలకు భూములిచ్చేందుకు సీఆర్డీఏ సమాయత్తమవుతోంది. -
నిలువెత్తు అన్యాయం
– రైతుల పొలాల్లో ఇష్టారాజ్యంగా విద్యుత్ టవర్ల నిర్మాణం – బ్రిటిష్ కాలం నాటి చట్టాల పేరుతో స్థల సేకరణ – విద్యుత్ సంస్థల తీరుతో భారీగా నష్టపోతున్న రైతులు – ఇతర జిల్లాల్లో పరిహారం.. ‘అనంత’లో మాత్రం అన్యాయం (సాక్షి ప్రతినిధి, అనంతపురం) విద్యుత్ టవర్ల ఏర్పాటులో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. బ్రిటీష్‌కాలం నాటి చట్టాలను సాకుగా చూపి పవర్‌గ్రిడ్ సంస్థలు రైతుల నోట్లో మట్టికొడుతున్నాయి. రైతుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఇష్టానుసారంగా టవర్ల నిర్మాణానికి ఉపక్రమిస్తున్నాయి. ఒక్కో టవర్ నిర్మాణంతో ప్రతి రైతు రూ.3.50 లక్షల నుంచి రూ.4.50 లక్షల వరకు నష్టపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 నాటికే దాదాపు తొమ్మిది లక్షల కిలోమీటర్ల్ల దూరం ఉండే విద్యుత్తీగల కోసం స్తంభాలు, టవర్లు ఏర్పాటు చేశారు. ఇవికాక దేశ వ్యాప్తంగా కేంద్ర పవర్‌గ్రిడ్ సంస్థ ఏటా వేలాది టవర్లను నిర్మిస్తోంది. ఎక్కడా రైతులకు సరైన పరిహారం ఇవ్వడం లేదు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో 620, 400 కేవీ విద్యుత్ టవర్లను పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తోంది. వీటి కారణంగా ఎంతోమంది రైతులు భూములు కోల్పోతున్నారు. జిల్లాలో మూడేళ్లుగా టవర్ల నిర్మాణం సాగుతున్నా.. ఎవరికీ పరిహారం ఇవ్వకపోవడం గమనార్హం. నోటీసుల్లేవు.. అనుమతులూ లేవు కేంద్ర ఎలక్ట్రిసిటీ యాక్టు–2003 రూల్ 31(ఏ) కింద ట్రాన్స్మిషన్ కంపెనీ టవర్ నిర్మించాల్సి వస్తే మొదట కలెక్టరును కలవాలి. మార్కెట్‌రేటు, రైతు సాగు చేసిన పంట, నష్టం వాటిల్లే వివరాలను పరిగణనలోకి తీసుకుని కలెక్టర్ పరిహారం మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఆ మేరకు రైతుకు చెల్లించి టవర్ నిర్మాణానికి ఉపక్రమించాలి. కానీ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఈ నిబంధనలను తుంగలో తొక్కుతూ పొలాల్లో ఇష్టారాజ్యంగా టవర్ల నిర్మాణం చేపడుతోంది. జిల్లాలో 2003 నుంచి భూములకు నష్టపరిహారం పొందనివారు, తక్కువ పరిహారంతో నష్టపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్‌తో పాటు నేషనల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తాడిపత్రి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, పామిడి, వజ్రకరూర్, ఉరవకొండ మండలాల్లో 620, 420 కేవీ టవర్ల నిర్మాణం చేపడుతున్నాయి. దీంతో రైతులు 8, 200 ఎకరాలు నష్టపోయే ప్రమాదముంది. పంట నష్టం జరిగితే రూ.25 వేల చొప్పున పరిహారం ఇచ్చి.. చేతులు దులిపేసుకోవడం మినహా చట్టం ప్రకారం రైతులకు దక్కాల్సిన పరిహారాన్ని అందజేయడం లేదు. నిబంధనల ప్రకారం పరిహారం ఇలా.. ప్రధాన రహదారి పక్కనున్న పొలాలైతే గజానికి వెయ్యి , రోడ్డుకు దూరంగా ఉంటే గజానికి రూ.100 చొప్పున పరిహారం చెల్లించాలని పాత నిబంధనలున్నాయి. అలాగే ఒక టవర్ నుంచి మరో టవర్ వరకూ విద్యుత్ తీగలు వెళ్లే స్థలానికి కూడా మీటరుకు రూ.65 చొప్పున చెల్లించాలని ఉంది. అయితే.. ఇది చాలా తక్కువని 2009లో తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో హైవేకు అర కిలోమీటరు దూరంలో ఉంటే ఒక్కో టవర్ ఏర్పాటుకు రూ.3.50 లక్షల (350 చదరపు అడుగులు) నుంచి రూ.4.50 లక్షల (350 చదరపు అడుగుల కంటే ఎక్కువ) వరకు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే ఇతర పొలాలు, స్థలాల్లో టవర్ ఏర్పాటుకు రూ.2.45 లక్షల నుంచి రూ.3.15 లక్షల వరకు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు పరిహారాన్ని కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఇస్తున్నారు. తెలంగాణలోని వరంగల్, నల్గొండ జిల్లాల్లోనూ ఇచ్చారు. ఒక్కో టవర్ నిర్మాణానికి 20 టన్నుల ఇనుము వినియోగిస్తారు. నిర్మాణప్రాంతంలో పండ్లతోటలు, ఇతర పంటలు ఉంటే టవర్ సామగ్రి తీసుకెళ్లే సమయంలో వాటికి నష్టం వాటిల్లుతుంది. ఈ పరిహారాన్ని అదనంగా చెల్లించాలి. అలాగే టవర్ చుట్టూ వెయ్యి చదరపు అడుగులు పంట సాగుకు అనుకూలంగా ఉండదు. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. టవర్ నిర్మాణం తర్వాత చుట్టూ కిలోమీటర్ మేర పొలాల విలువ గణనీయంగా తగ్గుతుంది. లైన్సౌండ్, ఎలక్ట్రికల్ షాక్‌తో పాటు ప్రమాదాలకు భయపడి గోదాములు, పరిశ్రమల స్థాపనకు ఎవ్వరూ ముందుకు రారు. దీంతో పరిహారం పంపిణీలో రైతులకు కచ్చితంగా మేలు జరిగేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని 2003 యాక్టులో ఉంది. బ్రిటీష్ చట్టం చాటున అన్యాయం టవర్ల నిర్మాణం కోసం స్థలాల స్వాధీనానికి బ్రిటీష్ పాలకులు 1885లో తెచ్చిన ‘భారతీయ టెలిగ్రాఫ్ చట్టం’ ప్రకారం తమకు అధికారాలున్నాయని విద్యుత్ సంస్థలు ప్రకటనలు జారీ చేస్తున్నాయి. పాత నిబంధనల ప్రకారమే టవర్ల నిర్మాణానికి ఉపక్రమిస్తున్నాయి. 1885 టెలిగ్రాఫ్ చట్టం సెక్షన్–35లో ఎలక్ట్రిసిటీ యాక్టు–164 ప్రకారం పోల్స్ నిర్మించాలి. ఇవి టవర్లు కావు. రైల్వేలైను పోల్స్ తరహాలో ఉంటాయి. వీటికి గట్ల మధ్యలో ఒకే పోల్ ఉంటుంది. పోల్ పైభాగంలో 10 అడుగుల వెడల్పుతో కమ్మీలు అమర్చి తీగలను లాగుతారు. కానీ ఈ తరహా విధానాన్ని పాటించడం లేదు. అయినా పరిహారం విషయంలో మాత్రం ఈ చట్టాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. నిజానికి రైతు సంఘాలు కూడా టవర్ల స్థానంలో టెలిగ్రాఫ్ పోల్స్ నిర్మించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. అయినా ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదు. పరిహారంపై ధర్నాకు సిద్ధం - తరిమెల శరత్‌చంద్రారెడ్డి, రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు టవర్ల నిర్మాణంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. పరిహారం కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నాం. కొంతమేర పరిహారం దక్కింది. అయితే నేషనల్ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టే వాటికి పరిహారం ఇవ్వడం లేదు. దీనిపై రైతులు, రైతు సంఘాలతో చర్చించి ధర్నా చేపడతాం. -
ఉద్యోగం పోయినా... నిధి ఉండాలి!
♦ వివిధ రంగాల్లో తగ్గుతున్న ఉద్యోగాలు ♦ ఉన్నట్టుండి తొలగిస్తున్న ప్రైవేటు సంస్థలు ♦ తగినంత నిధి లేకుంటే ఇబ్బందుల పాలు ♦ బీమా సహా అవసర రక్షణలు తప్పనిసరి స్నాప్‌డీల్ 500 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇస్తున్నట్టు చెప్పేసింది. అంటే వారికి ఉద్వాసన చెప్పినట్టే!! భారీగా ఉద్యోగాలను కల్పిస్తున్న బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో ఆటోమేషన్ కారణంగా అవకాశాలు తగ్గిపోతున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిసెంబర్ క్వార్టర్లో 4,500 మంది ఉద్యోగులను తగ్గించుకుంది. టెలికం కంపెనీలు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అసలు ఏ రంగంలో పరిస్థితులు ఎప్పుడెలా మారతాయో తెలియని పరిస్థితి. మరి ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే? అప్పటి వరకు జీతంతో సాఫీగా సాగిపోతున్న ప్రయాణానికి స్పీడ్ బ్రేకర్లు ఎదురైతే...? ఆదుకునేందుకు ఓ నిధి తప్పనిసరి. ఉద్యోగం ఊడినా ఈ నిధితో మళ్లీ ఉద్యోగం వచ్చే వరకూ కుటుంబ అవసరాలు తీరాలి. అందుకే ముందుచూపుతో జాబ్ లాస్ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇటువంటి ఆకస్మిక పరిణామాలను సులభంగా తట్టుకోవచ్చు. మన దేశంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగం కోల్పోతే... దాదాపు ఎలాంటి రక్షణా ఉండదనే చెప్పాలి. కంపెనీ నుంచి వెళ్లిపోతే చెల్లించే సెవరెన్స్ పే కొన్ని సంస్థల్లోనే ఉంది. మేనేజ్మెంట్ నిపుణులకు ఉద్యోగం కోల్పోతే మూడు నుంచి ఆరు నెలలు, కొన్ని కంపెనీల్లో 12 నెలల వేతనాన్ని సెవరెన్స్ పే కింద చెల్లిస్తుంటారు. అయితే ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనలు లేవు. సంస్థను బట్టి మారుతుంటుంది. అందుకే ఇలాంటి వాటిని నమ్ముకోకుండా ఉద్యోగం లేని పరిస్థితికి సన్నద్ధంగా ఉండాలన్నది నిపుణుల సూచన. ఉద్యోగం పోతే పెట్టుబడులు, రుణాల చెల్లింపులు, కుటుంబ అవసరాలకు విఘాతం కలగని విధంగా ప్రణాళిక వేసుకోవాలి. కంటింజెన్సీ ఫండ్ (అత్యవసర నిధి) ప్రతి కుటుంబానికీ అత్యవసర నిధి ఎంతో అవసరం. కనీసం మూడు నుంచి ఆరు నెలల అవసరాలకు, బీమా చెల్లింపులు, రుణాల చెల్లింపులకు సరిపడా ఈ నిధిని సమకూర్చుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఒత్తిళ్లతో కూడిన రంగంలో పనిచేస్తుంటే మాత్రం అత్యవసర నిధి ఏడాది అవసరాలను తీర్చేంత ఉండాలి. ఈ నిధిని షార్ట్ టర్మ్ డెట్‌ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉంచితే అవసరమైన వెంటనే వినియోగించుకోవటానికి అనువుగా ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి నిధి కంటింజెన్సీ ఫండ్ ఎంతన్నది చేస్తున్న ఉద్యోగం సీనియారిటీ, రంగాన్ని బట్టే ఉంటుంది. ఎందుకంటే జూనియర్ లెవల్ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఆకస్మికంగా దాన్ని కోల్పోతే నెలల వ్యవధిలో తిరిగి వేరొక ఉద్యోగాన్ని సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది. అదే మధ్య స్థాయి ఉద్యోగి అయితే మూడు నుంచి నాలుగు నెలలు పట్టొచ్చు. ఇక వైస్ ప్రెసిడెంట్ లేదా మేనేజింగ్ డైరెక్టర్ వంటి సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగం అయితే తిరిగి తనకు సరిపడే ఉద్యోగాన్ని సొంతం చేసుకునేందుకు ఏడాది పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. విమానయాన రంగంలోని వారైతే ఇంకా ఎక్కువే పట్టొచ్చు. అదే ఆరోగ్యరంగం, ఫార్మాలో ఉన్న వారు రోజుల వ్యవధిలోనే కొత్త ఉద్యోగాన్ని సొంతం చేసుకోగలరు. అందుకే తామున్న రంగం, ఉద్యోగ స్థాయిల ఆధారంగా తిరిగి ఉద్యోగం సంపాదించేందుకు గరిష్టంగా పట్టే కాలానికి అవసరాలను తీర్చేలా కంటింజెన్సీ ఫండ్‌ను సమకూర్చుకోవాలి. అత్యవసర నిధి జీవిత బీమా పాలసీ, వైద్య బీమా, ప్రమాద బీమా పాలసీ వార్షిక ప్రీమియాన్ని చెల్లించేదిగా ఉండాలి. సొంత కారు, ఇల్లు ఉంటే వాటి బీమాలను కూడా కవర్ చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఉద్యోగం లేదు కదా అని బీమా రక్షణలు అనవసరం అయిపోవు కదా. ఒకవేళ ఉద్యోగం లేదులే అనుకుని వైద్య బీమా ప్రీమియం చెల్లించడం మానేశారనుకోండి. ఉన్నట్టుండి కుటుంబంలో ఎవరైనా ఆస్పత్రి పాలైతే ఆ భారాన్ని భరించడం తలకుమించినది అవుతుంది. అందుకే ఉద్యోగం లేకున్నా బీమా రక్షణ కొనసాగాలి. అది కూడా సరిపడినంత ఉండాలి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన రిస్క్‌తో కూడిన పెట్టుబడులను ఉద్యోగం లేని సమయంలో సమీక్షించుకోవడం సరైనదే. ఉదాహరణకు యులిప్ పాలసీ ఉందనుకోండి. దాన్ని విక్రయించేసి నగదు చేసుకోవడం సరైనదేనని ఆర్థిక నిపుణుల సలహా. ఒకవేళ కొనసాగించదలచుకుంటే పెట్టుబడుల తీరును మార్చుకోవాలి. ఉద్యోగం లేదు గనుక రిస్క్ తగ్గించుకునేందుకు ఈక్విటీకి కేటాయింపులు తగ్గించి, డెట్‌కు కేటాయింపులు పెంచుకోవాలి. తిరిగి ఉద్యోగం సంపాదించిన తర్వాత మళ్లీ ఈక్విటీ కేటాయింపులు పెంచుకోవచ్చు. రుణాల్ని సమీక్షించుకోవాలి ఉద్యోగం లేకపోయినా తీసుకున్న రుణాలకు తిరిగి చెల్లింపులు ఆగకుండా కొనసాగించాలి. ఉద్యోగం లేని సమయంలో రుణం మొత్తాన్ని తీర్చేసే ఆలోచన సరైనది కాదు. ఒకవేళ ఈఎంఐ చెల్లింపులు కష్టంగా ఉంటే... రుణ కాల వ్యవధిని పెంచుకోవడం ద్వారా నెలవారీ వాయిదాను కొద్ది మేర తగ్గించుకోవచ్చు. ఇక క్రెడిట్ కార్డు రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ అధికంగా ఉండడమే కాదు, సకాలంలో చెల్లింపులు చేయకుంటే వడ్డనలు భారీగా ఉంటాయి. చెల్లింపులు కష్టమైతే తిరిగి ఉద్యోగం వచ్చే వరకు మారటోరియం విధించాలని రుణ దాతలను కోరవచ్చు. అయితే, ఇది రుణదాత ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. కొత్తగా వేరొక రుణం తీసుకుని ప్రస్తుత రుణం తీర్చివేసే ఆలోచనలు కూడా సమంజసం కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఖర్చుల తీరు మారాలి ఉద్యోగం లేకపోయినా విచక్షణా రహిత ఖర్చులు శ్రేయస్కరం కాదు. ఈఎంఐ, బీమా ప్రీమియం, ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు తప్పనిసరి అవసరాలు. ఇక వినోదం, రెస్టారెంట్లలో విందులు, పర్యటనలు వంటి అనవసర వ్యయాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగం పోతే బీమా...? ఉద్యోగం లేని సమయంలో రక్షణ కల్పించేందుకు వీలుగా పాలసీలున్నాయి. ఉద్యోగం ఊడితే మూడు నెలల పాటు ఖర్చులకు పరిహారం చెల్లిస్తాయి. మూడు నెలల వరకు వేతనం, నెలవారీ ఈఎంఐలకు చెల్లింపులు చేస్తాయి. కానీ వీటికి కొన్ని షరతులు కూడా విధిస్తాయి. పనితీరు బాగాలేక ఉద్యోగం కోల్పోతే పరిహారం ఇవ్వవు. మోసపూరిత ఆరోపణలపై ఉద్యోగం పోయినా పరిహారం చెల్లించవు. పైగా ఉద్యోగం పోయిన దగ్గర్నుంచి 90 రోజుల పాటు కొత్తగా ఉద్యోగం చేపట్టకూడదు. అది కూడా పాలసీ కాల వ్యవధిలో ఒక్కసారి ఉద్యోగం కోల్పోతేనే రక్షణ. రెండోసారి ఉద్యోగం పోతే బీమా కవరేజీ ఉండదు. పైగా ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది కనుక ఇది అంత ఉపయోగకరం కాదన్నది ఆర్థిక సలహాదారుల సూచన. –సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
ఇళ్లు కట్టకుండానే ఎన్‌ఓసీలా?: రేవంత్‌రెడ్డి
జేవీ ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్యలు తీసుకోవాలని సీఎంకు లేఖ సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు సంస్థలతో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చేసుకున్న జాయింట్ వెంచర్(జేవీ) ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఒప్పందంలో భాగంగా పేదలకు ఇళ్లు కట్టకుండా, అలాగే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సొమ్మును జమచేయకుండానే ఎన్ఓసీలు ఇవ్వడం ద్వారా ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆయన పేర్కొన్నారు. జేవీ ప్రాజెక్టుల్లోని అవినీతిపై విజిలెన్సు ఇచ్చిన నివేదికను బయటపెట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదివారం సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగలేఖలో డిమాండ్ చేశారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు సంస్థలు గృహనిర్మాణం చేయాలని, వాటిలో పేదలకు 10 శాతం ఎల్ఐజీ ఇళ్లు, వాణిజ్య సముదాయంలో 5 శాతం ప్రభుత్వానికి చెల్లించాలని ఒప్పందం జరిగిందని వివరించారు. దీని ప్రకారం దాదాపు రూ.3 వేలకోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందని, 40 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని పేదలకు ఇవ్వాల్సి ఉందని అన్నారు. వీటిని ఎగ్గొట్టడానికి ప్రైవేటు సంస్థలతో మంత్రులు ఈటల, ఇంద్రకరణ్‌రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. -
చైనా, జపాన్ కంపెనీలకూ చోటు
- రాజధానిలో సింగపూర్ కంపెనీలకు ఇవి అదనం.. -12న సీఆర్సీసీ బృందంతో కేంద్ర మంత్రులు అశోక్, సుజన భేటీ సాక్షి, హైదరాబాద్ : నూతన రాజధాని అమరావతిలో ఇప్పటికే సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు పాగా వేయగా తాజాగా చైనా, జపాన్‌కు చెందిన కంపెనీలు రంగ ప్రవేశం చేయనున్నాయి. చైనా రైల్వే కన్స్ట్రక్షన్ కార్పొరేషన్(సీఆర్సీసీ) అమరావతిలో ప్రవేశానికి ఆసక్తి చూపింది. ఇటీవల సీఎం చైనా పర్యటన సందర్భంగా రాజధానిలో అవసరమైన భూములతో పాటు పలు ఆర్థికపరమైన రాయితీలు ఇస్తామని, ప్రాజెక్టులను చేపట్టాలని కోరారు. ఇందులో భాగంగా సీఆర్సీసీ ఉన్నతస్థాయి బృందం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల కోసం ఈ నెల 12వ తేదీన ఢిల్లీ వస్తోంది.ఈ చర్చల్లో కేంద్ర మంత్రులు అశోకగజపతి రాజు, సుజనా చౌదరిలను పాల్గొనాలంటూ సీఎంవో ప్రత్యేక నోట్ జారీ చేసింది. వారితో పాటు మున్సిపల్, పంచాయతీరాజ్, మౌలిక వసతుల కల్పన, జలవనరుల శాఖల ఉన్నతాధికారులు, సీఆర్డీఏ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వ రైల్వే సలహాదారు ఈ చర్చల్లో పాల్గొననున్నారు. సీసీడీఎంసీలో భాగస్వామిగా జపాన్ సంస్థ : కేపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ (సీసీడీఎంసీ)లో భాగస్వామిగా జపాన్‌కు చెందిన జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ (జెబీఐసీ) చేరేందుకు ఉత్సాహం చూపుతోంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏప్రిల్ 29న జపాన్ మంత్రితో సీఎం చంద్రబాబు మధ్య చర్చలు సాగాయి. జెబీఐసీ అమరావతిలో చేపట్టనున్న బిజినెస్ ప్రణాళికను సమర్పించిన తరువాత ఆ ప్రణాళికను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. -
ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ..టోల్ ఫ్రీ
కోటగుమ్మం (రాజమండ్రి) : మనమేదో పని మీద వెళ్తుంటాం. రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటారు. వెంటనే మొబైల్ నుంచి 108కి ఫోన్ చేసి, సమాచారం అందిస్తాం. ఒక్క ఫోన్‌కాల్‌తో రెండు నిండు ప్రాణాలు కాపాడుతాం. పైగా ఫోన్ చేయడం వల్ల ఒక్క పైసా ఖర్చుండదు. ఇలాంటి టోల్ ఫ్రీ నంబర్లు అన్ని రంగాలకూ విస్తరించాయి. కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా అందిస్తున్నాయి. ఈ టోల్‌ఫ్రీ నంబర్ల గురించి తెలుసుకుందాం. 155333 (ఏపీఈపీడీసీఎల్) : విద్యుత్ సరఫరాలో అంతరాయం, లో ఓల్టేజి, సిబ్బంది పనితీరు, ఇతర విద్యుత్ సమస్యలను ఈ నంబర్‌కు చెప్పవచ్చు. 1910 (బ్లడ్ బ్యాంక్స్) : అందుబాటులో ఉన్న గ్రూపు రక్తం, ఇతర వివరాలు ఈ నంబరులో తెలుసుకోవచ్చు. 1950 (ఎన్నికల సంఘం) : ఓటరు నమోదు, తొలగింపులు, పేరుమార్పిడి, ఓటుమార్పిడి, అవసరమైన సర్టిఫికెట్లు వంటి వివరాలు తెలుసుకోవచ్చు. 1100 (మీ-సేవ) : ఆయా ప్రాంతాల్లో మీ-సేవ పథకం అమలు తీరు, సమస్యలపై ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. 1800-425-1110 (వ్యవసాయ శాఖ) : ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం మద్దతు ధర, రైతుల సమస్యలు, మిల్లర్ల దోపిడీ, అధికారులు సహకరించకపోవడం వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చు. 1800-200-4599 (ఏపీఎస్ ఆర్టీసీ) : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సేవలు, సంస్థ బస్సుల్లో అసౌకర్యాలు, ప్రయాణికులతో సిబ్బంది ప్రవర్తనపై ఫిర్యాదు చేయవచ్చు. 101 (అగ్ని మాపక శాఖ) : అగ్ని ప్రమాదం సంభవిస్తే, ప్రకృతి వైపరీత్యాల్లో ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే, సిబ్బంది వచ్చి నియంత్రణ, సహాయక చర్యలు చేపడతారు. విపత్తుల నిర్వహణలో సేవలు అందిస్తారు. 108 (ఎమర్జెన్సీ అంబులెన్స్) : ప్రమాదం జరిగినా, ప్రాణాపాయ పరిస్థితుల్లో అస్వస్థతకు గురైనా ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. క్షణాల వ్యవధిలో అంబులెన్స్ వచ్చి, వైద్య సిబ్బంది .చికిత్స అందిస్తారు. ఇంటివద్ద ఉన్న రోగులనూ అతస్యవసరంగా ఆస్పత్రికి చేరవేస్తారు. 1997 (హెచ్ఐవీ-కంట్రోల్‌రూమ్) : హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధులపై, బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవచ్చు. 100 (పోలీసు శాఖ) : పోలీసుల తక్షణసాయం పొందవచ్చు. గృహహింస, వరకట్న వేధింపులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. 131 (రైల్వే శాఖ) : రైల్వే రిజర్వేషన్, రైళ్ల రాకపోకల వివరాలు తెలుసుకోవచ్చు. స్థానిక రైల్వేస్టేషన్ సమాచారం తెలుస్తోంది. 1090 (క్రైం స్పెషల్ బ్రాంచ్) : చోరీలు, ఇతర నేర సంబంధ సమస్యలను తెలియజేయవచ్చు. ఇది జిల్లా కేంద్రంలో క్రైం స్టాఫర్‌కు చేరుతుంది. అసాంఘిక కార్యకలాపాలు, వేధింపులు, జూదం, వ్యభిచారం వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చు. 155361 (అవినీతి నిరోధక శాఖ) : ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్టు తెలిస్తే సమాచారం ఇవ్వవచ్చు. 155321 (ఉపాధి హామీ పథకం) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరింత సమర్ధంగా అమలు చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ దీనిని వినియోగిస్తోంది. పథకంలో సమస్యలు, లోపాలు, అవకతవకలపై ఫిర్యాదు చేయవచ్చు. 198 (బీఎస్ఎన్ఎల్) : సంస్థకు చెందిన టెలిఫోన్ సమస్యలపై వినియోగదారులు ఈ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు. 1098 (చైల్డ్ హెల్ప్‌లైన్) : ఎలాంటి ఆదరణ, రక్షణ లేని బాలలను ఆదుకునేందుకు, బాలలు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసినా, బాల కార్మికులు తారసపడినా ఈ నంబరుకు తెలియజేయవచ్చు. -
సర్కారు ఆస్పత్రులు ప్రైవేటుపరం
-
సర్కారు ఆస్పత్రులు ప్రైవేటుపరం
- సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కారు - పైలట్ ప్రాజెక్టుగా ‘ఈ-వైద్య’ కంపెనీకి 4 ఆస్పత్రుల అప్పగింత - ప్రైవేటు సంస్థకే నేరుగా నిధులు చెల్లించేలా ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: సర్కారు వైద్యం ఇక ప్రైవేట్‌పరం కానుంది. నిర్వహణ బాధ్యతలనూ ప్రైవేట్ సంస్థలే చేపట్టనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామా లు, పట్టణాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రైవేటు సంస్థల చేతికి అప్పగించాలని చూస్తోంది. ఇందులో భాగంగా నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఈ-వైద్య అనే సంస్థకి పైలట్ ప్రాజెక్టు కింద నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రాథమిక ఆసుపత్రులను ఈ సంస్థ నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో వైద్యసేవల నిర్వహణ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవాలని చూస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు 104 వ్యవస్థను కూడా ప్రైవేటు సంస్థలకే అప్పగించేందుకు యోచిస్తోంది. వైద్యులు, సిబ్బంది, సేవలన్నీ ‘ప్రైవేట్’కే... గ్రామీణ ప్రాంతాల్లో 685 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణాల్లో దాదాపు 177 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. పీహెచ్‌సీలకు రాష్ట్ర ప్రభు త్వం, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జాతీ య పట్టణ ఆరోగ్య మిషన్(ఎన్యూహెచ్ఎం) నుంచి నిధులు వస్తున్నాయి. పీహెచ్‌సీకి నెలకు సుమారు రూ.2 లక్షలను ప్రభుత్వం కేటాయిస్తోంది. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కో చోట ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు ఏఎన్ఎంలు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, సిబ్బంది ఉంటారు. పీహెచ్‌సీల్లో డాక్టర్‌సహా ఇతర సిబ్బంది ఉండాలి. కానీ, వీటిల్లో వైద్య సేవలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందడంలేదన్న విమర్శలు ఉన్నాయి. చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే వాటిల్లోని మౌలిక సదుపాయాలను కూడా ఆ సంస్థలకే కట్టబెడుతుంది. ఆసుపత్రులకు ఇస్తున్న నిధులను నేరుగా ఆ సంస్థలకే విడుదల చేస్తుంది. ఆ నిధులతో సంస్థలు ఆసుపత్రులను తమకు అనుగుణంగా తీర్చిదిద్దుతాయి. వైద్యులు, నర్సులు ఇతర సిబ్బందిని నియమించుకుంటాయి. వైద్య పరీక్షలు, ఔషధాల పంపిణీ కూడా ఆ సంస్థే చూసుకుంటుంది. ఫీజు ఉంటుందా.. ఉండదా? ప్రైవేటు చేతికి ప్రాథమిక ఆసుపత్రుల నిర్వహణ బాధ్యత అప్పగిస్తున్నందున రోగుల నుంచి ఫీజు వసూలు చేస్తారా? లేదా? అన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రభుత్వమే ప్రైవేటు సంస్థలకు నిధులిచ్చి నిర్వహణ బాధ్యత అప్పగిస్తున్నందున ఫీజులు వసూలు చేయబోరని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోవ నీ, సకాలంలో ఇవ్వకపోతే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. -
రాజధానిలో పరిశ్రమల పంట
అనుమతి కోసం వందలకొద్దీ దరఖాస్తులు గుంటూరులో 782 మధ్య తరహా కంపెనీల ఏర్పాటు విజయవాడ నగరంలో ఆటో మొబైల్, కార్ల కంపెనీలు సీఆర్డీఏ పరిధిలో స్టార్ హోటళ్లు విజయవాడ : నూతన రాజధాని అమరావతి ప్రాంతానికి ప్రైవేటు కంపెనీలు క్యూ కడుతున్నాయి. రాజధాని ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందించడంతో పాటు మాస్టర్ ప్లాన్‌లో ప్రత్యేకంగా జోన్లు ఏర్పాటు చేసి వేల ఎకరాల స్థలాన్ని కేటాయించింది. దీంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ప్రముఖ కంపెనీలు రాజధాని ప్రాంతంలో తమ కార్యకలాపాలు మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే సుమారు 30కి పైగా ప్రధాన కంపెనీలు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి దరఖాస్తు చేసుకోగా, మధ్యతరహా కంపెనీలు 782 దరఖాస్తు చేసుకున్నాయి. ఇక రాజధాని ప్రాంతంలో నూతనంగా విద్యా సంస్థలు, హోటళ్ల ఏర్పాటుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణాలు రాజధాని ప్రాంతంలో మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణాలు సాగించే అవకాశాలు ఉన్నాయి. తొలుత ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ సచివాలయం, రాజ్‌భవన్, ఇతర ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు మూడేళ్ల కాలవ్యవధిలో నిర్మించే అవకాశం ఉంది. దీనికనుగుణంగా రాజధాని ప్రాంతంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగనున్నాయి. ముఖ్యంగా గత నెలరోజులుగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొంత కదలిక వచ్చింది. రాజధాని ప్రాంతంలో భారీ ఇన్ఫ్రా సంస్థలు, అపార్టుమెంట్లు, మల్టీస్టోరేజ్ భవనాల నిర్మాణానికి సీఆర్డీఏ వద్ద అనుమతులు తీసుకోనున్నాయి. ఇప్పటివరకు 16కు పైగా ప్రధాన కంపెనీలు శంకుస్థాపనలు పూర్తి చేసుకున్నాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. గడిచిన ఆరునెలల కాలంలో గుంటూరు జిల్లా పరిశ్రమల కేంద్రంలో అనుమతులు తీసుకుని 782 చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇవి రూ.లక్ష నుంచి రూ.20 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన సంస్థలు. వీటికి ఐదు రెట్లు రుణ సౌకర్యం ప్రభుత్వం అందించింది. ఇప్పటివరకు రూ.188.78 కోట్లు విలువైన మధ్యతరహా పరిశ్రమలు రాగా వీటి ద్వారా 10,381 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా బ్రిక్స్, పౌల్ట్రీ, టైలరింగ్, బిస్కెట్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఏర్పాటయ్యాయి. ఇవి కాకుండా మాస్టర్ ప్లాన్‌లో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ జోన్లో పరిశ్రమలు నిర్మించడానికి పదుల సంఖ్యలో మల్టీ నేషనల్ కంపెనీలు ఇప్పటికే ప్రభుత్వంతో ఎంవోఈలు కుదుర్చుకోగా, రెండు వారాల క్రితం 12 కంపెనీలు రూ.1800 కోట్ల విలువైన ఏంవోఈలు కుదుర్చుకున్నాయి. ఆర్థిక రాజధానిగా విజయవాడ కేవలం రాజధాని నగరంగానే కాక ఆర్థిక రాజధానిగా కూడా విజయవాడ వెలుగొందుతోంది. ముఖ్యంగా కార్ల కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు విజయవాడ నగరం సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. భవానీపురంలో 30కి పైగా ప్రధాన ఫార్మా కంపెనీల ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. గన్నవరం, గొల్లపూడి ప్రాంతాల్లో టాటా, నిస్సాన్, టయోటా, బెంజ్ షోరూమ్‌లు పెద్ద సంఖ్యలో ఏర్పాటయ్యాయి. వీటితోపాటు, కార్లు, ద్విచక్ర వాహనాల విడి భాగాల తయారీ యూనిట్లు కూడా పదికి పైగా విజయవాడలో సిద్ధం అయ్యాయి. విజయవాడ నగరం ప్రధానంగా వాణిజ్యంపైనే ఆధారపడి ఉంది. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ నుంచి తరలి వచ్చే కంపెనీల ద్వారా ఇక్కడ ఆదాయం 30శాతంకు పైగా పెరిగింది. తాజ్ గ్రూప్, ఐటీసీ, గ్రూపులు రాజధాని ప్రాంతంలో 7 స్టార్ హోటళ్ల నిర్మాణానికి స్థల అన్వేషణ పూర్తి చేశాయి. ఇవి కాకుండా అమరావతి ప్రాంతంలో ఫైవ్‌స్టార్ కేటగిరీ హోటళ్లు ఎనిమిది ఏర్పాటు చేయడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయి. రాష్ట్ర విభజనతో జిల్లా వాణిజ్య పన్నులశాఖ ఆదాయం రెట్టింపు అయింది. -
రైల్వేలో ప్రైవేటుకు చోటివ్వాలి
ప్రభుత్వానికి వివేక్ దేబ్రాయ్ కమిటీ తుది నివేదిక ♦ స్వతంత్ర నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి ♦ ఆర్థికాంశాలను ఈ అథారిటీయే పర్యవేక్షించాలి ♦ స్కూళ్లు, ఆసుపత్రుల నిర్వహణను వదిలించుకోవాలి ♦ ఈ సిఫారసులు అమలు చేస్తే రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ అక్కర్లేదు న్యూఢిల్లీ: రైల్వే రంగంలోకి ప్రైవేటు సంస్థలకు ప్రవేశం కల్పించాలని ఉన్నతస్థాయి కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రైల్వేలో ఒక స్వతంత్ర నియంత్రణ వ్యవస్థ(రైల్వే రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-రాయ్) ఏర్పాటు చేయాలని సూచించింది. స్కూళ్లు, ఆసుపత్రుల నిర్వహణ నుంచి రైల్వే విభాగం తప్పుకోవాలని పేర్కొంది. నష్టాల నివారణకు అధికారాల వికేంద్రీకరణే మార్గమని స్పష్టంచేసింది. వివేక్ దేబ్రాయ్ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం రైల్వే బోర్డుకు ఈ మేరకు 300 పేజీలతో కూడిన తుది నివేదికను సమర్పించింది. గత సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. మార్చిలో మధ్యంతర నివేదిక సమర్పించిన ఈ కమిటీ తాజాగా తుది నివేదికను అందజేసింది. తమ సిఫారసులను అమలు చేస్తే ఐదేళ్లలో రైల్వేకు ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం కూడా ఉండదని ఆ నివేదికలో పేర్కొన్నారు. ‘‘వాటాలు ఎక్కడికక్కడ విక్రయించి రైల్వే శాఖను ప్రైవేటీకరించాలని మేం చెప్పడం లేదు. ఒక స్వతంత్ర నియంత్రణ వ్యవస్థ ద్వారా ప్రైవేటు సంస్థలకు కూడా రైల్వేలోకి ప్రవేశం కల్పించాలని సూచిస్తున్నాం. రోడ్లు, పౌర విమానయానం, టెలికం రంగాలతో పోల్చుకుంటే రైల్వేలో ప్రైవేటు భాగస్వామ్యం తక్కువగా ఉంది. విధానపర నిర్ణయాలు, నిర్వహణ, నియంత్రణ తదితరాలన్నీ రైల్వే పరిధిలో ఉండడమే ఇందుకు ప్రధాన కారణం’’ అని కమిటీ పేర్కొంది. ఇతర సంస్థల భాగస్వామ్యం కూడా పెంచేందుకు ట్రాక్‌ల నిర్మాణం, రైళ్ల నిర్వహణ, రైళ్ల విడిభాగాల తయారీ యూనిట్లను విడదీయాలని సూచించింది. ‘‘రైల్వేలో ప్రైవేటు భాగస్వామ్యం పెంచాలన్నది ప్రభుత్వ విధానపర నిర్ణయం. మేం దాన్ని ఆమోదించాం. అంతే తప్ప ఇది కొత్త సిఫారసు కాదు. తుది నివేదిక అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆశిస్తున్నాం’’ అని వివేక్ దేబ్రాయ్ పేర్కొన్నారు. ఈయన నీతి ఆయోగ్‌లో సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. కమిటీ సిఫారసులు ఇవీ.. ⇒ ప్రైవేటు రంగానికి ప్రవేశం కల్పించేందుకు వీలుగా భారత రైల్వే నియంత్రణ అథారిటీ (ఆర్ఆర్ఏఐ-రాయ్) ఏర్పాటు చేయాలి. ఇది స్వతంత్రంగా ఉండాలి. ప్రత్యేక బడ్జెట్ ఉండాలి. ⇒ ఆర్థిక అంశాలు, చార్జీల పెరుగుదల, రైల్వేల భద్రత, సేవల నాణ్యత, లెసైన్సులు, పరిహారం పెంపు, వివాదాల పరిష్కారం, సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధిని తదితరాలను రాయ్ పర్యవేక్షించాలి ⇒ నష్టాలను నివారించాలంటే అధికారాలను తక్షణమే వికేంద్రీకరించాలి. ప్రస్తుతం ఈ అధికారాల వికేంద్రీకరణ పాక్షికంగానే ఉంది. ఇది పూర్తిస్థాయిలో జరగాలి ⇒ రైల్వేను ఆర్థికంగా పరిపుష్టంగా మార్చేందుకు అంతర్గత వనరులతోపాటు ఇతర మార్గాలను అన్వేషించాలి ⇒ రైళ్లను నడపడం వరకే రైల్వే విభాగం పరిమితం కావాలి. స్కూళ్లు, ఆసుపత్రుల నిర్వహణను వదిలించుకోవాలి. కేటరింగ్, రియల్ ఎస్టేట్ అభివృద్ధి, లోకోమోటివ్ బోగీలు, వ్యాగన్ల తయారీ వంటివాటిని దేనికదే స్వతంత్ర విభాగాలుగా చేయాలి. ⇒ రైల్వే భద్రతా దళాన్ని(జీఆర్పీ) రైల్వే నుంచి పూర్తిగా విడదీసి రాష్ట్రాల చేతుల్లో పెట్టాలి. జీఆర్పీ నిధుల భారాన్ని రాష్ట్రాలకే వదిలేయాలి. రైళ్లలో భద్రత కోసం ఆర్పీఎఫ్ లేదా ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను ఎంచుకునే స్వేచ్ఛను జనరల్ మేనేజర్లకు కట్టబెట్టాలి. ⇒ తమ పిల్లలను కేంద్రీయ విద్యాలయాల్లో చేర్చేందుకు వీలుగా రైల్వే సిబ్బందికి సబ్సిడీ అందించాలి. అలాగే రైల్వే ఉద్యోగులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సకు సబ్సిడీ ఇవ్వాలి ⇒ కమిటీ సిఫారసులను ఐదేళ్లపాటు తు.చ. తప్పకుండా అమలు చేస్తే రైల్వేకు ఇక ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉండదు. మన రైల్వే.. 4 భారతీయ రైల్వే ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్. తొలి మూడు స్థానాల్లో అమెరికా, రష్యా, చైనా ఉన్నాయి 7 ప్రపంచంలో పెద్ద సంఖ్య (దాదాపు 15 లక్షల మంది)లో ఉద్యోగులున్న సంస్థల్లో మన రైల్వేది ఏడో స్థానం 1,14,500 కి.మీ. దేశంలోని రైల్వే మార్గాల పొడవు 2.1 కోట్లు రైల్వేల ద్వారా దేశంలో ప్రతిరోజూ ప్రయాణించేవారి సంఖ్య 8 వేలు దేశంలోని రైల్వే స్టేషన్ల సంఖ్య (సుమారుగా) 11 వేలు రోజూ రాకపోకలు సాగించే రైళ్ల సంఖ్య ఎటువైపు ఈ అడుగులు? 2014, ఆగస్టు 6 రైల్వే మౌలిక వసతుల్లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. హైస్పీడ్ ట్రెయిన్ల వంటి భారీ ప్రాజెక్టుల్లో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడతాయి. దీంతో ప్రయాణికులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని, రైల్వేశాఖ ఆధునిక పట్టాలెక్కుతుందని ప్రభుత్వం చెబుతోంది. రైల్వే సంఘాలు మాత్రం దీన్ని వ్యతిరేకించాయి. 2014, నవంబర్ 29 ‘మన దేశంలో రైల్వే స్టేషన్లు వందేళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పుడూ అలాగే ఉన్నాయి. రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరిస్తేనే వీటి పరిస్థితి మారుతుంది. అదనంగా ఒక కోచ్ తగిలించో, ఒక స్టేషన్‌ను ఆధునీకరించో చేతులు దులుపుకోం. రైల్వేలను పూర్తిగా అభివృద్ధి పట్టాలెక్కిస్తాం’’ - మేఘాలయలో మెందీపత్తర్- గువాహటి ప్యాసింజర్ రైలు ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 2014, డిసెంబర్ 25 ‘రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచన మాకు లేదు. అవన్నీ పుకార్లు మాత్రమే. అయితే దేశ ఆర్థికాభివృద్ధికి మరింత ఊపు ఇచ్చే విధంగా రైల్వేలో స్వదేశీ, విదేశీ పెట్టుబడులను ఇతోధికంగా పెంచుతాం’ - వారణాసిలో డీజిల్ లోకోమోటివ్ పనుల విస్తరణ కార్యక్రమంలో మోదీ 2015, జూన్ 12 రైల్వేలో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించాలని, ఒక స్వతంత్ర నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని దేబ్రాయ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇన్నాళ్లుగా రైల్వే సిబ్బందికి చేదోడువాదోడుగా నిలుస్తున్న రైల్వే ఆసుపత్రులు, స్కూళ్లను వదిలించుకోవాలని సూచించింది. రైల్వే సంఘాల మండిపాటు.. 30న బ్లాక్‌డే దేబ్రాయ్ కమిటీ నివేదికపై రైల్వే సంఘాలు మండిపడ్డాయి. సిఫారసులకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈనెల 30న బ్లాక్‌డేగా పాటిస్తామన్నాయి. కమిటీ ప్రైవేటీకరణకు దారులు పరిచింది. ప్రభుత్వం కమిటీ నివేదికను అంగీకరించదని భావిస్తున్నాం. నివేదిక దేశంలో జనరల్, స్లీపర్ క్లాసుల్లో ప్రయాణించే 95 శాతం రైలు ప్రయాణికులకు వ్యతిరేకంగా ఉంది. అందుకే ఈనెల 30న బ్లాక్‌డేగా పాటిస్తాం’’అని అఖిల భారత రైల్వే సమాఖ్య నేత శివ గోపాల్ మిశ్రా తెలిపారు. కాగా, ముందుగా రైల్వేశాఖ ఆ నివేదికను పరిశీలిస్తుందని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
ఇక మరింత సులువుగా వ్యాపారాల నిర్వహణ
మరిన్ని నిబంధనలు సడలించిన కేంద్రం న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేలా నిబంధనలను కేంద్రం సరళతరం చేసింది. ఇకపై ప్రైవేట్ కంపెనీలు .. ఆఫర్ సర్క్యులర్, డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా డిపాజిట్లు స్వీకరించే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ సంస్థల్లో అధికారులకిచ్చే జీతభత్యాల విషయంలో పరిమితుల నుంచి మినహాయింపునిచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, చారిటబుల్ సంస్థలు, నిధి కంపెనీలు మొదలైన వాటి నిబంధనలను సడలిస్తూ కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై ప్రైవేట్ కంపెనీలు సింపుల్ మెజారిటీ ద్వారా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్‌ను ఆమోదించవచ్చు. అలాగే, పెట్టుబడులు తదితర నిర్దిష్ట లావాదేవీలకు షేర్‌హోల్డర్ల నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలన్న నిబంధనను పక్కన పెడుతున్నట్లు ఎంసీఏ పేర్కొంది. ఆడిటర్లు గరిష్టంగా 20 కంపెనీలకు మాత్రమే ఆడిటింగ్ చేయాలన్న నిబంధన పరిధిలోకి ఏక వ్యక్తి కంపెనీలు, అంతగా లావాదేవీలు లేని సంస్థలు, చిన్న కంపెనీలు, రూ. 100 కోట్ల పెయిడప్ షేర్ క్యాపిటల్ కన్నా తక్కువ ఉండే ప్రైవేట్ సంస్థలు మొదలైనవి రాకుండా మినహాయింపునిచ్చింది. డిఫెన్స్ పరికరాలు తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థలకు కొన్ని అకౌంటింగ్ నిబంధనలను పాటించనక్కర్లేకుండా మినహాయింపు కల్పించింది. నిధి కంపెనీలకు సంబంధించి డివిడెండ్ చెల్లింపు తదితర అంశాలను సవరించింది. పొదుపు అలవాటును ప్రోత్సహించేందుకు ఉద్దేశించి ఏర్పాటైన సంస్థలను నిధి కంపెనీలుగా వ్యవహరిస్తారు. -
ఔను...ప్రైవేటు రాజధానే
-
’ప్రైవేట్’ రాజధాని
-
‘ప్రైవేట్’ రాజధాని
* రైతుల భూములు 99 ఏళ్లు ప్రైవేట్ పరం * రాజధానిలో ప్రభుత్వం మాయ.. జీవోను వెబ్సైట్లో ఉంచని వైనం * భూములపై నిధులు సమకూర్చుకునే వెసులుబాటు * సీసీడీఎంసీ ద్వారా ప్రైవేట్ సంస్థలకు భూములు.. లీజు వసూలు బాధ్యత వాటిదే * లీజు ఒప్పందాలు చేసుకుని యూజర్ చార్జీలు, పట్టణ నిర్వహణ చార్జీల వసూలు * రాజధాని ప్రాంత సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తుంది సాక్షి, హైదరాబాద్: రాజధాని కోసం రైతుల నుంచి సమీకరించిన వేలాది ఎకరాల భూములను ప్రైవేట్ కంపెనీలకు జీవిత కాలంపాటు లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని కోసం ఇటీవలే కేపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కంపెనీ (సీసీడీఎంసీ)ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. దాని ద్వారా అమరావతిలో ప్రైవేటు కంపెనీలకు ద్వారాలు తెరిచింది. సీసీడీఎంసీ ద్వారా అమరావతిలో చేపట్టబోయే ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. రాజధానిలో చేపట్టే ప్రాజెక్టుల్లో పెట్టుబడి భాగస్వామికి లేదా ప్రైవేటు పార్టీలకు భూములను 99 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఈ నెల 2న దీనికి సంబంధించి ఉత్తర్వులు (జీవోఎంస్ నంబర్ 110) జారీ చేసింది. అయితే ప్రైవేటు సంస్థలకు పెద్దపీట వేసిన విషయం బయటపడకుండా, ఆ జీవోను వెబ్సైట్లో పెట్టకుండా రహస్యంగా ఉంచారు. 2 వ తేదీన జీవో నంబర్ మాత్రమే పెట్టి వివరాలను ఖాళీగా (బ్లాంక్) ఉంచారు. అయితే ఇందులో పొందుపరిచిన విషయాలు పరిశీలిస్తే.. రాజధానిలో చేపట్టబోయే వివిధ ప్రాజెక్టుల విషయంలో ప్రైవేటు సంస్థలకు లీజు పద్ధతిలో భూములు అప్పగించడానికి ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాజధానిలో అభివృద్ధి చేసిన ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ), లేదా భూమిని లేదా ఉపాధి కల్పన పెట్టుబడి భాగస్వామికి లేదా ప్రైవేట్ పార్టీలకు 99 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. జీవోలో ఏముంది.. భూమిని 99 సంవత్సరాల పాటు లీజుకివ్వడం అంటే దాదాపు రెండు తరాల పాటు ప్రైవేట్ పార్టీలకు స్వాధీనం చేయడమేనని స్పష్టమవుతోంది. లీజు పొందిన పార్టీలు ఆ భూమి విలువ ఆధారంగా మార్కెట్ నుంచి ఆర్థిక వనరులను సమీకరించుకునే వెసులుబాటు కల్పించారు. 2013 కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసిన సీసీడీఎంసీ విధులు, అధికారాలను జీవో నిర్ధారించారు. ఏడాది వారీగా లీజును వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేస్తుంది. 99 సంవత్సరాలకు లీజుకు ఇస్తూ ఒప్పందాలు చేసుకుంటుంది. నూతన రాజధానిలో రవాణా, విద్యుత్, మంచినీటి సరఫరా, వ్యర్థ పదార్థాల నిర్వహణ, సమాచార పరిజ్ఞానంతో పాటు ఉమ్మడి ప్రాంతంలో ఇతర మౌలిక వసతుల పనులను నేరుగాగానీ పీపీపీ విధానంలోగానీ అప్పగించవచ్చునని జీవోలో స్పష్టం చేశారు. అది కూడా ‘వయబులిటీ స్మార్ట్ సిటీ ప్రిన్సిపల్స్’ మేరకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. అంటే నామినేషన్ విధానంలో ఈ మౌలిక వసతుల పనులను అప్పగిస్తారని స్పష్టమవుతోంది. అలాగే నూతన రాజధానిలో వైద్య సేవలు, స్పోర్ట్స్, విద్య, వినోదం వంటి సామాజిక మౌలిక సదుపాయాలను వివిధ భాగస్వాముల ద్వారా చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఆర్డీఏ ఆమోదం పొందిన రాజధాని మాస్టర్ ప్లాన్ ఆధారంగా సీసీడీఎంసీ ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తుంది. తిరిగి ప్రణాళికను సీఆర్డీఏ ద్వారా ఆమోదం తీసుకుని కార్యాచరణను ప్రారంభిస్తుంది. నూతన రాజధానిలో అన్ని రకాల సేవలకు సంబంధించి డిజైన్, అభివృద్ధి, అమలు నిర్వహణ పనులను సీసీడీఎంసీ చేపడుతుంది. భవన నిర్మాణాల ప్రణాళికలను ఇతర మౌలిక వసతుల కల్పనలను పరిశీలించి సిఫార్సు చేసే అధికారం సీసీడీఎంసీకి ఇచ్చారు. ప్రైవేట్ డెవలపర్స్ నుంచి డెవలప్మెంట్ చార్జీలను సీసీడీఎంసీ వసూలు చేస్తుంది. సీఆర్డీఏ నిర్ధారించిన మేరకు వినియోగదారుల నుంచి యూజర్ చార్జీలు, టారిఫ్‌ను సీసీడీఎంసీ వసూలు చేయనుంది. అలాగే రాజధాని పట్టణ నిర్వహణ చార్జీలను కూడా వసూలు చేస్తారు. రాజధాని సిటీ అభివృద్ధిలో భాగంగా ఉపాధి కల్పన పెట్టుబడి భాగస్వామితో పాటు ఇతర ప్రైవేట్ ఏజెన్సీలను సీసీడీఎంసీ ఎంపిక చేయనుంది. ఇక కీలకమైన జీవితకాల లీజు విషయాన్ని జీవో పాయింట్లలో కింద ఉదహరించడం కొసమెరుపు.. జీవో 110 రాజధాని కోసం రైతుల నుంచి సేకరించిన వేల ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు 99 ఏళ్లు లీజుపై ధారాదత్తం ఏమవుతుంది? 99 ఏళ్ల పాటు భూములు లీజుకిస్తే రెండు తరాల పాటు ప్రైవేట్ కంపెనీలకు హక్కులు కల్పించటమే. భూములు పొందిన సంస్థలు తనఖా పెట్టుకుని ఆర్థిక వనరులు సమీకరించుకోవచ్చు. రాజధానిలో మౌలిక వసతుల కల్పనను నామినేషన్‌పై అప్పగించనుంది. అంతా గోప్యం.. ఈనెల 2న ఇచ్చిన ఈ జీవోను వెబ్సైట్లో ఉంచకుండా రహస్యంగా వ్యవహరించింది. జీవో నంబర్ మాత్రమే పేర్కొంటూ వివరాలను ఖాళీగా వదిలేసింది. ప్రైవేట్ సంస్థలకు భూములు కట్టబెట్టేందుకు దారులు తెరిచింది. యూజర్ చార్జీలు కట్టాల్సిందే - రవాణా విద్యుత్, మంచినీటి సరఫరా ఇతర మౌళిక వసతుల పనులను నేరుగా గానీ, పీపీపీ విధానం ద్వారా గానీ అప్పగించవచ్చు - వినియోగదారుల నుంచి యూజర్ చార్జీలను అలాగే పట్టణ నిర్వహణ చార్జీలను సీసీడీఎంసీ వసూలు చేయనుంది. -
పాల ధరల యుద్ధం
-
‘కొలువు’ పొందువరకూ అలుపు లేదు మాకు
ఇంటికి చెప్పకుండా బ్యాటు పట్టుకుని దొంగచాటుగా గ్రౌండుకు వెళ్లే రోజులు పోయాయి. నాన్న ఏమంటారో అని భయపడుతూ రన్నింగ్ షూష్ ఇంటి వద్దే తొడుక్కుని పెరటి గోడ దూకి మైదానం వైపు పరిగెత్తే రోజులూ పోయాయి. దెబ్బ తగిలిన చేతిని అమ్మకు చూపించకుండా నక్కినక్కి పడుకునే రోజులు కూడా సెలవు తీసుకున్నాయి. ఇప్పుడు ఆడడానికి, ఆడుతున్నామని చెప్పడానికి ఎవరూ సందేహించడం లేదు, భయపడడం లేదు. చదువుతో పాటు క్రీడలకు యువత పెద్దపీట వేస్తోంది. ప్రభుత్వ కొలువులు ఆటల ద్వారా సాధ్యమవుతున్న వేళ ఆటలను తారకమంత్రంగా ఎంచుకుంది. అమ్మానాన్నలను ఒప్పించి, అనుకున్న లక్ష్యాన్ని అందుకునే వరకూ అలుపెరగని పోరుసాగిస్తోంది. జిల్లా యువతా ఆ దారిలోనే ఉపాధికి బాటలు వేసుకుంటోంది... * క్రీడలపై మక్కువ చూపిస్తున్న జిల్లా యువత * పేరు ప్రఖ్యాతులతో పాటు, ఉన్నత కొలువుల సాధనకు సరైన మార్గం * ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగావకాశాలకు 2శాతం కోటా * ప్రతిభ గల క్రీడాకారులకు ఆఫర్లు కురిపిస్తున్న ప్రైవేటు కంపెనీలు విజయనగరం మున్సిపాలిటీ: రోహిత్ శర్మ డబుల్ సెంచరీ... ఎక్కడ చూసినా అదే చర్చ. అంతకుముందు రాయుడు కళాత్మక శతకం. అప్పుడు కూడా ఎక్కడ చూసినా రాయుడు టాపిక్కే. ఇంకొంచెం ముందు కామన్వెల్త్లో పతకం కొల్లగొట్టిన మత్స సంతోషి. ఆ సమయంలో జిల్లాలో సంతోషి పేరు వినబడని ఊరు, వీధి లేవంటే అతిశయోక్తి కాదు. జనాలను సమ్మోహితులను చేసే ఏదో శక్తి ఆటల్లో ఉంది. అందుకే జిల్లా యువత ఇప్పుడు ఆటల బాటలో నడుస్తోంది. సెలబ్రిటీగా వెలుగొందడంతో పాటు క్రీడల కోటాలో ఉద్యోగాలు కూడా లభిస్తుండడంతో ఈ దారిలో పయనించడానికి యువతరం ఆసక్తి చూపుతోంది. అంతేకాదు నిరుపేద కుటుంబాల వారు కూడా క్రీడల మార్గంలో పయనించడానికి భయపడడం లేదు. జిల్లాలో ప్రధానంగా ఖోఖో, రెజ్లింగ్ (కుస్తీ) కబడ్డీ, వాలీబాల్ క్రీడలకు ఆదరణ ఉండేది. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ పెద్దదైంది. షటిల్ బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్, తైక్వాండో, అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, ఆర్చరీ, బాక్సింగ్ క్రీడాంశాల్లో జిల్లా క్రీడాకారులు మంచి ప్రతిభ చూపిస్తున్నారు. తద్వారా వారు ఏర్పర్చుకున్న ల క్ష్యాన్ని చేరుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కబడ్డీలో రాణించిన 30 మంది వరకు క్రీడాకారులు వివిధ రంగాల్లో స్థిరపడటంతో పాటు ఉన్నత చదువులను క్రీడల కోటాలోనే అభ్యసించారు. * ఖోఖోలో 40 మంది , వాలీబాల్‌లో 20 మంది, వ్యాయామ ఉపాధ్యాయుల రంగంలో 50 మంది వరకు స్థిరపడ్డారు. * ఇటీవల అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని దేశ కీర్తిని చాటి చెప్పిన కొండవెలగాడ గ్రామానికి చెందిన మత్స సంతోషిని ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. క్రీడలతో ప్రయోజనాలు ఎన్నో... * క్రీడల్లో రాణించటం ద్వారా బహుళ ప్రయోజనాలు దక్కుతున్నాయి. ఈ రంగంలో రాణించేవారికి ప్రభుత్వ శాఖలైన బ్యాంకింగ్, రైల్వే, పోలీస్, ఉపాధ్యాయ, పోస్టల్ విభాగాల్లో ప్రభుత్వమే నేరుగా ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. పలు ప్రైవేటు సంస్థలైతే ప్రతిభ గల క్రీడాకారుల కోసం వెతుక్కుంటూ వచ్చి మంచి ప్రోత్సాహాకాలతో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమే.. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమే. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లో రాణించటం ద్వారా అనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అంతేకాకుండా ఉన్నత అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. గ్రామీణ ప్రాంతంలో పుట్టిన నేను అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటానని అనుకోలేదు. పట్టుదలతో శిక్షణ తీసుకున్నా తల్లిదండ్రులు, దేశ ప్రజలంతా గర్వించే విధంగా అంతర్జాతీయ పోటీల్లో పతకం సాధించాం. క్రీడల్లో కనబరుస్తున్న ప్రతిభను గుర్తించిన రైల్వే అధికారులు విజయనగరం రైల్వే స్టేషన్లో టీసీగా ఉద్యోగం ఇచ్చారు. చదువుతో పాటు క్రీడల్లో పట్టుదలతో రాణిస్తే సాధించలేనిదంటూ ఉండదు. -మత్స.సంతోషి, అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్, కొండగుంపాం. పట్టుదలతో రాణిస్తే ప్రయోజనం... ఏ రంగంలోనైనా పట్టుదలతో రాణిస్తే తప్పక ప్రయోజనం ఉంటుంది. నేను ఎనిమిదేళ్లుగా ఖోఖో ఆడుతున్నాను. మాది నిరుపేద కుటుంబం. చిన్నతనంలో నాన్న చనిపోయారు. మావయ్య గోపాల్ ప్రోత్సాహంతో చదువుకుంటూనే క్రీడల్లో అడుగుపెట్టాను. ఇప్పటి వరకు 10 జాతీయ పోటీల్లో పాల్గొన్నా ఒక సారి జాతీయ గోల్డ్ మెడల్ దక్కించుకున్నా. 2010లో క్రీడలో రైల్వేలో క్లర్క్ ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం బిలాస్పూర్లో ఉంటున్నా. నాకు ఉపాధి కల్పించిన ఖోఖో క్రీడను రైల్వే శాఖ తరఫున , ఆంధ్రరాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నా. - నమ్మి నరేష్, దాసన్నపేట, విజయనగరం. రైల్వేలో ఉద్యోగం చిన్నతనం నుంచి క్రీడలంటే నాకు ఇష్టం. కస్పా హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో ఖోఖో నేర్చుకున్నాను. అప్పటి వ్యాయామ ఉపాధ్యాయులు చిన్నంనాయుడు, గోపాల్ మాస్టార్లు అన్ని విధాలుగా ప్రోత్సహించారు. వారి ఆశీర్వాద బలం, నా నిరంతర శిక్షణతో పలు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. సౌత్ ఆసియా అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో దేశం తరఫున ఆడాను. 2009లో చేసిన మొదటి ప్రయత్నంలోనే రైల్వే శాఖలో ఉద్యోగం లభించింది. ఇప్పటికీ ఆ క్రీడను కొనసాగిస్తున్నా. -కరగాన.మురళీకృష్ణ, దాసన్నపేట, విజయనగరం. జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తెస్తా... మాది నిరుపేద కుటుంబం. కేవలం కూలి చేసుకుంటూ జీవన ం సాగిస్తాం. తల్లిదండ్రులు నన్ను పెంచి, చదివించేందుకు ఎంతో కష్టపడుతున్నారు. వారిని ఎప్పటికైనా మంచి స్థానంలో ఉంచాలన్నదే నా ధ్యేయం. ఓ వైపు చదువుతూ మరో వైపు వాలీబాల్ క్రీడను నేర్చుకున్నాను. ఇప్పటి వరకు పలు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నా. పతకాలు దక్కించుకున్నాను. డిగ్రీ పూర్తియ్యే సరికి జాతీయ స్థాయిలో ఉత్తమ క్రీడాకారుడిగా ఎదిగి జిల్లామంచి పేరు ప్రఖ్యాతలు తేవటంతో పాటు క్రీడల కోటాలో ఉద్యోగం సంపాదిస్తా. నా ఆశయాన్ని నెరవేర్చుకుంటా. - నరేష్, బలిజిపేట, విజయనగరం క్రీడల కోటాలో ఇంజినీరింగ్ సీటు... మాది సాధారణ కుటుంబం. మా ఊరిలో స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థి ఏదో ఒక ఆటలో రాణిస్తుంటాడు. ఎక్కువ మంది కబడ్డీ అంటే ఇష్టపడతారు. నేనూ అదే క్రీడలో శిక్షణ పొందాను. ఇంటర్ తర్వాత క్రీడల కోటా కలిసిరావటంతో ఉచితంగా కళాశాల యాజమాన్యం సీటిచ్చింది. ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. - టి.భాస్కరరావు, సారిపల్లి, విజయనగరం. ఇప్పటికీ ఖోఖో అడుతున్నా... మాది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు కష్టపడి పని చేసి చదివించారు. ఎలాగైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం సాధించాలన్నది నా చిన్ననాటి నుంచి సంకల్పం. క్రీడల్లో రాణించటం ద్వారా ఆ నా కలను నిజం చేసుకోవాలని అనుకున్నాం. మున్సిపల్ కస్పా ఉన్నత పాఠశాలలో చదువుతున్న సమయంలో చిన్నంనాయుడు (పీఈటీ), గోపాల్ (పిఈటీ)లు నాలో ఉత్సుకతను గమనించి ఖోఖోలో ప్రోత్సహించారు. ఇప్పటి వరకు ఆరువరకు జాతీయ స్థాయి టోర్నీలు పాల్గొన్నా. క్రీడలో కోటాలో 2011 సంవత్సరంలో పోలీస్ శాఖలో సివిల్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం లభించింది. ప్రస్తుతం విజయనగరం వన్‌టౌన్‌లో విధులు నిర్వహిసున్నా. ఇప్పటికీ ఖోఖో ఆడుతూ పలువురు విద్యార్ధులకు నేర్పిస్తున్నా. ఈ ఏడాది డిసెంబర్లో బెంగళూరులో జరగనున్న సీనియర్స్ జాతీయ ఖోఖో పోటీల్లో రాష్ట్రం తరఫున ఆడతాను. - పొంతపల్లి.హరీష్, కొత్తపేట, విజయగనరం. -
ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూములపై సర్వే!
టీఎస్ అవసరానికి వినియోగించకుంటే వెనక్కి హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, గృహనిర్మాణ సంస్థలను ఆదేశించిన ప్రభుత్వం ఈ సంస్థలతోపాటు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోనూ సర్వే హైదరాబాద్: ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను నిర్ణీత వ్యవధిలో సద్వినియోగం చేసుకోని పక్షంలో వాటిని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించింది. తెలంగాణలోని భూములను ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు వివిధ సంస్థలు, పరిశ్రమలు, పర్యాటకాభివృద్ధి, గృహ నిర్మాణ సంస్థల కార్యక్రమాల కోసం కేటాయించారుు. కాగా, ఇలా కేటారుుంచిన భూవుుల్లో నిరుపయోగంగా ఉన్న స్థలాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, పరిశ్రమల మౌలిక సదుపాయల సంస్థ, గృహ నిర్మాణ సంస్థ, పర్యాటక శాఖల ద్వారా ఇచ్చిన భూములపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గత ప్రభుత్వాలు తెలంగాణలో నేరుగానే 16వేల ఎకరాలకుపైగా భూమిని వివిధ సంస్థలకు కేటాయించినట్లు సమాచారం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం కేటాయించిన ఆ భూవుులను నిజంగానే నిర్దేశిత అవసరాలకే వినియోగిస్తున్నారా? లేక ఏదైనా ఇతరత్రా వాటికి వినియోగిస్తున్నారా? వృథాగా ఉ న్నాయా? అన్న అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రాం తాలనుంచి పూర్తి సవూచారాన్ని తెప్పించుకుంటున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే ఎపీ ఎన్జీవోలు, ఎపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు కేటారుుంచిన స్థలాలను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖ తాజాగా ఇలాంటి భూములపై సర్వే చేపట్టింది. నిర్దేశిత లక్ష్యం మేరకు భూవుులను వినియోగించని వారికి నోటీసులు జారీ చేస్తూ.. ఆ భూములను స్వాధీనం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇదే విధానాన్ని హెచ్ఎండీఏ, టీఎస్ ఐఐసీ, పర్యాటక శాఖలు కూడా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి కోసం పలు సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. అందులో దాదాపు 90 శాతం మేరకు సంబంధిత సంస్థలు కనీసం పనులు కూడా మొదలుపెట్టలేదని అందువల్ల అలాంటి సంస్థల నుంచి భూములు వెనక్కి తీసుకోవాలని రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. తవు సర్వేలో నిరుపయోగంగా ఉన్నట్టు తేలిన భూముల వివరాలను సంబంధిత శాఖలకు కూడా పంపిస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఇలాంటి భూవుులను వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. -
ఖాళీ చేయండి!
ప్రైవేట్ బిల్డింగ్‌లలోని ప్రభుత్వ కార్యాలయాలకు యజమానుల నోటీసులు ఎక్కువ అద్దెలు చెల్లిస్తున్న ప్రైవేట్ సంస్థలు దిక్కుతోచని స్థితిలో అధికారులు విజయవాడ: నవ్యాంధ్రప్రదేశ్‌కు తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించిన ప్రభుత్వం ఒకవైపు అన్ని శాఖల కార్యాలయాలను తరలించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇక్కడ ప్రైవేటు భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేయించే పనిలో యజమానులు నిమగ్నమయ్యారు. ఉన్నవాటినే ఎక్కడ పెట్టాలో తెలియడం లేదని, ఇక కొత్త కార్యాలయాల సంగతి సరేసరి అని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. విజయవాడ కేంద్రంగా రాజధాని ఉంటుందని దాదాపు ఖరారు కావడంతో ఎక్కువ అద్దెలు ఇచ్చే కార్పొరేట్ సంస్థలకు తమ భవనాలను లీజుకు ఇచ్చేందుకు యజమానులు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో తక్కువ అద్దెలు చెల్లించే ప్రభుత్వ కార్యాలయాలను ఆరు నెలల్లో ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో విజయవాడతోపాటు అన్ని మున్సిపాలిటీల్లో పలు ప్రభుత్వ కార్యాలయాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. విభజన తర్వాత డిమాండ్ రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో అద్దెలకు ఇచ్చే ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. గతంలో సగటున అద్దెకు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు అడుగుల చొప్పున అద్దెలు చెల్లించాలని కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు విజయవాడలో చదరపు అడుగుకు రూ.7 అద్దె చెల్లిస్తున్నారు. మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, నూజివీడు, నందిగామ, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం, ఉయ్యూరు తదితర ప్రాంతాల్లో రూ.5 నుంచి రూ.7 వరకు చెల్లిస్తున్నారు. ప్రైవేటు కార్యాలయాలు మాత్రం రూ.30 నుంచి రూ.50 వరకు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాల అద్దెను కూడా చదరపు అడుగుకు రూ.30కి పెంచాలని భవన యజమానులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.7కు మించి చెల్లించే పరిస్థితి లేదు. దీంతో జిల్లావ్యాప్తంగా అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలను ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ మేరకు విజయవాడలోని పలు కార్యాలయాలకు నోటీసులు కూడా అందాయి. గురునానక్ కాలనీలో ఉన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కార్యాలయం, డీఆర్ కార్యాలయాలకు ఖాళీ చేయాలని నోటీసులు అందాయి. అద్దె భవనాల్లోనే 52 శాఖల కార్యాలయాలు! నగరంలో 52 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 500 నుంచి 600 వరకు కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. సబ్-రిజిస్ట్రార్, వాణిజ్య పన్నుల శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు, దేవాదాయ శాఖ కార్యాలయాలు, రెవెన్యూ, ఇరిగేషన్, రవాణా, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల శాఖలకు సంబంధించిన కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. కొన్ని కార్యాలయాలకు రూ.3లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖ-1, 2వ డివిజన్ల కార్యాలయాలకు రూ.3లక్షలకు పైగా అద్దె చెల్లిస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖ బెంజిసర్కిల్, సీతారామపురం, కృష్ణలంక, భవానీపురం కార్యాలయాలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అద్దె ఇస్తున్నారు. ఆయా శాఖల కార్యాలయాలు మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, నందిగామలలో కూడా అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. ఎక్కువ శాతం ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తున్న భవనాలు రాజకీయ నాయకులవే కావడంతో ఖాళీ చేయించేందుకు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అద్దె భవనాల కోసం తిరుగుతున్న అధికారులు తమ కార్యాలయాలకు భవనాల కోసం విజయవాడతోపాటు అన్ని మున్సిపల్ కేంద్రాల్లో అధికారులు వెదుకులాట ప్రారంభించారు. హాస్టళ్లకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాస్త పెద్ద ఇళ్లు, భవనాలు కనిపిస్తే అద్దెకు ఇస్తారా.. అంటూ ఆరా తీస్తున్నారు. అయితే యజమానులు మాత్రం ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకు ఇచ్చేందుకు ముందుకురావటం లేదు. -
ప్రభుత్వమే నిర్మిస్తుంది
శివ్డీ-నవాశేవా సీలింకుపై సీఎం చవాన్ సాక్షి, ముంబై: శివ్డీ-నవాశేవా సీలింకు పనులు చేపట్టేందుకు ప్రైవేటు కంపెనీలు ఆసక్తి కనబర్చకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేపట్టాలని నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వెల్లడించారు. దీంతోపాటు రూ.10 వేల కోట్లతో దక్షిణ ముంబైలోని కోస్టల్ రోడ్డు ప్రాజెక్టును మహానగర పాలక సంస్థ (బీఎంసీ) స్వయంగా చేపట్టనుందని చవాన్ స్పష్టం చేశారు. ముంబై-నవీముంబై ప్రాంతాలను కలిపే శివ్డీ-నవాశేవా సీలింకు ప్రాజెక్టును ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో నిర్మించనున్నట్లు పదేళ్ల కిందట ప్రభుత్వం ప్రకటించింది. అందుకు రిలయన్స్ కంపెనీతోపాటు అనేక ప్రైవేటు సంస్థలు టెండర్లు వేశాయి. కానీ ఆ తర్వాత రద్దు చేసుకున్నాయి. దీంతో పదేళ్లకుపైగా పెండింగులో పడిపోయిన ఈ ప్రాజెక్టును ఇప్పుడు స్వయంగా ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించుకుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.9,630 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చవాన్ చెప్పారు. ఇదిలావుండగా భావుచా ధక్కా-నెరుల్-రేవస్-మాండ్వా జలరవాణా మార్గాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సీడ్కో), మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ(ఎమ్మెస్సార్డీసీ), మెరీ టైం బోర్డు సంయుక్త కంపెనీలకు జలరవాణా బాధ్యతలు అప్పగించింది. ఇందులో సిడ్కో 40 శాతం, ఎమ్మెస్సార్డీసీ 40 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులు సమకూర్చనున్నాయి. -
ఆశల సాగు
శ్రీకాకుళం అగ్రికల్చర్, న్యూస్‌లైన్: గత నాలుగేళ్లుగా వరుస విపత్తులతో కుదేలైన జిల్లా రైతులు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో పంట సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రకృతి విపత్తుల మాటెలా ఉన్నా.. ప్రతి ఏటా ఎదుర్కొంటున్న ఎరువులు, విత్తనాల సమస్యకు తోడు ఈసారి పంట రుణాల సమస్య ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ప్రతికూలతలు, అడ్డంకులు ఉన్నప్పటికీ ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఎన్నికల బిజీ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న అధికారులు ఖరీఫ్ ప్రణాళికలు సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు. ఏటా విత్తనాలతో సమస్య జిల్లాలో అత్యధికంగా సాగయ్యే పంట వరి. గత నాలుగేళ్లుగా వరుస విపత్తులతో పంట నష్టపోయి విత్తనాలు తయారు చేసుకొనే అవకాశం లేకుండా పోయింది. జిల్లాలో ఖరీఫ్ సగటు సాగు విస్తీర్ణం 2.53 లక్షల హెక్టార్లు. ఇందులో 1.85 లక్షల హెక్టార్లలో వరి, 22 వేల హెక్టార్లలో వేరుశనగ, మిగిలిన విస్తీర్ణంలో గోగు, పప్పు దినుసులు తదితర పంటలు సాగు చేస్తున్నారు. గత ఏడాది సుమారు 2.05 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. వరి సాధారణ విస్తీర్ణమైన 1.85 లక్షల హెక్టార్లకు సుమారు 1.45 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. ఇందులో 30 శాతం అంటే సుమారు 45 వేల క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే సాధారణంగా ప్రభుత్వం అందిస్తోంది. కానీ ఈ ఏడాది 49 వేల క్వింటాళ్ల విత్తనాలు అందనున్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 20 వేల క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. ఎలా చూసుకున్నా అవసరమైన విత్తనాల్లో ఇది మూడో వంతు మాత్రమే. మిగిలిన విత్తనాలను రైతులే సమకూర్చుకోవలసి వస్తోంది. ప్రస్తుతం రైతుల వద్ద ఒక్క గింజ కూడా లేదు. ఫలితంగా బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర పెట్టి విత్తనాలు కొనుగోలు చేసుకోవాల్సిందే. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తాయని, గతంలో ఇది తమకు అనుభవమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ప్రైవేటుగా కొనుగోలు చేసే విత్తనాల్లో నకిలీ, నాసిరకం ప్రమాదం కూడా ఉంటుందని అంటున్నారు. ఎరువులదీ అదే దారి ఎరువుల విషయంలోనూ రైతులు ఇదే రకమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచుకునే స్వేచ్ఛను ఆయా కంపెనీలకే కట్టబెట్టడంతో ధరలు చుక్కలనంటుతున్నాయి. దీంతో రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది. జిల్లాకు ఖరీఫ్‌లో 99373 టన్నుల ఎరువులు అవసరం. ఇందులో డీఏపీ 15950 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 18390 టన్నులు ఉన్నాయి. జిల్లా రైతులు సేంద్రియ ఎరువులపై ఆసక్తి చూపకుండా రసాయనిక ఎరువులపైనే ఆధారపడుతున్నారు. వీటి ధరలు ఇష్టారాజ్యంగా పెరిగిపోతుండటం.. సీజనులో డిమాండ్ తగినంతగా సరఫరా కాకపోవడం సమస్యగా పరిణమిస్తోంది. మట్టి నమూనా ఫలితాలు అందేనా.. పంటల సాగులో భూసారం తెలుసుకోవడం అత్యంత ప్రధానం. ఏటా వ్యవసాయ శాఖ భూసార పరీక్షలంటూ రైతుల నుంచి మట్టి నమూనాలు సేకరిస్తోంది. వాటి ఫలితాలను సకాలంలో రైతులకు అందజేయడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. ఈ సారి కూడా ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మట్టి నమూనాలు సేకరించి పరీక్ష కేంద్రాలకు పంపే పనిలో వ్యవసాయాధికారులున్నారు. అయితే వాటిని ఎప్పుడు పరీక్షిస్తారు.. ఫలితాలు ఎప్పుడు రైతులకు అందజేస్తారన్నవి మాత్రం సమాధానం లేని ప్రశ్నలే. అవగాహన లోపం పంటల సాగు విధానంలో వస్తున్న మార్పులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. అందుబాటులో ఉన్న పథకాలు.. తదితర అంశాలపై రైతులకు సరైన అవగాహన ఉండటం లేదు. రైతులను చైతన్యపరిచేందుకు ఏటా ఖరీఫ్ సీజన్‌కు ముందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రకరకాల పేర్లతో గ్రామాల్లో చైతన్య యాత్రలు నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది గ్రామాల్లో ఎన్నికల హడావుడి, అధికారులు కూడా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో చైతన్య యాత్రలు అటకెక్కాయి. అరకొర పరిజ్ఞానంతోనే రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. -
నీటి దందాతో కోట్లు
రూ.25 కోట్లకుపైగా దోచేస్తున్న ప్రైవేటు సంస్థలు ఐఎస్ఐ లేకనే వాటర్ప్యాకెట్లు, బాటిల్స్ అమ్మకాలు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో నిలువు దోపిడీ తిరుపతి, చిత్తూరు నగరాల్లో నకిలీ కంపెనీలు పట్టించుకోని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు నకిలీ కంపెనీల నీళ్ల వ్యాపారం జిల్లాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. కోట్ల రూపాయలు దండుకుంటున్న ఈ కంపెనీలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారుు. వేసవి మొదలవడంతో ఈ నీళ్ల వ్యాపారం మాఫియూ స్థాయికి చేరుకుంది. సాక్షి, చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా ఏటా నకిలీ వాటర్ ప్యాకేజీ కంపెనీలు రూ.25 కోట్లకు పైగా వ్యాపారం చేస్తూ ప్రజలను దోచేస్తున్నాయి. నకిలీ వాటర్ కంపెనీలు కలుషితమైన నీటిని అమ్ముతూ దాదాపు కోట్లల్లో టర్నోవర్ చేస్తూ లాభాలు గడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆహార మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం జిల్లాలో 90 శాతం ప్యాకేజీ వాటర్ కంపెనీలు నడవడం లేదు. కొన్ని లెసైన్స్లే లేకుండా విచ్చలవిడిగా నాసిరకం, కలుషితమైన నీటితో వ్యాపారం చేస్తున్నాయి. వందల్లో నకిలీ కంపెనీలు తిరుపతిలో 4, చిత్తూరులో రెండు, మదనపల్లెలో 2 కలిపి జిల్లా మొత్తం పదిలోపే ఐఎస్ఐ ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ లెసైన్స్ కలిగిన కంపెనీలు ఉన్నాయి. ఒక్క తిరుపతిలోనే ఐఎస్ఐ ముద్ర లేని వాటర్ప్లాంట్లు పదికి పైగా ఉన్నాయి. ఇళ్లలో నడుస్తున్న చిన్నాచితక అనధికారిక కంపెనీలు రెండు వందలకు పైగా ఉన్నాయి. మదనపల్లెలో 50, చిత్తూరులో 100 వరకు ఇలాంటి బోగస్ వాటర్ ప్యాకేజీ కంపెనీలు ఉన్నాయి. శివారు ప్రాంతంలో స్థలం లీజ్‌కు తీసుకోవడం బోరు వేసేయడం, ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ అనధికారికంగా ప్రారంభించేయడం జిల్లాలో సర్వసాధారణంగా మారింది. వీటిని అడ్డుకోవడంపై జిల్లా అధికారులు కూడా పెద్దగా దృష్టి సారించడం లేదు. నిబంధనలు ఇవీ... బీఎస్ఐ ఇచ్చే ఐఎస్ఐ మార్కు తప్పనిసరిగా ఉండాలి. ఐఎస్ఐ ఉంటేనే ఫుడ్ లెసైన్స్ ఇస్తారు. ఈ రెండు ఉంటేనే ప్యాకేజీ వాటర్ కంపెనీ నిర్వహించడానికి అనుమతి లభిస్తుంది. పంచాయతీ లేదా మున్సిపాలిటీ అప్రూవల్ కచ్చితంగా ఉండాలి. స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీగా గుర్తింపు పొంది ఉండాలి. సేల్‌ట్యాక్స్ టిన్ మెంబర్‌తోపాటు టీవోటీ లెసైన్స్ కలిగి ఉండాలి. వాటర్‌ప్లాంట్‌లో ఒక మైక్రోబయోలజిస్టు, కెమిస్టు, ఇద్దరు టెక్నికల్ సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. వీరు ఎప్పటికప్పుడు వాటర్ శాంపిల్స్ తీసి ప్రయోగశాలకు పరీక్ష నిమిత్తం పంపుతుండాలి. ప్రతి నెలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి వాటర్ శాంపిల్స్ పరీక్షకు పంపి నివేదిక తెప్పించుకోవాలి. ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్-లేబుల్‌పై ఐఎస్ఐ మార్కు, వాటర్ ప్యాకేజీ చేసిన తేదీ, గడువు తీరే తేదీ ముద్రించాలి. ఒక వాటర్ ప్యాకెట్‌ను మూడు రోజుల్లోనే విక్రయించాలి. డబ్బు పెట్టినా... కలుషిత నీరే రైళ్లు, ఆర్టీసీ బస్టాండ్లలో, రైల్వేస్టేషన్లో, తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుపతి విష్ణునివాసం, శ్రీనివాసం వంటి యాత్రికుల సముదాయాల వద్ద నాసిరకం, కలుషిత ప్యాకేజీ వాటర్‌ను విరివిగా అమ్ముతున్నారు. ఒక్కొక్క వాటర్ ప్యాకెట్ రూ.2, బస్టాండ్లలో రూ.3కి కూడా విక్రయిస్తున్నారు. ఐఎస్ఐ ముద్ర ఉన్న కంపెనీ బాటి ల్స్ లీటరు రూ.20 విక్రయిస్తుండగా, ఎలాంటి నాణ్యత లేని, ప్రమాణాలు పాటించని కంపెనీల వాటర్ బాటిల్స్‌ను రూ.20 కే విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆయూ మున్సిపల్ కమిషనర్లు, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అధికమొత్తాలకు ఆశపడి.... నీటిని ఎలాంటి ప్రోసెసింగ్ చేయకుండా నేరుగా తయూరైన వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్‌పై అధిక మొత్తంలో మార్జిన్ ఇస్తున్నారు. దీంతో దుకాణదారులు కూడా నాసిరకం నీటి ఉత్పత్తులపైనే ఆసక్తి చూపుతున్నారు. రానున్నది వేసవి సీజన్ కావడంతో ఈ తరహా మోసపూరిత వ్యాపారాలు ఇప్పటి నుంచే పుంజుకోనున్నాయి. -
ప్రయివేట్ డివిడెండ్లదే పైచేయి
ముంబై: డివిడెండ్లను పెంచడంలో ప్రభుత్వ రంగ సంస్థల కంటే ప్రైవేటు కంపెనీలే జోరుమీదున్నాయి. ప్రైవేటు కంపెనీలు చెల్లించిన డివిడెండ్ల పరిమాణం గత నాలుగేళ్లలో సగటున ఏటా 22.5 శాతం పెరిగింది. పీఎస్‌యూల విషయంలో ఇది 16.7 శాతమే. బీఎస్ఈ 200 కంపెనీల డివిడెండ్లను విశ్లేషించినపుడు వెల్లడైన అంశాలివీ... 2012-13లో పీఎస్‌యూలు రూ.46,198 కోట్ల డివిడెండ్ చెల్లించాయి. మొత్తం 36 పీఎస్‌యూల్లోని టాప్ 5 కంపెనీల డివిడెండే ఇందులో 60% అంటే రూ.27,325 కోట్లు. కోల్ ఇండియా ఇటీవలే రూ.18,371 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. గతంలోని రూ.8,843 కోట్లతో పోలిస్తే ఇది 207% అధికం. అంతేకాదు, ఓ భారతీయ కంపెనీ ఒకేసారి చెల్లించిన అత్యధిక డివిడెండ్ కూడా ఇదే. గత నాలుగేళ్లలో దేశీ కంపెనీల డివిడెండ్ల పరిమాణం ఏటా 20% చొప్పున పెరిగి రూ.1.02 లక్షల కోట్లకు చేరింది. 2008-09లో నికరలాభాల్లో 23%గా ఉన్న ఇవి 2012-13లో 29.8%కు ఎగశాయి. డివిడెండ్ చెల్లింపులతో మైనారిటీ షేర్హోల్డర్లకు పెద్దగా ప్రయోజనం ఉండడం లేదనీ, ఈ విధానంలో నిలకడను ప్రజలు గమనించాలనీ ఐడీబీఐ క్యాపిటల్ రీసెర్చ్ హెడ్ సోనమ్ ఉదాసీ వ్యాఖ్యానించారు. ‘కంపెనీల డివిడెండ్ చరిత్రను ఇన్వెస్టర్లు పరిశీలించాలి. డివిడెండును ఏ రీతిన పెంచుతున్నాయో గమనించాలి. ఓ కంపెనీ తన భవిష్యత్తుపై ఎంత భరోసాతో ఉందనే అంశాన్ని డివిడెండ్ విధానం వెల్లడిస్తుంది. దేశీ కంపెనీలు సాధారణంగా అభివృద్ధి కోసం మూలధనం అవసరమంటూ లాభాల్లో అధిక మొత్తాన్ని ఉంచేసుకుంటాయని’ ఆయన తెలిపారు. డివిడెండ్ల విషయం ప్రోత్సాహకరంగానే ఉన్నప్పటికీ పెంపు అన్ని రంగాలకూ విస్తరించాల్సి ఉందని విశ్లేషకులంటున్నారు.